అపుత్రికస్య… – డా|| సి. భవానీదేవి

అమ్మమాట ఆ సమయంలో అలా విన్పించగానే కొయ్యబారిపోయింది కావ్య. పదేపదే ఆ మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూ గుండెల్లో కత్తుల్లా గుచ్చుకుంటున్నాయి. ఆ స్వరంలో జీవితమంతా ఆడపిల్లల తల్లిగా ఆవిడ పడుతున్న వేదనంతా ఆక్రోశంగా వెలువడుతోంది. అమ్మ హిస్టీరిక్‌గా ఇంకా ఏవేంటో అంటున్నది. ఏనాడూ గొంతుపెంచి మాట్లాడని అమ్మ, ఏనాడు పదిమంది ముందు గట్టిగా నోరువిప్పని అమ్మ, తన గుండెల్లో గూడుకట్టుకున్న ఎన్నో రహస్యాలను, వేదనలను, బాధలను తనతో మాత్రమే పంచుకున్న అమ్మ ఇవ్వాళ తనని పదిమందిలో నిందితురాలిగా చూపించి మాట్లాడుతోంది.

కావ్యకి చూపు నిలబడిపోయింది. నోట మాట రావటంలేదు. కాళ్ళు భూమిలో పాతుకుపోయాయి. ”సీతమ్మలా నన్ను కూడా భూదేవి తీసుకుపోతే బాగుండు” అన్పిస్తోంది. ”ఎందుకమ్మా అన్ని మాటలు ఇప్పుడు. కావ్య తప్పుగా ఏం మాట్లాడలేదే! తమ్ముడా మాటనటం తప్పే. నువ్వు వాడికి చెప్పాలి గానీ దాన్నంటావేం?” పెద్ద చెల్లెలు అమ్మకి నచ్చజెప్పబోయింది.

అమ్మ ఎవరి మాటలు వినే పరిస్థితిలో లేదు. దశాబ్దాలుగా అణచివేయబడ్డ వ్యక్తిత్వం దారితెన్నూ తెలీకుండా విప్లవిస్తున్నట్లుంది. చిన్న చెల్లెళ్ళిద్దరూ పెద్దగా ఏడుస్తున్నారు. తమ్ముడు మాత్రం మగతనంగా కాలర్‌ ఎగరేసి నడిహాల్లో నిల్చున్నాడు. ఇంతమందిలో దోషిలా కావ్య. పేలటానికి సిద్ధంగా ఉన్న అగిపర్వతం. అయినా ఓర్పు పేలనివ్వదు. ”క్షమించమ్మా! శివా! క్షమించు” అని మెల్లగా అనేసి బయటికి వచ్చేసింది.

గదిలో మంచంమీద పడి భోరుమంటున్న భార్యకేసి శాడిస్టిక్‌గా చూశాడు చిరంజీవి. అతనికెంతో ఆనందంగా ఉంది. ”నేను ముందునించీ చెప్తూనే వున్నా! వాడు చెడిపోయాడు. అయినా నాన్నఅమ్మలకోసం అని దేశోద్ధారకురాలిలాగా తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు. నా నెత్తినా పెట్టావు. దుర్మార్గుడైన తెలివిగలవాడికి చదువునిచ్చి మరింత తప్పు చేశావు. బాగయింది. నీకీ శాస్తి జరగాల్సిందే! చీపురుతో కొట్టాడు… హు…”

భార్య పట్ల రవంత ప్రేమ లేకపోయినా సానుభూతి కూడా కనిపించటం లేదు. సమయం చూసి కాటేసే పాములా కన్పిస్తున్నాడు.

ఆ రాత్రి ఏం తినలేదు కావ్య. చిరంజీవి ఇంట్లో తినకుండా బయటికెళ్ళి ఏదో తిని పొద్దుపోయి వచ్చాడు. కావ్యని భోజనం చేయమని ఎవరూ పిలవలేదు.

ఆ ఇంట్లో వటవృక్షం కూలిపోయింది. పిచ్చిమొక్క చేతిలోకి పెత్తనమొచ్చింది. ”తండ్రి పోయిననాడు పెత్తనం తెలుస్తుంది” అంటారు. ఇదే కాబోలు.

ఈ ఇంటికోసం ఎంత ఆరాటపడింది. ఎన్ని కన్నీళ్ళు కార్చింది. ఎన్ని అవమానాలు, దెప్పిళ్ళు… ఏం లాభం. అన్నీ దగ్ధం… కావ్యకారాత్రి గతం అంతా వేదనామయ చిత్రపటంలా ఎదుట నిల్చుంది.

రైతుకుటుంబానికి చెందిన నాన్న కుటుంబరావు చదువురాని అమాయకురాలు అమ్మకి కావ్య పెద్దకూతురు. నలుగురు ఆడపిల్లలు వరుసగా పుట్టటంతో బంధుమిత్రుల హేళనల మధ్య అమ్మ బాధేంటో కావ్య చిన్నప్పుడే రుచి చూసింది. ఆడపిల్లలు పుట్టటం ఎందుకు తప్పో తెలిసే వయసు కాదది.

అనుకోని అదృష్టం. రాత్రివేళలో సూర్యోదయంలా ఆ ఇంట్లో ఐదో కాన్పులో ఓ మగపిల్లాడు పుట్టటం అందరి మొహాల మీద ఆనందం పులిమింది. ఇక నట్టిల్లంతా బంగారమేనన్నారంతా!

బామ్మయితే అప్పట్నుంచీ తమ్ముడు శివ గురించే మాట్లాడేది. వాడినే ఎత్తుకునేది. పన్లన్నీ కావ్యకి చెప్పేది. తమ్ముడ్ని ఎంత ప్రేమగా చూసుకోవాలో అక్కలకి బోధించేది. శివకి బారసాల, అన్నప్రాసన.. అరిసెలు.. బొబ్బట్లు.. అసలు పిల్లలకోసం ఇన్ని వేడుకలుంటాయని కావ్యకేకాదు ఏ ఆడపిల్లకీ తెలీదు. ఎందుకంటే వాళ్ళకవి జరగలేదు మరి. శివకి నేలంటే తెలీదు. చేతులమీదే పెరుగుతున్నాడు.

అంతవరకు ఎక్కడ దాచారో, శివకోసం వెండికొమ్ము చెంబు, వెండి ప్లేటు, గ్లాసు అన్నీ వచ్చేశాయి. మెళ్ళో గొలుసు, మురుగులు, వాచీ ఏడాదిలోపే అమిరాయి. అన్నప్రాసననాడు శివ పెన్ను పట్టుకుంటే నాన్న మురిసిపోయాడు. ”నా కొడుకు బాగా చదివి పెద్ద ఆఫీసరౌతాడని”.

తమ్ముడికి మూడు ముద్దులు, అక్కలకి ఆరు గుద్దులుగా కాలం గడిచింది.

”తూలికి ఎల్లను” అని గొప్పగా ప్రకటించిన తమ్ముడ్ని స్కూలుకి అలవాటు చేయటంకోసం కావ్య తాను బడి మానేసి వాడితో వెళ్ళి వాడి పక్కన కూచునేది. వాడు తనని బాత్‌రూంకి కూడా కదలనిచ్చేవాడు కాదు.

ఇలారోజూ శివకోసం స్కూలు మానేస్తే తన చదువు పాడయిపోతోందని కావ్య గొణిగింది. నాయనమ్మ కాళిలా అరిచింది.

”ఏంటే నీ చదువు. నువ్వు ఆడపిల్లవి. చదివి ఉద్యోగం చేయాలా ఉద్ధరించాలా…” కావ్య మౌనంగా ఉండిపోయింది.

శివ కొంచెం స్కూలుకి అలవాటయినాక కావ్య తన చదువులో పడింది. పాతపాఠాలు చదువుకొని గట్టెక్కింది.

ఇంట్లో తమ్ముడి ప్రాముఖ్యత అక్కలందరికీ అర్థమైంది. శివ అంటే కొడుకు. ”వంశోద్ధారకుడు” ఇది బామ్మ మాట.

”మీరంటే! ఆడపిల్లలు! పెళ్ళి చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకొకరి వాకిలి ఊడుస్తారు” ఆవిడే ఈసడించింది.

చిన్నచెల్లెలు ప్రియ గబగబా దొడ్లోకి వెళ్ళి ఓ చీపురు తెచ్చి వాకిలి ఊడుస్తూ… ”చూడు బామ్మా! నేను ఈ వాకిలేగదా ఊడుస్తున్నాను” అంది అమాయకంగా.

అదెప్పుడూ అంతే! బోళాగా హడావుడిగా ఉంటుంది. అందరికోసం అమ్మ వండిన పెద్దగిన్నెను ”అంతా నాకే” అని ఏడ్చేది.

పదేళ్ళ కావ్య మాత్రం అందరితో తినేది కాదు. అమ్మమాట ప్రకారం శివని ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళి చందమామ చూపించి కబుర్లు చెప్పి అన్నం పెట్టేది. తర్వాతే తను తినేది.

చెల్లెళ్ళు, తమ్ముడి చదువు, ఆటపాటలు, వాళ్ళ జ్వరాలకి మందులేయటం, బజారుకెళ్ళి కూరలు తేవటం, పిల్లలకి పండక్కి టైలర్‌తో బట్టలు కుట్టించటం, దీపావళొస్తే టపాకాయలు దగ్గరుండి కాల్పించటం, అమ్మకి చీరలు తేవటం, మేనత్తలొస్తే పెట్టుబడులు చూడటం, నాన్నకి పొలానికి భోజనం తీసుకెళ్ళటం ఇలా ప్రతి పని కావ్య లేనిదే జరగలేదు. అందరి నోళ్ళల్లో కావ్యే!

కుటుంబరావు చేసే చిన్న ఉద్యోగంతోబాటు సమాజసేవ, మీటింగులతో పిల్లలు, కుటుంబం ఆయనకి ద్వితీయ ప్రాధాన్యతాస్థానంలో ఉన్నాయి.

కావ్యకీమధ్య శివ గురించి దిగులు పట్టుకుంది. చదవడు. ఆటల మీద ధ్యాస. ఏడోతరగతి కామన్‌ పరీక్ష ఇంకా రెండురోజులే ఉంది. కావ్య కూర్చోబెట్టి చదివిస్తుంటే వాడు గట్టిగా అరిచి ఏడవటం మొదలుపెట్టాడు. వెంటనే బామ్మ, నాన్న రంగంలోకి వచ్చారు. వాడిక్కావలసిందీ అదే!

”ఎందుకే! వాడ్నలా రాచిరంపాన పెడతావు. చదువుకోకపోతే ఏం. పొలం దున్నుకొని బతకలేడా? రారా నాయనా! ఈ ఆడపిల్లల మధ్య పుట్టి నీకెన్ని కష్టాల్రా తండ్రీ!” బామ్మ ఒళ్ళో ఒదిగి గర్వంగా కావ్యకేసి చూస్తున్నాడు శివ. కావ్య ఏం చేయగలదు. ఇలా శివ అస్త్రాలన్నీ ఎదుర్కొంటూ వాడిని చదివించటానికి తిట్లూ, తన్నులూ తింటూ ఏడోక్లాసు పాసయేలా చేయగలిగింది కావ్య. ఆరోజు పడిన ఆనందం తాను పాసయినా లేదు కావ్యకి.

ఓరోజు కాలేజినించి ఇంటికి నడిచివస్తోంది. శివ స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ ఎదురుపడ్డాడు.

”నమస్తే మాస్టారూ” కావ్య పలకరించింది.

”నువ్వా కావ్యా! ఏంటమ్మా! మీ తమ్ముడికి వంట్లో బాగాలేదా! ఇంటికి కబురు చేద్దామనుకున్నాను. వాడు మూడ్నెల్లనించి స్కూలుకి రావటం లేదు. మీ నాన్నగార్కి చెప్పమ్మా” అంటూ వెళ్ళిపోయాడాయన.

కావ్యకి మతిపోయినంత పనయింది. ఇంట్లో రోజూ సమయానికే బయలుదేరుతున్నాడు శివ. ఎక్కడికెళ్తున్నాడు ఆరాతీస్తే ఫ్రెండ్స్‌తో క్రికెట్‌గ్రౌండ్‌లో గడుపుతున్నాడని తెలిసింది. మొదటిసారి నాన్న బెల్టుతీసి శివని కొట్టాడు.

రెండుమూడు నెలలకి నాన్న పర్సులో డబ్బు, బామ్మవేలి ఉంగరం, దేవుడి హుండీ మాయం అయ్యాయి. అలా డబ్బు మాయం అయిన ప్రతిసారీ శివ రెండుమూడు రోజులు ఇంటికి రావటం లేదు. క్రమేపీ ఇంట్లో అందరి మొహాల్లో దిగులు తప్ప నవ్వు లేదు.

ఈసారి శివ ఇంటికి వచ్చి మూడురోజులయింది. నాన్న నెలజీతం ఎత్తేసి వెళ్ళిపోయాడు. నాన్న డీలా పడిపోయాడు. ”వాడిని ఇంట్లోకి రానీయొద్దు. చచ్చాడనుకుంటాను” ఎవరూ చూడకుండా ఆయన కన్నీరు తుడుచుకోవటం కావ్య చూసింది. ”రాత్రి పదకొండయింది. ఇప్పుడెక్కడికే!” అమ్మ మాటలు విననట్లు రిక్షా ఎక్కింది కావ్య.

బస్టాండులో వెదికింది. శివ లేడు. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై బిచ్చగాళ్ళ ప్రక్కన వాళ్ళ ముసుగులో సగం దూరి పడుకున్న శివని గుర్తించి రిక్షావాడిని పంపింది. తనని చూస్తే పారిపోతాడు. బలవంతంగా ఇంటికి తెచ్చింది. అందరికీ రిలీఫ్‌ అనిపించినా మళ్ళీ కమ్ముకోబోయే మేఘాల గురించి ముందే దుఃఖం. ఆ రాత్రే కావ్య నిశ్చయించుకుంది. ఇక ఆ వూళ్ళో శివని ఉంచితే లాభం లేదు. మరెలా? తాను డిగ్రీ పూర్తిచేస్తున్నది. ఏదైనా వుద్యోగం సాధించి తమ్ముడ్ని ఫ్రెండ్స్‌కి దూరంగా తీసుకెళ్ళి బాగా చదివించుకోవాలి. అంతే!

అది సాధించుకుంది. ఇప్పుడు కావ్య హైదరాబాద్‌లో ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీసర్‌. తమ్ముడ్ని తనతో ఉంచుకుని చదివించింది. వాడి తప్పులన్నీ భరించింది. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకు తండ్రికి సాయం చేసింది.

”కావ్య నాకు కూతురు కాదు, కొడుకు” అని నాన్న అన్నప్పుడు మనస్సు చివుక్కుమంది. ‘కొడుకు’ అనే పదం అనకపోతేనేం కూతురిగా సార్ధకత ఉండదా? ఏమో! వాళ్ళంతేనేమో!

చూస్తుండగానే బామ్మ పోయింది. అమ్మనాన్నలు వృద్ధులయ్యారు. శివకి ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం. అమ్మకి కోడలొచ్చింది.

ఈలోగా ఓ పిడుగు పడింది. చిన్నచెల్లెలు ప్రియని అత్తింటివాళ్ళు కిరోసిన్‌ పోసి కాల్చి చంపారు.

”ఈ కేసు మీరు నిర్వహిస్తే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను” శివ భార్య ధనలక్ష్మి హెచ్చరించిందట. వాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

కుంగిపోయిన తల్లిదండ్రుల పక్కన కావ్య ఆసరాగా నిలబడి ఆ దుఃఖాన్ని దిగమింగటంలో, సమాజ నిరసననూ ఎదుర్కోటంలో సాయపడింది.

ఇంట్లో చాలా మార్పులు జరిగాయి. శివ వేరే ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయాడు. రాత్రిపూట నాన్నకి స్ట్రోక్‌ వస్తే చూసే దిక్కులేక తెల్లవార్లూ అమ్మపడిన నరకం వింటే కావ్యకి కన్నీళ్ళాగలేదు.

”వాడిని పిలవొచ్చుగా”.

”రాత్రిళ్ళు కబురుచేస్తే విసుక్కుంటాడు” అమ్మ జవాబులో గతం తాలూకు గాయాలు పచ్చిపచ్చిగా జ్వలిస్తూ…

వారం రోజులు బాధపడి నాన్న విముక్తి పొందారు. అమ్మ మౌనంలో ఎన్ని తుఫానులో! అందులో భవిష్యత్‌ తాలూకు భయం కూడా! పదో రోజు అది.

కావ్య ఇంట్లోకి ఏవో వస్తువులు తీసుకుని బజారునించి అప్పుడే వచ్చింది.

శివ పెద్ద గొంతుతో లోపలిగదిలో అమ్మమీద అరుస్తున్నాడు. కావ్య లోపలికి వెళ్ళింది.

”శివా! అమ్మతో కొన్ని చెప్పాలి. కొంచెం ఉండు” అంటూ తాను తెచ్చిన మందులు, వస్తువులు బల్లమీద పెడుతోంది.

శివ హాల్లోకి వచ్చి నిల్చున్నాడు. వాడి మొహంలో మగతనం దెబ్బతిన్న అహం ఆవిర్లెత్తుతోంది.

”అసలు ఈ ఆడపెత్తనంవల్లే ఇదంతా! దాన్నిప్పుడే ఇంట్లోంచి వెళ్ళగొడతాను” పెద్ద చెల్లెలికేసి చేతులూపుతున్నాడు. కావ్యకి చాలా బాధ కలిగింది.

అమ్మ దగ్గర్నుంచి లేచి తమ్ముడి దగ్గరకొచ్చింది.

”ఏంట్రా ఇది! నాన్న పోయి పదిరోజులైనా కాలేదు. నువ్వలా మాట్లాడొచ్చా!” అనునయంగా భుజం మీద చేయివేసింది.

శివ కావ్య చేతిని విసిరికొట్టాడు. పాములా బుసలు కొడ్తున్నాడు. ”అసలు దాన్నేంటి… నిన్ను కూడా! మీ అందర్నీ ఈ క్షణమే… ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళగొడతా… ఆ..!” చిటికెలు వేస్తూ వాకిలి చూపిస్తున్నాడు.

ఇంతలో అమ్మ హాల్లోకి వచ్చి అంతా వింటోంది. ”ఏంటమ్మా వీడు… నాన్న పోయి మనమంతా బాధలో ఉంటే.. బాధ్యత లేకుండా ఇలా అంటాడు.”

కావ్య మాటలు పూర్తికాకముందే అమ్మ కూడా అరవటం మొదలుపెట్టింది.

”వాడేమన్నాడు. తప్పేముంది.”

”వాడలా అందర్నీ వెళ్ళగొడతానని…” కావ్య గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.

”నేనెక్కడ అన్నాను…” శివ బుకాయించాడు క్షణంలో.

”వాడన్లేదు… మీ ఆడపిల్లలు బాధ్యతగా వున్నారా! అసలు ఆడపిల్లల్ని కనటమే నా దురదృష్టం. వాడు నాశనం కావటమే మీకు కావాలి” అమ్మ అరుస్తోంది.

ఇదేంటి? అమ్మకేమయింది. నాన్న చేసే అనైతికం పనులు, తమ్ముడి అరాచకం, అన్నీ తనతో పంచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటే తన లేత చేతులతో అమ్మ కన్నీళ్ళు తుడిచిందే. ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మ మాట మీరలేదే, అమ్మ కుటుంబమే తన కుటుంబంగా తన అత్తింటివారి అవమానాలు భరించి ఎదుర్కొని, తన పిల్లల్ని కూడా అంత శ్రద్ధగా చూడకుండా చెల్లెళ్ళు, తమ్ముడు అని కలవరించి తిరిగిందే, అటువంటి తనను అమ్మ ఇప్పుడు నిందిస్తోంది. తను పుట్టటమే దురదృష్టంగా భావిస్తోంది. మరి నా దురదృష్టం ఏమిటి? ఇది స్వయంకృతమా! అమ్మకోసం తననితాను పోగొట్టుకుందా? ఇంత జీవితంలో ఇన్ని గడిచింది అమ్మకోసమేగా! ఏ అమ్మకోసం అనుక్షణం తపించిందో ఏ అమ్మ కష్టాన్ని కొంచెమైనా తగ్గించటానికి ఆరాటపడిందో ఆ అమ్మకి తాను పుట్టటం ఇవ్వాళ దురదృష్టంగా మారింది. ఎందుకు? కూతురు కావటం వల్లే! కొడుకు చేతికి రావటం వల్లే.

అలాగే వచ్చేసింది కావ్య బయటికి. గుండె గాయం రక్తం కారుతోంది. కళ్ళలోంచి కారేదీ అదే!

శివ, భార్య ఊరు మారారు. పిల్లల చదువుల కోసం. డాక్టర్‌ విజిట్స్‌లా అమ్మని చూసి వెళ్తారు. పొలాలన్నీ అమ్మి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడట. ‘అక్క’ అన్న పిలుపు మర్చిపోయాడు. శిథిలమైన ఆ ఇంట్లో గాజుకళ్ళతో కొడుకుకోసం ఎదురుచూపులు చూస్తూ అమ్మ.

‘నాతో రామ్మా!’ రాదని తెలిసీ ఆగలేక అడిగింది కావ్య.

”ఆడపిల్ల దగ్గర ఉండను” బలహీనమైనా అమ్మ గొంతులో స్థిరత్వం.

అందరినీ కన్నది తానే అయినా అమ్మ మనసులో ఎందుకీ తేడాలు.

ఇన్నేళ్ళుగా ఆడపిల్లగా తన సేవలు, డబ్బు పనికొచ్చాయి. ఇప్పుడెందుకీ విరోధం. కొడుకేమంటాడోననే భయమా! కాదని చేస్తే తలకొరివి పెట్టడనే అభద్రతాభావమా? మనకి తెలీని స్థితిలో ప్రాణం పోయాక కట్టెకు జరిగే చివరి సంస్కారం కోసం జీవితమంతా కొడుకుకి బానిసగా బతకాలా?

”అమ్మ ఇకలేదు” అనే చెల్లెలి ఫోన్‌కాల్‌తో కావ్య మొదలునరికిన చెట్టులా కూలబడింది.

శివ అమ్మకేసి చూడటం మానేశాడట. ఆమె బంగారం, ఆస్తి కాజేసి వదిలేశాడుట. అమ్మ ఏమీ చెప్పదు. తనతో అవసరం

ఉన్నప్పుడు బాధలు పంచుకుంది. ఇప్పుడు పంచుకోలేక దాచుకుని బాధపడుతోంది.

శివ దంపతులు ఫారిన్‌ టూర్‌లో ఉన్నారట. ఏ కోరికతో అమ్మ అన్నీ భరించిందో ఆ కొడుకు ‘తలకొరివి’ పెట్టటానికి రాలేకపోయాడు. రావాలని అనుకుంటే కదా!

తల్లి చితికి కావ్య నిప్పంటించింది కన్నీళ్ళతో. సూర్యుడు కూడా ఎర్రబడిన కళ్ళతో జ్వలిస్తున్నాడు.

”క్షమించమ్మా! కొడుకును కాను. కూతుర్నే! నన్ను కొడుకుతో పోల్చవద్దమ్మా! నన్ను కనటం దురదృష్టమని నువ్వనుకున్నావు. తల్లి ఋణం ఇలా తీర్చుకున్నందుకు నేను అదృష్టవంతురాలినమ్మా! నీకోసం బతికిన కూతుర్నమ్మా” అంటూ చితి దగ్గరే కూలబడి రోదిస్తున్న కావ్యని ఓదార్చే శక్తిలేక సూర్యుడు కూడా మొహం చాటే

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.