ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడము ప్రపంచంలోని పసిపిల్లల నుంచి పండు ముసలోల్లదాకా సుతారాం యిష్టం లేదు. వద్దు వద్దనుకున్న ట్రంప్ ఆఖరికి మొన్న రెండేసి బైబిల్లతో ప్రమాణ స్వీకారం గూడ జేసె. హిల్లరీ క్లింటనే ఈసారి అమెరికా ప్రసిడెంటవుతదని ప్రపంచ ఆడోల్లందరు ఆశపడ్డరు. 2009లో ఒక నల్లజాతీయున్ని అధ్యక్షుని జేసినట్లే యీసారి అమెరికా సమాజము మహిళను కూడా చేస్తుందని ఒక భరోసా వుండె. నల్లజాతీ యుల్ని బానిసలుగా మార్చిన అమెరికా తెల్లజాతి ఆధిపత్య వ్యవస్థ తమ అధ్యక్షుడిగా ఒక నల్లజాతీయున్ని అంగీకరించడం చూసినంక ప్రపంచ అగ్ర రాజ్యం, ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని అన్ని రంగాల్ని శాసిస్తున్న అమెరికా తన ఆధిపత్యాల్ని సడలించుకునే బాటపట్టిందని భ్రమ పడినం. 45వ అధ్యక్షులు హిల్లరీనే అనుకున్నం.
అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీని ఓడించినప్పుడే అర్థమైంది. ప్రపంచ నీతి అంతా మగనీతిగా వున్నదనీ, అది నిరంకు శంగా, మగ నియంతృత్వంగా వున్నదనీ అమెరికా ఎలెక్షన్సే పెద్ద సాక్ష్యం.
రేసిజమ్ విషయంలో ప్రజా స్వామ్యాలు కనబరిచిన తెల్ల అమెరికా, జెండర్ ప్రజాస్వామ్యాల్ని కనబరిచి హిల్లరీ క్లింటన్‌ని ఎందుకు అధ్యక్ష పదవికి ఎన్నుకోలేదు. కేవలం మహిళ అనే వివక్షతో హిల్లరీని ఓడించడం బాధాకరం.
ట్రంప్ తన ప్రచార కాలంలోనే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడ్డం, ముస్లింల పట్ల వ్యతిరేకతలు, వలసలను కఠినతరం చేస్తాననే ప్రసంగాలతో ప్రజా వ్యతిరేకిగా ముద్రబడిండు. తన వ్యక్తిగత జీవితం కూడా ఆదర్శవంతమైంది కాదనీ, అవినీతిమయమైందనీ ప్రపంచ మీడియా అంతా కోడై కూసింది. అయినా ట్రంప్ గెలవడం ఏంది? అని అందరికీ ఆశ్చర్యమ్! యిక్కడ మగఛావనిజం చాపకింద నీరులా బలంగా పంజేసింది. ఆడవాల్లకు అధికార మిస్తే… అందులో మామూలు అధికారం గాదు ప్రపంచ అగ్రరాజ్యానికి అధిపతిని చేస్తే ప్రపంచం ఆడదైపోతదనీ, ఆడపెత్తనాలు చేస్తదని భయపడి అన్ని దుర్వ్యసనాలున్న అవినీతి పరుడు అని పేరున్న మగవాడికే అమెరికా అధ్యక్ష పదవిని దారాదత్తం చేయడం ఈ యేటి విషాదం.
ప్రపంచ మగచావనిజాన్ని, అమెరికా మగస్వామ్యాలనర్థం చేసుకున్న హిల్లరీ ముందుగానే చెప్పింది. ‘ఆడవారిని అమెరికా ప్రెసిడెంటుగా చేసేంతగా అమెరికా సమాజం ఎదగలేదని’. హిల్లరీ ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని శ్వేతజాతి మహిళ. ఒబామా క్యాబినెట్‌లో విదేశాంగ మంత్రిగా వున్న రాజకీయానుభవం, అంతకుముందే రాజకీయాల్లో సమర్థురాలిగా పనిచేసిన చరిత్ర వుంది. ఒకపరిపూర్ణమైన వ్యక్తిగా ఎలాంటి ఆరోపణలు లేని మనిషిగా అమెరికా సమాజం కీర్తిస్తూనే హిల్లరీని ఎందుకు ఓడించినట్లు? హిల్లరీ ఎందుకు ఓడింది? యిది ప్రపంచమంతా నడుస్తున్న చర్చ. మగరాజకీయాలే హిల్లరీని ఓడించినయి. ”హిల్లరీ ఎంత రాజకీయ దురంధి అయినా, ఎంత ఉన్నతమైన వ్యక్తియైనా, ఎంత విద్యావంతురాలైనా ఒక మహిళ అయినందునే ఓడిపోయింది – ట్రంప్ ఎంత దుర్మార్గుడైనా మగవాడు కనక గెలిచిండు.” అనేది అమెరికా ఎన్నికలు సూచించినయి.
అమెరికా పూర్వ ప్రెసిడెంటు ఒబామా పోతూ పోతూ ‘నేను నల్లజాతీయు డైనందువల్ల నల్లజాతీయులకు మేలు జరుగుతుందనుకున్నాను, కానీ అధికార చట్రంలో అది చేయలేకపోయా. నా కాలంలో కూడా నల్లజాతీయులమీద దాడుల్ని ఆపలేకపోయా… అమెరికాకు భవిష్యత్తులో మహిళలు, సిక్కులు, హిందువులు కూడా అధ్యక్షులైతార’ని జోస్యం చెప్పిండు. సిక్కులు, హిందువులు ఏమోగాని మహిళలు, అందుల్లో నల్లజాతి మహిళలు అమెరికాకు అధ్యక్షులై న్నాడు ఒక కొత్త పరిణామంగా పండుగ చేసుకోవచ్చు. ఆ పండుక్కోసమే కదిలింది ”పింక్ క్యాప్”.
యివ్వాళ ట్రంప్‌మీద లక్షలమంది మహిళలు ”పింక్ క్యాంప్” ఉద్యమంగా మొదలైండ్రు అమెరికాలో. ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ ‘ట్రంప్ పాలనలో మహిళలు చదువుకోగలరా, ఉద్యోగం చేయ గలరా అనీ.. మహిళల హక్కులు మానవ హక్కులనీ, అసలు ట్రంప్ మా అధ్యక్షుడే కాదనీ’ పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. యిది ఒక్క అమెరికా లోనేకాదు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి.
మహిళల కనీస ప్రాథమికమైన హక్కులు కూడా వుండవేమోనని ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌మీద వ్యతిరేకతలు వస్తున్న యీ క్రమం ఏ మలుపులకు దారి తీస్తుందో! యీ ‘పింక్ క్యాప్’ క్యాంపెయిన్ జెండర్ ప్రజాస్వామ్యాల సమానత్వాలకు, ఆ జెండర్‌లో అణగారిన జెండర్ ప్రజా స్వామ్యాలకు చుక్కానిగా కొనసాగుతుందని ఆశిద్దాము. యిది నల్లజాతి మహిళ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా అయ్యేవరకు కొనతాగుతుందనీ ఆశిద్దాం.
అంగారక గ్రహాల్లోని అడవుల్ని నరికి సిటీలు కడుతున్నామనీ, భూమి ఆక్రమ ణలతో అల్సిపోయి ప్లానెట్ ఆక్రమణకు ప్రయాణాల అభివృద్ధి ఎక్కడిదాకా అంటే ‘ఆడవాల్లను అంచుల పొంచులకాన్నే వుంచేదాకా’ అని అమెరికా ఎన్నికలు అర్థం చేయించినయి. యీ అభివృద్ధిని, అర్థాల్ని తిరగరాయనీకే ‘పింక్ క్యాప్’ క్యాంపెయిన్స్ బైల్దేరినయ్ బహు పరాక్!