గొంతెత్తి మాట్లాడాలనుకుని అశక్తతతో
మౌనంగా నిశ్శబ్దపు గొడుగు విప్పి నిలబడ్డాను
బతకలేక ఆడవాళ్ళు రాలిపోతున్నప్పుడు
ఒక కన్నీటి చుక్కని రాల్చుకున్నాను
కష్టాల్నీ కన్నీళ్ళనీ జయించి
ముందుకు నడుస్తున్న స్త్రీ మూర్తుల చిత్రాల్ని
మురిపెంగా ముట్టుకుని పదిలపరుస్తాను
గుండెకాలిన కమురు వాసనల్ని
అసహాయంగా ఎటూ మళ్ళించలేనపుడు
గదిలో అగరొత్తులు వెలిగించి కుమిలిపోతాను
ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేను
ఎందుకంటే ఆడపిల్లని కదా
ఎక్కడయినా సరే రైతు చనిపోయాడని తెలిస్తే
ఆ రోజు కంచంలో మెతుకులు ఎరుపెక్కుతాయి
మట్టిమనిషి బద్దలయ్యాడని వింటే
గొంతంతా వేడినీళ్ళ ప్రవాహం కదుల్తుంది
మగ్గంమీద బ్రతుకు అంతమైందని విన్నప్పుడు
కప్పుకున్న పరికిణీ నిండా ముళ్ళు మొలుస్తాయి
కట్నం కోసం చితిని చేరిన పుష్పాలగోడు విన్నప్పుడు
ప్రమిదలోని తైలానికి బదులుగా
రక్తాన్నెవరో నింపి వెళ్ళినట్లే ఉంటుంది
మగాడి నిషా కోసం నదిలా మారిన ఆడవాళ్ళని చూసి
ఎటూ కదలని ప్రతిమలా మారిపోతాను
ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేను
ఎందుకంటే ఆడదానిగా పుట్టాను గదా
బ్రతకాలని తపించీ తపించీ
అజ్ఞాతంగా రాలిపోయిన నిర్భయలెందరో ఉన్నారు
అరచేతిలో ప్రాణం పెట్టుకుని
అమ్మానాన్నల కన్నీటి బ్రతుకుల్ని గట్టెక్కించాలని
గొంతుమీదకి కర్కశంగా చేర్తున్న కత్తులకి
భయంగా అరచేతుల్ని అడ్డంపెట్టి
అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు
ఇక చాలు… … …
ఓ స్త్రీ! నువ్వు మేల్కొనకపోయినా ఫర్వాలేదు
నువ్వు హాయిగా నిద్రించవే తల్లీ
యుగాలనుంచీ ఏడ్చీ ఏడ్చీ మైనం బొమ్మవయ్యావు
ఇక చాలు
కానీ నీ కోసం నేనేమీ చేయలేను
ఎందుకంటే నేనూ నీలాంటి ఆడదాన్నే కదా!
అయినా
ఏదీ! నీ ఆవేదనని అద్దంలో చూపెట్టు
అంటారేంది ఈ నస్లిహరామ్ కొడుకులు
… … …
ఒక్కటి నిజం
మేం లేకుంటే మీకు జన్మే లేదు
మేమే లేకుంటే మీకు మూలం లేదు
మనుగడసలే లేదు..