స్త్రీ వాద పత్రిక భూమిక’ సంపాదకులకు నమస్కారం, ‘భూమిక’ రజతోత్సవ సంచికలో ప్రచురించిన ఒక వ్యాసం నాకు చాలా నచ్చింది. ”ఆర్భాటం లేని ఆదర్శ వివాహాలను ఆదరించి అభినందించాలి” అనే శీర్షికతో దాన్ని ఒక ‘ఆదర్శం’గా రాసిన శ్రీమతి పసుపులేటి రమాదేవికి నా హృదయపూర్వక అభినందనలు. సంప్రదాయాల పేరుతో కట్నాలు, లాంఛనాలు ఇస్తూ, తీసుకుంటూ వివాహాల పేరుతో డబ్బు ఖర్చు పెట్టడం, డబ్బు తీసుకోవడం చేస్తున్న పెద్దవాళ్ళది ఎంత తప్పో, సరదాల పేరుతో ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని కోరుకోవడం, పెద్దలచేత ఖర్చు పెట్టించడం చేస్తున్న యువతీ యువకులది కూడా అంతే తప్పు. పూర్వపు రోజుల్లో పెళ్ళి భోజనాలు సంప్రదాయబద్ధంగా ఉన్నా వెర్రి పోకడలు ఉండేవి కావు. ఈ రోజుల్లో ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఏర్పాటు చేస్తే అంత గొప్ప అనుకుంటూ వాటిమీద విపరీతమైన ఖర్చు చేస్తున్నారు. ఊరేగింపులో డాన్స్ చేయడానికి పూర్వం కొందరు డాన్సర్‌లను పెట్టేవారు. సినిమాల ప్రభావంతో ఇప్పుడు యువతీ యువకులే డాన్సులు చేస్తున్నారు. ఇంకా ఎన్నో ఉన్నాయి. పెళ్ళి కార్డుల మీద లక్షలూ, కోట్లూ ఖర్చుపెట్టడం వంటివి సంస్కరించవలసిన అంశాలు.
ఆదర్శ వివాహం చేసుకున్న నాగపూర్‌కి చెందిన జంటకి నా హృదయపూర్వక అభినందనలు. అటువంటి వాళ్ళు ఒక ఉద్యమాన్ని నడపాలనీ, సమాజంలో మార్పు తీసుకురావాలనీ కోరుకుంటున్నాను.
– అబ్బూరి ఛాయాదేవి, హైదరాబాద్
***
నాకై పుట్టిన నీవు – జ్యోతి నండూరి … చాల చక్కని పోయెమ్ – సుపర్ణ మహీ, ఇ-మెయిల్
***
”వర్తమానలేఖ” వ్రాసిన శిలాలోలిత మేడంకు ధన్యవాదాలు. మీ ఉత్తరం చాలా సంతోషాన్ని ఇచ్చింది. స్ఫూర్తిని కలిగించింది. – గండికోట వారిజ, ఇ-మెయిల్
***
సంపాదుకులకు నమస్తే,
భూమిక పత్రిక 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరలోకి వచ్చినందుకు భూమిక సభ్యులందరికీ అభినందనలు. సత్యవతి గారికి ప్రత్యేక అభినందనలు. మీ సంపాదకీయం చదివితే మీరు భూమికను మీ భుజాల మీద వేసుకొని నడిపించడం, మీరు పడిన కష్టం స్పష్టంగా తెలిసింది. మీతోపాటు ఈ ప్రయాణంలో పాలుపంచుకొన్న అందరికి అభినందనలు. ముఖ్యంగా – ప్రసన్న, లక్ష్మి, ప్రశాంతి గార్లకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. భూమిక కొత్త ఔట్‌లుక్, కార్టూన్స్ కాలం బాగున్నాయి. భూమిక ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఇంకా ఎంతో మందికి చేరువకావలని, కొత్త యువ రచయితలు భూమిక ద్వారా పరిచయం కావాలని అశిస్తున్నాను. ధన్యవాదాలు – అంజలి, ఇ-మెయిల్
***