మా అన్న కొడుకు దొరబాబు దావుకాండ్ల చనిపోయిండనే దుర్వార్త వూరికి వురికొచ్చింది. ముప్పయైదేండ్లుంటయేమో! మా అన్న పేరైతే దొరబాబు అని పెట్టిండు గానీ అతన్ని కూలిబాబునే చేసిండు. చదివియ్యలే. నేను బలవంతంగా హాస్టల్లేస్తే ‘అవ్వో నా కొడుకులేంది, కండ్లముందట కనబడకుంటే నేంబత్క’నని, హాస్టల్లనుంచి తీస్కొచ్చిండు గావురం జేసి సదువుకో నియ్యలే…
కాని పెండ్లి మాత్రం ఓ పనయి పోతదని దబ్బున సిన్నప్పుడే చేసి పారేసిండ్రు. బూమి గుంట సెంటున్నది, సదువులేదు, పెండ్లామ్, సంసారం ఎట్ల బత్కాలె? పెండ్లమ్ వూర్లెనే కూలికైకిలికి బోతే అతను టౌన్‌కు బొయి రంగులేసే పనికి కుదిరిండు. ఆ పనిలబడి నీల్లు సరింగ తాగక, తాగినా ఎట్లాంటి నీల్లో ఏమో కామెర్లొచ్చినయి. అవి వచ్చినయనే సోయిగూడ లేదాట, పట్టించు కోలే. ఆస్పత్రికి బొయి మందు మాకేసుకోలే, ఎవ్వరికి చెప్పలే. ఎప్పటికి కూలి దొరికిందా, తిండి దొరికిందా.. సాలు. యిగ ఆరోగ్యాలు, రోగాలు, మందులు డాక్టర్ల కాడ సూయించు కోవాలనే వెసులుబాటు లేని కుంగుబాటు జీవితాలు. ఆఖరిదశలో దావుకానకు బొయినా ఫాయిదలేకుంటైంది. యిది ఒక్క మా అన్న కొడుకుకు సంబంధించే కాదు పల్లెటూల్లల్ల దళిత యూత్ అంత యిట్లానే వున్నరు.
చదువుల్లేకున్నా పెండ్లీలు, బార్య సంపాదనే ఆదారం, వీల్లు టౌన్‌కు బొయి దొరికిన్నాడు కూలి, లేనినాడు లేనేలేదు. అట్లా అరకొర బతుకులు, నిరాశలు, నిస్పృహలు నిత్యం బతుకు యుద్ధం. ఆ వూర్లొదిలి రారు. అక్కడక్కడే అవే సమాజాల బడి కొట్టుకుంటుంటరు.
అయితే ఏడుపులు, పెడబొబ్బలు తో వూరంత దద్దరిల్లింది. వూరి యూతంత శోకమైంది. తర్వాత మొదలైంది లొల్లి. పెనిమిటి బొయిన దుక్కంలో వున్న కోడలు మీద అత్త, ఆడబిడ్డె, మామ, బావలు యెగబడిండ్రు. ఎవ్వరం వూహించలే. ముందు నాకు సమజుగాలే… తర్వాత బయమైంది.
‘ఒర్రిన కాడికి సాలుగనీ యిగ మూటముల్లె సదురుకో.. నా కొడుకే పోయిండు నువ్వెవతివే బిడ్డా.. పాపా.. పిల్లాజెల్లా… నీ మొకం నాకు సూపించకు యెల్లు’
‘నువ్వు జెయ్యవట్టే మా అన్న సచ్చిపోయిండు. ముందే దావుకానకు తీస్కపోతే మా అన్న బతికెటోడు పట్టించు కోకనే సచ్చిపోయిండు మాన్న. నువ్వే సంపినవే ముండ నీయవ్వగారింటికి పో…’ – ఆడబిడ్డ
‘పెండ్లప్పుడేం దెచ్చినవు? ఎట్లచ్చినవో అట్లెనే పో… యీ యిల్లు నీ యవ్వ గట్టలే.. నీ యయ్య గట్టలే.. మా రెక్కల కష్టెంతోని కట్టుకున్న యింట్ల యిన్ని రోజులున్న కాడికి సాలు బైలెల్లు. మాకు కొడుకెట్ల గనవడ్తడు? నువ్వూ వూల్లె కనబడకుంట యెల్లిపో…’ – మామ
‘సావు కర్సు, దావుకాన కర్సుకు అప్పు దెచ్చి పెట్టిన. రేపా అప్పు యెవలు గట్టాలె. నీ యన్నదమ్ములు గడ్తరా, నీ అవ్వయ్యలు గడ్తరా! మీ బూమి, మీ యిల్లమ్మితేనే అప్పు గట్టేది. నువ్వీన్నే వుంటె.. యీ యింట్లనే వుంటె అప్పెట్ల తీర్తది పో.. పోయి మారు మనుము జేసుకో.. యింకా దినం కర్సు గూడున్నది, అవన్నిటికి అప్పే తేవాలె’ అని ఆ అమ్మాయి బావ మాట్లా డ్తుండు. వేరే వాల్ల మాటలు యింటలేరు.
‘అయ్యో ఆ పిల్ల పెనిమిటి బొయిన దుక్కంలుంటే… గట్ల పొడుసుక తింటం డ్రేంది? పెనిమిటి పేరు మీదేమున్నా ఆ పిల్లకే రావాలె. గట్లంటరేంది యాడికి బోతది? పదారేండ్లబట్టి సంసారం జేత్తంది, సిన్నపిల్లం జేస్కత్తిరి. యిప్పుడు గిట్ల మాట్లాడ్తండ్రేంది? మీ బిడ్డయితె గిట్లనే ‘సాలు’ జెప్తరా.. గింతన్యాలం వుంటదా’ ఒక పెద్ద మనిషి సమజెయ్యబొయిండు.
మేమ్మేము జూస్కుంటమ్ మీరెవ్వరు మాట్లాడొద్దు అని మాట్లాడెటోల్లను నోర్మూ యించిండ్రు.
‘ఎందుకు మాట్లాడొద్దు? వూరు గొడ్డుబొయిందా! మా పిల్లకు పిల్లల్లేకుంటే అది మనిషి గాదా, దానికి బతుకు లేదా! వొయిసు పిల్లను కడుపులబెట్టి సూస్కునేది బొయి గిట్ల అగ్గునగాల్ల యెల్లగొట్టుడు ఎవరన్న మెచ్చుతరా, నా బిడ్డె లంగా దొంగా ఎందుకెల్లగొడ్తరు? యిన్నేండ్లు సంసారం జేసిందీ యింట్లనే దాని కక్కున్నది. పెనిమిటి బూమి జాగ, యిల్లు ఆమెకే రావాలె. యిదెక్కన్నయినా చెల్లుబాటయితది. పంచాది బెట్టుండ్రి. పెద్ద మనుసులు జెప్తరు ఏది మంచో ఏది సెడో… వుత్తగ ఆగంగ మాట్లాడుడేంది? ఎవరన్న మెచ్చుతరా! ఆడపిల్ల యేడుపు తరతరాలకు తాకుతది’ అని ఆమె తల్లిదండ్రులు దుక్కంగన్నరు.
కుటుంబ రక్షణలు అనేవి ట్రాష్. ఆడవాల్ల పట్ల పచ్చి స్వార్థంగా క్రూరంగా వుంటాయని ప్రత్యక్షంగా చూస్తున్న. చిన్న వయసుల్నే పెనిమిటి పోయినామె పట్ల అంత దౌర్జన్యంగా, దాడిగా మాట్లాడడాన్ని భరించలేక, పొడుసుక తినే ఆ కాకుల మధ్య వుంచొద్దనుకున్న. భూమిక హెల్ప్‌లైన్, మహిళా సంగాల సాయంతో ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్లు చేద్దామని నాతోని మా యింటికి తీసుకొచ్చిన.