ఇంకా పెళ్లి కావాలా? (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – స్వాతి శ్రీపాద

చివరి పిల్లవాడిని పంపి రూమ్స్‌ ఎప్పటిలా సర్దించి డస్టింగ్‌, క్లీనింగ్‌ ముగిసే సరికి ఏడున్నర దాటిపోయింది. ఇంటికి వెళ్లేసరికి ఎంత లేదన్నా గంట పైమాటే. ఏ మాత్రం బద్దకించి ఉదయం చేయిద్దాం అనుకునే వీలే లేదు. ఎనిమిదిన్నర అయ్యేసరికి గేట్‌ ముందు బారులు తీరి ఉంటారు పేరెంట్స్‌. వాళ్ళ హడావిడి వాళ్ళది. పిల్లలను దింపేసి మళ్ళీ ఉరుకులు పరుగులతో ఆఫీస్‌లకు వెళ్ళాలాయే.

అక్కడికీ ముగ్గురు నర్సరీ ట్రైనింగ్‌ అయిన అమ్మాయిలను అపాయింట్‌ చేసుకుంది. ఇద్దరు ఆయాలు. ఒక క్లీనింగ్‌ లేడీ.

ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం వచ్చి క్లీనింగ్‌, డస్టింగ్‌ చేసి వెళ్తుంది. రాలేని పరిస్థితుల్లో మరెవరినైనా పంపుతుంది. హైటెక్‌ సిటీ సమీపంలో త్రీ బెడ్‌ రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో డే కేర్‌ నడుపుతూ దాదాపు ఏడేళ్ళు గడిచిపోయాయి.

హడావిడిగా మెయిన్‌ డోర్‌ లాక్‌ చేసుకుని కిందకు వచ్చింది సావిత్రి. అంతవరకు ఆమెతో పాటు ఉన్న నర్సరీ టీచర్‌ నాన్సీని కూడా ”రండి మేడం, ఎలాగూ కారులోనే కదా డ్రాప్‌ చేస్తా, కూకట్‌పల్లిలో ఆటో ఎక్కుదురు గాని” అనడంతో ఇద్దరూ కలిసి బయలు దేరారు.

బస్‌ స్టాండ్‌లో ఆ అమ్మాయిని దింపి కొంచెం ముందుకు వెళ్లి బేకరీ ముందు కారాపింది సావిత్రి. సరిగ్గా ఆరేళ్ళయింది.

ఉదయం నుండి గుర్తు చేసుకుంటూనే ఉంది.

లోనికి వెళ్లి చిన్న కేక్‌ ఆర్డరిచ్చి అది పాక్‌ చేసేలోగా బేకరీలో ఒకటి రెండు అయిటమ్స్‌ తీసుకుని ఇంటికి బయలు దేరింది. పార్కింగ్‌ లాట్‌లో కారు పెట్టి రేగిపోయిన జుట్టు సవరించుకుంటూ లిఫ్ట్‌ దగ్గరకు నడిచింది.

ఈపాటికి శివ వెళ్ళిపోయి ఉంటాడు. రేపు ఉదయం వచ్చి తింటాడులే. అనుకుంటూ థర్డ్‌ ఫ్లోర్‌లో లిఫ్ట్‌ ఆగగానే బాగ్‌ అందుకుని కార్నర్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌ వైపు నడిచింది. పావు తక్కువ తొమ్మిది.

డోర్‌ లాక్‌ కాబట్టి ఇంట్లో ఉన్నదీ లేనిదీ తెలియదు. అయినా నైట్‌ షిఫ్ట్‌ గనక వెళ్ళిపోయి ఉంటాడు. హాల్లో టీవీ ఆన్‌లో లేదు. చేతిలో బాగ్స్‌ టీపాయ్‌ మీదుంచి బెడ్‌ రూమ్‌ లోకి వెళ్ళబోతూ ఓరగా వేసి ఉన్న అతని గదివైపు చూసింది. నైట్‌ బల్బ్‌ వేసి ఉంది. మసక చీకటిలో శివ పడుకుని ఉన్నది లీలగా కనిపిస్తోంది.

”శివ డ్యూటీకి వెళ్ళలేదా? ఏమైందో?” అతనికి నిద్రా భంగం కలిగించకుండా నెమ్మదిగా నడిచి వెళ్లి తలుపు తోసి లోనికి వెళ్లింది సావిత్రి.

లైట్‌ ఆన్‌ చేసినా శివకు మెలుకువ రాలేదు. మామూలుగా అయితే అడుగుల చప్పుడుకే లేచి కూచుంటాడు. కొంచం ఫెయిర్‌గా ఉంటాడేమో మొహమంతా ఎర్రగా వుంది.

”ఒంట్లో బాలేదా?” వేళ్ళు మడిచి అతని బుగ్గపై నాంచి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది.

స్పర్శకు కళ్ళు తెరిచాడు శివ.

”జ్వరంగా వుంది”

”అవును డాక్టర్‌ దగ్గరకు వెళ్ళావా? ఏమైనా టాబ్లెట్‌ వేసుకున్నావా?”

”లేదు సావిత్రీ, సాయంత్రం తలనొప్పిగా వుంటే నిద్ర చాలక అనుకుని సిక్‌ లీవ్‌ పంపి పడుకున్నాను.

మధ్యలో నిద్ర మగత, జ్వరం తెలుస్తూనే వుంది” అని క్షణం ఆగి, ”ఆఫీస్‌లో అందరికి వైరల్‌ ఫీవర్‌, అదే వచ్చి ఉంటుంది. ఏదైనా టాబ్లెట్‌ ఉంటే చూడు సావిత్రీ, రేపు ఉదయం వెళ్తాలే డాక్టర్‌ దగ్గరకు”

”కొంచం ఏమిటి జ్వరం బాగానే ఉంది. ఉండు టాబ్లెట్‌ ఏదైనా తెస్తాను”

మెడిసిన్‌ బాక్స్‌లో వెతికితే డోలో స్ట్రిప్‌ కనబడింది.

వేడి వేడి టీతో పాటు టాబ్లెట్‌ తీసుకుని అతని గదిలోకి వచ్చేసరికి మళ్ళీ మగత లాంటి నిద్రలోకి జారుకున్నాడు శివ.

అతన్ని లేపి టాబ్లెట్‌ ఇచ్చి టీ కప్పు అందించింది సావిత్రి. కొంచెం వేడి టీ పడేసరికి లేచి కూచున్నాడు శివ.

”వెళ్లి డ్రెస్‌ మార్చుకుని ఏదైనా తిను సావిత్రీ రోజంతా అలసిపోయి ఉంటావు.”

”మరి నీ సంగతో…”

మామూలుగా ఆఫీస్‌ లోనే రాత్రి కాంటీన్‌లో తింటాడు శివ.

”పెద్ద ఆకలేం లేదు జ్వరం వల్ల…”

”కాస్సేపు పడుకో టాబ్లెట్‌ పని చేస్తే జ్వరం తగ్గుతుంది. ఈలోగా ఏదైనా చేస్తాను” సావిత్రి లోనికి వెళ్లి స్నానం చేసి నైటీ లోకి మారి వంట గదిలోకి అడుగుపెట్టింది. అన్నింటికన్నా కాస్త

అన్నమే నయమేమో…

సావిత్రికి గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడు జ్వరం వచ్చినా పాత చింతకాయో, నిమ్మకాయో రెండు ముద్దలు, చారు… అదే మందు, ఎంత జ్వరమైనా నాలుగు రోజులు తిరిగే సరికి తగ్గుముఖం పట్టేది.

అన్నం కాస్త మెత్తగా వండి, టమాటాలు రెండు కనబడితే చారు చేసింది. ఫ్రిజ్‌లో ఎప్పుడో స్వగృహలో కొన్న నిమ్మకాయ పచ్చడి గుర్తుకు వచ్చింది.

”శివ మళ్ళీ పడుకున్నాడో ఏమిటో” అనుకుంటూ అతని గదిలోకి తొంగి చూసేసరికి మళ్ళీ కాస్త నిద్రలోకి వెళ్లినట్టున్నాడు.

నిద్రలోనే ”అమ్మా, అమ్మా” అంటూ మూలుగుతున్నాడు.

నిద్రలోనే చేత్తో కణతలు అదుముకుంటున్నాడు.

అమృతాంజనం బాటిల్‌ తీసుకుని వెళ్లి అతని తలపక్కన కూచుని నెమ్మదిగా తలలేపి ఒడిలో ఉంచుకుంది. ఎన్ని సార్లు, ఎన్ని రాత్రులిలా జ్వరపడినప్పుడు చేసిన సేవలు?

”వద్దు సావిత్రీ” మెలుకువ వచ్చి వారించాలని చూశాడు.

”కాస్సేపు మాట్లాడకు” ఒక పది నిమిషాలు తలపట్టి, మరో పది నిమిషాలు కాళ్ళు నొక్కేసరికి కాస్త స్థిమిత పడ్డాడు.

అప్పటికి టాబ్లెట్‌ పని చేసి ఒంటి వేడి కూడా తగ్గింది.

”లే శివా… కొంచెం మొహం కడుక్కుని రా, కొంచెం చారు అన్నం తిందువుగాని, ఆకలున్నా లేకపోయినా, కాస్త ఓపిక కావాలిగా… ”చెప్పగా చెప్పగా లేచి వెళ్లి గీజర్‌ ఆన్‌ చేసి ఉండటంతో వేడి నీళ్లతో రిఫ్రెష్‌ అయి వచ్చాడు. ఆ సరికి కంచంలో అన్నం, కాస్త నిమ్మకాయ పచ్చడి కలిపి స్పూన్‌ వేసి తీసుకు వచ్చింది.

దిళ్ళు వెనక్కు పెట్టుకుని తల ఆన్చి కూచున్నాడు శివ.

”ఓపిక ఉందా? తినిపించనా?”

అసలే తెల్లటి తెలుపేమో జ్వరంతో ఎర్రబారిన మొహం ఈ మాటకు మరింత ఎర్రనైంది. పళ్ళెం అందుకున్నాడు కాని చెయ్యి వణుకుతూ ఉండటంతో సావిత్రి మంచం అంచున కూచుని పళ్ళెం అందుకుంది.

ఆ నాలుగు స్పూన్ల నిమ్మకాయ అన్నం తిన్నాక కాస్త చారుతో తినిపించింది.

”నువ్వు తెచ్చుకో సావిత్రీ, ఒక్కదానవూ… రోజూ వేరే సంగతి, ఇప్పుడు ఉన్నానుగా.

సావిత్రి కంచంలో అన్నం నిమ్మకాయ పచ్చడి కలుపుకుని వచ్చింది.

”అదేమిటి నా కంటే జ్వరం. ఈ పచ్చడి మెతుకులు తినడం ఏమిటి?”

”తినకూడదా? ఒక రోజిలా తినడం మంచిదేలే…”

”అన్నట్టు కేక్‌ పట్టుకొచ్చాను. గుర్తుందా, అప్పుడే

ఆరేళ్ళు… ఎలా గడిచి పోయాయో కదా…”

”సావిత్రీ, ఆరేళ్ళ కింద అడిగిన మాటే మళ్ళీ కొత్తగా అడగనా?”

శివ స్వరంలో ఆశ.

నిర్వికారంగా అతనివంక చూసింది.

కాస్సేపు నిశ్శబ్దంగా వుండి లేచి వెళ్లి తినడం పూర్తి చేసి కిచెన్‌ సర్దడం మొదలు పెట్టింది. అదేమీ కొత్త కాదు శివకు. ఎప్పుడా ప్రసక్తి వచ్చినా జవాబు మాత్రం నిశ్శబ్దమే.

లేచి బెడ్‌షీట్‌ దులిపి పక్క సరిగా వేసుకుని బెడ్‌ లైట్‌ కూడా ఆఫ్‌ చేసి పడుకున్నాడు శివ.

పెద్ద కుటుంబం పెళ్ళిళ్ళు, బాధ్యతలు, బరువులూ పూర్తయి అందరూ జీవితంలో కుదుట పడేసరికి ఒంటరితనమే మిగిలింది.

అయితే బాధించిన విషయం అదికాదు. అవసరం ఉన్నంత వరకూ వాడుకున్నాక ప్రతి విషయంలోనూ నీకేం తెలుసు అంటూ కరివేపాకులా అందరూ తీసిపారెయ్యడం, చివరికి ఏకాకిగా రోడ్డుమీద నించున్నప్పుడు ఆదరించినది సావిత్రి.

నిజానికి ఆ సమయాన… ఆలోచనలనుండి చటుక్కున బయటపడ్డాడు శివ. రెండు చేతులూ తలకింద పెట్టుకుని వెల్లకిలా పడుకున్నవాడు అప్రయత్నంగానే పక్కకు జరిగాడు. అయినా అతని చేతి మడతమీద ఒక పక్కగా ఒరిగి షర్ట్‌ కూడా లేకుండా, వెచ్చగా తగులుతున్న అతని విశాలపక్షం మీద తలనాంచింది సావిత్రి.

ఆ చెయ్యి అలాగే ఉంది మరో చేతితో పొదవి పట్టుకున్నాడు శివ.

”నీ ప్రశ్నకు ఇవ్వాళ జవాబు చెప్తాను శివా”

”ఇంతకూ జ్వరం కాస్త తగ్గినట్టుంది…”

”నీ ముందు జ్వరాలెక్కడ ఆగుతాయి” కాస్తంత అభిమానం, కాస్త ప్రేమ, కొంచెం అతిశయం అతని స్వరంలో తొంగి చూసాయి.

అతని చేతి మీంచి తల జరిపి మరో చేతిని అతని చుట్టూ ఉంచి,

”ఇలా మనకేం తక్కువ శివా, పెళ్లి చేసుకుని ఇప్పుడు కొత్తగా మనకు వచ్చేదేమైనా ఉందా? అయినా పెళ్లంటూ ఒక ముళ్ళకంప మనచుట్టూ పాతుకున్నాక ఇంత ఆనందంగా

ఉండగలమా”

”మన మధ్య సమస్యలు రాకపోయినా బయటనుండి వచ్చేవే ఎక్కువవుతాయి.”

”ఈ ఆరేళ్లుగా లేనివి కొత్తగా ఏం వస్తాయి?”

అవును. ఇద్దరూ సహజీవనం మొదలుపెట్టిన తొలినాళ్ళలోనే రావలసిన సమస్యలన్నీ రానే వచ్చాయి.

అతన్నేదో డబ్బుకోసం వలలో వేసుకుందని అతని వైపు వాళ్ళు నానా యాగీ చేసారు.

డబ్బు ప్రసక్తి ఇద్దరి మధ్యా లేదని తెలిసాక చప్పబడినా, పెళ్లి కావాలంటే ఎవరినో ఒకరిని చూస్తాం నీకన్నా పెద్దదైన ఆవిడతో ఎందుకీ లంపటం అనీ అన్నారు. శివ వెనక్కు తగ్గలేదు.

సావిత్రిని మాత్రం తక్కువ వేధించారా?

”అవ్వ పెళ్ళైన కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ

ఉండి ఈ తెగింపేమిటని” బుగ్గలు నొక్కుకున్నారు.

నిజమే.

ఎవరి కుటుంబాలు వారికున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఒక అతిరిక్త వ్యక్తిగా…, మరింత ఒంటరితనం చెడును మింగుతూ. చావు కోసం ఎదురు చూస్తూ నిండా నలబై ఆరేళ్ళు లేని వయసునుండి ఎలా బతకాలి?

మీ అల్లుడేమంటాడు అని కూతురూ, కోడలికి మొహం ఎలా చూపిస్తావని కొడుకూ నిలదీసినా చెక్కు చెదరలేదు సావిత్రి.

”నాకిప్పుడు మనసులో మాట చెప్పుకుని వెంట నడిచే మనిషి కావాలి, నా అనే మనిషి” అంటూ ధైర్యంగా నిలబడింది.

నిజమే శివ అయిదారేళ్ళు చిన్నవాడే కాని సహజీవనానికి ఆ వయసు తేడాలేమీ అడ్డం కాలేదు. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి జీవనం వారిది కాని ఒకరికొకరు.

నిజానికి శివ అప్పుడే అడిగాడు ”పెళ్లి చేసుకుందాం సావిత్రీ” అని.

”పెళ్ళే అవసరమా శివా మనకి” అంటూ మాట తప్పించి వేసేది.

”నిజానికి మనిషికి మనిషి తోడూ కావలసిన వయసులో ఒంటరి జీవితాలు శాపమే శివా, కాని ఆ శాపానికి తల వంచవలసిన అవసరం లేదు. సమాజానికో, బంధువులకో భయపడి జీవితాన్ని గుదిబండ చేసుకోవాలా? జీవించటం ఎలా జన్మహక్కో ఒక తోడు సమకూర్చుకోడమూ జన్మ హక్కే, ఇద్దరు మనుషులు కలసి ఉండటానికి మూడో వ్యక్తి ప్రమేయం అవసరమా? ఈ వయసులో ఒకరి నుండి ఒకరం ఆశపడేదేముంది ఒక ఓదార్పు ఒక మంచి మాట తప్ప. దానికి పెళ్ళే కావాలంటే నీ ఇష్టం శివా”

శివకు ఏం చెప్పాలో తెలియలేదు.

”నిజానికి పద్దెనిమిదేళ్ళకల్లా పెళ్ళి పేరంటాలు చేసుకుని పాతికేళ్ళు గడిపిన వైవాహిక జీవనంలోకన్నా ఈ ఆరేళ్ళు గానే… ఒక పరిపూర్ణమయిన ఆనందాన్ని, ప్రతి మాటా మనసూ శరీరమూ పంచుకున్నది.

ఇంకా పెళ్లి కావాలా శివా?”

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

One Response to ఇంకా పెళ్లి కావాలా? (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – స్వాతి శ్రీపాద

  1. ari sitaramayya says:

    కథ బాగుంది. పాత్రలు సహజంగా ఉన్నాయి. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.