ఆ రోజుల్లోనే ఆదివాసీలకు భూములు తిరిగి ఇవ్వాలని మేము ఉద్యమాన్ని మొదలుపెట్టాము. హజారీబాగ్ గోళా ప్రఖండ్లో అభిరామ్ కర్మాలి కర్మాలీలకు భూములను, నివాస పత్రాలను ఇప్పించారు. శివజగత్ రామ్ మరియాలో, సహదేవ్ యాదవ్ ప్రతాప్ పూర్లో భూములు వెనక్కు ఇవ్వాలని, బాస్గీత్ పర్చా ఇవ్వాలని మహావో గాభోం మీద గ్రామీణుల అధికారాల కోసం పోరాటం ఇంతకుముందే మొదలుపెట్టారు. ఇబాక్లో నేను స్వయంగా వెళ్ళి రాజ్‌పుత్‌ల భూములలో నివసిస్తున్న దళితులకు ఆ భూముల నివాసపత్రాలను ఇప్పించాను. ఈ రాజ్‌పూత్ జమీందారులందరూ కాంగ్రెస్‌లోని సభ్యులే. కామేశ్వర్ ప్రసాద్ సింహ్ జిల్లా కమిటీ సభ్యులు. బాబు నర్వదేశ్వర్ ప్రసాద్ సింహ్ కేదలా గనులలో పి.డి. అగ్రవాల్ మేనేజర్‌గా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం అతడిపై చాలా ఉంది. ప్రతాప్పూర్ వికాస ప్రణాళికలలో ఠేకేదారీ చేసేవారు. ఆ రోజుల్లో ప్రతాప్‌పూర్‌లోని అడవులలో ఇప్పపూలు ఏరేవారు. ఈ పని విషయంలో అక్కడివాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు. రాజపుత్రులు, పఠానులు ఇంకా మిగిలిన ఎన్నో కులాల వాళ్ళు, జమీందారులు వాళ్ళ పహల్వానులు ప్రభుత్వ అడవులలో ఇప్పపూల చెట్లను కూడా తమ ఆధీనంలో పెట్టుకున్నారు. వీళ్ళు ఇల్లీగల్‌గా కబాలీలతో (ముఖ్యంగా భుయియాం, గంఝా ఆదివాసీలు) 13 తట్టల ఇప్పపూలు ఏరినప్పుడు 12 తట్టలు తాము ఉంచుకుని వాళ్ళకు ఒక గంప మాత్రమే ఇచ్చేవారు. ఈ విధంగానే పెద్ద ఆకులను ఏరించేవారు. వెయ్యి ఆకులను ఏరితే కట్టకు కేవలం మూడు రూపాయిల కూలీ మాత్రమే ఇచ్చేవారు. సగం కట్ట ఆకులు బాగోలేవని చెప్పి కూలి కూడా ఇచ్చేవారు కాదు.
ఆ రోజుల్లో బాబు సియారామ్ సింహ్ పుత్రుడు సంతోష్ సింహ్ తన భుయినీ తల్లి గుడిసెను కాల్చేసి, తన భూమి నుండి ఆమెను వెళ్ళగొట్టాడు. ఈ భుయినీ స్త్రీని బాబు సియారామ్ సింహ్ ఉంచుకున్నాడు. ఆయన తాను బతికి ఉన్నప్పుడు తన నేలమీద గుడిసె వేసి ఇచ్చాడు. ఆయనకు ఇంకా ఎందరో ఉంపుడుగత్తెలు ఉన్నారు. ఒక కహారిన్ కులానికి చెందిన స్త్రీ కూడా ఉండేది. ఆమె కొడుకు లాల్ బాబూ సింహ్ కేసు వేసి బాబూ సియారామ్ సింహ్‌కి చెందిన భూములలో భాగం కూడా తీసుకున్నాడు. తనను రాజ్‌పూత్‌గా ప్రకటించుకున్నాడు. కానీ ఈ భుయినీ మహిళకు కొడుకులు లేరు. ఈ విషయంలో నాకు ఫిర్యాదు వచ్చింది. నేను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిని కనుక కల్పించుకుని దర్యాప్తు చేయడానికి ఐ.జి.తో పాటు మరికొందరు అధికారులపై ఒత్తిడి తెచ్చాను. సంతోష్ సింహ్ అంటే అందరికీ హడల్. ఏ కార్యకర్తకీ ఆయన ఊరికి వెళ్ళి ఎదిరించే ధైర్యం లేదు. ఆయన ఊరికి వెళ్ళడానికి శివజగత్ రామ్‌కి నేను ఒక మోటార్ సైకిల్ కొని ఇచ్చాను. ఆయన అక్కడికి వెళ్ళి ఉద్యమాన్ని నడిపి భుయియాం స్త్రీకి మళ్ళీ ఇల్లు కట్టించాలనేదే నా ఉద్దేశ్యం. శివజగత్ రామ్ అక్కడికి వెళ్ళగానే సంతోష్ సింహ్ ఆయనపై దాడి జరిపించాడు. ఆ రోజుల్లో సహదేవ్ యాదవ్ కూడా వీళ్ళను ఎదిరించేవాడు. ఆయనపైన ఎన్నోసార్లు దాడులు జరిగాయి. ప్రతాప్పూర్ థానా ప్రభారీ సహదేవ్ యాదవ్‌ని చంపించాలని ప్రయత్నించాడు. నేను కల్పించుకుని సబ్ ఇన్స్పెక్టర్ని బదిలీ చేయించాను. తర్వాత సహదేవ్ యాదవ్‌ని అక్కడి రాజ్‌పూత్ కాంగ్రెస్ నాయకులు హత్య చేయించారు. ఆయన, ఆయన ఇద్దరు తమ్ముళ్ళు హత్య చేయబడ్డారు. ఈనాడు ఆ ఇంట్లో కేవలం ఒక వికలాంగుడైన సోదరుడు, ముగ్గురు విధవ స్త్రీలు బతికి
ఉన్నారు. వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పే. వాళ్ళకు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం రక్షణ కల్పించింది. అలాగే పెన్షన్ ఏర్పాటు చేసింది. భుయినీ ఇళ్ళల్లో కొత్తగా పెళ్ళయిన పెళ్ళికూతుళ్ళు పల్లకీని మొదటి రాత్రి ఇక్కడే బాబూ సాహెబ్ ఇంటిదగ్గర దింపే ఆచారం ఉంది.
1970లో ఎన్నికల ప్రచారం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ భుయినీల ఆచారం గురించి అందరూ నాకు చెప్పారు. నేను వ్యతరేకించాను. పెద్ద యుద్ధమే చేశాను. అప్పటినుంచి బాబూ సాహెబ్ ఇంటిదగ్గర కొత్త పెళ్ళికూతురు మొదటి రాత్రి పల్లకీని దింపే ఆచారం పోయింది. ఉంపుడు గత్తెల ఆచారం ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉంది. నక్సల్స్ ప్రభావం వలన ఆడవారిని బలవంతం చేసే ఆచారం కొంత తగ్గింది.
నేను ఐ.జి.ని పిలిపించి చెప్పాను. – ”ఆ భుయినీ ఇల్లు అక్కడ కట్టాల్సిందే. లేకపోతే నేను వెళ్ళి నిల్చుని కట్టించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ నా పట్ల ఏదైనా దుర్ఘటన జరిగితే దానికి కారణం మీరే అవుతారు”.
ప్రభుత్వం కల్పించుకోవడం వలన ఆ భుయినీ ఇల్లు కట్టడం జరిగింది. సంతోష్ సింహ్, బాబూ సాహెబ్‌లు అరెస్టయ్యారు.
వీళ్ళు 20 సూత్రాల కార్యక్రమం కింద తమ భూములలో నివసిస్తున్న వారికి బాస్గీత్ పర్చా (స్వీకృతి పత్రం) ఇవ్వాలి. అందువల్ల వారందరినీ తమ తమ భూములలోంచి వెళ్ళగొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు ఎమర్జెన్సీ సమయం. అందువల్ల బాబూ సాహెబ్ ఎదిరించలేకపోయారు.
నేను, శివజగత్ రామ్, అభిమన్యు తివారీ, అభిరామ్ కర్మాలి, సుదామా రాయ్, ఘనేశ్వర్ ముండా, బైజనాబు ఇంకా కొందరు కార్యకర్తల సహాయంతో మొత్తం జిల్లాలోని రైతుకూలీల ప్రతినిధులతో చత్రాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. అందరూ తమ తమ అభిప్రాయాలను వెల్లడి చేయాలని, ఏఏ ప్రదేశాలలో ఎంతెంత కూలీ ఉందో మొత్తం వివరాలన్నీ సేకరించాలని చెప్పాము. వీళ్ళతోపాటు కాంగ్రెస్ నేతలను, కాంగ్రెస్ భూస్వాములను కూడా సమావేశానికి రావాలని పిలుపునిచ్చాము. కానీ మేము ఒక షరతు పెట్టాము. ఇక్కడ రైతు కూలీలు మాత్రమే మాట్లాడుతారు. భూస్వాములు, కాంగ్రెస్ నేతలు వింటారు. దీనివల్ల అసలు విషయాలు బయటికి వస్తాయి. దీని తర్వాత కనీస కూలీ ఎంత ఇవ్వాలో మేము నిర్ణయిస్తాం. ఎవరైతే తమను తాము నిజమైన కాంగ్రెస్ నేతలని భావిస్తారో వాళ్ళు తప్పకుండా నిర్ణయించిన కూలీని ఇస్తామని వాగ్గానం చేస్తారు.
ఈ సమావేశం ఎంతో విజయవంతమయింది. అసలు సమావేశాల్లో మాట్లాడడానికి ఏ మాత్రం అవకాశం దొరకని వారందరూ మాట్లాడగలిగారు. వాళ్ళు కేవలం మాట్లాడడమే కాదు ఏ యజమానులను చూసయితే ఒణుకుతారో వాళ్ళ ఎదురుగా నిలబడి గట్టిగా మాట్లాడారు. కూలీలకు ఎంత తక్కువ కూలీ ఇస్తున్నారో ఈ సమావేశం ద్వారా మాకు తెలిసింది. మేము ఆ రోజు ఒక మధ్యే మార్గాన్ని సూచిస్తూ ఒక ఒడంబడికను చేసుకునే ప్రయత్నం చేశాము. నిజానికి ఈ ఒడంబడిక ఎన్నో చోట్ల ఆచరణలోకి వచ్చింది. కొన్ని చోట్ల కాలేదు. కానీ దీనివల్ల అసలు కూలీ ఎంత లభించాలో అందరికీ అవగతమయింది. అందరూ తమ తమ క్షేత్రాల్లో సంఘటితమయ్యే ప్రయత్నం చేశారు.
మళ్ళీ మేము రెండోసారి కూలీల సమావేశాన్ని చతరాలోనే ఏర్పాటు చేశాము. ముఖ్యమంత్రి జగన్నాధ్ మిశ్రా, బి. భగవతి (ఇంటక్ అధ్యక్షుడు) సమావేశానికి రావాలి. రామ్‌రతన్ రాయ్, ముంగేరీ బాబులు కూడా రావాలి. జనసభలో గత సమావేశానికి సంబంధించిన నివేదిక, రైతు కూలీల స్థితిగతుల వివరణను కేంద్ర నాయకులకు ఇవ్వాలని అనుకున్నాం. దీనివల్ల వాళ్ళు అసలు వాస్తవాలు తెలుసుకుంటారని మా ఉద్దేశ్యం. కానీ భూస్వాములకు నిలయమైన చత్రాకి రానివ్వకుండా ఈ దోపిడీ దారులు అడ్డుకున్నారు. రాజ్‌పూత్ దోపిడీదారులు పాట్నా, ఢిల్లీలకు వెళ్ళారన్న సంగతి నాకు తెలిసింది. నేను వెంటనే సుదూర ప్రాంతాల వరకు కరపత్రాలను పంపించాను. వాటిలో ఇలా రాసి ఉంది – ”ఒకవేళ నేతలు రాకపోయినా, నా ప్రసంగం విన్నాక మీరు మీ ఉద్యమం కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే తప్పకుండా సభకు రండి. మీరు మీ తోటివారితో కలిసి కార్మిక సంఘాలను బలపరచాలనుకుంటే అందరూ కలిసికట్టుగా రండి. నేను అక్కడికి తప్పకుండా వస్తాను”.
నేతలు రాకపోయినా ప్రతాప్పూర్, హటర్గంజ్ల నుండి వేల సంఖ్యలో కూలీలు చతరా సమావేశానికి వచ్చారు. మేమందరం ఆశ్చర్యపోయాం. గోలా, చిత్తర్పూర్, చురుచు, మాండూ, సిమరియా, కేరేడారీ, బడ్కాగాఁవ్, టండవ్, చౌపారణ్, సత్గాఁవ్ల నుండి కూడా శ్రామికులు అనేక పాట్లు పడుతూ వచ్చారు. టండవా ప్రఖండ్ నుండి తానా భగత్ వచ్చాడు. గంటలు వాయిస్తూ ముందు వరసలో నిల్చున్నారు. ఈ సభకు ఇద్దరు దళిత నేతలు రామ్‌రతన్ రాయ్, ముంగేరి బాబు మాత్రమే వచ్చారు. దాదాపు పదివేల మంది జనం వచ్చారు. వాళ్ళలో దళితులు, ఆదివాసీలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సభ బాగా జరిగింది. కనీస కూలీ ఇవ్వాలని తీర్మానించారు. ఈ క్షేత్రంలో పొలం పనులన్నీ. – నాట్లు పెట్టడం నుండి కోతలు కోసేదాకా స్త్రీలే చేస్తారు. మొదట్లో 12 కట్టల ధాన్యంలో ఒక కట్ట మాత్రమే కూలీలకు దొరికేది. కూలీ కింద ఇంకా కొన్ని కట్టల ధాన్యం ఏర్పాటు చేశాము. ఖోసారీ పిండికి బదులుగా రహర్ (శనగపిండి) ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రొద్దున్న ఇచ్చే అల్పాహారంలో రొట్టెల సంఖ్య రెండు నుండి నాలుగు దాకా పెంచారు.
నిజానికి ఈ ఉద్యమం వల్ల రైతు కూలీలకు తమ కనీస కూలీ గురించి తెలిసింది. ఇవ్వాళ కాకపోతే రేపైనా రైతు కూలీలకు తమ కనీస కూలీ గురించి తెలిస్తే అందరూ ఒకటవుతారని ఆ కూలీ డబ్బుల కోసం పోరాడతారని నా నమ్మకం. అసలు వీళ్ళకి సరైన సమాచారం తెలిపేవాళ్ళే లేరు.
1980 సంవత్సరం వరకు చురుచు ప్రఖండ్ నివాసులు కనీసం రైలుబండిని చూడనైనా చూడలేదు. ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, సామాజిక సంస్థలు కానీ వాళ్ళకు చట్టం గురించి, వాళ్ళ హక్కుల గురించి పూర్తిగా తెలియచేయరు. ఈ పని యూనియన్ చేయగలుగుతుంది. కానీ ఇప్పటికి దేశంలో ముఖ్యంగా బీహార్ (ఝార్ఖండ్‌తో సహా)లో రైతు కూలీల యూనియన్లు మెరుగ్గా ఏర్పాటు కాలేదు. సన్నకారు రైతులు వాళ్ళని వాళ్ళే భూస్తాములుగా భావిస్తూ అప్పుడప్పుడూ జమీందారులతో చేయి కలుపుతారు. వీళ్ళు రైతుకూలీలను పెద్ద రైతులకంటే ఎక్కువగా దోపిడీ చేస్తారు. అప్పుడప్పుడూ వాళ్ళు స్వార్థపరుల
జమీందారులతో చేతులు కలిపి వాళ్ళ పనిముట్లుగా తయారై వీళ్ళని ఇంకా ఎక్కువగా దోపిడీ చేస్తారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఉపాధి లేకపోవడం వలన రైతు కూలీలు భూస్వాముల దగ్గర వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చేది. దీని నుండి బయటపడడానికి వర్షాకాలం తర్వాత వీళ్ళందరూ గ్రామాలు వదిలి బయటికి వెళ్ళిపోయేవారు. ఈ రోజుల్లో ఊళ్ళల్లో యువకులెవరూ ఉండడంలేదు. ఉపాధి కోసం అందరూ నగరాలకు తరలివెళ్తున్నారు. కానీ మూడు నెలలు మాత్రం వాళ్ళు తప్పకుండా వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో ఉంటారు. కర్పూరిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనికి బదులుగా ధాన్యాన్ని ఇచ్చే ప్రణాళికను అమల్లో పెట్టారు. అప్పుడు రైతు కూలీలకు తమ కూలీని పెంచాలని అడిగే సాహసం వచ్చింది.
ఇక్కడ ముఖ్యంగా చతరాలో జమీందారుల కన్నా వాళ్ళ దగ్గర ఉండే పఠాన్లు, బాబూ సాహెబ్ (రాజ్‌పుత్)లే కాక వెనకబడ్డ వర్గం వారికి చెందిన వాళ్ళు కూడా వీళ్ళని దోపిడీ చేస్తారు. ఈ మధ్యలో నక్సలైట్లకి వ్యతిరేకంగా సన్ లైట్ సేనని ముఖ్యంగా రాజ్‌పూత్, పఠానులు తయారుచేశారు. వీళ్ళకి వ్యతిరేకంగా అక్కడ జనం రైఫిళ్ళను పట్టుకుని ఎర్ర సైన్యంలో చేరిపోయారు.
1976 నుండి 1980 వరకు జరిగిన సంఘటనలు
1973లో గనుల రాష్ట్రీయకరణ జరిగింది. కార్యకర్తలను పనిలోకి తీసుకోవాలని ఉద్యమం నడిపించాం. ఈ పోరాటం 1975 నుంచి 76 దాకా కొనసాగింది. 1976లో తిరిగి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ దొరికింది. కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె.బారువా ఈ విషయంలో ఆసక్తి చూపించారు. సీతారాం కేసరి (బీహార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు) నాకు విరోధి అయ్యారు. డా.జగన్నాధ్ మిశ్రా నన్ను వ్యతిరేకించలేదు. కేదార్ పాండే స్వయంగా వెళ్ళి నా గురించి చెప్పారు. ఆ రోజుల్లో కేదలాలో శ్రామికుల పని ప్రవేశం విషయంలో సూచికలు ఫైనల్ చేయడంలో నేను నిమగ్నమై ఉన్నాను. సరిగ్గా సమయానికి ఢిల్లీ వెళ్ళలేకపోయాను. కడ్కాకానికి చెందిన సుదామా రామ్ జీతం తీసుకున్నాడు. గోలాకి చెందిన అభిరామ్ కర్మాలీ తన పంపుని తాకట్టు పెట్టి విమానంలో ఇద్దరూ ఢిల్లీకి చేరారు. నేను రైలులో ఢిల్లీ వెళ్ళాను. వాళ్ళు నాకు స్టేషన్లో కనిపించారు. నేను ఆశ్చర్యపోయాను. ”అందరూ విమానంలో వస్తుంటే మాకేం తక్కువయిందని. మేమూ విమానంలో వచ్చాం” అన్నారు.
నేను వాళ్ళని కోప్పడ్డాను. కానీ వాళ్ళు పట్టుదలగానే ఉన్నారు. కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్ళగానే నాకు చెప్పారు. – ”మీ పల్టాన్ అంతా కార్యాలయం వెనుక మైదానంలో ఉంది. వెళ్ళి వాళ్ళను కలవండి. వాళ్ళు నల్లా నీళ్ళు కూడా తాగరు. ఢిల్లీలో బావి నీళ్ళు దొరకడం గగనం. ఈ విషయం మీకు తెలిసిందే”.
తానా భగత్ వచ్చారని నాకర్థమయింది. వెళ్ళి చూశాను. మధురా తానా భగత్ తన తోటివాళ్ళతో కలిసి వంట చేస్తున్నారు. నన్ను చూడగానే ఎంతో సంతోషపడ్డారు. మీరెప్పుడొచ్చారు, ఎందుకొచ్చారని నేనడిగాను. ఆయన ఇలా చెప్పారు. – ”తమ తమ నాయకులవైపు నుండి అందరూ వస్తున్నారు. మీరు కూలీల సూచికలు రాయడంలో నిమగ్నమై ఉన్నారు. అందువల్ల మీ వైపునుండి మేము వెళ్దామనుకున్నాం. మొత్తం దళాన్ని తీసుకువచ్చాం. మేము ఇంటింటికీ వెళ్ళాం. ఛైర్మన్, బోర్డు మెంబర్లను కలిసి వచ్చాం”.
వీళ్ళందరూ గంట కొడుతూ ఇంటింటింకీ వెళ్ళి నా కోసం ప్రచారం చేశారు. నాకేం చేయాలో తోచలేదు. నాకోసం వీళ్ళెంతగా కష్టపడుతున్నారు. నేను భావుకురాలినయ్యాను. ఆ సమయంలో నాకు ఎమ్మెల్సీ టికెట్ దొరికింది. నేను విధాన పరిషత్ సభ్యురాలినయ్యాను.
మధుర తానా భగత్ ప్రఖండ్ ఊరిలో ఉండేవారు. ఒకసారి మేం నా అంబాసిడర్ కారులో ఆ ఊరికి వెళ్ళాం. అక్కడ ఏ రోడ్డూ లేదు. కనీసం కాలిబాట కూడా లేదు. మేము పొలాల సరిహద్దుల మొక్కలను కొడవలితో కోసి దారి చేసి ఆయన ఊరికి వెళ్ళాం. మధురా తానా భగత్ చాలా జబ్బు పడ్డారు. ఆయనను తీసుకువచ్చి జమ్షెడ్పూర్ క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్చవలసిన పరిస్థితి ఏర్పడింది. రాంచీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన శ్రీ ధాన్ సాహెబ్ సోదరికి కాంగ్రెస్ మహిళా విభాగం కన్వీనర్‌గా నియుక్తి అయ్యే విషయంలో నేను సహాయపడ్డాను. ఆమె సహాయంతో నేను ఆయనను జమ్షెడ్పూర్ ఆస్పత్రిలో చేర్పించాను. బొంబాయిలో కూడా చికిత్స ఇప్పించాము. వారు జబ్బు నయమై ఎంతో ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. కానీ మళ్ళీ జబ్బు పడ్డారు. మళ్ళీ వారిని టాటా ఆస్పత్రిలో చేర్పించాను. కానీ ఈసారి ఇక వారు వెనక్కి తరిగి రాలేదు. ఆయన తానా భగత్‌లకు మంచి నేతగా ఉండేవారు. బాగా ప్రసంగించేవారు.
నేను విధాన సభలో కూడా ఊరికే ఉండలేదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వాద వివాదాలు జరుపుతూ పనులు జరిగేలా ప్రయత్నించేదాన్ని. ముఖ్యమైన విషయాలమీదే కాదు, చిన్న చిన్న విషయాల మీద, షార్ట్ నోటీసుల విషయాలలో కూడా ప్రశ్నలు లేవనెత్తేదాన్ని. ఆ రోజుల్లో చలిలో పొద్దున్నే ఐదు గంటలకే నిద్ర లేచి విధాన సభకు వెళ్ళి స్వయంగా నోటీసు ఇవ్వాల్సి వచ్చేది. అప్పుడు కానీ ప్రస్తావన మంజూరయ్యేది కాదు. నేను ప్రతి చర్చలో పాల్గొనేదాన్ని. షార్ట్ నోటీసు ప్రశ్నల విషయంలో కూడా ముందే రాయించాలి. ముందే రాయించాలన్న తపన బాగా ఉండేది. నేనెప్పుడూ మిగిలిన ఎమ్మెల్యేల కంటే ముందు వరుసలో నిల్చోవాలని ప్రయత్నించేదాన్ని.
నేను పరిషత్‌లో సభ్యురాలిగా ఉన్నప్పుడు ధన్‌బాద్ మాఫియా కింగ్ సురభ్ సింహ్‌ని అరెస్ట్ చేసిన డి.సి. కె.డి. సింహ్‌ని బదిలీ చేసే విషయంలో నేను వ్యతిరేకించాను. సభలో చాలా గొడవ చేశాను. అక్కడ విధాన సభలో లాల్‌చంద్ మెహతా గొడవ చేశారు. ముఖ్యమంత్రి రామ్ సుందర్ దాస్ గారికి రెండు చోట్లా జవాబు చెప్పవలసి వచ్చింది. ఆయన బదిలీని నిలిపివేశారు. లాల్‌చంద్ మొదట్లో జన్‌సంఘ్ ఎమ్మెల్యేగా ఉండేవారు. నేను కాంగ్రెస్‌లో ఉన్నాను. కానీ నేను ఆయనను కపూర్‌గారి సహాయంతో లోక్దళ్లోకి తీసుకువచ్చాను.
1977లో నేను కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పోరాడాను. స్థానికులకు టిక్కెట్లు ఇవ్వాలని నేను రికమెండ్ చేశాను. కానీ వాళ్ళు స్థానికేతరులైన వ్యాపారులు, మాఫియాకు టిక్కెట్లు ఇచ్చారు. ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ వచ్చింది. నేను, కమలాచరణ్ ఉపాధ్యాయ్ (ఇంటక్), లాల్‌చంద్ మహతో (బి.ఎం.ఎస్) ఆంధ్రప్రదేశ్‌లోని బొగ్గు కార్మికుల తరపున వారికి కావలసిన సామగ్రిని పంచాం. ఆదివాసీలు, దళితులు, మిగిలిన స్థానిక ప్రజల పట్ల నాకున్న అనురాగం బీహారీలకు తెలిసిందే. ఎన్నోసార్లు బీహారు ప్రభుత్వం ద్వారా పాట్నాలో నియుక్తులయిన సిబ్బందికి వ్యతిరేకంగా నేను పోరాడాను. ఈ అంశంపైన కమలాచరణ్ ఉపాధ్యాయ్ నన్ను విమర్శిస్తే లాల్ చంద్ మహతో నా తరపున మాట్లాడేవారు. హైదరాబాద్‌లో అధికారులు నాతో ఎక్కువగా మాట్లాడేవారు. ఎందుకంటే నేను మహిళను. హిందీ, ఇంగ్లీష్‌లో అందరి తరపున నేను మాట్లాడగలను. ఆ సమయంలో వెనక్కు తిరిగి వచ్చేవరకు లాల్ చంద్ గారికి, నాకు మధ్య సత్సంబంధం ఉండేది.
మేం పాట్నాకి వెనక్కి వెళ్ళాక నా ఫ్లాట్‌లోనే నాతోపాటు అప్పుడప్పుడు ఉంటూ ఉండేవారు. కవి జ్ఞానేంద్ర పతి నాకు స్నేహితుడు. నేను అప్పుడప్పుడూ ఆయనను కలుస్తూ ఉండేదాన్ని. బహుశ లాల్‌చంద్ మహతోతో నా స్నేహం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నన్ను ఇదివరకటిలా కలవడం మానేశారు. అరుదుగా నన్ను కలిసేవారు.
కర్పూరీగారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాజ్‌పూత్ గ్రూప్ ఆయనని ఏ విధంగానైనా తొలగించాలని అనుకున్నారు. జనతా పార్టీలో కర్పూరీగారు చరణ్‌సింహ్ గారి గ్రూప్‌లో ఉండేవారు. మిగిలినవారు మొరార్జీ దేశాయ్ గ్రూప్. బీహార్‌లో బాబూ సత్యేంద్ర సింహ్ కాంగ్రెస్, పాత సోషలిస్ట్ పార్టీ, ముక్తివాహిని ఒకవైపు ఉండేవారు. వీళ్ళందరూ జయప్రకాష్ నారాయణ్ గారిని తమ నేతగా భావించేవారు. కానీ సంయుక్త సోషలిస్ట్ పార్టీ గ్రూప్ కర్పూరీగారితో ఉండేది. జనసంఘ్ గ్రూప్ వేరు. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఖరి చూసి బాధపడేదాన్ని. నేను స్వయంగా కమ్యూనిస్టు (మార్క్స్ వాదుల) పార్టీతో అనుబంధాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాను. వీళ్ళు జనతా పార్టీకి ప్రభుత్వంతో సంబంధం లేకపోయినా మద్దతు ఇచ్చేవారు. ప్రభుత్వంలో సైద్ధాంతిక భేదాలు ఉన్నాయి. కర్పూరీగారికి వ్యతిరేకంగా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన వచ్చింది. రాజకీయాలలో మత భేదాలు ఎక్కువయ్యాయి.
ఆ రోజుల్లో లాల్ చంద్, మంత్రి ఛలియా మహతోల మధ్య ఎంతో స్నేహం ఉండేది. ఇద్దరూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కారిడార్‌లో ఉన్నారు. కానీ లాల్‌చంద్ గారిపై క్షేత్రంలో నా ఉద్యమాలు, స్థానీయులకు నేను చేసే సహాయ, సహకారాల ప్రభావం ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ ట్రిప్‌లో వాళ్ళందరూ నాకు ఇంకా దగ్గరయ్యారు. నేను కర్పూరీ గారితో, ఛటర్జీ గారితో మాట్లాడాను. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్సీలను కర్పూరీ ఠాకూర్‌గారి మద్దతుగా తీసుకువస్తానని హామీ ఇచ్చాను. లాల్‌చంద్ గారు మా ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో ఛత్ మహతోతో, టేకరీవాల్ గారితో మాట్లాడారు. లాల్‌చంద్ గారికి ఏ పరిస్థితుల్లోనూ కర్పూరీగారిని తొలగించడం ఇష్టంలేదు. రామ్‌సుందర్ దాస్‌ని అగ్ర కులాల వారే నిలబెట్టారని ఆయనకి తెలుసు. బసావన్ సింహ్ (భూమిహర్), బాబూ సత్యేంద్ర నారాయణ్ సింహ్ (రాజ్‌పూత్), లాలా (కాయస్థ్) మొదలైన వారి లాబీ అంతా ఒకటై ఏ విధంగానైనా కర్పూరీగారిని పదవి నుండి దించేయాలని పట్టుపట్టారు. జయప్రకాష్ గారు సందిగ్ధంలో పడిపోయారు. జాతీయ నేతలు వీరి మాటలు వినేవారు కాదు. ఊర్మిళ కేసు దీనికి ఉదాహరణ. కర్పూరీగారు దళితుల పక్షాన ఉండడం పైవర్గాల వారికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఊర్మిళ రాజ్‌పూత్ కులానికి చెందింది. ఆమె ఒక దళితుడిని వివాహం చేసుకుంది. పెద్ద గొడవ అయింది. జయప్రకాష్ జీ కల్పించుకున్నా ఆయన మాట ఎవరూ వినలేదు. రాజ్‌పూత్‌లు ఆ యువకుడిని అరెస్ట్ చేయాలని పట్టుబట్టారు. కానీ కర్పూరీగారు అరెస్ట్ చేయించలేదు. కానీ ఆయన కులం వాళ్ళు కూడా నీచపు కులం వాడికి సహాయం చేస్తున్నావంటూ ఆయనను తిరస్కరించారు.
1977లో కర్పూరీ గారికి విరుద్ధంగా విధానసభలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావనకు వచ్చింది. లాల్చంద్ని వెతకడానికి కైలాస్పతి మిశ్రా ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆయన దొరకలేదు. లాల్‌చంద్ గారు ఇంటికి రాలేదు. మిశ్రాగారు కర్పూరీగారికి మద్దతు ఇవ్వడమే కాక ఆయన దళంలో కూడా చేరారు. ఛత్రూరూమ్ మహతోని తనతో తీసుకురాలేక పోయారు. అవిశ్వాస తీర్మానంలో కర్పూరీగారు ఓడిపోయారు. రామ్‌సుందర్ దాస్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత టేకరీవాల్ గారు కర్పూరీగారితో కలిశారు.
నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి స్వతంత్రురాలినయ్యాను. యూనియన్‌లో దూబెగారు జోనల్ కమిటీలను ఒకచోట చేర్చాలని ప్రకటించారు. రామ్‌గఢ్ రాష్ట్రీయ కొలియారీ సంఘ్ (ఆర్సీఎమ్మెస్) సమావేశంలో ప్రసంగించడానికి నాకు అనుమతి ఇవ్వలేదు. నేను ట్రక్ లోడర్లని తిరిగి పనిలోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తానని దూబే గారికి తెలుసు. దామోదర్ పాండే సలహా ప్రకారం సి.సి.ఎల్. వీళ్ళని పనిలోకి తీసుకోకూడదని తీర్మానించింది. దీంతో కొలియారీ మజ్దూర్ సంఘ్‌లోని 26 శాఖల ప్రతినిధులు కోపంగా నాతోపాటు వాకవుట్ చేశారు. ఇందులో హజారీబాగ్, కుజు, రామ్‌గఢ్, కర్ణపురా బెల్ట్ మొత్తం మాతో వచ్చింది. ఈ క్షేత్రంలోని గనులలో ఆర్.సి.ఎం.సి.ని రూపు మాపారు. శ్రామిక మంత్రిత్వ శాఖ నుంచి సి.సి.ఎల్.కి లేఖ రాయాల్సి వచ్చింది. ఈ జోన్లో కొన్ని యూనియన్లు ఉన్నాయి. దేనికి అనుమతినివ్వాలని ఎంక్వయిరీ కోసం ఈ లేఖ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ మాట్లాడడానికి ఇంటక్‌లో మా వాళ్ళు తప్ప ఏ ప్రతినిధులూ మిగలలేదు. రామ్‌గఢ్‌లో దామోదర్ పాండే గారు ఒకరు, పాత ఎన్.సి.డి.సి. గనులలో కొందరు మాత్రమే ఉన్నారు. కొత్తగా పెట్టిన ”టేకెన్ ఓవర్”లో కూడా మా ప్రభావమే ఎక్కువగా ఉంది. నేను ప్రణవ ఛటర్జీతో మాట్లాడి కోల్ ఫీల్డ్ లేబర్ యూనియన్ సభ్యులను నా క్షేత్రానికి మార్చాను. నేను ఉపాధ్యక్షురాలినయ్యాను. ధన్‌బాద్‌కి సాఠీÄ జనరల్ సెక్రటరీగా ఉండేవారు. ప్రణవ్గారు అధ్యక్షులు. తర్వాత నేను జనరల్ సెక్రటరీనయ్యాను. ప్రణవ్గారు చనిపోయిన తర్వాత వారి భార్య అధ్యక్షురాలయ్యారు. వారి తర్వాత జార్జి ఫెర్నాండెజ్ అధ్యక్షుడయ్యారు.
కేంద్ర శ్రామిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (సి.సి.ఎల్.) మా యూనియన్ మీటింగులోకి రావచ్చని అనుమతినిచ్చింది. కంపెనీ స్థాయిలో కేవలం కోల్ ఫీల్డ్ లేబర్ యూనియన్ (సి.ఎల్.యు.) మాత్రమే వెళ్ళాలి. ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఇంటక్) ప్రతినిధులు కూడా ఉంటారు. మేము ప్రారంభంలో హింద్ మజ్దూర్ సభతో కలిసి
ఉండేవాళ్ళం. కానీ వాళ్ళ నేతృత్వం విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. అందువల్ల వాళ్ళు హెచ్.ఎం.ఎస్. ప్రతినిధిత్వం కోల్ ఇండియా కమిటీలో చేయనీయలేదు. నిజానికి మా యూనియన్ వాళ్ళ యూనియన్ కన్నా బలమైనది. ఇంటక్‌లో ఉంటూ నేను కోల్ ఇండియా పరామర్ష్ ధాత్రీ కమిటీలో సభ్యురాలిగా ఉండేదాన్ని. హింద్ మజ్దూర్ సంఘ్ నేతృత్వం వాళ్ళు జార్జిని సహించలేకపోయారు. రెండు చీలికలు వచ్చాయి. ఇలా ఎన్నోసార్లు జరిగింది. మేం మా నేతలతో పాటు వస్తూ పోతూ ఉండేవాళ్ళం. జార్జ్ హింద్ మజ్దూర్ పంచాయత్ అనే పేరున ఇంకో సంఘం స్థాపించారు. దీన్ని హింద్ మజ్దూర్ సభలో విలీనం చేశారు. కానీ అభిప్రాయ భేదాల వల్ల మళ్లీ సంఘం వేరయింది. ఈ సారి హింద్ మజ్దూర్ పంచాయత్‌ని హింద్ మజ్దూర్ కిసాన్ పంచాయత్ (హెచ్.ఎం.కె.పి.) గా మార్చారు. హింద్ మజ్దూర్ సభకి సూరజ్ దేవ్ సింహ్ వచ్చారు. కానీ నేను అందులో ఉన్నంత కాలం సూరజ్ దేవ్ సింహ్‌ని కార్యకారిణి సభ్యునిగా
ఉండకుండా చేశాను. వెంకట్ రమణ్ కూడా హెచ్.ఎం.ఎస్.లో ఆయన ప్రవేశించడానికి వీల్లేదన్నారు.
మేమందరం హెచ్.ఎం.ఎస్. నుండి బయటికి వచ్చి జార్జి ఫెర్నాండెజ్‌తో కలిశాము. నేను బయటికి వచ్చాక సూరజ్‌దేవ్ సింహ్‌కి అనుమతి లభించింది. నేనెప్పుడూ మాఫియా ఠేకేదార్లను యూనియన్‌లోకి రానీయకుండా చూసేదాన్ని. సూరజ్‌బాబు హత్య విషయంలో వాద వివాదాలు కొనసాగాయి. జనతాదళ్ పార్టీలో నా ప్రవేశ విషయంలో గొడవలు జరిగాయి. ఆ రోజుల్లో జనతా పార్టీలో కృష్ణకాంత సింహ్ (ఎమ్మెల్సీ) కాకుండా గోపాల్ సింహ్, సత్యేంద్ర నారాయణ్ సింహ్, భూమిహార్ రాజ్‌పుత్రుల గ్రూప్‌కి నేను జనతా పార్టీలోకి రావడం ఏ మాత్రం ఇష్టంలేదు. ఎంత మంది వ్యతిరేకించినా కానీ ప్రణవ్ ఛటర్జీ గారు, కర్పూరీగారు నాకు లోక్‌దళ్‌లో ప్రవేశం కల్పించారు. నేను మాండూ ఎన్నికలలో నిల్చోవాలని వారు పట్టుబట్టారు. లాల్‌చంద్ గారు నాకు మద్దతునివ్వడానికి ఇంకా కొందరి సహాయం కూడా తీసుకున్నారు. విధాన పరిషత్‌లో కూడా ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. కృష్ణకాంత్ సింహ్ నాకు బలమైన మద్దతునిచ్చారు. నామీద చాలామంది నిందలు మోపారు. ఆ సమయంలో విధాన సభలో, పరిషత్‌లో కొంతమంది రాజ్‌పూత్ – భూమిహార్లు అయిన ఎమ్మెల్సీలు నన్ను నేరస్థురాలిగా నిరూపించాలని ఎంతో ప్రయత్నం చేశారు. అయినా కృష్ణకాంత్ సింహ్ నా పక్షాన నిల్చున్నారు. అప్పుడు ఇంకా కొంతమంది సభ్యులు ఆయనతోపాటు నా పక్షాన నిల్చున్నారు. దీని తర్వాత విధాన పరిషత్, విధాన సభలలో ఎన్నో సంఘనలు జరిగాయి. విధాన సభలో ప్రవేశించిన మాఫియాని, మాఫియాను సమర్ధించేవాళ్ళను, వికృత మనస్తత్వం కల స్త్రీ ద్వేషులను, భూస్వామ్య మనస్తత్వం కలవారిని, హీనభావ గ్రస్థులైన సభ్యులను ఎన్నోసార్లు ఎదిరించాల్సి వచ్చింది.
రాజ్‌పూత్ వర్గం ప్రతిసారీ, ప్రతిచోటా నన్ను వ్యతిరేకిస్తూనే ఉంది. వాళ్ళు నాపైన లేశమాత్రం వాస్తవంలేని బాబూ సూరత్ సింహ్ హత్యానేరాన్ని మోపారు. ఇందిరా గాంధీ ద్వారా రమణీ కమిషన్ ఏర్పాటు చేయబడింది. నేను నేరం చేయలేదని రుజువయింది. నిజానికి ఇదంతా నాకు వ్యతిరేకంగా రాజకీయ ప్రచారం మాత్రమే. ఇందులో సి.పి.ఎం కూడా ఉంది. సూరజ్‌బాబు డైరీలో తను మార్క్ ్స సిద్ధాంతాన్ని నమ్ముతున్నానని కమ్యూనిస్టుగానే చనిపోతానని రాసుకున్నారు. సి.పి.ఎం.కి ఆయనపట్ల స్నేహం పెరిగింది. అందువల్ల
వాళ్ళు నన్ను నేరస్థురాలిననుకోవడం సహజమే. కానీ వాళ్ళకు అప్పుడు నిజం తెలియలేదు. తర్వాత నిజానిజాలు తెలుసుకున్నారు.
నిజానికి బసావన్ సింహ్ (భూమిహార్ గ్రూప్) యూనియన్‌కి, సూరజ్ నారాయణ్ బాబు యూనియన్ (రాజ్‌పూత్‌ల గ్రూప్)కి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నేను దూబెగారి నేతృత్వంలో రాంచీలో ఇంటక్ యూనియన్ని స్థాపించాలని అనుకున్నాను. ఆ దుర్ఘటన జరిగిన రోజు దూబెగారు నాకన్నా ముందే అక్కడికి వెళ్ళారు. నేను తర్వాత వెళ్ళాను. ఆ రోజు రాంచీలో ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. కేదార్ పాండే ముఖ్యమంత్రి కావడంవల్ల ఆవిడని కలవడానికి వెళ్ళారు. ఆ రోజుల్లో బాంకాలో ఎన్నికలలో శకుంతలాదేవి నిల్చున్నారు. నేను ఎన్నికల ప్రచారానికి అక్కడికి వెళ్ళాను. నేను బాంకా నుండి రాంచీకి వెళ్తున్నప్పుడు నా కారుకి యాక్సిడెంట్ అయింది. నాతోపాటు రాజ్ నారాయణ్‌గారు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ యాక్సిడెంట్లో ఆయన కాలు విరిగింది. మరో కారును అద్దెకు తీసుకున్నాను. రామ్‌గఢ్ వస్తుండగా హఠాత్తుగా కారులో మంటలు రేగాయి. మూడవ కారు తీసుకుని రాంచీలోని సి.సి.ఎల్. గెస్ట్‌హౌస్‌కి వెళ్ళాను. సి.సి.ఎల్. డైరెక్టర్ వి.ఎల్. వడేరాతో చెప్పి నేను ఒక కారు తెప్పించి రాజనారాయణ్ని ఆర్.సి.ఎం.ఎల్ (ఆస్పత్రి)లో చేర్పించాను. ఆ తర్వాత కేదార్ పాండే గారి ఇంటికి వెళ్ళాను. చాలా ఆలస్యమయింది. హజారీబాగ్‌లో జరగబోయే అల్లర్ల గురించి మాజీ ఎమ్మెల్సీతో, సభ్యులతోనే కాక ఇప్పుడున్న కార్యకర్తలతో కూడా పాండేగారు మాట్లాడారు. బీహార్‌లో రాజ్‌పుత్ గ్రూప్ పాండేకు వ్యతిరేకం. రామ్దులారి సిన్హా పాండేజీ క్యాబినెట్లో ఉన్నా వేరు కుంపటి పెట్టాలన్న ఆలోచనలో ఉంది. ఆ రోజుల్లో ఆవిడ విదేశాలకు వెళ్ళారు. ఆవిడ బీహారులో కార్మిక శాఖ మంత్రిగా ఉండేవారు. ఆవిడ ముఖ్యమంత్రి కావాలని అనుకునేవారు.
సాయంత్రం దూబేగారు దుర్ఘటన జరిగిన స్థలం నుంచి వెనక్కు వచ్చారు. ఉషా మార్టిన్ దుర్ఘటన గురించి చెప్పారు. నేనూ అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళకముందే సూరజ్బాబును ఆర్.సి.ఎం.ఎస్. ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. నేను ఆయన్ను చూడడానికి ఆస్పత్రికి వెళ్ళాను కానీ ఆయన ఆపరేషన్ థియేటర్లో ఉండడంవల్ల చూడలేకపోయాను. నేను ప్రెస్వాళ్ళతో మాట్లాడాను. సంఘటన జరిగిన చోట బాంబులు వేశారు. లాఠీ ఛార్జి అయింది. ఈ వివరాలన్నీ చెబుతూ ఇలా హింస చేయడం కూడదని నేను ఖండించాను. అసలు నిజం ఏమిటంటే కేదార్ పాండేని దింపేయడానికి ఇదంతా ఒక పన్నాగం. ఈ కుట్రలో నన్ను ఇరికించే ప్రయత్నం జరిగింది. నేను కొన్ని రోజుల క్రితం మార్టిన్ కంపెనీ యూనియన్ వాళ్ళ బుద్ధులు సరిగ్గా లేవని చెప్పాను. దీంతో ఆయన ఇలా అన్నారు. – ‘మీరు విప్లవవాదులు. తప్పుడు ప్రవర్తన గలవారిని సరిగ్గా చేయగలరు. అందువల్లే మిమ్మల్ని అక్కడికి పంపించాము’.
కానీ దూబెగారు నా పక్షాన పార్టీవాళ్ళతో కానీ, ప్రెస్ వాళ్ళతో కానీ మాట్లాడలేదు. వాళ్ళకు సంఘటన జరిగినపుడు నేను లేనని, నాకన్నా ముందే ఆయనే వెళ్ళి వచ్చారని కూడా చెప్పలేదు.
నేను ఈ విషయంలో ఎంతో ఎదిరించాను. నా తప్పేమీ లేదని నిక్కచ్చిగా చెప్పాను. నేను ఇందిరాగాంధీ గారి దగ్గరకు వెళ్ళాను. ‘సూరజ్ బాబు హత్య చేయించావుగా, రామ్‌దులారీ చెప్పింది’ అని ఆవిడ నిర్మొహమాటంగా అన్నారు. నేను అవాక్కైపోయాను.
”మీరు ఇలాగే అనుకుంటే కమిషన్ వేయండి. ఒకవేళ నేనే దోషినని నిరూపిస్తే నాకు ఉరిశిక్ష వేయండి. రామ్‌దులారీ గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అందువల్ల కేదార్పాండేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను ఆయనవైపు ఉన్నానని నన్ను బలిపీఠం ఎక్కించాలని చూస్తున్నారు ఆవిడ. కమిషన్ నివేదిక తర్వాతే మిమ్మల్ని కలుస్తాను” అని చెప్పి నేను వెనక్కి వచ్చేశాను. ఆ తర్వాత ఆవిడని నేను కలవలేదు. అంతకుముందు ఎన్నోసార్లు వెళ్తూ ఉండేదాన్ని. ఈ విషయంపై రమణ్ కమిషన్ని వేశారు.
ఈ సంఘటన గురించిన వార్త ”కంచన కామినీల గుప్పెట్లో కేదార్‌పాండే” అన్న హెడ్డింగ్‌తో బ్లిడ్జ్ పత్రికలో వచ్చింది. నేను కేదార్ పాండే చేత ఇదంతా చేయించినట్లు రాశారు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు రాశారు, మాట్లాడారు. నన్ను, కేదార్ పాండేలను విడదీయాలని ప్రయత్నం చేశారు. దీన్ని ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అసలు దీనివెనుక అప్రత్యక్షంగా కాంగ్రెస్ హస్తముంది. ముఖ్యంగా కేదార్‌పాండే శత్రువులైన లలిత్ నారాయణ్ మిశ్రా, ఆయన వర్గం
వాళ్ళు దీని వెనుక ఉన్నారు. రామ్‌లఖన్ యాదవ్ కూడా చాలా బలవంతుడు. కేదార్ పాండేని బలహీనుడిగా చేయడానికి యువనేతలను వాడుకోవడం మొదలుపెట్టారు. రాజ్‌పూత్‌ల వర్గం పాండేగారికి వ్యతిరేకం. కొందరు వెనుకబడ్డ వర్గం వాళ్ళు కూడా అతడికి శత్రువులయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన ఈ గ్రూపే బీహార్‌లో 1974 ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణక్రాంతిని బలపరిచింది. నిజానికి ఇది ఐడియాలజీల మధ్య పోరు కాదు, పదవీ వ్యామోహమే దీనికి కారణం. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ విషయంలో ముందంజ వేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆజ్యం పోసేవారు. ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ వ్యక్తులే. తర్వాత జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ఈ ఉద్యమం నడిచింది. మెల్లిమెల్లిగా ఇది
భారతదేశంలో పెద్ద ఉద్యమం అయింది. గుజరాత్ కూడా పాల్గొనడంతో ఈ సంపూర్ణ క్రాంతి ఉద్యమానికి ఇంకా బలం పెరిగింది.
ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్‌లో అందరూ పోటీ పడసాగారు. ప్రభుత్వంలో తమ తమ పవర్‌ని పెంచుకోవాలని ప్రతివారూ ఆరాటపడేవారు. ఇందిరాగాంధీ గారు కూడా బాధపడుతున్నారని నాకనిపించేది. ఆవిడ బీహార్ విషయంలో కూడా నిస్సహాయురాలని అనిపించేది. ఒకవైపు లలిత్ బాబు ఆవిడకు వ్యతిరేకి. మరోవైపు జగన్ బాబు కూడా ఆవిడకి సమస్యలు సృష్టించేవారు. బీహార్‌లో మంత్రులు, ముఖ్యమంత్రులను ఢిల్లీ నుండే బదిలీ చేయించే పరిపాటి మొదలయింది. అసలు ఈ మార్పుల విషయంలో బీహార్ ప్రజల అభిప్రాయం తీసుకునేవారు కాదు. కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏ మార్పులూ జరగలేదు. మంత్రులు, ముఖ్యమంత్రుల విషయంలో మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉండేవి. ప్రతిపక్ష పార్టీల సంవిద్ సర్కార్ 1967లో ఏర్పడింది. కానీ తర్వాత పార్టీలో చీలికలు వచ్చాయి. బీహార్‌లో పార్టీల మార్పుకన్నా కాంగ్రెస్ పార్టీలోనే ఒక గ్రూప్ నుంచి మరొక గ్రూప్‌కు సభ్యులు వెళ్తూ ఉండేవారు. ఇదంతా వ్యాపారంలా మారిపోయింది. ఈ వ్యాపారస్థులకు గనుల యజమానులు ముడుపులు ముట్టచెబుతూ ఉండేవారు.
ఇటువంటి పరిస్థితులలో కేదార్ పాండే, ఆయనతో పాటు నేను బలిపీఠం ఎక్కడంలో పెద్ద విశేషం ఏముంది? బీహార్‌లో ఎన్నో సంవత్సరాల నుండి రూల్ చేస్తున్న కాంగ్రెస్‌లో ఇదంతా మామూలైపోయింది. ”ఆయారామ్-గయారామ్” కాంగ్రెస్‌లోని భజన్‌లాల్‌తో మొదలయింది. బీహార్‌లో ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కించడం, దించడం మొదలయింది. బొగ్గు, అభ్రకం గనులలో చందాలు వసూలు చేసేవారు. బీహారులో వ్యక్తి శీలంపై బురద జల్లడం మొదలయింది. ఈ విషయంలో సోషలిస్టు పార్టీ కూడా ఏ మాత్రం వెనకలేదు. అసలు ఈ శీలంపై బురద జల్లడం అనే ప్రక్రియను వాళ్ళే మొదలుపెట్టారు. రాజ్ నారాయణ్ వర్గం వాళ్ళు దీనిని మొదలుపెట్టారు. కె.సి.త్యాగి ద్వారా జరిగిన సురేష్-సుష్మాల కాండ భారతీయ రాజనీతిలో మొదలయింది.
రాంచీలో బసావన్ సింహ్, సూరజ్ బాబు యూనియన్ల మధ్య ఎప్పటినుండో వైరం ఉంది. ఎన్నోసార్లు గొడవలు, కొట్లాటలు జరిగాయి. బసావన్ సింహ్ ద్వారా గుర్తింపు పొందిన యూనియన్‌తో
ఉషా మార్టిన్ సంప్రదింపులు జరిపేది. కానీ దీనివల్ల ఎటువంటి లాభం ఉండేది కాదు. సూరజ్ బాబు యూనియన్‌కు గుర్తింపు లేదు. అయినా సంప్రదించాల్సి వచ్చేది. బసావన్ సింహ్ యూనియన్‌లో భూమిహర్ నేతృత్వం ఎక్కువగా ఉండేది. బసావన్ సింహ్ ప్రోగ్రెస్సివ్ ఐడియాలు కలవారు, సమర్ధవంతులు. కానీ ఆయన తర్వాత యూనియన్‌లో పనిచేసేవాళ్ళు ప్రగతివాదులు కాదు. కులమతాలకు ఎక్కువ విలువ ఇవ్వడం మొదలయింది. రెండో యూనియన్ తర్వాత సూరజ్‌బాబు నేతృత్వంలో ఉన్నా రాజ్‌పూత్‌ల చేతిలో కీలుబొమ్మ. యాజమాన్యం వారికి గుర్తింపు ఇవ్వదలచుకోలేదు. సూరజ్‌బాబు ప్రారంభంలో విప్లవవాదే. కానీ తర్వాత ఆయన రకరకాల యూనియన్లకు నేతృత్వం వహిస్తూ యూనియన్లలో బూర్జువా పార్టీలు అవలంబించే పాలసీలను అవలంబించడం మొదలుపెట్టారు. ఉషా మార్టిన్ కంపెనీ, రాంచీ యూనియన్ రాజ్‌పూత్ గ్రూప్ ఆయన పేరుని పాడుచేస్తూ యాజమాన్యంపై అధికారం చూపించడం మొదలుపెట్టాయి. మూడో స్థానంలో ఇంటక్ పేరుకి మాత్రమే ఉండేది. ఈ యూనియన్ నేతృత్వం స్థానికుల చేతుల్లో ఉండేది. ఈ యూనియన్ బలమైనది కాదు. దాంట్లో కొందరు నేతలు రాజ్‌పూత్‌ల గ్రూపులుగా దలాలీ చేసేవారు. నిజానికి శ్రామిక వర్గం ఎవరినీ ఇష్టపడదు. కొంచెం రాజ్‌పూత్ గ్రూప్ వైపు వాళ్ళు మొగ్గు చూపేవారు. వీళ్ళు పైకి మాత్రం గంభీరంగా ఉండేవారు. వీళ్ళు లోపాయకారిగా దలాలీ చేసేవారు. వీళ్ళు పోట్లాటల్లో ఎప్పుడూ ముందుండేవారు. దీనివల్ల ఈ సంస్థ బలమైన సంస్థగా పేరుపొందింది. యాజమాన్యం ఈ సంస్థకి భయపడి తప్పుడు పనులు చేసేది. దీనివల్ల లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగేది.
నాకు కోల్‌ఫీల్డ్‌లో మాఫియా, ఠేకేదార్లకి వ్యతిరేకంగా పోరాడుతానన్న పేరు వచ్చింది. బిందేశ్వరి దుబే ఆ రోజుల్లో ఇంటక్‌లో అధికారిగా ఉండేవారు. రాంచీలోని ఇంటక్‌లో పనిచేసేవారి ఒత్తిడివల్ల నన్ను ఉషా మార్టిన్ యూనియన్‌కి అధ్యక్ష పదవి స్వీకరించాలని, దాని వికాసం కోసం పాటుపడాలని ప్రాధేయపడ్డారు. దీంతో నేను ఆ బాధ్యతను స్వీకరించాను. నాకు బొగ్గు గనులలో పనిచేసే కార్మికులు, రైతు కూలీలు, రైతులు మొదలైన వారి సమస్యలు తెలుసు. కానీ ఫ్యాక్టరీలోని కార్మికుల విషయంలో పరిజ్ఞానం లేదు. ఈ సందర్భంలో రాంచీ చుట్టుపక్కల ఉండే ఊళ్ళల్లో ఇక్కడివాళ్ళు ఉషా మార్టిన్‌లో పనిచేసేవారు. సమావేశాలు జరిగాయి. బీహార్ ప్రభుత్వం తరపున నేను శ్రామిక కమిటీకి ప్రతినిధిగా నియమితురాలినయ్యాను. కార్మికులు వేసే ప్రశ్నలపై నేను మాట్లాడేదాన్ని. సూరజ్ బాబుని కూడా ఒకసారి కార్మిక శాఖ మంత్రి రామ్ దులారీ సిన్హా ఛాంబర్లో కలిశాను. నాతోపాటు అప్పుడు ఉషామార్టిన్ యూనియన్‌లో పనిచేసే కార్మికులు కూడా ఉన్నారు. యూనియన్‌లో ఎన్నికలు జరపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాము. కానీ వాళ్ళు వ్యతిరేకించారు. ఎన్నికలు జరిగితే, ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలుస్తుందని, కార్మికులు తీర్పునిస్తారని నేను చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు.
మా యూనియన్‌కి బాబూ శ్రీ కృష్ణ సింహ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హజారీలాల్ వచ్చారు. నన్ను కలిశారు. ఆయన ఫండ్ కలెక్షన్‌కి బయలుదేరారని చెప్పారు. ”మీరు కూడా మాకు సహాయం చేయాలి. బాబూ జీత్‌నాథ్ సింహ్, మామూ బాబులతో పరిచయం చేయండి” అని అన్నారు.
కేదలా బొగ్గు గనులలో ఎక్కువగా రాజ్‌పూత్ ఠేకేదార్లే ఉన్నారు. ”నేను వీళ్ళ ముఖాలు కూడా చూడను. వీళ్ళకు, నాకూ మధ్య శతృత్వం ఉంది. నేను శ్రామికుల దగ్గర చందాలు వసూలు చేస్తాను కానీ ఈ ఠేకేదార్ల దగ్గర చందా అడగను” అని నేను చెప్పాను.
సంస్థలు నడవాలంటే చందాలు తీసుకోవాలి తప్పదు అన్నారాయన. కానీ ఠేకేదార్ల దగ్గర, గనుల యజమానుల దగ్గర చందాలు తీసుకోనని నేను జవాబు చెప్పాను.
ప్రణవ ఛటర్జీ నన్ను ప్యురిటిన్ అని పిలిచేవారు. ఠేకేదార్లతో మాట్లాడిన వాళ్ళకు కూడా మా యూనియన్ శిక్ష వేసేది. ఏది మాట్లాడినా బాహాటంగానే మాట్లాడాలి. రహస్యంగా, ఒంటరిగా ఎవరూ ఠేకేదార్లతో మాట్లాడకూడదు. ఆఖరికి నేను కూడా. ఈ నియమాలను మాపై మేము విధించుకున్నాం. మాతోటివారి పైన కూడా విధించాం.
శ్రామిక మంత్రిత్వ శాఖలో సమావేశం జరిగింది. అక్కడే సూరజ్బాబుతో నాకు పరిచయం ఏర్పడింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన హత్య చేయబడ్డారు. పాత యూనియన్ల మధ్య గొడవలు, కొట్లాటలలో హింస కూడా జరిగేది. ఇంటక్‌లోని బలహీనమైన యూనియన్ కూడా తానూ ఉన్నానని చెప్పడానికి కల్పించుకునేది. నిజానికి ఇది రెండు శక్తివంతమైన యూనియన్ల మధ్య సమరం. బలహీనమైన యూనియన్ని దోషిగా నిలబెట్టడం తేలిక. అదే జరిగింది. నేను మధ్యలో బద్నాం అయ్యాను. ఒకసారి దుబెగారికి చెప్పాను.-”ఇంటక్ యూనియన్ వికాసం సంభవం కాదు. ఎందుకంటే స్థానికంగా సరైన నేతృత్వం లభించడంలేదు. నిజానికి దలాలీ చేయడంలో కూడా ఇదేమీ తక్కువ కాదు. నేను బయటినుంచి వచ్చి వీళ్ళనందరినీ విప్లవవాదులుగా ఎలా తయారు చేయగలను?”
దీనికి ఆయన సమాధానంగా ‘అందుకేగా మిమ్మల్ని అక్కడికి పంపించాను, మీరు వాళ్ళని మార్చాలనే కదా’ అన్నారు.
మేమందరం ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ దుర్ఘటన జరిగింది. ఇంటక్ కొంత బలం పుంజుకున్నప్పుడు వాళ్ళు ఈ హత్య చేయించారు. రెండు యూనియన్లూ తాము నిర్దోషులమని నిరూపించుకోవాలని మాపై నేరం మోపాయి. రమణిక గుప్తా సూరజ్ బాబుని తన్నింది అంటూ ముఖ్యంగా నాపైన కొందరు అబద్ధపు సాక్ష్యం చెప్పారు. ఆ సంఘటన జరిగినపుడు నేను లేనని అందరికీ తెలుసు. రమణ్ కమిషన్ నేను నేరస్థురాలిని కాదని తెలుసుకుంది. అందువల్ల ఆ యూనియన్లకు నాపై ఇంకా కోపం పెరిగింది. అయినా నేను ధైర్యంగా ఉన్నాను. ఈ హత్య వెనుక నేను కాదు, వాళ్ళల్లో వాళ్ళ కలహాలే కారణం.
(ఇంకాఉంది)