నేను మాండు నుండి తపేశ్వర్‌దేవ్‌ని ఓడించాను – రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)

ఈ మధ్యలో జనతాపార్టీ ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. లోపల, బయట నలుమూలల నుండి నన్ను అందరూ వ్యతిరేకిస్తున్నా లోక్‌దళ్‌ పార్టీవాళ్ళు నన్ను చేర్చుకున్నారు. 1978లో రహస్యంగా సి.పి.యం. పార్టీలోకి వెళ్ళిపోయాను. కానీ పార్టీవాళ్ళు కర్పూరీగారితో లోక్‌దళ్‌ పార్టీలోకి వెళ్ళమని అన్నారు. బహుశా నేను కాంగ్రెస్‌ నుండి సి.పి.యమ్‌ పార్టీలో చేరడం వలన ఏమైనా ఇబ్బందులు వస్తాయని వాళ్ళు ఊహించి ఉండవచ్చు.

1978-79లో విధాన పరిషత్‌లో సభ్యురాలిగా ఉన్న లోక్‌దళ్‌ పార్టీలో ప్రవేశించాను. యూనియన్‌, పరిషత్‌

ఉద్యమాలలో పాల్గొనేదాన్ని. 1980లో బీహార్‌ విధానసభలో ఎన్నికలు అవుతాయని ప్రకటించారు. 1979 లోక్‌సభ ఎన్నికలలో జనతా పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్‌ మళ్ళీ రూలింగ్‌ పార్టీ అయింది. గాలి అటే వీస్తోంది, కాంగ్రెస్‌ మంత్రి తాపేశ్వర్‌దేవ్‌కి విరుద్ధంగా నన్ను ఎన్నికలలో నిలబడమని ఒత్తిడి చేశారు. విధానసభలో ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. జబల్‌పూర్‌లో లోక్‌దళ్‌ నుంచి మాండు విధానసభ నుండి నేను ఎన్నికల్లో నిల్చోవాలని నిర్ణయం తీసుకున్నారు. నా దగ్గర  ఏ మాత్రం డబ్బులు లేవు. అందుకని నా కొడుకైన టుటూకి సహాయం చేయాల్సిందిగా ఉత్తరం రాశాను. విదేశం నుండి డబ్బులు రావాలంటే కొంత సమయం పడుతుంది. ప్రచారం ఎలా మొదలుపెట్టాలో నాకు అర్థం కాలేదు. నా దగ్గర ఒక అంబాసిడర్‌ కారు ఉండేది. పోనీ ఆ కారుని అమ్మి వచ్చిన డబ్బులతో ఎన్నికల ప్రచారం మొదలుపెడదామనుకున్నాను. కానీ అమ్మడానికి కూడా సమయం పడుతుంది కదా! లాల్‌చంద్‌గారు ఎన్నికలప్పుడు నాకు చాలా సహాయం చేశారు. లాల్‌చంద్‌ మా కోసం ఒక జీపును పంపించారు. అది మాటిమాటికీ పాడయ్యేది. దాని సహాయంతో నేను నా పనిని ప్రారంభించాను.

టొమేటోలు, క్యారెట్లు, ముల్లంగిలు తిని నాతోటివారు ఎన్నికల ప్రచారం చేశారు. మాతోపాటు కొత్త కొత్త క్యాడర్లు వచ్చాయి. టేకేలాల్‌ మహతోని నేను లోక్‌దళ్‌లో సభ్యునిగా చేర్పించాను. కానీ ఆయన ఎన్నికలలో నాకు వ్యతిరేకంగా నిల్చున్నారు. జనతా పార్టీ నుండి గోపాల్‌సింహ్‌ నిల్చున్నారు. నాకు విరుద్ధంగా కాంగ్రెస్‌ క్యాబినెట్‌ మంత్రి తాపేశ్వర్‌ దేవ్‌ నిల్చున్నారు. ఈయన సోదరుడు నరేష్‌దేవ్‌ చట్టవిరుద్ధంగా గనులను నడిపేవారు. నేను ఈ చట్టవిరుద్ధమైన తవ్వకాలకు వ్యతిరేకంగా విధానపరిషత్‌లో ప్రశ్న లేపాను. సత్యాసత్యాలను వెలుదీయడానికి ఒక కమిటీని వేశారు. హజారీబాగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీ కె.డి.సింహ్‌ ఈ చట్టవిరుద్ధమైన తవ్వకాలను మూయించేశారు. రహస్యంగా తవ్వకాలు నిర్వహించేవారు. నాకు సమయానికి పార్టీ ఎన్నికల చిహ్నం దొరకలేదు. అందువలన స్త్రీ చిహ్నంపైన ఎన్నికలలో పోటీ చేశాను. దీనివల్ల నాకు నష్టం ఏ మాత్రం జరగలేదు, ఇంకా లాభమే కలిగింది. కాంగ్రెస్‌ వాళ్ళు ఓటు వేశారు, గ్రామీణ ప్రాంతాల వారు ఓటు వేశారు. శ్రామికుల ఓట్లు ఎక్కువగా లభించలేదు. దీనికి కారణం బిలాస్‌ పురియా, ఒరిస్సా, చాయ్‌బాసా, పలామ్‌కి చెందిన ఆదివాసీలు, దళిత శ్రామికుల పేర్లను ఒక పన్నాగం ప్రకారం లిస్టులో ఎక్కించకపోవడమే. అయినా నేను వెయ్యి ఓట్లతో విజేతనయ్యాను.

లాల్‌చంద్‌గారు ఎన్నికలలో ఓడిపోయారు. నేను గెలిచిన సందర్భంలో ఊరేగింపు చేశారు. ఆయన అందులో పాల్గొన్నారు. మా ఉత్సాహం భంగం కాకూడదన్న ఉద్దేశ్యంతో ఆయన ఓడిపోయిన విషయం ఎవరికీ చెప్పలేదు. ‘కోయల్‌ కీ రాణి (బొగ్గుల రాణి)’, ‘పానీ కే రాణి (నీళ్ళ రాణి)’ అన్న స్లోగన్లతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. లాల్‌చంద్‌ గారి ఓటమి విషయం తెలిశాక నేను బాధపడ్డాను. రూటీఝరియా, విష్ణుగఢ్‌, కోనార్‌డామ్‌ల ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి బూత్‌ దగ్గర వాళ్ళకు అవతలివాళ్ళను ఎదిరించాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో మా క్యాడర్లమీద ఎన్నో కేసులు నడిచాయి. టాటా ఝరియాలో రాజ్‌పుత్‌ల ముఠావాళ్ళు ప్రతి బూత్‌లోను తమ ఆయుధాలను ఉపయోగించి గొడవలు చేసేవాళ్ళు. అక్కడ గంజూ, భుయియాం, మాంఝీలు విజయ్‌సింహ్‌, ప్రేమ్‌గుప్తా ఇంకా అక్కడి ప్రముఖుల నేతృత్వంలో (వీళ్ళందరూ యాదవులే) వాళ్ళను భేటీ అయ్యేవారు. బూత్‌లను కబ్జా చేయకుండా ఆపేశారు. తన్నుకున్నారు. కానీ ఓట్లు లభించాయి. అర్జున్‌సోనీ, ఇంకా కొందరిపై కేసులు నడిచాయి. నేను మాండు క్షేత్రం నుండి గెలిచాను. విష్ణుగఢ్‌లో టేక్‌లాల్‌ మహతో నా ఓట్లను తగ్గించారు. నేను చాలా తక్కువ ఓట్లతో గెలిచాను. బైజుబాబు, కారీనాథ్‌ మహతో, లాల్‌జీ మహతో, ఖీరూ మహతో, ఖుషీలాల్‌ మహతో, ఛోటన్‌ సాబ్‌, రాజేంద్ర ఖుష్‌వాహీ, జావేద్‌, అర్జున్‌, ప్రేమ్‌చంద్‌, విజయ్‌సింహ్‌, జీవాధన్‌ మహతో, భత్తు, ఓఝా, మిశ్రా, మున్నీదేవి, నిజాం భాయి… ఇంకా తక్కిన కార్యకర్తలందరూ నన్ను ఉత్సాహంతో చుట్టుముట్టారు, కానీ లాల్‌చంద్‌ గారు ఓడిపోయారనే బాధ అందరిలోనూ ఉంది.

నా క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఉద్యమాలను నడుపుతాను అన్న సంకల్పంతో నేను విధానసభలో అడుగుపెట్టాను. నిజానికి నేను చేసి చూపించాను కూడా. నా నియోజకవర్గంలో రెండు నదులమీద వంతెనలు, దాదాపు 70 మీటర్ల పొడవైన రోడ్డు, తాగునీరు కోసం హ్యాండ్‌పంప్‌ వేయించాను. విధానసభలో నేను ముందు వరుసలో కర్పూరీ ఠాకూర్‌ పక్కన నాలుగో నంబర్‌ సీటులో కూర్చునేదాన్ని. కర్పూరీగారు అసోసియేట్‌ పార్టీకి నేత. శ్రీ జగన్నాథ్‌ మిశ్రా, ముఖ్యమంత్రి రాధానందన్‌ ఝా గారు విధానసభకి అధ్యక్షులు. మొదట శివానందన్‌ పాశ్వాన్‌ గారు ఉపాధ్యక్షునిగా ఉండేవారు. తర్వాత హిమాన్షుగారు ఉపాధ్యక్షులయ్యారు.

1980 ఉద్యమం

సి.సి.ఎల్‌. హజారీబాగ్‌ని ఇప్పుడు హజారీబాగ్‌, కుజు అనే రెండు భాగాలుగా విభజించారు. హజారీబాగ్‌లో లక్ష్మణసింహ్‌ అనే ఒక కరడుగట్టిన జనరల్‌ మేనేజర్‌ వచ్చాడు. పెద్ద పెద్ద నేతలను సైతం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాడని అతడికి పేరు. నాతో పోటీపడతానని ఛాలెంజ్‌ చేశాడు. కార్మికులు, కూలీల మద్దతుతో పెద్ద పెద్ద అధికారులను నేను నానా తిప్పలు పెడతానని నాకు కూడా పేరు ఉంది. ఆయన నన్ను ”గుప్తా గారూ! మీరు ‘లాఠీసింహ్‌’ పేరు విన్నారుగా. నన్నందరూ లాఠీసింహ్‌ అంటారు. ఈ క్షేత్రంలో పనులను  మీరు, నేను పోట్లాడుకుంటూనా లేక సలహాలు ఇస్తూ సౌమ్యంగానా! ఎట్లా చేద్దాం?” అని అడిగారు.

”మీరు కేదలాలోని మట్టి బెడ్డలని చూడలేదా? మీరు బహుశ ఔరంగాబాద్‌ పహల్వానుల కథ కూడా వినలేదేమో. లాఠీ దగ్గర నుండి దెబ్బ వేస్తుంది. కానీ మట్టి బెడ్డ దూరం నుండే దెబ్బ వేస్తుంది. అందువల్ల లాఠీని ఏ విధంగా ఎదుర్కోవాలో మట్టి బెడ్డకు తెలుసు. సరే ఇక ఏరియాలో పనిచేసే విషయం. మాకు న్యాయం లభిస్తే ఎందుకు పోట్లాడతాను? మేము పీస్‌ రేటెడ్‌ కార్మికుల హితం కోసం ఏమైనా చేస్తాం. మున్షీ, సిబ్బంది కలిసి వీళ్ళని దోపిడీ చేస్తారు. నిజానికి పీస్‌ రేటెడ్‌ కూలీలకు సంపాదించే పుత్రులు అన్న పేరు ఉంది. మీరు వాళ్ళకి ఎంత ఎక్కువ పని చేప్తే అంతగా శ్రామికుల సంపాదన పెరుగుతుంది. అలాగే ఉత్పత్తి పెరుగుతుంది. క్రెడిట్‌ మీకే దక్కుతుంది. కానీ ఉత్పత్తి చేయకుండా ఎక్కువ ఉత్పత్తి చేశామంటే మాత్రం ఊరుకునేది లేదు. శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నట్లే” అని నేను జవాబిచ్చాను.

నా మాటలు ఆయనమీద ప్రభావం చూపాయి. ”నేను పీస్‌ రెటెడ్‌ కార్మికులకు సమయంలో ఎక్కువ పని ఇవ్వాలన్న ఉద్దేశ్యం కలవాడిని. అందువల్ల ఇక మీకు, నాకు ఏ గొడవ లేదు. నేను ఒకవేళ ఏదైనా పని చేయలేకపోతే మీరు రాంచీలోని హెడ్‌ క్వార్టర్స్‌కు వెళ్ళండి. మీరు నాకు ప్రామిస్‌ చేయాలి” అనునయంగా అడిగారాయన.

”ఒకవేళ ఇక్కడే పని అయిపోతే నేను రాంచీకి ఎందుకు వెళ్తాను? మేము మా నీతి నియమాల కోసం పోరాడతాం. కోల్‌ ఇండియా రాంచి-కలకత్తా పాలసీలకు విరుద్ధంగా జాతీయస్థాయిలో యుద్ధం చేస్తాం. దీనికి మిగిలిన అధికారులు అనుకున్నట్లుగా మీరు మీకు వ్యతిరేకమైన సమరం అని ససేమిరా అనుకోకూడదు. ఒకవేళ మీరు జాతీయ ఆహ్వానంపై దీక్ష చేపడితే మీరు మీ ప్రతిష్టకు భంగం అని భావిస్తూ దీక్షను విరమింపచేసేలా చేయకూడదు. చేస్తే మీతో మా సమరం తప్పదు. ఇలా ఎన్నో విషయాలమీద పోరాడవలసి వస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో మీరు ఎటువంటి పరిష్కారం ఇవ్వలేరు. సి.సి.ఎల్‌. రాంచి కార్యాలయం కూడా ఏమీ చేయలేదు. ఇదంతా ప్రభుత్వం చూసుకుంటుంది. గ్రామీణ వికాసం, నిర్వాసితులకు పునరావాసం, ఉద్యోగం, సంక్షేమ ప్రణాళికల విషయంలో మీరు ఏమీ చేయలేరు. అది మీకెలా తెలుసు” అని నేనన్నాను.

ఇదంతా జరిగిన కొన్ని నెలల తర్వాత మేము మా యూనియన్‌ తరఫునుండి అధికారికంగా కోల్‌ ఇండియా అధ్యక్షుడు శ్రీ ఆర్‌.ఎన్‌.శర్మకు ఒక నోటీసు పంపించాము. రైతుల డిమాండ్లపై విచారణ జరగకపోతే జరగబోయే ఉద్యమం గురించి హెచ్చరించాం.

కోల్‌ ఫీల్డ్‌ లేబర్‌ యూనియన్‌

నిబంధన సంఖ్య – 1996

ముఖ్య కార్యాలయం – మ్యూజియం రోడ్డు – (చీనీకోఠీ) పాట్నా

క్యాంప్‌: హజారీబాగ్‌

తేదీ: 28-4-80

శ్రీ ఆర్‌.ఎన్‌.శర్మ

ఛైర్మన్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌, కలకత్తా

సర్‌,

సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌ కుజు, అర్‌గడ్డా, హజారీబాగ్‌ క్షేత్రాలలోని బొగ్గు గనులలో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి పనులు చేస్తారు. కానీ ఈ శ్రామికులకు క్వార్టర్‌ ఇవ్వరు. నీరు, విద్యుత సదుపాయం లేదు. నేను మీకు నివేదించేది-

1.     నీళ్ళు, విద్యుచ్ఛక్తి, రోడ్లు మొదలైన సదుపాయాలు ఆయా బస్తీలలో ఉండేలా చూడాలి. గ్రామీణ శ్రామికులకు వెల్ఫేర్‌ ఫండ్‌ వల్ల ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే స్థానికులైన కార్మికుల పిల్లలు కోల్‌ఫీల్డ్‌లో చదువుకోరు. స్థానిక కూలీలు ఏ లాభం పొందరు. అందువల్ల ఊళ్ళల్లో ఏ పాఠశాలల భవనాలు కూలి పడిపోయాయో, ఏ పాఠశాలలో ఫర్నిచర్‌ లేదో అక్కడ వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి ఈ సదుపాయాలు కల్పించాలి. కవ్వాలీలు, నృత్యాలు కాకుండా వెల్ఫేర్‌ ఫండ్‌ని పారూబేడా, కేదలా హైస్కూల్‌కి, చరహా కాలేజికి ఉపయోగించాలి.

2.     బొగ్గు గనులలో పనిచేయడానికి దూరం నుండి వచ్చే శ్రామికులకు షిఫ్ట్‌ బస్సుల సదుపాయం కల్పించాలి.

3.     మూయబడిన గనులను (బూండు, హేసాలంగ్‌, జోరాకరమ్‌, జగేసర్‌, బన్‌వార్‌ మొ||) ప్రభుత్వం మళ్ళీ తెరవాలి. స్థానికుడైన నిరుద్యోగులకు, నిర్వాసితులకు పని ఇవ్వాలి.

4.     ఇన్సెంటివ్‌ బోనస్‌ ప్రణాళిక కింద శ్రామికులందరికీ సమానంగా బోనస్‌ ఇవ్వాలి. ఎక్కువ పని చేసేవారికి ఎక్కువ ఇవ్వాలి. దీనివల్ల వాళ్ళల్లో పని చేయాలన్న ఉత్సాహం ఎక్కువవుతుంది. ఒకరికి రెండొందలు, ఒకరికి ఇరవై రూపాయలు ఇచ్చి శ్రామికులలో భేదాలు సృష్టించడం సరైనది కాదు. కొన్ని బొగ్గు గనులలో ఈ విధంగానే జరుగుతోంది.

5.     వరద బాధితులకు ఇచ్చినట్లుగా కరవు కాటకాలకు బలయిపోయే శ్రామికులకు, సి.డి.ఎస్‌. ఫైనల్‌ కరవుభత్యం ఇవ్వాలి.

6.     బొగ్గు గనులకోసం భూమి ఇచ్చినవారికి ప్రతి ఇంట్లో ఆశ్రితులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. మూడు లేక ఒక ఎకరం అన్న షరతు తొలగించాలి.

7.     వాలంటరీ రిటైర్మెంట్‌ సందర్భంలో పదవుల అమ్మకాలను అరికట్టాలి. కోర్టు మ్యారేజ్‌ల ద్వారా జరుగుతున్న అక్రమాలను ఆపాలి.

8.     గ్రామీణ అభివృద్ధితోపాటే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాల్లో శాంతి ఉంటే పరిశ్రమలలో శాంతియుతమైన ఉత్పత్తి పెరుగుతుంది.

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నేను మిమ్మల్ని ప్రార్థించేదేమిటంటే బొగ్గు గనుల చుట్టుపక్కల బస్తీలను మీరు మీవిగా భావించి వాటి అభివృద్ధికి తోడ్పడాలి. లేకపోతే స్థానికులు, శ్రామికులలో అసంతృప్తి ఎక్కువవుతుంది. దానివల్ల మేనేజ్‌మెంట్‌తో పాటు ఇక్కడి స్థానికుల పరిభాష ప్రకారం బయటివాళ్ళు కూడా శిక్షను అనుభవించవలసి ఉంటుంది.

ఉపేక్షకి గురైన గ్రామస్థుల సమస్యలను తీర్చడానికి మీ సహాయ సహకారాలను త్వరలో అందిస్తారని ఆశిస్తున్నాను. అలా జరగకపోతే అస్సాంలా మళ్ళీ పునరావృతమైతే భేటీ పడడం చాలా కష్టం. దేశానికి పెద్ద నష్టం కూడా.

భవదీయురాలు

రమణిక గుప్తా

స.వి.ప., సెక్రటరీ

కోల్‌ఫీల్డ్‌ యూనియన్‌, హజారీబాగ్‌

మేము యాజమాన్యాన్ని ఎన్నోసార్లు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాం. ఏ రైతుల పిల్లలయితే పెళ్ళి చేసుకుని తల్లిదండ్రుల నుంచి వేరై వేరే కుంపటి పెట్టుకున్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళు భూములు పంచుకున్నట్లుగా కాగితాలు ఉన్నా లేకపోయినా 1980లో నిర్వాసితుల ఉద్యమం తర్వాత ‘పరివార్‌ కీ పరిభాష’ను మేము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చాం. ఇక్కడ వారిస్‌ (వారసులు) అంటే అర్థం తల్లిదండ్రులు, ముగ్గురు కౌమార్యం దాటని పిల్లలు. చట్టం ప్రకారం భూమిని బ్లాక్‌స్థాయిలో పంచడం ఎంతో కష్టమైన పని. మామూలు రైతులకైతే అసాధ్యం.

ఈ అవగాహనతో యూనియన్‌ పనులన్నీ సరైన పద్ధతిలో నడుస్తున్నాయి. మేం మా అందరి శక్తి గ్రామీణులను సంఘటితపరచడానికి ఉపయోగించేవాళ్ళం. మా యూనియన్‌ కేడర్‌ వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో ఇకముందు జరగబోయే ఉద్యమం గురించి చెప్పేవాళ్ళు. ప్రతిరోజూ మీటింగ్‌ పెట్టేవాళ్ళం. మేం నోటీసు రూపంలో కాగితాన్ని ముందే కోల్‌ ఇండియా అధికారులకు ఇచ్చాం. అందులో శ్రామికుల డిమాండ్లతోపాటు గ్రామీణుల డిమాండ్లు కూడా ఉన్నాయి. ప్రతి ఊరు వెళ్ళి ప్రచారం చేశాము. నెట్‌వర్క్‌ తయారుచేయడంలో నిమగ్నమైపోయాము. ఈ ఆశయంతోనే బీహార్‌ ప్రభుత్వానికి కూడా ఓపెన్‌ లెటర్‌ పంపించాం. మేము కార్మికులు, గ్రామీణుల ఉమ్మడి ఉద్యమానికి సిద్ధం కావడం మొదలుపెట్టాం. దీంట్లో పాలసీలు, రాజనైతిక ప్రశ్నలు కూడా ఉన్నాయి.

బీహారు ముఖ్యమంత్రి పేరున ఓపెన్‌ లెటర్‌

ఛోటా నాగపూర్‌ వాసుల పట్ల కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న చిన్నచూపు వైఖరికి సామాన్యులు కూడా ఎంతో బాధపడుతున్నారు. నిర్వాసితుల సమస్యలు, స్థానికుల ఉద్యోగాల సమస్యలకు సమాధానాలు వెతక్కుండా కొందరు అధికారులు, కొన్ని సంస్థలు తమ తమ స్వార్థాల కోసం ఈ సమస్యలను ఇంకా జఠిలంగా చేయడం మొదలుపెట్టారు.

బొగ్గు పరిశ్రమల వలన ఏమి ఆశించామో అది జరగలేదు. సి.ఐ.ఎల్‌. అయినా, టాటా కంపెనీ అయినా ఉద్యోగాల విషయంలో సరైన పద్ధతిని అవలంబించలేదు. నిరాశే ఎదురయింది.

1. రెండువేల మంది సెక్యూరిటీ గార్డులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఛోటా నాగ్‌పూర్‌ను వంచించాలన్న

ఉద్దేశ్యంతో సి.సి.ఎల్‌. సెక్యూరిటీ విభాగం సైనికులకు  నిర్థారింపబడిన ఎత్తు ఐదడుగుల నాలుగంగుళాలను, ఐదడుగుల ఏడంగుళాలకు పెంచారు. దీని గురించి మేం ముందే తెలియచేశాం. ఉద్యేగం రిక్రూట్‌మెంట్‌ కోసం జనరల్‌ అప్లికేషన్లు తీసుకోకుండా రిటైరయిన

ఉద్యోగులనే తీసుకోవాలన్న దాని వెనుక రహస్యమేముందో ఎవరికీ అర్థం కావడంలేదు.

టాటా కంపెనీ, సి.సి.ఎల్‌.లలో ఉద్యోగుల ఆశ్రితులకే పని ఇవ్వడం, వాలంటరీ రిటైర్మెంటు ద్వారా ఉపాధి ఇవ్వడం రాజ్యాంగానికి వ్యతిరేకం. వంశపారంపర్యంగా ఈ పనులు ఇవ్వడంవల్ల స్థానికులకు ఎప్పుడూ ఉపాధి లభించే అవకాశమే లేదు. సి.సి.ఎల్‌. అగ్రిమెంట్‌ ప్రకారం కొత్త ఉద్యోగాలు ఐదు కిలోమీటర్ల పరిధిలోపు ఉన్నవారికే లభిస్తాయి. అయితే ఈ నియమాన్ని సి.సి.ఎల్‌. స్వయంగా ఉల్లం ఘించింది. ఈ సంవత్సరమే కుజులో హజారీబాగ్‌ జిల్లా వెలుపల ఉన్నవారిని డ్రైవర్లుగా రిక్రూట్‌ చేశారు. వాలంటరీ రిటైర్మెంట్‌లో అంతా మోసమే. ఛోటా నాగ్‌పూర్‌ నివాసితుల అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ను 6 నుండి 10 వేల రూపాయిలతో దళారీల ద్వారా ఎవరైనా బయటి వ్యక్తులు కొంటారు. కోర్టులో మేరేజ్‌ అఫిడవిట్‌ చేయించి నాయకులు పనిచేసే వాళ్ళద్వారా ఉద్యోగాన్ని సంపాదిస్తారు.

టాటాలో కేవలం సిబ్బంది బంధువులకే ఉద్యోగం లభిస్తుంది. వేరేవాళ్ళకు దొరకదు. ఈ గనులలో 1970కి ముందు చాలా తక్కువమంది స్థానికులకు ఉపాధి దొరికేది. స్థానికులను కేవలం కాంట్రాక్టర్లుగానే ఉంచేవారు. తరచుగా వారిని తీసేసేవారు.

2. బొగ్గు గనుల కోసం భూములను సేకరిస్తారు. కానీ ఈ విషయంలో వింత చట్టాలను ప్రవేశపెట్టారు. మూడెకరాలకు యజమాని అయితేనే ఉద్యోగం దొరుకుతుంది. లేకపోతే లేదు. దీని అర్థం పేదవారికి కాదు, అంతో ఇంతో ఆస్తిపాస్తులు

ఉన్నవారికే. సి.సి.ఎల్‌.లో, టాటాలో ఉన్నవారికే ఉద్యోగాలు లభిస్తాయి. ఇ.సి.ఎల్‌.లో అలాంటి నియమం లేదు. బి.సి.సి.ఎల్‌.లో ఒక ఎకరం ఉండాలి అన్న నియమం ఉంది.  అసలు ఈ నియమం ఎందుకు? రోడ్డు కోసం, బొగ్గు గనుల కోసం, మీరు భూమిని దేనికోసం తీసుకున్నా ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ భూములవల్ల జీవనోపాధిని పొందుతున్న నివాసులు అని ధృవీకరించే పత్రాలను పొందిన ఆదివాసీలు, దళితులు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకు కూడా పని కావాలిగా. టాటా యాజమాన్యం 30 సంవత్సరాల క్రితం బంజీవాళ్ళ 37 ఎకరాలను తీసుకున్నారు. చైన్‌పూర్‌ సైడింగ్‌లో చాలా ఎకరాలు తీసుకున్నారు. కానీ ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదు. ఈరోజు వాళ్ళ కొడుకులు యువకులయ్యారు. వాళ్ళు తెలివిగలవారు, పనిచేయగలరు. వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు దొరకలేదు. ఆ సమయంలో వాళ్ళ పూర్వీకులు వీళ్ళను మభ్యపెట్టి చాలా తక్కువ ధరకు భూమిని చేజిక్కించుకున్నారు. టాటా కంపెనీవాళ్ళు ఎవరి భూమిలోనైనా 21 డెసిమల్‌ తీసుకున్నాక వాటి చుట్టుపక్కల ఉన్న మూడెకరాల భూమిని అక్రమంగా చేజిక్కించుకున్నారు. కోల్‌ డంపింగ్‌ వల్ల చుట్టుపక్కల ఉన్న భూములకు ఎంతో నష్టం కలిగింది కానీ దీనిపై టాటా వాళ్ళు కించిత్‌ కూడా దృష్టి పెట్టలేదు.

3. కేదలాలో రైల్వే శాఖ మా భూములను తీసుకుంది. ప్రఖండ్‌ కార్యాలయం నుండి పనులు జరుగుతున్నాయి. మా భూమిని కూడా సి.సి.ఎల్‌. కంపెనీనే ఉద్యోగాలనివ్వకుండా చేజిక్కించుకోవాలని చూస్తోంది.

సి.సి.ఎల్‌., టాటా కంపెనీలు అంతటా మిషన్లే వాడుతున్నాయి. శ్రామికులను సర్‌ప్లస్‌ అంటూ కొత్త ప్రణాళికలను చూపడం,

ఉపాధి మార్గాలన్నీ మూసివేయడం కాకపోతే మరేంటి?

ఎక్కడ అవసరమో అక్కడ మిషన్లు తప్పవు. కానీ కోల్‌ లోడింగ్‌కి కూడా శ్రామికుల బదులు మిషన్లు ఎందుకు? క్వారీలలో బొగ్గులను కట్‌ చేయడానికి మనిషి బదులు మిషన్లెందుకు?

నిరుద్యోగులు ఏం చేయాలి? బొగ్గు గనులు జాతీయకరణ అయినప్పటినుండి కార్మికులు పనులు చేయడం లేదు అంటూ వాళ్ళనే బద్‌నాం చేయడానికి చూస్తారు. జీతాలు పెరిగాయి అందువలన బొగ్గుల ధర కూడా పెరిగింది. వేల టన్నుల బొగ్గులు గనులలో పడి ఉన్నాయి. కానీ అమ్మేవాళ్ళు, డి.ఓ. నేతలు, ప్రభుత్వ అధికారులు, బొగ్గు గనుల అధికారులతో చేతులు కలిపి స్కైల్‌ బదులు స్టీమ్‌, స్టీమ్‌కి బదులుగా పోడా తీసుకువెళ్తారు. బొగ్గుని భారతదేశంలో కాకుండా పాకిస్థాన్‌, నేపాల్‌లకి పంపిస్తారు. ధర పెరగడానికి మళ్ళీ కార్మికులే కారణమని అంటారు. కార్మికులు కాంట్రాక్ట్‌ ప్రకారం పనిచేస్తారు. ఎంత బొగ్గును కట్‌ చేస్తారో అంత కూలీ పొందుతారు. అసలు పని, పాటు చేయకుండా సుఖాలను అనుభవించేవారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యా ఎందుకు తీసుకోదు?

4. ఇదే స్థితి భూముల నష్టపరిహారం విషయంలో కూడా ఉంది. పంట విషయంలో నష్టపరిహారం కానీ, భూమి విషయంలో పూర్తి నష్టపరిహారం కానీ బాబా ఆడమ్‌ జమానాలోని ధర ప్రకారం ఇస్తే ఎట్లా? 1908లో ఉన్న ధర ప్రకారమే ఇప్పుడు 1980లో ఇస్తే ఎట్లా?

మా భూములు నోటీసు ఇవ్వకుండానే, తవ్వకాల విభాగానికి తెలియపరచకుండానే ఇనుపకంచె వేయకుండానే టాటా కంపెనీ, సి.సి.ఎల్‌. తవ్విస్తాయి. పంట పరిహారంగా అంతో ఇంతో డబ్బు ముట్టచెప్తాయి. తర్వాత తవ్వకమయ్యాక దాన్ని మళ్ళీ ఎవరూ కొనరు. ఎవరూ నష్టపరిహారమూ ఇవ్వరు.

నోటీసు ఇవ్వకుండానే టాటా, సి.సి.ఎల్‌లు రాయితీ స్థలాలను ఆక్రమిస్తున్నాయి. కోడ్‌కర్‌ రైట్‌, లేబర్‌ సెటిల్మెంట్ల భూములను గ్రామీణులు దున్ని అంతో ఇంతో పండించి జీవిస్తున్నారు. ఎటువంటి చట్టపరమైన విచారణ లేకుండా భూములను లాక్కుంటున్నారు.

ఉద్యోగాలు, సద్యోగాలు లేవు. డబ్బులు లేవు. ఇవ్వాళ మా భూములే మాకు కాకుండా పోయాయి. దున్నితే తన్నులు తింటాం. పట్టుదల సాగిస్తే కేసుల్లో ఇరుక్కుంటాం. కానీ ఇక ఇప్పుడు మేము మా భూములను దున్నుతాం. మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.

నష్టపరిహారం రేటు పెంచాలి. భూములలో భాగం ఉన్నవాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. టాటా, సి.సి.ఎల్‌. లేబర్‌ పాలసీని మార్చాలి. యాంత్రీకరణను ఆపేయాలి. పే లోడర్‌ బంద్‌ చేయాలి.

అందువలన ఇక మేం ఊరుకోము. మౌనంగా ఉంటే భూములు పోతాయి. ఉద్యోగాలు లేకపోవడం వలన ఆకలితో చావాల్సి వస్తుంది. మీ మనస్సు స్పందిస్తుందని ఆశిస్తున్నాము. మీరు ఈ కంపెనీల పన్నాగాలని, కుతంత్రాలని తెలుసుకోవాలని మనవి.

మీరు కల్పించుకుని కింద ఇవ్వబడిన డిమాండ్లను పూర్తి చేయాలి.

1. నిర్వాసితులకు భూమికి బదులుగా ఉద్యోగం

(క) మూడు ఎకరాల నియమాన్ని తొలగించాలి

(ఖ) భూమిలో భాగమున్న ప్రతివారికీ ఉద్యోగం లభించాలి.

(గ) ఆ భూములపై బాస్‌ గీత కాగితాలను తీసుకున్న భూమిలేని దళిత, ఆదివాసీలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి.

(ఘ) కోడ్‌కర్‌ రైట్‌, పనిలేని వారికి సర్వోదయ, రౖెెల్వేకిచ్చిన భూములకు బదులుగా ఉద్యోగాలివ్వాలి.

(జ్ఞ) గిద్దీ వాషరీ నుండి దనియా, పరేజ్‌ నుండి కేదలా వరకు వెళ్ళే రోడ్లకిచ్చిన భూములను దృష్టిలో పెట్టుకుని

ఉద్యోగాలివ్వాలి.

2. కేవలం టాటా, సి.సి.ఎల్‌ ఆశ్రితులకు ఉద్యోగం ఇవ్వాలన్న పాలసీని ఆపేయాలి. దీనివలన కొత్తవారికి

ఉద్యోగాలు లభిస్తాయి.

3. ప్రభుత్వం లేబర్‌ నియామక పాలసీలో మార్పు చేయాలి. ఛోటా నాగపూర్‌లో స్థానీయులు అంటే అర్థం ఛోటా నాగపురి కావాలి.

4. సి.సి.ఎల్‌.లో రెండువేల మంది సెక్యూరిటీ గార్డులకు ఉద్యోగాలు ఎక్స్‌ మిలటరీ మెన్‌కు కాకుండా ఛోటా నాగపూర్‌ నివాసులకు లభించాలి. ఎత్తు ఐదడుగుల నాలుగు అంగుళాలు మాత్రమే ఉండాలి.

5. అనవసరంగా యాంత్రీకరణ చేయవద్దు. పే లోడర్‌ని వెంటనే బంద్‌ చేయాలి.

6. మూతబడ్డ గనులను సి.సి.ఎల్‌. నడపాలి. అందులో కేవలం నిర్వాసితులకు, చుట్టుపక్కల బస్తీలలో ఉన్న గ్రామీణులకు

ఉద్యోగాలు ఇవ్వాలి.

7. సి.సి.ఎల్‌. తాను చేసిన అగ్రిమెంట్‌ను, సర్క్యులర్‌ను అమలు చేయాలి. కలకత్తాలో రమణిక గుప్తా, కోల్‌ ఇండియా ఛైర్మన్‌ కుమార మంగళం మొదలైనవారి సమావేశం జరిగింది. ఎవరైనా సరే గనులకు చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రామీణులకు మాత్రమే ఉద్యోగాలు లభించాలి.

8. గిద్దీ, వాషర, టిప్‌లాల్‌లలో ఇంకా ఠేకేదారీ కింద పనిచేస్తున్న శ్రామికులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి.

9. టాటా 137 ఎకరాల బంజరు, బారూఘాట్టూ భూములు, ఇంకా చాలా ఎకరాల చైన్‌పూర్‌ సైడింగ్‌ కోసం అతనా, ఛద్‌వా, చైన్‌పూర్‌, సోన్‌డిహల భూములను ఎన్నో సంవత్సరాల క్రితం తీసేసేకుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలు ఇవ్వాలి.

10. టాటా భూమిని తీసుకుని కూడా నష్టపరిహారం ఇవ్వకుండా దుకాణదారులకు, ఇంకా కొంతమందికి అద్దెకు ఇస్తోంది. దీనికి వ్యతిరేకంగా మీరు చర్యలు తీసుకోవాలి.

11. టాటా గ్రామీణుల దగ్గర భూమి తీసుకుని బయటివారికి పొలం చేయడం కోసం లీజుకు ఇచ్చింది. ఒకవేళ ఈ భూములు టాటా కంపెనీకి అవసరం లేకపోతే వీటిని గ్రామీణులకు ఇచ్చేయాలి. లేకపోతే వారికే పొలం చేయడానికి లీజుకు ఇవ్వాలి.

12. దుని బస్తీల వాళ్ళకి వాషరీ వలన తాగునీరు కూడా లభించడంలేదు. వారికోసం నీటి వసతి కల్పించాలి. (నదిలో బొగ్గు, సెలైరీ కలవడంవలన నది నల్లగా అయిపోయింది)

13. కేదలా, ఘాటోలో తెరవబడుతున్న వాషరీలలో పనిచేయడానికి చుట్టుపక్కల గ్రామాలలో (హజారీబాగ్‌ జిల్లాలోని) యువకులను ఎంచుకుని ప్రభుత్వ ఖర్చుతో శిక్షణనివ్వాలి. వాషరీలలో పనులు ఇవ్వాలి.

14. కంపెనీవారు హెవీ బ్లాస్టింగ్‌ చేయడంవలన ఘాటో హైస్కూల్‌ గోడలకి పగుళ్ళు వచ్చాయి. దీనివలన ఏ క్షణాన్నైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక బ్లాస్టింగ్‌ని ఆపేయాలి. లేకపోతే కంపెనీ తన ఖర్చు మీద వేరేచోట స్కూల్‌ కట్టించాలి.

మీరు ఈ విషయాలలో కల్పించుకుని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.

లాల్‌చంద్‌ మహతో, ముఖ్య అధికారి

క్షేత్రీయ సమితి, లోక్‌దళ్‌ (ఛోటా నాగ్‌పూర్‌, సంధాల్‌ నగర్‌)

రమణిక గుప్తా

స.వి.స., సెక్రటరీ

కోల్‌ఫీల్డ్‌ యూనియన్‌, హజారీబాగ్‌

14-8-1980

మేము కావాలనే ఉద్యమం జరిగే తేదీని ప్రకటించలేదు. ఏ తేదీన మొదలుపెట్టాలో నిర్ణయించడానికి ఆగస్టు 15న సమావేశం పెట్టాలనుకున్నాం. కార్యక్రమం కూడా నిర్ణయించాలి.

ఆగస్టు 15, 1980న వెస్ట్‌ బొకారో బొగ్గు గనుల ఘాటో టాండ్‌కి చెందిన రామ్‌ మనోహర్‌ లోహియా శ్రామిక ఉన్నత విద్యాలయంలో కోల్‌ఫీల్డ్‌ లేబర్‌ యూనియన్‌ వైపు నుండి హజారీబాగ్‌, కుజుక్షేత్రం (సి.సి.ఎల్‌.)లోని అన్ని గనుల శాఖల కార్యదర్శులను, అధ్యక్షులను బొగ్గు గనులలో చుట్టుపక్కల నిర్వాసితులైన ముఖ్యమైన గ్రామీణ కార్యకర్తలను జండా వందనం సమయంలో పెట్టే సమావేశానికి రావాలని పిలిచాం. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆదివాసీలు, దళితులకు పునరావాసం, ఉద్యోగాలు, గ్రామీణులకు సంబంధించిన సమస్యలపై చర్చ జరపాలనుకున్నాం.

ఉద్యమం తర్వాత స్కూల్‌ హాల్‌లో అందరూ కలిశారు. అందువలన వాళ్ళ ముఖాలు వెలిగి పోతున్నాయి. ముకుంద బేడాకు చెందిన బాబూరావ్‌ మాంఝీ, కేదలాకు చెందిన జుమ్మన్‌ మియా, సీతారాం కర్‌మాలీ, భీమ మహతో, హర్‌దయాళ్‌ మహతో, లాల్‌మన్‌ మహతో, అవధ్‌ సర్దార్‌, తోపా-తొయరాకి చెందిన సాయినాథీ మహతో, తులసీ మహతో, జకామ్‌ కర్‌మాలీ, లయియా రవిదాస్‌; కేదలా అండర్‌గ్రౌండ్‌కి చెందిన లాల్‌జీ మహతో, రాహీబస్తీకి చెందిన మహతో ఆయినేం, గంఝా మహిళలు, దున్నీకి చెందిన లాల్‌జీ మహతో, తాపిన్‌నాథ్‌కి చెందిన మున్షీసింగ్‌ గంఝా, ఆయన భార్య, ఇంకా మహావీర్‌ సావ్‌ ముఖియా, విరాజ్‌ నోనియాం, తాపిన్‌ దక్షిణ్‌కి చెందిన దుబ్‌రాజ్‌ మాంఝీ, రేబా మాంఝీ, జైవీర్‌ మహతో, మోహన్‌ మహతో, బసంత్‌పూర్‌కి చెందిన రాజకుమార్‌ కర్‌మాలీ, ఖుషీలాల్‌ మహతో, ఆయన చెల్లెలు, రషీబ్‌సాహెబ్‌, కారీనాథ్‌ మహతో, చుకుందర్‌ మహతో, రజాక్‌ సాహెబ్‌, ముఖియాజీ, బైజూ బాబు; కుజు, హౌస్‌గఢా,పుండీకి చెందిన జ్ఞానీ మహేంద్ర సింహ్‌, దుఖీ మహతో, సర్పంచ్‌ లడ్డూ మహతో, ద్వారకా మహతో, మహదేవ్‌ మాంఝీ; మాండూకు చెందిన ఇంద్రనాధ్‌ సావ్‌, రామానంద్‌ సావ్‌, బంజీకి చెందిన ఛోటన్‌ సావ్‌, గోపాల్‌ సావ్‌, రాజకుమార్‌ సావ్‌, కిషన్‌ సావ్‌, లయియో రాహోమ్‌; పచమో, దున్నీ, ముకుందబేడా, ఝరవా, బర్‌సమ్‌, రౌతా, సిర్‌కా, చైన్‌పూర్‌, బడ్‌గావ్‌, కరమా, రతలై, హసిర్‌, సోన్‌డహి, బీస్‌మయిల్‌, పిండ్‌రా, గిదనియాం, చుంబాలా నుండి ఆదివాసీలు ‘సదాన్‌’ గ్రామీణ కార్యకర్తలు వచ్చారు. వీళ్ళ భూములు గనుల కోసం తీసుకోబడ్డాయి. కొందరి భూములు ఇంకా తీసుకోబడుతున్నాయి. వాళ్ళకి ఏ నష్టపరిహారం అందలేదు. ఏ ఉద్యోగాలూ లేవు. కేవలం హామీ ఇస్తూ బలవంతంగా నిలహే ఇంగ్లీషు వాళ్ళ (వీళ్ళు ‘నీల్‌’ అనే మొక్కలను వేయాలని రైతులపై ఒత్తిడి తెస్తారు)లాగా సి.సి.ఎల్‌. అధికారులు స్థానిక దళారులతో కలిసి వాళ్ళ పొలాలను బొగ్గు గనులుగా మార్చేస్తున్నారు. బొగ్గు గనులలో యూనియన్‌ ఒత్తిడి వలన కూలీలకు కొన్ని పెంకుటిళ్ళు, క్వార్టర్‌, విద్యుత్‌, స్కూల్‌, ఆస్పత్రి, తాగునీటి కోసం చేతిపంపులు, ఎండాకాలంలో లారీలలో నీళ్ళు ఇచ్చే సదుపాయం చేశారు. కానీ చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే కూలీలకు ఏ మాత్రం సదుపాయం లేదు. సి.సి.ఎల్‌కు చెందిన 13 బొగ్గు గనులు, కేదలా, లయియో, ఝార్ఖండ్‌, తాపిన్‌ నార్త్‌, తాపిన్‌ సౌత్‌, ఆరా, సర్‌వాడా, కుజు, హైసాగఢా, తోపా, పిండరా, గిథనియా, పుండీ లేక వసంతపూర్‌, వాషరీ, భూములు ఇచ్చేసిన చుట్టుపక్కల ఉన్న రైతులు, ఎద్దులు-నాగళ్ళను తీసుకుని అన్ని గనుల భూములను దున్నడానికి నిర్ధారించబడిన రోజున తెల్లవారుఝామున రావాలని సమావేశంలో నిర్ణయించాం. ఆ గనుల దగ్గర ఉండేవాళ్ళే నేతృత్వం వహించాలని నేను వెళ్ళకూడదని కూడా నిర్ణయించారు. పిస్తోళ్ళు పేల్చినా, లాఠీఛార్జి జరిగినా నేను ఆ సంఘటన జరిగిన స్థలానికి వెళ్తాను. ఈ ఉద్యమం నేతృత్వం కూలీలు-రైతులు కలిసి చేస్తారు. ఈ దాడి చేస్తున్న వార్త ఎవరికీ చెప్పకూడదు. ప్రతిరోజూ జరిగే సంఘటనల గురించి నాకు చెప్పడానికి ప్రతి క్షేత్రం నుండి ఒక్కొక్క వ్యక్తినీ హజారీబాగ్‌కి పంపించాలి. అరెస్టులయితే ప్రతిరోజూ సాయంత్రం హజారీబాగ్‌లో నినాదాలు చేస్తూ జనం ఆఫీసు ప్రాంగణం నుండి బయలుదేరి కచేరీకి వెళ్ళాలి. కచేరీ నుండి కూడా నినాదాలు ఆఫీసుదాకా వినిపిస్తాయి. ఊరేగింపు వస్తోందని మేము తెలుసుకోగలుగుతాం. ఉద్యమాన్ని సఫలీకృతం చేయడానికి బొగ్గు గనుల యాజమాన్యాన్ని ఒక్కసారిగా అవాక్కయ్యేలా చెయ్యాలని మా ఉద్దేశ్యం. అంతేకానీ అరెస్టులు చేయించుకుని మా పేర్లను పేపర్లో వేయించడానికి కాదు. అందువలన అరెస్టు కాకుండా చూసుకోవాలని అందరికీ ఆదేశాలు ఇచ్చాం. దీనివలన ఉద్యమం దీర్ఘకాలం నడుస్తుంది.

ఆగస్టు 15న సమావేశానికి చాలారోజుల ముందు లాల్‌చంద్‌ గారు బేరమో నుండి వచ్చి హజారీబాగ్‌ కార్యాలయంలో ఒక వారంపాటు ఉండే ఏర్పాటు అయింది. మేమందరం అప్పుడప్పుడూ విడివిడిగా, అప్పుడప్పుడూ కలిసి గ్రామాలలోకి వెళ్ళి అందరినీ సంఘటితపరిచేవాళ్ళం, సభలు పెట్టేవాళ్ళం. ఉద్యమం తేదీ సూచన ఇచ్చే బాధ్యత ఆ క్షేత్రంలో ముఖ్యమైన కార్యకర్తలకు ఇచ్చేవాళ్ళం. ఘాటో టాండ్‌లో జరిగే సభకి హాజరై ఆగస్టు 15 రాత్రి తిరిగి తిరిగి తమ తమ క్షేత్రాల గ్రామీణులకు ఉద్యమంలో పాల్గొనాలని సూచనలిచ్చేవాళ్ళు. గనుల అధికారులకు ఎప్పుడు ఎక్కడ ఉద్యమం జరుగుతుందో తెలియదు. పోలీసులకు కూడా తెలియదు.

ఆగస్టు 15న ప్రాతఃకాలంలో గ్రామీణులు నాగలి-ఎద్దులను తీసుకుని పదమూడు గనుల దగ్గరికి వచ్చారు. బంజీబస్తీ మా స్థావరమని అనుకుంటారు. ఆ ఊళ్ళో ప్రతి యువకుడు మాతో ఉన్నాడు. వాళ్ళు బాగా చదువుకున్నారు. స్థితిగతులు బాగున్నాయి. మా ఉద్యమాల ప్రభావం వలన టాటా వెస్ట్‌ బొకారో, ఘాటో గనులు, సి.సి.ఎల్‌.లో ఉద్యోగాలు లభించాయి. బంజీలో చాలామందికి ఉద్యోగాలు దొరికాయి. కొందరు  టాటా వెస్ట్‌ బొకారో గనులలో ఠేకేదారీలను కూడా తీసుకున్నారు. అక్కడ యువకులందరూ ఈ ఉద్యమంలో ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు. మొదటిరోజు అంతటా శాంతియుతంగా ఉద్యమం నడిచింది. సాయంత్రం కాగానే సి.సి.ఎల్‌. అధికారులకు ఏం జరుగుతోందో తెలిసిపోయింది. నన్ను తీసుకురావడానికి జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం నుండి మనుషులు వచ్చారు. మేము డిప్యూటీ కమిషనర్‌కి ఈ ఉద్యమం గురించిన అవగాహన కలగడానికి, కల్పించుకుని పరిష్కారం చూపాలన్న ఉద్దేశ్యంతో 21-8-80న ఈ కింది విధంగా ఉత్తరం రాశాం.

రమణిక గుప్తా                                    ఫోన్‌ : 567, హజారీబాగ్‌

బీహారు విధానసభ సభ్యురాలు                                       : 24825, పాట్నా

మినిస్టర్‌ – కోల్‌ఫీల్డ్‌ లేబర్‌ యూనియన్‌                                 తేదీ: 21-8-1980

హజారీబాగ్‌

సంఘటన్‌ మంత్రి: హింద్‌ మజ్టూర్‌ సభ, బీహార్‌

డిప్యూటీ కమిషనర్‌, హజారీబాగ్‌

విషయం సి.సి.ఎల్‌.కు చెందిన చరహీ, కుజు ప్రాంతాలలో రైయతోం ద్వారా తమ తమ భూములను కబ్జా చేసిన విషయంలో

….
అయ్యా!
పైన రాయబడిన విషయానికి సంబంధించిన వివరణ ఇస్తున్నాను. రైయతోంల రైయతీ భూములను తీసుకుని సి.సి.ఎల్‌ అధికారి భూములకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి 1972-73 నుంచి ఈనాటి వరకు గనులను నడుపుకుంటున్నారు. దాదాపు ఒకటిన్నర నెలకు పూర్వం సి.సి.ఎల్‌. జనరల్‌ మేనేజర్‌కి, చరహి, కుజుల జి.ఎం.లకు నోటీసిచ్చాం. నేను ఒక నెల లోపల రైతులకు భూముల పరిహారం ఇవ్వాలని తెలిపాను. దీని తర్వాత మేము దాదాపు ఒక నెల ఎదురుచూశాం. కానీ ఈ విషయంలో ఎటువంటి చర్యా తీసుకోలేదు. నష్టపరిహారం ఇవ్వలేదు. ఉద్యోగాలూ రాలేదు. ఇక ఇప్పుడు వివశులమై ఒక నిర్ణయానికి వచ్చాం. రైతులందరూ తమ తమ భూములను దున్ని వాటిపై అధికారం పొందాలి. తేదీ 18-8-1980 నుండి రైతులు వారి వారి భూములను దున్నడం మొదలుపెట్టారు. ఫలితం గనులలోని పనులు ఆగిపోయాయి. సి.సి.ఎల్‌. అధికారులు రైతుల ద్వారా దున్నబడిన భూములను రైతుల దగ్గరనుండి లాక్కోవాలని, ప్రభుత్వం సహాయం చేయాలని అడిగినట్లుగా మాకు తెలిసింది.

తమ తమ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ఎటువంటి తప్పూ కాదని నా అభిప్రాయం. అందువల్ల పోలీసుల ద్వారా సి.సి.ఎల్‌. చెప్పడంవలన రైతులను అక్కడినుంచి తొలగించడం పక్షపాత చర్య. ఎందుకంటే ఈ భూములను దున్నడం, ఆధీనంలోకి తెచ్చుకోవడం మొదలైన విషయాలు ప్రభుత్వానికి సంబంధించినవి కావు.

అందువలన మీరు ఈ విషయంలో కల్పించుకుని స్థానిక అధికారులను రైతుల ఉచితమైన డిమాండ్లను ఒప్పుకోవాలని ఒత్తిడి తేవాలని మా ప్రార్థన. ఈ విషయంలో నేను కూడా మీకు సహాయ సహకారాలందిస్తాను. సరియైన సమాధానం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. దయచేసి అధికారులను పిలిపించి సి.సి.ఎల్‌.పై  ఒప్పందం చేసుకోవాలని సూచన చేయగలరు.

భవదీయురాలు
రమణికగుప్త
స.వి.స, మాండూ క్షేత్రం, హజారీబాగ్‌

(ఇంకాఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.