రాణీ దుర్గావతి – భండారు అచ్చమాంబ – సరళీకరణ : పి. ప్రశాంతి

గే. చిదుకుల గదుల్చుటను నగ్ని చెలగి మండు;
చెడుగు చేయుటచే బాము పడగద్రిప్పు
మఱియు క్షోభంబువలననే మానవుడును
దనదు మహిమంబు చూపును తథ్యముగను – వీరేశలింగకవి

పదహారో శతాబ్దంలో బుందేల్‌ఖండ్‌ సంస్థానంలో ప్రసిద్ధికెక్కిన రాజులలో ప్రథముడగు చందవేల్‌ రాజుకు రూపగుణ సంపన్నురాలైన ఒక కూతురు ఉండేది. ఆమె పేరు దుర్గావతి. ఆమె రూపగుణాల కీర్తి దిగంతాలు నిండి అనేకమంది రాజపుత్రులు ఆమె కోసం చందేల్‌రాజును ఆశ్రయిస్తుండేవారు. కానీ, ఆ రాజపుత్రులు తన కూతురికి తగినవారు కారని తలచి, చందేల్‌ రాజు వారికేదో ఒక కారణం చెప్పి పంపుతుండేవాడు. ఒకసారి గఢా మండల సంస్థానాధిపతియైన గోండురాజు దుర్గావతిని తనకిమ్మని ఆమె తండ్రిని వేడుకున్నాడు. ఈ గోండురాజు యొక్క శౌర్యసాహసాలను గురించి చారుల ద్వారా విని ఉండడం వలన, దుర్గావతి కూడా ఆయనయందు బద్ధానురాగయై

ఉండేది. గోండులు జాతియందు, విద్యయందు, నాగరికతయందు రాజపుత్రులకంటే తక్కువవారు. గోండువారు ఆర్యులు కారు, అనార్యులు. కనుల అట్టి నీచ కులజునికి తమ శ్రేష్ఠవంశపు కన్యను ఇవ్వడానికి చందేల్‌రాజుకు ఇష్టం లేకపోయింది. కాని, అప్పడు గోండురాజు అత్యంత బలవంతుడిగా ఉన్నాడు. ఈ రాజు పాలించే గఢామండల రాజ్యం అంతగా గొప్పది కాకపోయినా అతడు గొప్ప బలవంతుడైనందున అతనికి అనేకమంది రాజులు సహాయంగా ఉన్నారు. ఇలాంటి రాజుతో పోరి గెలవలడం దుర్లభమని,  దుర్గావతి మనసు అతనియందే చిక్కిందని తెలిసి చందేల్‌ రాజు గఢామండలేశ్వరునికి తన కుమార్తెనిచ్చి వైభవంగా వివాహం చేశాడు.

వివాహం జరిగిన తర్వాత అత్తవారింటికి వచ్చేటప్పుడు దుర్గావతి తండ్రి రాజ్యంలోని బీదసాదలకు అనేకమందికి శాశ్వత జీవనాన్ని ఏర్పరచింది. అందువలన వారందరూ ఆమెను తమ పాలిట దైవంగా భావించి ఆమెకు అనేక దీవనలనొసగారు. ఈమె గఢామండలానికి వచ్చిన తర్వాత ఈమె భర్త, రాజ్య విచారణమేమీ చేయక ఈమెయందే అధికానురాగం కలవాడై సదా నర్మదా నదీ తీరానికి, అక్కడున్న ఉద్యానవనాలలోనూ విహరిస్తూ కాలం వ్యర్థపరుస్తుండేవాడు. అనేకసార్లు దుర్గావతి రాజ్యాన్ని బాగా ఏలవలసిందిగా రాజుకు సూచించింది కాని, విషయాసక్తుడైన రాజు ఆ మాటలను లక్ష్యపెట్టలేదు. అంతట కొంతకాలానికి దుర్గావతి గర్భవతై ఒక కొడుకుని కనింది. ఆ పుత్రునికి పది సంవత్సరాల వయసు వచ్చినపుడు రాజుగారేదో రోగంతో మృతి చెందాడు. అప్పడు రాజ్యపాలనంతా దుర్గావతిమీద పడినందున ఆమె తన కుమారుడ్ని సింహాసనాధీశుడ్ని చేసి అతని పేరిట తానే రాజ్యం చేస్తుండేది. ఆమె తన పెనిమిటి లాగా కాక, గొప్ప దక్షతతో, న్యాయంతో రాజ్యపరిపాలన చేస్తూ ప్రజలను సంతోషపెడ్తుండేది!

ఇలా తన ప్రజలను సుఖపెడ్తూ పరరాజులతో వైరం లేకుండా ఐదారు సంవత్సరాలు రాణీగారు రాజ్యం చేసిన తర్వాత మొగలాయి రాజైన అక్బరుబాదుషా ఆమె కీర్తిని విని ఇలా రాజ్యాన్ని పరిపాలించే రాణి తనకు అంకితురాలిగా ఉండాలని నిశ్చయించాడు. ఇలా తలచి అక్బర్‌ ఆసఫ్‌ఖాన్‌ అనే ప్రసిద్ధ వీరుడ్ని 1564వ సంవత్సరంలో దుర్గావతి రాజ్యంపైకి పంపాడు! అక్బరు సకలగుణ సంపన్నడని చరిత్రకారులు చెప్తారు. అతనియందు అనేక సద్గుణాలు ఉండేవి. ఇతర యవన ప్రభువులతో పోల్చి చూస్తే అతడు దేవసమానుడని చెప్పడానికి సందేహంలేదు. కాని, ఇటువంటి మహాత్మునికి కూడా రాజ్యకాంక్ష వదలలేదు.  రాణి దుర్గావతి అక్బరుని కాని, అతని రాజ్యంలోని ప్రజల్ని కాని ఎంతమాత్రం బాధపెట్టినది కాదు. వారి జోలికి ఎప్పుడూ పోయింది కాదు. ఇలా ఉండగా ఆ అబలమీదికి సైన్యాన్ని పంపడం మహత్వాకాంక్షగాక మరేంటి? ఇలా ఆసఫ్‌ఖాన్‌ శూరుడు (అవును.అబలతో యుద్ధానికి తలపడినవాడు శూరుడే!) తనపై దండెత్తి వస్తున్నాడని విని దుర్గావతి భయపడకుండా మహా ధైర్యంతో యుద్ధానికి సిద్ధం చేయసాగింది. మహా ప్రయత్నం చేసి కొద్దికాలంలోనే 500 ఏనుగుల్ని, 5000 గుర్రాలని, గొప్ప కాల్బలాలను సిద్ధపరిచింది. తాను పురుష వేషం ధరించి, ఆయుధాలను పుచ్చుకుని, ఏనుగుపైనెక్కి ప్రత్యక్ష దుర్గవలె యుద్ధానికి వెళ్ళింది! ఆమెని చూసిన సైనికులందరికీ ఉత్సాహం కలిగి వారి శౌర్యం ఇనుమడించి వారు శత్రు సైన్యంపైకెళ్ళి అతిధూర్తులైన యవన సైనికులను అనేకమందిని రూపుమాపి మరునాడు ఆ సేనాధిపతిని యమసదనానికి పంప నిశ్చయించుకున్నారు. కాని, ఢిల్లేశ్వరునిచే మహావీరుడని ప్రఖ్యాతిని గాంచిన ఆసఫ్‌ఖాన్‌ కొద్ది సైన్యంతో ఈమెని జయించుట దుర్లభమని తెలుసుకుని, మరునాడు ఇంకా సైన్యాన్ని గూర్చుకుని, తమవద్ద ఉన్న ఫిరంగిలన్నింటిని అగ్రభాగాన ఉంచి గోండు సైనికులపై అకస్మాత్తుగా వచ్చి తన సామర్థ్యమంతా జూపగా వారు చీకాకుపడి శత్రువులను ఎదుర్కోలేకపోయారు. ఈ దురవస్థ చూసి దుర్గావతి కుమారుడు చిన్నవాడైనా అభిమన్యుడి వంటివాడు కావడంతో తాను ముందుండి భయపడవద్దని సైనికులకు ధైర్యమిచ్చి, శత్రువులను ఎదుర్కొన్నాడు. ఇలా కొంతసేపు మహాధైర్యంతో పోరాడి ఆ బాలశూరుడు బాణం దెబ్బకు మూర్ఛపోయాడు. అప్పుడు సైనికులందరూ చింతాక్రాంతులై ఆ దుఃఖవార్తను మరోవైపున తురకలను మర్దించుచున్న దుర్గావతికి తెలియచేశారు. ఆ మాటవిని దుఃఖించడానికి అది సమయం కాదని తలచి రాణీగారు ఇసుమంతైనా చలించక  పుత్రవాత్సల్యంను ఆపుకుని తన సేనాధిపతికి ఇలా వర్తమానం పంపింది. ”ఈ సమయం ధైర్యాన్ని వదిలి దుఃఖిస్తూ కూర్చోతగింది కాదు. శత్రుహననం మన ముఖ్య కర్తవ్యం. ఈశ్వరేచ్ఛ వలనయైన కార్యానికి వగచాల్సిన పనిలేదు. కాని పిల్లవానిని శిబిరానికి తీసుకుని పోయి తగిన ఉపచారాలు చేయండి. నేనిప్పుడు యుద్ధం విడిచి రావడానికి వీలులేదు. రణయజ్ఞం సమాప్తం చేసి ప్రాప్తి ఉంటే మరల చూసెదను”. ఈ ఆజ్ఞ ప్రకారం సైనికులు కార్యాన్ని చేసారు.

యుద్ధంలో కొంతసేపు వారికి జయం కొంతసేపు వీరికి జయం కలుగుచూ తుదకు ఎవరు గెలుస్తారో నిశ్చయించ వీలులేకుండా ఉంది. ఇలా కొంతసేపు ఉభయపక్షాలూ సమానంగా యుద్ధం జరిగి, అది హిందువుల స్వాతంత్య్ర నాశనకాలం నుక, తురుష్కులకే ఆధిక్యం వచ్చింది. గోండు సైనికులు పోరాడి పోరాడి ఉత్సాహహీనులయ్యారు. గోండులు ఎట్లెట్లా ఉత్సాహహీనులౌతూ వచ్చారో, అట్లట్లా మ్లేచ్ఛుల బలం హెచ్చుతూ పోయింది. తమ రాజ్యంను గోండు దేశమునందు స్థాపించాలన్న ధృఢేచ్ఛ కలవారు కనుక ‘దీన్‌దీన్‌’ అనే రణశబ్దం ఉచ్ఛరిస్తూ ఘోరంగా గోండు సైన్యాలను అంతం చేశారు. ఇలా భయంకరమైన హనన యజ్ఞం జరగగా, మూడు వందల సైనికులతో దుర్గావతి రాణి మాత్రం బ్రతికి భయంకరంగా పోరాడుతోంది. ఆమెను ఎదుర్కొనుటకు ఆసఫ్‌ఖాన్‌ దుర్గావతి వద్దకు స్వయంగా వచ్చాడు. కాని ఆమె రౌద్రాన్ని చూసి భయపడి, దూరంపోయి అక్కడ్నుంచి ఆమెపై బాణవర్షం కురిపించసాగాడు. ఆమె ఆ బాణాలన్నింటిని తునిమేసింది. కాని వాటిలో ఒక బాణం శిరస్సునందు గ్రుచ్చుకోగా ఆమె మరింత క్రోధాయమాన మనస్కురాలై ఆ బాణం తానే పెరికేసి మరింత రౌద్రంతో యుద్ధం చేయసాగింది! అప్పుడామె శరీరమంతా రక్తమయమైన సంగతి చూసి, ఆమె అలసిపోయిందని తెలుసుకుని స్వామిభక్తిగల ఒక సేవకుడు ఆమెని సమీపించి ఇలా అన్నాడు. ”అమ్మా! మీరిక యుద్ధం చేసినందువలన లాభమేమీ లేదు. కొద్దికాలంలోనే శత్రువులు మిమ్మల్ని చెరబట్టగలరు. వారి చేతుల్లో పడక శీఘ్రంగా ఇక్కడినుంచి పలాయనం చేయడం మేలు; తమకొక్క ఇబ్బందీ లేకుండా నేను ఆవలికి తీసుకుపోతాను”. ప్రియసేవకుడు పలికిన ఈ పలుకులు విని, ఆమె చింతించి, శత్రువులు నిజంగా సమీపించుచున్నారని చూసి, పవిత్రమైన దేహం మ్లేచ్ఛులచే అపవిత్రం అవుతుందన్న మాట మాత్రం తలపుకురాగా సహించలేక, విషణ్ణవదనయై, తన సేవకుని చూసి ఇలా అంది. ”ఓరీ! నీవన్నమాట నిజం. ఇదిగో నా చేతనున్న ఖడ్గం తీసుకుని, ఇక్కడే నా శిరచ్ఛేదం చేయి; నేను క్షత్రియ కన్యను; కాబట్టి పగవారికి వెన్నిచ్చి పారిపోవడం నాకు అనుచితం. ఈ శరీరం శత్రువులు ముట్టగూడదు. కావున నువ్వు అన్యథా విచారించక నా తలను నరుకు. దానితో నేను వీరస్వర్గాన్ని పొందుతాను. నా ఆజ్ఞ విని నన్ను సంకటం నుండి కాపాడినందుకు నీకు కూడా పుణ్యమే కలుగుతుంది; పాపం కలగదు.” ఈ మాటను వినడంతోనే ఆ స్వామి సేవాపరాయణుడైన సేవకుడు నిశ్చేష్టుడై ఏమీ తోచక నిలుచుండిపోయాడు. కొంతసేపలా నిలుచుండి ఇలా అన్నాడు. ”తల్లీ! నా విన్నపం ఆలకించి, ఈ ఏనుగునెక్కండి. అది శీఘ్రంగా మిమ్ముల్ని శత్రువుల బారినుండి తప్పించి, అవతలకి తీసుకుపోతుంది. నేను స్త్రీ వథ చేయలేను” అప్పుడా రాణీగారు ఎంతో విచారించి, మ్లేచ్ఛులామెను సమీపించడం చూసి, తన ఖడ్గానికి మ్రొక్కి దానితో తనంటత తానే పొడుచుకుని రణభూమినందే ప్రాణాలు విడిచింది!!! రాణీగారి శవం మ్లేచ్ఛుల చేతుల్లో పడకుండా ఆమె సేవకుడు భద్రపరచి, తాను కూడా యుద్ధం చేసి అక్కడే మృతుడయ్యాడు! రాణీగారి కుమారుడు కూడా పరలోకగతుడయ్యాడు. ఇలా ఒక తురక బాదుషా యొక్క రాజ్యలోభం వలన  గోండు సంస్థానంలోని నిరపరాధులైన లోకులందరూ హతులయ్యారు. ఆహా! రాజ్య లోభం ఎలాంటి ఘోరకృత్యాలను చేయునో చూడండి.

ఈ రణశూరయైన దుర్గావతి యొక్క సమాధి జబ్బలపురం (జబల్‌పూర్‌) వద్ద ఉంది. ఆ సమాధి వద్దనే ఈమె గుణవర్ణనాత్మకమైన శిలాశాసనం ఉంది. అక్కడికి వెళ్ళిన బాటసారులందరూ ఆ సమాధిని మహాభక్తితో చూసి, ఈ శూరనారిని గురించి పూజ్యభావం వహిస్తారు. పరమ ధార్మికుడైన ఒక బాటసారి దీనిని గూర్చి ఇలా వ్రాశాడు. ”దుర్గావతి యొక్క సమాధి ఆ పర్వత దేశంనందు నిర్మించబడింది. అక్కడ రెండు పాషాణ (రాతి) స్తంభాలున్నాయి; వాటిని చూడగానే వెనుక జరిగిన యుద్ధం మూర్తివంతంగా కళ్ళ ఎదుట కనబడుతుంది. ఆ గిరి శిఖరంకింద ఇప్పటకీ భయంకరమైన రణఘోష రాత్రిపూట వినొస్తుందని అక్కడి లోకులు నమ్ముతారు. నిర్జనమై, రమణీయమైన ఈ స్థలానికి వచ్చే బాటసారులు ప్రేమపూర్వకంగా రాణీగారి సమాధిని పూజిస్తారు. ఆ స్థలంనందు ప్రకాశవంతమైన గాజుతునకలనేకం ఉన్నాయి. ఆ గాజు తునకలే రాణీగారికి బాటసారులర్పిస్తారు. ఈ పూర్వాచారాన్ననుసరించి, నేను కూడా దుర్గావతి యొక్క దివ్యగుణాలను అభినందించుటకై ఒక గాజు తునకని సమాధికి అర్పించాను”. అవును. ఇటువంటి అలౌకిక శౌర్యం ఎవరికి అభినందనీయం కాదు? క్షత్రియులకు అత్యంత శ్రేయస్కరమైన ధర్మాన్ని ఆచరించి స్వర్గద్వారమునందు చేరినవారు పురుషులైనా, స్త్రీలైనా సర్వజనవంద్యులే. కృష్ణమూర్తి కూడా అర్జునుడికి ఇదే బోధించాడు:-

యదృచ్ఛ యాచోపవన్నాం స్వర్గద్వార మసావృతమ్‌ / సుఖినః క్షత్రియాః పార్థ! లభంతే యుద్ధ మీదృశమ్‌.

ఓ అర్జునా! కోరకుండా సంభవించినట్టియు, తెరవబడిన స్వర్గ ద్వార రూపమయినదియునగు ఇట్టి యుద్ధమును ఏ రాజులు పొందుచున్నారో వారు సుఖులగుచున్నారు – భగవద్గీత, అ-2, శ్లోకం – 32. (ఇంకావుంది)

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.