అర్థరాత్రి 12 గంటల సమయంలో నిర్మానుష్యమైన సిటీ రోడ్డుపై ఒలింపిక్ పరుగు పోటీలోఉస్సేన్ బోల్ట్ మాదిరిగా పరిగెడుతోంది సుమ. తన వెనుక ఇద్దరు రౌడీలు చేతిలో ఐరన్ రాడ్లతో తరుముతూ వస్తున్నారు. వాళ్ళకు ఎదురుగా రోడ్డు ప్రక్కన దీవీఔ కారు ఆగి ఉంది. కారు పక్కన క్రికెటర్ సుమన్ నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ”ప్లీజ్ సేవ్ మి” అని పెద్దగా అరుస్తోంది సుమ. సుమన్‌కు ఏం జరగిందో అర్థం కాక ఒకసారి రోడ్డువైపునకు చూశాడు. సుమ అతన్ని సమీపించింది. ”ప్లీజ్ సేవ్ మి సర్” అంటోంది. వెంటనే తన కారు డిక్కీ తెరిచి తన క్రికెట్ కిట్‌లోని బ్యాట్ తీశాడు. అతను సినిమా హీరోలా రౌడీలను చితకబాదాడు. సుమ ”థాంక్యూ, థాంక్యూ… థాంక్యూ వెరీమచ్ సర్” అని కలవరిస్తోంది.
……
”సుమ, చాల్లేవే మొద్దు నిద్ర, ఇంక లే” పిలుపుతో నిద్రలోంచి ”ఏంటి జ్యోత్స్న? పొద్దున్నే నీ గోల. మంచి డ్రీంను డిస్టర్బ్ చేశావు, లేదంటే నేను సుమన్‌తో చాలా విషయాలను మాట్లాడేదాన్ని” అంది. టైం ఆరు గంటలైంది, ”మేడమ్‌గారు మార్నింగ్ ప్రాక్టీస్ కూడా మానేసి ఇక్కడ కలలు కంటున్నారు. అక్కడ కోచ్ ప్రాక్టీస్‌కు రాని వాళ్ళకు స్కోరింగ్ పాయింట్లు తగ్గించేస్తానని అరుస్తున్నారు. తుది జట్టులో స్థానం దొరక్కపోతే అప్పుడు గానీ తమరికి తిక్క దొరకదు” అంది జ్యోత్స్న. ”నాకేంటే భయం, నా స్థానం రిజర్వ్ చేసేసుకున్నాను. నువ్వే చూస్తూ ఉండు” అంది సుమ.
……
సుమకు 23 సంవత్సరాలు, ఈ మధ్యనే ఎంబీఏ పూర్తిచేసింది. మారుమూల ప్రాంతంలో పుట్టిన సుమకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. టీవీలో ఎప్పుడు మ్యాచ్ వచ్చినా మిస్సయ్యేది కాదు. సెలవుల్లో ఊర్లో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. ఆ ఆసక్తే సుమకు క్రికెట్ ఆటమీద పట్టు సాధించేలా చేసింది. అబ్బాయిలతో పోటాపోటీగా ఆడేది. తల్లిదండ్రులు సుమను ఎప్పుడూ వద్దని ఆపలేదు. యూనివర్శిటీలో ఉన్నప్పుడు టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం వచ్చింది. యూనివర్శిటీల మధ్య జరిగిన పోటీల్లో తనే కెప్టెన్‌గా ఉండి యూనివర్శిటీకి కప్ అందించింది కూడా. ఏదో ఒకరోజు దేశం తరపున క్రికెట్ ఆడాలనే ఆశ బలంగా ఉండేది. చిన్నప్పటి నుంచి క్రికెట్ టీంలో ఉండే ప్రతి ఒక్క ప్లేయర్ సుమకు చాలా ఇష్టం. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇండియా తరఫున ఆడుతున్న సుమన్ అంటే చాలా అభిమానం సుమకు. జీవితంలో ఒక్కసారైనా సుమన్‌తో మాట్లాడాలని, తన పెర్ఫార్మెన్స్ని అభినందించాలని అనుకునేది. ఆ పిచ్చి ముదరడంవల్లే ఈ చిత్ర విచిత్ర కలలు.
……
అమ్మాయిలను క్రీడా రంగంలో ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో ఒక ట్రస్ట్ ”మహిళా కెరటాలు” పేరిట రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించింది. ముందుగా ప్రతి జిల్లా నుండి క్రికెట్లో ప్రావీణ్యమున్న కొంతమంది అమ్మాయిలను గుర్తించి వారికి 20 రోజులపాటు ప్రత్యేక శిక్షణనిచ్చి, వారి మధ్యనే స్క్రీనింగ్ మ్యాచ్‌లను నిర్వహించి ఫైనల్ టీంను ఎంపిక చేస్తుంది. తర్వాత అసలైన పోటీ మ్యాచ్‌లు జోనల్ మరియు రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి. సుమ, జ్యోత్స్నలిద్దరూ తమ జిల్లా నుండి మొదటి రౌండ్లో ఎంపికై, ప్రస్తుతం ప్రత్యేక శిక్షణను తీసుకుంటున్నారు. రోజూ నాలుగు గంటలకు నిద్ర లేవడం, రోజంతా ప్రాక్టీస్ చేయడం… ఇదే వారి దినచర్య. సుమ మాత్రం మొదట్లో టీంలో బాగా చురుగ్గా ఉండేది. కోచ్ కూడా సుమ మంచి ప్లేయర్‌గా ఎదగాలని ఆటలో మెలకువలు నేర్పించేవారు. కానీ గత వారం రోజుల నుండి సుమ ప్రాక్టీస్‌కు సరిగ్గా వెళ్ళడంలేదు. మరొకవైపు స్క్రీనింగ్ మ్యాచ్‌లు దగ్గరబడుతున్నాయి.
……
ఆ రోజే మొదటి స్క్రీనింగ్ టెస్ట్ జరగబోతోంది. ప్లేయర్లందరూ ఉదయం నాలుగు గంటల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాగా ఆడాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. జ్యోత్స్న కూడా ఉదయం ప్రాక్టీస్ ముగించుకుని రూమ్‌కు వచ్చింది. కానీ సుమ మాత్రం ప్రాక్టీస్‌కు వెళ్ళలేకపోయింది. దానికి కారణం రాత్రిళ్ళు సుమన్ గురించిన అప్డేట్స్ కోసం బ్రౌజ్ చేయడం, ట్విట్టర్లు, సుమన్ మెసేజ్ పోస్టింగులను
చూడడం, తను పోస్ట్ చేసిన సందేహాలకు సుమన్ నుంచి సమాధానం కోసం ఎదురుచూడడం, సమాధానం రాకపోతే బాధపడడం అలవాటుగా మారింది. గత రాత్రంతా తాను పోస్ట్ చేసిన సందేహాలకేమైనా సమాధానం వస్తుందేమో అని ఎదురుచూస్తూ ఆలస్యంగా పడుకుంది.
ఉదయం పది గంటలకు స్క్రీనింగ్ మ్యాచ్ ఆడడానికి ప్లేయర్లందరూ మైదానానికి చేరుకున్నారు. ప్లేయర్లందర్నీ కోచ్ రెండు టీంలుగా అక్కడికక్కడే నిర్ణయించారు. మ్యాచ్‌ను ఇరవై ఓవర్లకు కుదించారు. టీం-ఎ కు జ్యోత్స్నను కెప్టెన్‌గా ప్రకటించారు. టీం-బి కి ఝాన్సీని కెప్టెన్‌గా ప్రకటించారు. ఆ టీంలోనే సుమ కూడా ఉంది. మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ప్రతి ఒక్క ప్లేయర్ నువ్వా, నేనా అన్నట్లుగా ఆడుతున్నారు. జ్యోత్స్న జట్టు 150 పరుగులు చేసింది. జ్యోత్స్న కూడా మంచి భాగస్వామ్యం ఇచ్చింది. సుమ మాత్రం ఆటమీద శ్రద్ధ పెట్టలేకపోయింది. రెండు కీలక క్యాచ్‌లను త్రుటిలో జారవిడిచింది. రెండవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఝాన్సీ టీం తడబడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సుమ పరుగులను మందకొడిగా చేసింది, లక్ష్యం సాధించడంలో విఫలమైంది. చివరకు ఝాన్సీ టీం కొద్దిపాటి తేడాతో ఓడిపోయింది. ఇంక ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. రెండు రోజుల్లో నిర్వహిస్తామని కోచ్ చెప్పారు. జ్యోత్స్న పెర్ఫార్మెన్స్ను కోచ్ అభినందించారు, కానీ సుమను మాత్రం ”అయాం నాటెటాల్ హ్యాపీ విత్ యువర్ పెర్ఫార్మెన్స్” అన్నారు. సుమ నిరాశపడింది.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో సుమ, జ్యోత్స్నలిద్దరూ హాస్టల్‌కు వస్తుంటే ల్యాండ్‌లైన్‌కు ఫోన్ వచ్చింది. సుమ ఫోన్ ఎత్తి ‘హలో’ అంది. అవతలివైపు సుమ నాన్న, ”మీ ఫ్రెండ్ గీతిక ఇక లేదమ్మా, ఆత్మహత్య చేసుకుందట, మన ఊరికి తీసుకొస్తున్నారు. నువ్వు, జ్యోత్స్న ఇద్దరూ వస్తే బాగుంటుంది” అని బాధగా చెప్పి ఫోన్ పెట్టేశారు. ”వ్వాట్! గీతిక అలా చేయడమా! నో” అంది సుమ. జ్యోత్స్నకు విషయం అర్థమైంది.
…..
ఊర్లో అంతటా విషాదఛాయలు అలముకున్నాయి. గీతిక తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. సుమ, జ్యోత్స్నలను చూడగానే ఇంకా ఏడవడం మొదలుపెట్టారు. అంత్యక్రియలకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్న గీతిక మృతదేహాన్ని చూసి ఇద్దరికీ ఏడుపాగలేదు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత, గీతిక చెల్లెలు సూసైడ్ నోట్‌ను సుమచేతికి అందించింది.
”సుమా! ఎలా మొదలుపెట్టాలో నాకు అర్థం కావడంలేదు. నా జీవితం ఇంత త్వరగా ముగుస్తుందని నేను ఊహించలేదు. నా కలల గూడు చెదిరిపోతుందని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. మంచి డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకుంటున్న సమయంలో రవి నా జీవితంలో అడుగుపెట్టాడు. డ్యాన్స్ స్కూల్ పెట్టాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నానని నీకు గుర్తుంది కదా. నేను అప్పటివరకు పడిన కష్టాన్ని కూడా మర్చిపోయాను. నా డ్రీం ప్రాజెక్టుకి సహాయం చేస్తానని చెప్పిన రవి, తర్వాత నేను కార్పొరేట్ ఉద్యోగం చేయాలని బలవంత పెట్టసాగాడు. నేను ఒప్పుకోకపోవడంతో టార్చర్‌తో మొదలై నన్ను బంధించే స్థాయికి చేరింది. విడాకులు ఇస్తానన్నాను. దానికి అతను ఒప్పుకోలేదు. నేను ఇంటినుండి వచ్చేయాలని అనుకున్నాను. అతని నా క్యారెక్టర్ని నెగటివ్‌గా పబ్లిసిటీ చేసి, తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. నేను మానసికంగా చాలా బలహీనమైపోయాను. ఏం చేయాలో అర్థంకాకే ఈ నిర్ణయం. నువ్వెప్పుడూ ఒక మాట చెప్తుండేదానివి కదా, మనం తీసుకునే నిర్ణయాలు మన ఉనికిని తారుమారు చేయకూడదని… అది అక్షరాలా నిజం. నువ్వు, జ్యోత్స్న లిద్దరూ మీ కలలను సాకారం చేసుకోవడంలో మీ చేతిలో ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోండి. విలువైన సమయాన్ని చేజారనివ్వకండి. విజయం అందుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరని ఆశిస్తూ…
– మీ గీతిక
…..
సుమ, జ్యోత్స్నలిద్దరూ భారమైన మనసులతో మర్నాడు ఉదయాన్నే ట్రెయినింగ్ సెంటర్‌కు బయల్దేరారు. ఇద్దరూ చాలా స్తబ్దతగా ఉండిపోయారు. సుమ మనసులో గీతిక మరణం, ”మీ చేతిలో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి” అని గీతిక చెప్పిన మాట పదే పదే గుర్తుకొచ్చింది. హాస్టల్ చేరగానే ముందుగా కోచ్‌ను కలవడానికి వెళ్ళింది. ”గుడ్‌మార్నింగ్ సర్” అంది సుమ. లోపలికి రండి అన్నారు కోచ్. ”మీతో మాట్లాడాలి సర్” అంది సుమ. ”ఎస్ యు కెన్” అన్నారు కోచ్. ”నేను స్క్రీనింగ్ మ్యాచ్‌లో అంత శ్రద్ధగా ఆడలేదు సర్. గత వారం రోజుల నుండి ప్రాక్టీస్ కూడా సరిగ్గా చేయలేదు. కెప్టెన్‌గా ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నాను” అంది. ”చాలా తొందరగా మీ తప్పులను తెలుసుకున్నారు. క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా సంసిద్ధతతో ఉన్నప్పుడే విజయం సాధించగలుగుతారు. లేదంటే మన అవకాశం ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది సుమా” అన్నారు కోచ్. ”నేను క్రికెటర్ని కావాలనే ఆశను అంత సులభంగా వదులుకోను సర్, ఎల్లుండి జరగబోయే మ్యాచ్‌లో నా బెస్ట్ పెర్ఫార్మెన్స్తో మీ నుండి అభినందనలు తప్పక పొందుతాన”ని చెప్పింది సుమ. ”ఆల్ ది బెస్ట్, లెట్ మి సీ టుమారో” అన్నారు కోచ్. సుమ తన కిట్ బ్యాగ్ తీసుకుని గ్రౌండ్‌కు బయలుదేరడం చూసి జ్యోత్స్నకు చాలా సంతోషం వేసింది. తాను కూడా వస్తానని చెప్పి వెళ్ళింది.
…..
రెండవ స్క్రీనింగ్ టెస్ట్ కోసం ప్లేయర్లందరూ మైదానంలో ఆసక్తిగా ఉన్నారు. కోచ్ రెండు టీంల సభ్యులను ప్రకటించారు. టీం-ఎ కు జ్యోత్స్ననే కెప్టెన్ అని ప్రకటించారు. టీం-బి కు మాత్రం కెప్టెన్ మిస్ సుమ అని ప్రకటించారు. సుమ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం కనిపించింది. హోరాహోరీగా జరిగిన 20 ఓవర్ల మ్యాచ్‌లో సుమ టీం విజయం సాధించింది. సుమ ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచింది. మైదానంలో సుమ చురుకుదనం, ఫీల్డింగ్, బ్యాటింగ్ చూసి కోచ్ ఆశ్చర్యపోయారు. తన నిర్ణయం సరైనదేనని మనసులో గట్టిగా అనుకున్నారు. ఫైనల్ అభ్యర్థుల జాబితాలో సుమ, జ్యోత్స్నలిద్దరికీ స్థానం లభించింది. ఆపై సుమ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రోజురోజుకీ తన ప్రదర్శనను మెరుగుపరచుకుంది. సుమ టీం టోర్నమెంట్ కప్‌ను కూడా సాధించింది. రాష్ట్రమంతా వీరి ప్రదర్శనను అద్భుతమని కొనియాడింది.
…..
టోర్నమెంట్లో బాగా ప్రదర్శన కనబరచిన ముగ్గురిని సెలక్ట్ చేసిన ట్రస్ట్ వారికి స్పాన్సర్షిప్ ఇచ్చి మంచి కోచింగ్ అకాడమీలో ఆరు నెలలపాటు శిక్షణనిప్పించింది. ఆ తర్వాత సుమ ఇంటర్ స్టేట్ మ్యాచ్‌లలో కూడా ఆడింది. ఇండియన్ విమెన్ క్రికెట్ టీంలో స్థానం సాధించింది. మొట్టమొదటిసారిగా మన దేశం తరఫున విదేశాల్లో మూడు దేశాల మధ్య జరిగిన సిరీస్‌లో పాల్గొని, తన ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరచి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది సుమ. కప్పుతో స్వదేశానికి తిరిగివచ్చిన విమెన్ టీంకు సన్మాన సభను ఏర్పాటు చేసింది బోర్డు. దానికి అనేకమంది ప్రముఖులు వచ్చారు. అక్కడ వాతావరణం చాలా సందడిగా ఉంది. ప్రముఖులంతా టీం ప్రదర్శనను అభినందించారు. కెప్టెన్ తన అనుభవాలను అందరితో పంచుకున్నారు. మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడి, ఈ టోర్నమెంట్ ఆద్యంతం మెరుగైన ప్రదర్శనను కనబరచిన సుమను మాట్లాడమని కోరారు. సుమ స్టేజి పైకెక్కి మైకును చేతిలోకి తీసుకుని ”ఇక్కడ వాతావరణం చాలా ఆనందంగా ఉంది, అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు కొంత కటువుగా అనిపించవచ్చు, అందుకు క్షమించాలి” అంటూ మొదలుపెట్టింది…
ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రీడలలో క్రికెట్ మొదటి స్థానం సంపాదించుకుంది. మన దేశంలో క్రికెట్ గురించయితే చెప్పనక్కర్లేదు. క్రికెట్ ఆటలో స్త్రీలు కూడా రాణించగలరని నేడు ప్రపంచం గుర్తిస్తోంది. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండవవైపు క్రికెట్ రంగాన్ని తమ కెరీర్‌గా ఎంచుకుని ఎన్నో అడ్డంకులను దాటుకుని ముందుకు వచ్చి దేశం తరఫున ఆడుతున్న మహిళలకు ప్రోత్సాహం ఉందా లేదా అన్నది చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం అంది. అందరూ సుమనే ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో రకరకాల వయసువాళ్ళు ఉన్నారు కదా అంటూ ”మీరందరూ ఇప్పటివరకూ ఎన్ని క్రికెట్ మ్యాచ్‌లు చూశారు” అని అడిగింది. లెక్కలేనన్ని మ్యాచ్‌లు చూశామన్న సమాధానంతో ఆడిటోరియం దద్దరిల్లింది. మరి మీరు చూసిన వాటిలో విమెన్ క్రికెట్ మ్యాచ్‌లు ఎన్ని అని అడిగింది. ఆడిటోరియమంతా నిశ్శబ్దం అలముకుంది. నాలుగైదు చేతులు మాత్రం పైకి లేచాయి. ఇంకొక ప్రశ్న అంటూ, ”మొదటిసారిగా ప్రపంచ కప్ సాధించి, మన దేశ కీర్తిని చాటిన ఆనాటి మన టీంలోని కొంతమంది పేర్లు చెప్పండి” అని అడిగింది. ”కపిల్‌దేవ్…. అంటూ చాలా పేర్లను టకీమని చెప్పారు. మరి విమెన్ క్రికెట్లో ఇప్పటివరకు కీలకపాత్ర పోషించిన వారి పేర్లు తెలుసా అని అడిగింది. మళ్ళీ ఆడిటోరియం అంతా నిశ్శబ్దం. మీకు తెలియకపోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మా ఆటంతా నాలుగు గోడల మధ్య సాగినట్లుంటుంది. టివీల్లో కానీ, రేడియోలో కానీ ప్రసారం కానీ, కామెంటరీ కానీ ఉండదు. ఆఖరికి దినపత్రికల్లోని క్రీడా పేజీలో కొంత చోటు దొరకడం కూడా కష్టమే. సంవత్సరంలో ఎప్పుడో ఒకటిరెండు సార్లు విమెన్ క్రికెట్ గురించి వస్తే అదే ధన్యం మాకు. అదే మెన్ క్రికెట్ స్టార్ల పెళ్ళిళ్ళు, విహార యాత్రలు, పార్టీలు… అన్నీ ఎప్పటికప్పుడు మన ముందుంచుతాయి మన దినపత్రికలు. రోజూ టీవీ ప్రకటనల్లో, టివీ షోస్‌లో క్రికెటర్లను చూస్తుంటాం. కానీ మేము మాత్రం ఎక్కడా కనిపించం. అందుకే మేమున్నామనే విషయం చాలామందికి తెలీదు. ప్రైవేటు ఛానల్స్‌ను పక్కన పెడతే మన ప్రభుత్వ ఛానల్స్‌లో విమెన్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారం కావడం కూడా చాలా అరుదు. ఇక ఏడాదిలో మేము ఆడే మ్యాచ్‌లు ఒకటి, అర మాత్రమే, కొన్నిసార్లు అవి కూడా ఉండవు. మేము ఎంత ఎక్కువ మ్యాచ్‌లు ఆడడానికి అవకాశం కల్పిస్తే మా పెర్ఫార్మెన్స్ అంత మెరుగుపడుతుంది. అంతర్జాతీయ ఫార్మాట్లో మా ప్రదర్శన కూడా బాగుంటుంది అంది సుమ.
బోర్డు నుండి మేము తీసుకునే పారితోషికం కూడా మెన్ క్రికెటర్ల కంటే పదిరెట్లు తక్కువ. మెన్ క్రికెట్ ప్రమాణాలను పెంచడానికి బోర్డు ఎంచుకునే విధానాలలో కొన్నింటినైనా మాకు కూడా అమలు పరిస్తే విమెన్ క్రికెట్ కూడా ఎదగడానికి అవకాశముంటుంది లేదంటే ఏదో ఒకరోజు మరుగున పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎవరికి తెలుసు! ఎంతమంది ఆణిముత్యాలు దేశం కోసం ఆడాలని
తపిస్తూ, అవకాశాలు లేక, ప్రోత్సాహం లేక మగ్గిపోతున్నారో….
ఆడ, మగ అసమానతలు క్రికెట్ ఆటను కూడా వదిలిపెట్టలేదనే చేదు నిజాన్ని మనం జీర్ణించుకుని ఈ అసమానతలను వేర్లతో సహా పెకిలించడానికి సిద్ధమయితేనే అమ్మాయిలు కూడా ఈ రంగంలో సమర్థవంతంగా రాణించగలరు.
దేశం తరపున ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు అంటూ చెప్పి కళ్ళ చివర్ల నుండి కారుతున్న కన్నీటిని అదిమిపెట్టి గబగబా స్టేజినుండి కిందకు వచ్చేసింది.
…..
ఆడిటోరియమంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. టీం సభ్యులంతా సుమను చుట్టేశారు. అభినందనలతో ముంచెత్తారు. డయాస్ మీద ఉన్న పెద్దలందరూ సుమ చెప్పిన వాస్తవాలను అంగీకరించే ప్రయత్నంలో పడ్డారు. మర్నాడు అన్ని పత్రికలలో ఈ విషయం ప్రముఖంగా వచ్చింది. న్యూస్ ఛానల్స్‌లో దీనిపై ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్యానెల్ డిస్కషన్లు పెట్టారు. మిగిలిన క్రీడా విభాగాల్లోని క్రీడాకారిణులు కూడా సుమతో అంగీకరించారు. క్రికెట్ బోర్డు కూడా ఒక ప్రత్యేక కమిటీని వేసి విమెన్ క్రికెట్‌ను మెరుగుపరచడానికి ప్రణాళికలు తయారు చేయించమని అడిగింది.
…..
సుమ, జ్యోత్స్నలిద్దరూ ఊరికి తిరిగి వచ్చేశారు. ఊరంతా వాళ్ళిద్దరినీ అభినందించింది. ఒకరోజు ఉదయాన్నే సుమ ఇంటి తోటలో పనిచేసుకుంటోంది. ఇంటిముందు దీవీఔ కారు వచ్చి ఆగింది. క్రికెటర్ సుమన్, ఒక రిటైర్డ్ సీనియర్ క్రికెటర్ కారుదిగి వరండావైపు వచ్చారు. సుమ నాన్న ”సర్! మీరు మా ఇంటికి రావడం… నమ్మలేకపోతున్నాను… రండి సర్, కూర్చోండి…” అనగానే సుమను కలవడానికి వచ్చామని ఇంగ్లీషులో చెప్పారు. ”సుమా నీ కోసం ఎవరో వచ్చారు, త్వరగా రా…” అంటూ ఆమె తండ్రి గట్టిగా కేకవేశాడు. మట్టి చేతులతోనే సుమ వరండావైపు వచ్చింది.
ఆ ఇద్దరు వ్యక్తులు లేచి నిలబడి ”కంగ్రాచ్యులేషన్స్ మేడమ్” అన్నారు. వాళ్లిద్దరినీ చూసిన సుమ నమ్మలేకపోయింది. ”థాంక్యూ సర్, మీరు ఇక్కడ….” అంది. ”ఎస్ మేడమ్! మీతో పని ఉండి వచ్చాం, మీరు బోర్డుకు పెద్ద సవాలును పెట్టారు కదా! సో… విమెన్ క్రికెట్ అభివృద్ధి కోసం బోర్డు నియమించిన కమిటీ సభ్యులలో మీరు కూడా ఒకరు. కాబట్టి ముందుగా మనందరం కలిసి చర్చిస్తే బాగుంటుందని మీ సలహాల కోసం వచ్చాం” అన్నారు. సుమ, జ్యోత్స్న వాళ్ళతో చాలా విషయాల గురించి చర్చించారు. ఊరు ఊరంతా సుమ ఇంటిముందు గుమిగూడారు. ”థాంక్యూ! మీ వాల్యుబుల్ ఇన్పుట్స్కి. మేమిక బయలుదేరతాం” అన్నారు సుమన్ సుమవైపు చూస్తూ. దేశప్రజలంతా గర్వపడేలా ఇండియాకు మంచి టీంను అందించే కసరత్తు మొదలయింది…