కనురెప్పల నడుమ కదులుతున్న
నీడలేవో నిజాల్ని మోస్తున్నాయి!
చిరిగిన తెరలాంటి సగం చీకటి రాత్రిని విప్పేసి,
బతుకు ముల్లె బరువులో తొలికోడి కూసింది!
పొద్దుట్నుంచి సాయంత్రం దాకా
చాకిరీల ఆవిరి యంత్రం అదే పనిగా పనిచేస్తూ…
అలసట ఎరుగని కొత్త నవ్వును
పెదాలపై అతికించుకొని,
రోజూ వచ్చే దారిలోనే కొద్దిసేపైనా ఆగకుండా,
కుంభమేళా సిటీబస్సులో జనజాతర
అపరిచితుల నడుమ సామూహిక ఒంటరి ప్రయాణం!
చుట్టూరా టచ్‌స్క్రీన్ మరబొమ్మలు!
జీవితమంటే అమెజాన్‌లో ఆర్డరిచ్చి తెచ్చుకునే
అల్లావుద్దీన్ అద్భుతదీపమనుకున్న పాపం ఆ అమ్మాయికేం తెల్సు
అమ్మ నుండి అమ్మమ్మ వరకు
వంటింటి పందేరాల బతుకులో…
కొన్ని తిరగమోతలు మరికొన్ని
ఘాటైన చేదు నిజాల పొహళింపులని..!
జమా ఖర్చుల ఆదరబాదరా బతుకుబండిలో
ఎవరి ఏటీయం ఎవరి దగ్గరుందో?
తెల్సుకోలేని ఉద్యోగిని బేల చూపులు!
ప్లాస్టిక్ కార్డుల వాడకంలో
నిలువెల్లా జీతం రాళ్ళలో
జీవితాన్ని తూకమేసి కొనుక్కునే
బిగ్ బజార్ సేల్‌లో,
ఓ సమాధి రాయి, ఓ శిలాఫలకం
తన జన్మాంతర భుజకీర్తులై
నీకేం తెల్సుననే కర్కశ చూపుల మొండివైఖరులకు
నలిగిపోతూ… వంటింటి సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి
అన్న బిరుదును తగిలించి,
నిత్య చాకిరీల మర బొమ్మగా చితికిపోతూ..
ఎలుగెత్తి ప్రశ్నించే ఒక ధిక్కార స్వరం కొరకు
నిరీక్షిస్తూ… వంటింటి కిటికీ
నేడు వెన్నెల కాయని రేయైంది…!