అది ఒక అందమైన వెన్నెల రాత్రి. ఆ వెన్నెలలో ఒంటరిగా కూర్చున్న ఓ కుందనపు బొమ్మ. ఆ వెన్నెల చూసి ఆమె ఇలా అనుకుంటుంది…
చందమామ ఎంత అందమైనది… అయినా దానిలో మచ్చ తప్పనిసరి. అలాగే ఆడదాని మనసు ఎంత నిర్మలంగా ఉన్నా, ఎంత విశాలంగా ఉంటుందో అంతే నరకప్రాయంగా ఉంటుంది. ఇప్పటి నా జీవితం రంగులు పూసుకున్న ఒక మేలిమి బొమ్మది మాత్రమే… నా అసలు జీవితం వేరే.
నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాను. మేము పేరుకు నిరుపేదలమే కానీ మంచితనానికి, ప్రేమానురాగాలకు కాదు. మా ఇంట్లో మేము అయిదుగురం. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, నేను. నేనే పెద్దదాన్ని. దేవుడు అందుకే కాబోలు నన్ను ఇంటికి పెద్దదానిగా పుట్టించాడు. మా నాన్న కూలి పని చేస్తూ మమ్మల్ని పోషించేవారు. నాన్నగారు తెచ్చే డబ్బుతో అమ్మ ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టి మాకేం కావాలో చేసిపెట్టేది.
నేను పదవతరగతి పూర్తి చేశాను. మా జీవితం ఎంతో సాఫీగా సాగిపోతూ ఉండేది. ఆడుతూ, పాడుతూ ఉండే మా జీవితంలోకి పెనుతుపానులా ఒక సమస్య ఎదురైంది. మా నాన్నగారు హఠాత్తుగా పక్షవాతం వచ్చి మంచం పట్టారు. అది చూసిన అమ్మ అనారోగ్యం పాలైంది. మాకు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. తమ్ముడు, చెల్లి ఆకలికి తట్టుకోలేరు. అప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను పదవ తరగతి ఫస్ట్‌క్లాస్‌లో పాసయినపుడు మా అమ్మ నాకు వెండి దుద్దులు కొంది. అవి తీసుకుని మార్వాడీ దగ్గరికి వెళ్ళాను. ఆయన వాటిని తీసుకుని ఫక్కున నవ్వాడు.
వీటికి ఏమొస్తుందమ్మా తీసుకుపో అన్నాడు. నేను ఆయనను బ్రతిమలాడాను, కాళ్ళు పట్టుకున్నాను. ఎంతో కొంత ఇవ్వండి సార్! మా చెల్లి, తమ్ముడు భోజనం చేసి రెండ్రోజులయింది అన్నాను. దాంతో ఆ మార్వాడీ పది రూపాయలిచ్చాడు. ఆ డబ్బులతో బియ్యం తెచ్చి అన్నం వండిపెట్టాను. రెండ్రోజులనుంచి అన్నం లేకపోవడంతో వాళ్ళిద్దరూ ఆతృతగా తింటున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి నా కడుపును నా కన్నీళ్ళతో నింపుకుని ఆ రాత్రి సంతోషంగా పడుకున్నాం.
అమ్మకు ఉన్నట్లుండి ఆరోగ్యం మరీ పాడయింది. తమ్ముడు, చెల్లి ఆకలి అంటున్నారు. చెల్లి ఆకలికి ఓర్చుకోగలదు కానీ తమ్ముడు చిన్నవాడు కావడంవల్ల తట్టుకోలేడు. మా పక్కింటివాళ్ళు పనికోసం పట్టణం వెళ్తున్నారని తెలిసి నేను కూడా వస్తానని వాళ్ళతో బయల్దేరి వెళ్ళాను. వాళ్ళంతా క్యారేజీలు తెచ్చుకుని అన్నం తింటుండేవారు. నేనూ తీసుకువెళ్ళేదాన్ని కానీ నా క్యారేజిలో అన్నం ఉండేది కాదు.
యజమాని ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇచ్చేవారు. ఆ వచ్చిన డబ్బులతో అమ్మ, నాన్నలకి మందులు, తమ్ముడు, చెల్లికి అన్నం వండిపెట్టేదాన్ని. అలా వరుసగా మూడు రోజులు పనికి వెళ్ళాను. నాలుగవ రోజు కూడా ఎప్పటిలాగే క్యారేజి తీసుకు
వెళ్తుండగా కాళ్ళు తగిలి కిందపడ్డాను. నా చేతిలోని క్యారేజ్ కిందపడింది. అది ఖాళీగా ఉండడం చూసిన వాళ్ళకి అప్పుడు అర్థమయింది, అందరూ తినేటప్పుడు నేను ఎందుకు దూరంగా వెళ్తానా అని. అప్పుడు వాళ్ళు నీ భోజనం ఎలా అని నన్నడిగారు. నేను అన్నం తీసుకొస్తే నా కడుపే నిండుతుంది, అదే నేను తినకపోతే నాలుగు కడుపులు నిండుతాయని చెప్పాను. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కన్నీరు కార్చారు.
యజమాని దగ్గరకు డబ్బుల కోసం వెళ్ళాను. అక్కడ యజమాని ఏమి చెబితే అది చెయ్యాలంట. నాకు అక్కడకు వెళ్తే కానీ తెలియలేదు. యజమాని నా దగ్గరకు వచ్చి దొంగచూపులు చూస్తూ మీద చెయ్యి వేయబోతే చాచి ఒక్కటి కొట్టాను. అంతే దాంతో నన్ను పనిలోనుంచి తీసేశారు. ఈ విషయం నా తల్లిదండ్రులు తెలిస్తే బాధపడతారని నాలో నేనే క్రుంగిపోయాను. నా వల్ల మళ్ళీ వారం రోజులపాటు ఇంట్లో పస్తులు ఉండవలసి వచ్చింది.
ఒకరోజు నా సర్టిఫికెట్లు తీసుకుని ఉద్యోగం కోసం ఒక ఆఫీసుకు వెళ్ళాను. అక్కడివాళ్ళు నా మురికి బట్టలు చూసి నీలాంటి వారికి ఇక్కడ చోటు లేదు పో అని మెడపట్టి గెంటేశారు. బాధను దిగమింగుకుని ఏడుస్తూ రోడ్డు పక్కన నడుస్తుండగా కొంతమంది మగవెధవలు ‘ఏయ్ పోరి వస్తావా!’ అంటూ నన్ను హేళన చేయసాగారు. ఆ క్షణాన నాకు చావు తప్ప వేరే మార్గం లేదనిపించింది. కానీ నా కళ్ళముందు నా కుటుంబం కన్పించడంతో ఆ పని చేయలేకపోయాను.
చివరికి పనికోసం ఒక ఇంట్లో పనిమనిషిగా వెళ్ళాను. భార్య ఉన్నప్పుడు బుద్ధిమంతుడిలా
ఉండే ఆ ఇంటి యజమాని ఆమె లేని సమయంలో నావైపు దొంగచూపులు చూసేవాడు. ఒకరోజు ఎవరూ లేని సమయంలో వెనుకనుంచి నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. నేను గట్టిగా అరిచేలోపే అయ్యో నువ్వా నా భార్య అనుకున్నాను అని సమర్థించుకున్నాడు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి తమ్ముడు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు. చెల్లి గంజి కోసం పక్కింటికి వెళ్లి గుక్కెడు గంజి ఇవ్వమని అడిగింది. వాళ్ళు ఆ గంజిని రోడ్డుమీద పారబోశారు కానీ గిన్నెలో పోయలేదు. అది చూసిన నేను తమ్ముడి ముఖంపై నీళ్ళు చల్లి లేపి నీళ్ళు తాగించాను. లేచి నా ఒడిలో పడుకోబెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాను. అది చూసి నా తల్లిదండ్రులు కూడా ఏడ్చారు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళల్లో నీరు ఇంకిపోయింది.
ఇంతలో ఒకామె వచ్చి నీకు పని ఇస్తాను వస్తావా, రోజుకు బోలెడు డబ్బులు వస్తాయి, నీ కుటుంబ సమస్యలు తీరిపోతాయి అని ‘ఇదిగో ఈ 500 రూపాయలు ఉంచు ఉదయం వస్తాను’ అంటూ వెళ్ళిపోయింది. నాకు చాలా సంతోషం కలిగింది. దేవుడు ఈ రూపంలో వచ్చాడేమో అనుకున్నా. అమ్మా నాన్నలకు మందులు తెచ్చి, సరుకులు తెచ్చి వంట చేశాను. అందరం కలిసి భోజనం చేశాం. చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఆ ఆనందం ఈ రోజుతోనే సరి అని గమనించలేకపోయాను.
ప్రొద్దున్న రానే వచ్చింది. ఇంతలో ఆమె వచ్చి పనికి రా అంటూ తీసుకువెళ్ళింది. అది ఒక చిన్న సందు. అందులో నుంచి వెళ్తే ఒక చీకటి గది వస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఎంతో అందమైన అమ్మాయిలు… వాళ్ళ పొడవాటి జుట్టులో నిండుగా మల్లెపూలు… వచ్చేవారు కొందరు, వెళ్ళేవారు కొందరు. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు అది ఒక వ్యభిచార గృహం అని. దానిలో అడుగుపెడితే తిరిగి వెళ్ళడమనేది ఉండదు. ఏం చేయాలి? ఒక పక్క నా జీవితం, మరోపక్క నా కుటుంబం. నాకు నా కుటుంబమే ముఖ్యమనిపించింది. అందుకే నా జీవితాన్ని ఒక వేశ్యగా ప్రారంభించాను. దాంతో నా కుటుంబ బాధలు తీరి రోజులు బానే గడుస్తున్నాయి.
ఒకరోజు నేను ఒకాయనతో కారులో వెళ్తుండగా ఎంతోమంది అనాథ పిల్లలు రోడ్లమీద అడుక్కుంటున్నారు. ఎంగిలి విస్తరాకుల కోసం కొట్టుకుంటున్నారు. నాకు మేము పడిన బాధలు గుర్తొచ్చాయి. దాంతో నేను ఒక అనాథ శరణాలయం ఏర్పాటుచేసి ఎంతోమంది అనాథ పిల్లలకు అమ్మనయ్యాను.
ఒక సంస్థ నా సేవను గుర్తించి సమాజ సేవ అనే సంస్థకు అధ్యక్షురాలిగా నియమించింది. దాంతో నాలాంటి ఎంతోమంది పేదలకు ఆకలి తీరుస్తూ, వ్యభిచార కొంపలకు బలవుతున్న ఆడవాళ్ళ కోసం నేనే ఒక సంస్థను స్థాపించాను. అందులో వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూ ఎంతోమందికి మార్గదర్శకం అయ్యాను.