ఒకానొక కామ వికృతానికి
బలైన బాల్యం
తల్లిదండ్రుల సంఘభీతికి
పెళ్ళి పల్లకీ ఎక్కిన యవ్వనం
పెదాలమీద నక్షత్రాలు పూయిస్తూ
రోబోలాంటి భర్తతో కాపురం
ఎంత నైచ్యమైన బ్రతుకు నాది!
భయంకరమైన రహస్యాన్ని
కడుపులో దాచుకోలేక
దు:ఖాల అగ్ని
నన్ను కొలిమిలో కాల్చేస్తుంటే
పారిజాతాల్ని చూసి నన్ను నేను అసహ్యించుకుంటూ
ఈ వేదనల రహస్యపు బ్రతుకు తనకు అవసరమా?
ఈ దు:ఖపు పువ్వును అంతం చేస్తే…!
ఊహు..!
నేనెందుకు చావాలి? … పాపం ఎవరిది?
రేప్ చేసి తప్పు చేసిన వానిది కానీ నాది కాదు కదా!
ఎవరైనా ఏడవాల్సి వస్తే
అది నేను కాదు
నాలోని గిల్టీనెస్! అందుకే
దాన్ని
కిరసనాయిల్ పోసి కాల్చేసాను
ఆ అగ్నిలో నుండి
స్వచ్ఛమైన చిరునవ్వులా
మలినం అంటని జాజిమొగ్గలా
తిరిగి జన్మించాను