అమ్మా…!!!
నా చిన్నప్పుడు… అల్లరి చేస్తుంటే…
బూచోడు వస్తాడని చెప్పేదానివి కదమ్మా…!
ఇపుడు నిజంగానే ఉన్నారమ్మా… బూచోళ్ళు…!!
దోగాడే వయసులో… ఆస్తులకై ఎత్తుకెళ్ళేవాళ్ళు…
ఈడు రాగానే వేటాడే మృగాళ్ళు…!!
అడుగడుగునా… కీచక పర్వాలే…!
నడిరోడ్డున… దుశ్శాసన ఆగడాలే…!
తుదకు నట్టింట్లోనూ… రావణాసురులే…!
ఎన్నో ఆశలతో… ఆశయాలతో అడుగుపెట్టేవేళ…
ఆ చదువుల తల్లి ఒడిలో…
అక్షర యజ్ఞం కాదమ్మా… కత్తుల యుద్ధం జరుగుతోంది…!
మరోవైపు ర్యాగింగ్ రక్కసి బలిదానం కోరుకుంటోంది…!
విద్యాలయంలో స్వేచ్ఛగా ఆడే వయసులో…
ఆటలు కాదమ్మా… క్రూరమైన వేట సాగుతోంది…!
తోటివారు… తోడేళ్ళవుతుంటే…
నగరం నడిబొడ్డున… కన్నెరికానికి…
వికృత పోస్ట్‌మార్టం జరుగుతోంది…
ఎందరో కన్నతల్లుల కడుపు తీపికి…
అగ్గిరవ్వలు రాజోస్తోంది…
ఇలా అణగదొక్కపడ్డ ఆడపిల్లేనమ్మా…!
మువ్వన్నెల పతాకం రెపరెపలాడేలా…
ఈ రోజు విశ్వవిజేతగా నిలిచింది…
ఆ… ఆడపిల్లేనమ్మా… ఆదిశక్తిగా మారింది…
ఛీత్కరించే పురుష సమాజానికి…
తన సత్తా చూపింది…