(గత సంచిక తరువాయి)
లేబర్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. మా క్యాడర్ ఇలా చెప్పాడు. ”మీరు మూడు ఎకరాలకు బదులుగా వేరు కుంపటి పెట్టినవాళ్ళకి, ఇంట్లో ఒక్కొక్కరికి ఉద్యోగం, భూమికి బదులు భూమి, గనులకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్ళల్లో స్కూళ్ళు, రోడ్లు, వంతెనలు, ఆరోగ్య కేంద్రాలు, విద్యుచ్ఛక్తి గ్రామీణులకు టెక్నాలజీ జ్ఞానం ఇవ్వడానికి ట్రెయినింగ్ సదుపాయం చెయ్యాలి. గనులలో
ఉద్యోగాలు ఇప్పించాలి. వాళ్ళ భూములకు సరైన ధర ఇవ్వాలి. ఈ విధంగా చేయగలిగితే గుప్తాగారిని పిలవాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం సాగుతుంది. మీరు కావాలని పనులనుండి తీసేసిన కూలీలకు పనిలేనప్పుడు జీతం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు బలవంతంగా పనిలేకుండా కూర్చోవాలి. వాళ్ళు పని లేకపోవడంవల్ల రోజంతా ఊరికే కూర్చోవాలి. యాజమాన్యం వారు గ్రామీణులతో పోరాడకూడదు, ఎందుకంటే పోట్లాడడం వాళ్ళ డ్యూటీలోని భాగం కాదు”.
కేంద్ర లేబర్ మంత్రిత్వ శాఖ ధన్‌బాద్ (రీజియనల్) డిప్యూటీ కమిషనర్‌కు ఈ వార్త పంపించాము. హజారీబాగ్‌కి డిప్యూటీ కమిషనర్ శ్రీ మాధవన్, రాజీవ్ రంజన్ ఎసిపిగా ఉండేవారు. ఇద్దరూ ఈ డిమాండ్లను దృష్టిలో పెట్టుకున్నారు. నాయక్ చీఫ్ సెక్రటరీగా ఉండేవారు. మా మేనత్త సవతి కొడుకుకి ఆయన అల్లుడు అవుతారు. కానీ ఈ విషయం నాకు తెలియదు. ఈ ఉద్యమం తర్వాత నాకు తెలిసింది, ఆయన నాకు బంధువని. హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ హజారీబాగ్ చేరారు. అసలు నిజానికి టాటా కంపెనీయే ఈ పోట్లాటను పెంచింది. టాటా సైడింగ్ దగ్గర మా కాడర్ రాణా చైన్‌పూర్‌లో వాషరీ నుండి బొగ్గును తీసుకువచ్చి తీసుకువెళ్ళే ట్రాలీని పనిచేయనీయకుండా అడ్డుకున్నారు. దీనివల్ల పోట్లాట ఇంకా పెరిగింది. రాణా నేతృత్వంలో గ్రామంలోని యువకుల టోలీట్రాలీని అడ్డుకుంది. అందువల్ల టాటావాళ్ళు బొగ్గును బయటకి పంపించలేకపోయారు. టాటా కంపెనీకి డబ్బులు పడేసి ఎలాంటి పనులైనా చేయించగలమన్న గర్వం ఉండేది. పోలీసులకు లంచాలిచ్చి తన పక్షంవైపు తిప్పుకోవడం వాళ్ళకి పాత అలవాటే. ఈసారీ అదే చేశారు. అందువల్ల పోలీసులు టాటా చైన్‌పూర్ సైడింగ్‌లో లాఠీఛార్జి చేశారు. అంటే వాళ్ళపట్ల విశ్వాసం చూపించారు. సి.సి.యల్.లో పోలీసులు ఇలాంటివేమీ చేయరు. ఎందుకంటే అక్కడ లంచాలు దొరకవు. జనరల్ మేనేజర్ చరహీ, లక్ష్మణ్ సింహ్ ఉరఫ్ లాఠీసింగు లంచాలు ఇవ్వడానికి వ్యతిరేకులు. రెండోరోజు బంజీలో చాలామందిని అరెస్ట్ చేశారు. పెద్ద గొడవ జరిగింది. సాయంత్రానికి అరెస్టయిన వాళ్ళందరినీ హజారీబాగ్‌కు తీసుకువచ్చారు. అంతా శాంతిపూర్వకంగా జరిగింది. తోపాతొయరా, కుజు పుండీలలో ఎక్కడా లాఠీఛార్జ్ జరగలేదు. వందలమందిని అరెస్టు చేశారు. చైన్‌పుర్, ఘాటోలలో పోలీసులు దయాదాక్షిణ్యాలు లేకుండా రాణాని కొట్టారు. నేను ప్రెస్‌వాళ్ళకు తెలియబరిచాను. ఒక వాహనాన్ని బాగుచేయించి అర్జున్ సోనీ, ఖీరుమహతోలని టాటా కంపెనీ చైన్‌పుర్ సైడింగ్‌లో విచారణ జరపడానికి పంపించాను. దారిలో ప్రెస్‌వాళ్ళు అర్జున్‌ని భోజనం, బీర్ అడిగారు. నేను చెప్పమన్నట్లుగా అతడు చెప్పాడు – ”నేను కేవలం సత్తు (పిండి)ని తినిపించగలుగుతాను. మేము మీకు వాహనాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇక్కడ రాకపోకలకు ఎటువంటి వాహనాలు లేవు. అయినా ఇంతమందికి మేము తినిపించలేము. అందులోను హోటల్లో… మీకు తాగుడు పార్టీ కూడా కావాలి కదా?”
కేదలా ముఖియా, ఖీరూమహతో వెంట ఉన్నారు. ఆయన ప్రెస్‌వాళ్ళతో మాట్లాడారు. ”మీరందరూ చైన్‌పుర్ అయ్యాక కేదలా బస్తీకి రండి. అక్కడ మేం కోడిని కోసి మీకు విందు చేస్తాం. అంతేకానీ హోటల్ నుండి అన్నీ తెప్పించి మీకు తినిపించడానికి, తాగించడానికి మా దగ్గర డబ్బులు లేవు”. ”మేము టాటా కంపెనీకి వెళ్తే వాహనం, బీరు, కోళ్ళు అన్నీ దొరుకుతాయి” అని ప్రెస్ ప్రతినిధి అన్నారు.
”మరి వెళ్ళండి” ఖీరూ మహతో, అర్జున్ అన్నారు.
ప్రెస్‌వాళ్ళు చైన్‌పుర్ సైడింగ్ దగ్గర టాటా కంపెనీ మేనేజర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి స్వాగత సత్కారాలు జరిగాయి. వాళ్ళు టాటా ఉప్పును మెచ్చుకుంటూ బొగ్గు గనుల యాజమాన్యం పక్షం వహిస్తూ వార్తలు పంపారు. ఖీరూ మహతో ఊరు చేరుకున్నాక అర్జున్‌తో పాటు వాహనాన్ని వెనక్కి పంపించారు. చైన్‌పుర్ సైడింగ్ సంఘటన వివరాలు కూడా రాసి ఇచ్చి పంపించారు. అరెస్టయిన దాదాపు తొమ్మిది వందలమందిని జైలుకి పంపించారు. రాణా బాగా గాయపడ్డాడని, ఆయన తలకి గాయమయిందని వార్త వచ్చింది. నేను, లాల్‌చంద్ మహతో చైన్‌పుర్ వెళ్ళాలని జీపులో కూర్చున్నాము. ఇంతలో డిప్యూటీ డైరెక్టర్ దగ్గరనుంచి సర్క్యూట్ హౌస్‌కు రావాలని వార్త వచ్చింది. నేను, లాల్‌చంద్ గారు అక్కడికి వెళ్ళాము. డిప్యూటీ డైరెక్టర్ గృహ మంత్రితో మాట్లాడారు. ఆయన డ్రాయింగ్ రూమ్‌లో మా కోసం ఎదురుచూస్తూ
కూర్చున్నారు.
”మీ డిమాండ్ల గురించి మేము ప్రభుత్వంతో మాట్లాడాము. గృహ మంత్రి పాట్నా వెళ్ళి వార్త పంపిస్తారు. నేను రాణాని ఎందుకు కొట్టాను? లాఠీఛార్జి పైన విచారణ జరిపించాలని ఆదేశించాను అని ఆయన అన్నారు.
ఎస్.పి అక్కడ లేరు. మేమిద్దరం సర్క్యూట్ హౌస్ నుండి చైన్‌పుర్ సైడింగ్‌కి వెళ్తున్నామని డిప్యూటీ డైరెక్టర్‌కి తెలియచేసి బయలుదేరాం. మేం వెనక్కి వస్తున్నాం. జిల్లా పరిషత్ మలుపు దగ్గర పోలీసులు వెనుకనుండి వచ్చి మమ్మల్ని చుట్టుముట్టి మీ ఇద్దర్నీ అరెస్టు చేస్తున్నాం అన్నారు.
ఇది అనుకోని సంఘటన. కానీ ప్రభుత్వం ప్లాన్ ప్రకారం ఇదంతా చేసింది. గృహ మంత్రి ప్రభుత్వంతో మాట్లాడి మా అరెస్ట్ విషయం డిప్యూటీ డైరెక్టర్‌కు తెలిపారు. వ్యూహ రచన చేసి మమ్మల్ని సర్క్యూట్ హౌస్‌కు పిలిపించారు. ఫీల్డులో మమ్మల్ని అరెస్ట్ చేయడం వాళ్ళకి కష్టం. అందువల్ల అక్కడికి వెళ్ళకుండానే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము డిప్యూటీ డైరెక్టర్‌ని నమ్మడం పొరపాటయింది.
సరే! ముందు ఇంటికి వెళ్తాం. మేము కావలసిన బట్టలు తీసుకుంటాం అని నేనన్నాను.
మేము ఇంటికి వెళ్ళామో లేదో అక్కడ సి.పి.ఐ. ఎంఎల్‌సి భువనేశ్వర్ మహతో (తర్వాత ఆయన ఎం.పి అయ్యారు) కూర్చుని ఉన్నారు.
”మీరు ఇంత పెద్ద ఉద్యమం నడుపుతున్నపుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మేము మీకు మద్దతు ఇచ్చేవాళ్ళం కదా!” ఆయన వ్యంగ్యంగా అన్నారు. ”మరి ఇప్పుడు మాతోపాటు నడవండి. మేమందరం జైలుకి వెళ్తున్నాం. వెయ్యిమందికి పైగా అరెస్టయ్యారు. ఇంకా కొందరు దారిలో ఉన్నారు. మేము కాడర్‌కి అరెస్టుల నుండి రక్షించుకోండి అని సూచనలిచ్చాం. ఎందుకంటే పోరాటం దీర్ఘకాలం సాగుతుంది. కేవలం రైతులను మాత్రమే పంపించాడని చెప్పాను. కానీ ఇవ్వాళ రాత్రి పోలీసులు మా నేతలను ఇంటింటికీ వెళ్ళి పట్టుకుంటారు. మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనండి. మాకెంతో సంతోషం కలుగుతుంది. నిజానికి ఇది మేము చేసే ఉద్యమం, కానీ ఇకనుండి ఉమ్మడిగా ఉద్యమం సాగిద్దాం”.
ఈ విధంగా చైన్‌పుర్ వెళ్ళడానికి బదులు మేము పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళాం. రాత్రి మమ్మల్ని
వాళ్ళు మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళారు. మేజిస్ట్రేట్ రాత్రి విచారణ చేయడానికి ఇష్టపడలేదు. అందువల్ల ఆ రాత్రి మమ్మల్ని పోలీసు పర్యవేక్షణలో రెస్ట్‌హౌస్‌లో ఉంచారు. పొద్దున్నే 11 గంటలకు మమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళారు. కానీ కోర్టు మూసి ఉంది. పోలీసులు మాపైన దొంగతనంతో పాటు, ఎన్నో కేసులు పెట్టారు. అందులో ఆర్టికల్ 120 కూడా పెట్టారు. ఇది వ్యూహ రచనకి, దేశద్రోహానికి సంబంధించినది. టాటా కంపెనీ, సి.సి.ఎల్. మా ఉద్యమాన్ని దేశద్రోహంగా చిత్రీకరించి ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. కానీ పోలీసుల రికార్డులో ‘రమణికా గుప్తా కా అగస్త్ ఆందోళన్’ (రమణిక గుప్తా ఆగస్టు ఉద్యమం) అని రాశారు.
జడ్జి ఆర్టికల్ 120 చూడగానే కోపంతో ఊగిపోయారు. ”ఉద్యమం చేయడం పెద్ద నేరం కాదే మరి ఈ కేసు ఎలా పెట్టారు” అని అన్నారు. తక్కిన వాటితోపాటు 113 సెక్షన్ కూడా పెట్టి జైలుకి పంపించారు. మేము బయట ఉంటే శాంతియుతమైన వాతావరణం ఉండదని పోలీసులు అనుకున్నారు. దీని ప్రకారం వాళ్ళు ఎన్నాళ్ళు ఉంచాలనుకుంటే అన్నాళ్ళు ఉంచవచ్చు. నేను, లాల్‌చంద్ మహతో
ఉద్యమం సాగుతున్న సమయంలో అక్కడ లేనే లేము. కానీ రైతులపై ట్రెస్ పాసర్స్ కేసు, ఇంకా కొన్ని కేసులు నమోదు చేశారు. దీనివల్ల వాళ్ళకు బెయిల్ కూడా దొరకదు. అంటే అందరిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మేము మర్నాడు జైలుకి వెళ్ళాము. మాకు ముందు అరెస్టయిన వారికి మేమూ అరెస్టయ్యామన్న సంగతి ముందుగానే తెలిసింది. మేము వెళ్ళగానే జైలంతా నినాదాలతో ప్రతిధ్వనించింది. నన్ను మహిళా సెల్‌కి పంపించారు. లాల్‌చంద్ గారిని పురుషుల సెల్‌లోకి పంపించారు. మర్నాడు పురుషుల సెల్‌లోకి వెళ్ళి నేను, లాల్‌చంద్ అందరినీ సంబోధిస్తూ మాట్లాడాం. మహిళా సెల్‌లో తాపిన్, కేదలాకి చెందిన ఎందరో మహిళా ఉద్యమకారులు కూడా ఉన్నారు. ఒక పాలు తాగే పిల్లవాడు బయట
ఉండిపోయాడు. అరెస్ట్ చేసేటపుడు తల్లితోపాటు పిల్లవాడి పేరు నమోదు చేయలేదు. అందువల్ల పిల్లవాడిని లోపలికి తీసుకురాకూడదు. ప్రతిరోజూ ప్రొద్దున్న, సాయంత్రం ఆమె భర్త కానీ, అత్త కానీ పాలు తాగించడానికి తల్లి దగ్గరికి జైలుకి వచ్చేవాళ్ళు. మర్నాడు కూడా ఎందరో గనుల చుట్టుపక్క ఊళ్ళలో అరెస్టయి ఇక్కడికి వచ్చారు.
మేము జైలుకి రాకముందు భువనేశ్వర్ మహతో కూడా దాదాపు ఆరువందల మందిని తీసుకువచ్చారు. ఆయనతో పాటు గ్రామస్తులకు బదులుగా ముంగేర్, పలామ్, పాట్నాల నుండి కూలీలు వచ్చారు. చట్టవిరుద్ధమైన గనులు తెరవబడితే పర్మనెంట్ ఉద్యోగాలు దొరుకుతాయన్న ఆశతో వాళ్ళు మాండూ అడవుల్లో డేరాలు వేసుకున్నారు. వాళ్ళు నిర్వాసితులు కారు. కానీ ఉద్యమం నిర్వాసితులకు సంబంధించింది. మాతోపాటు నిర్వాసితులు, కొలియారీ కేడర్ నేతలు ఉన్నారు. మా శ్రామిక నేతలు బయట ఉండి గ్రామస్థుల కోసం చందాలు వసూలు చేసి ఉద్యమానికి అయ్యే ఖర్చును భరిస్తున్నారు. జైళ్ళలో ఉన్నవాళ్ళ కోసం అన్ని విధాలా సహాయపడుతున్నారు. తర్వాత ఎ.కె.రాయ్ గ్రూప్ ఎం.సి.సి.నుండి గిద్దీ, కనకీల నుండి 45 మంది రైతులు అరెస్టయి వచ్చారు.
నేతృత్వం వహిస్తున్న నేతలందరూ అరెస్టవడంవల్ల బయట ఉద్యమానికి అంతరాయం కలిగింది. ఇంతమంది అరెస్టయినా పేపర్లలో దీని గురించి ఒక్క వార్త కూడా పడలేదు.పేపరు వాళ్ళు టాటా నుండి పైసలు తీసుకుని బ్లాకవుట్ చేశారు. అరెస్టయిన ఒక వారం తర్వాత కలకత్తా, అమృత్‌సర్ పత్రికా ప్రతినిధి నన్ను జైల్లో కలవడానికి వచ్చారు. ఢిల్లీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విలేఖరి షీలారెడ్డి (ఆవిడ డిప్యూటీ డైరెక్టర్ మాధవన్ భార్య) పంపించారని నాకు తర్వాత తెలిసింది. అప్పుడు మా ఉద్యమం గురించి జాతీయస్థాయిలో వార్తలు వచ్చాయి. లోక్‌దళ్ స్థానిక నేతలు వార్తలు ప్రచురితం కాకూడదని అనుకున్నారు. అందువల్ల వాళ్ళు పై స్థాయి నేతలకు ఈ వార్త తెలియపరచలేదు. ఈ ఉద్యమం వాళ్ళ నేతృత్వంలో జరిపించడానికి మేము ఎందుకు అవకాశం ఇవ్వలేదని వాళ్ళు కొంత కోపగించుకున్నారు. పేపర్లలో వార్త చదివాక మా నేత కర్పూర్ గారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
ప్రభుత్వం కర్పూరిగారితో కలిసి ఒక సమితిని ఏర్పాటు చేసింది. సి.పి.ఐ. ఉద్యమంలో చేరాక వాళ్ళ నేత చతురానన్ మిశ్రా మాకు తెలుపకుండానే ఉద్యమాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రకటించారు. మేము ఈ విషయంలో అబ్జెక్ట్ చేశాం.
జైల్లోనే మాతోటి గ్రామస్థులతో పాటు సమావేశం జరిగింది. మాలో ఏ ఒక్కరూ బెయిల్ తీసుకోకూడదని నిర్ణయించాము. ప్రభుత్వం ఏ షరతులూ లేకుండా మాపై నుండి కేసులు తొలగించేదాకా మేం జైల్లోనే ఉంటామని నిర్ణయించుకున్నాం. ఒకవేళ మేం అలా చేయకపోతే గ్రామస్థులు కేసుల విషయంలో విసిగిపోతారు, అమ్ముడుపోతారు. లాల్‌చంద్ మహతోకి బెయిల్ ఇప్పించి బైటికి పంపించేయాలి. అప్పుడు ఆయన కోల్‌ఫీల్డ్‌కి వెళ్ళి మళ్ళీ నిర్వాసితులందరినీ సంఘటితపరచి ఉద్యమాన్ని ముమ్మరంగా సాగించి గనులను మూసేయించాలి. అరెస్టయి హజారీబాగ్ జైళ్ళని నింపేయాలి. నేను జైలు లోపల తోటివారందరిలో మనోబలం పెంచాలి. వ్యూహాన్ని తయారుచేసి బయటివాళ్ళు ఏం చేస్తున్నదీ లోపలి వాళ్ళకి చెప్పాలని నిర్ణయించాం. లాల్‌చంద్ గారి తమ్ముడు ఇంద్రజిత్ మహతోని పిలిచి అంతా తెలియచేశాం. ఆయనకు బెయిల్ రావడం కోసం అప్లికేషన్ పెట్టారు. లాల్‌చంద్ గారు బెయిల్ దొరకగానే రెండు రోజుల తర్వాత బేర్‌మోకి వెళ్ళారు. అక్కడ ఉద్యమం ముమ్మరంగా నడిచింది. వేలమంది పురుష, మహిళా రైతులు బేరమో క్ష్రేత్రంలోని గనులను మూసేయించారు. కానీ ఈ సారి పోలీసులు తమ పాలసీని మార్చారు. వాళ్ళు లాఠీఛార్జి చేసి అందరినీ చెల్లాచెదురు చేశారు. కేవలం 700 మందిని మాత్రమే అరెస్ట్ చేసి గిరిడీహ్ జైలుకి పంపించారు. ఇందులో మహిళల సంఖ్య చాలా ఎక్కువ. ఎంతోమంది స్త్రీ పురుషులను పోలీసులు ఎన్నో కోసుల దూరం తీసుకువెళ్ళి అడవి మధ్యలో వదిలేశారు. మేము నెలన్నరకన్నా ఎక్కువ సమయం జైల్లోనే ఉన్నాము. ఈ మధ్యలో కర్పూరీ గారితో, ముఖ్యమంత్రి జగన్నాధ మిశ్రా, హజారీబాగ్ డిప్యూటీ డైరెక్టర్‌తో మాట్లాడాము. 9.9.80లో క్రింద ఇచ్చిన లేఖను రాసి ఉద్యమాన్ని ఆపేయాలని ఆదేశమిచ్చారు. కానీ చతురానంద్ మిశ్రా నాకు, కర్పూరీగారి అభిప్రాయం తీసుకోకుండానే పాట్నా నుండి ఉద్యమాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రకటించారు. మేం మోసపోయామని ఎంతో బాధపడ్డాం.
ప్రియమైన రమణిక గారికి,
ప్రియమైన సోదరుడు లాల్‌చంద్ గారికి,
మేము ముఖ్యమంత్రి, హజారీబాగ్ డిప్యూటీ కమిషనర్ విచారణ చేసి ఉద్యమాన్ని నిలిపివేయాలని, ప్రభుత్వం సి.సి.ఎల్, టాటా బొగ్గు గనుల యాజమాన్యం ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయడానికి ఒక అవకాశమివ్వాలని కోరుకుంటున్నాము. వాగ్దానాలను పూర్తి చేస్తే సరే, నమ్మకద్రోహం చేస్తే మళ్ళీ
ఉద్యమాన్ని ప్రారంభించడం తథ్యం.
మీ
కర్పూరీ ఠాకూర్
నేత, అపోసిట్ పార్టీ
నేను కర్పూరిగారి ఉత్తరం అందాక హజారీబాగ్ జైలునుండి ఒక ప్రార్థనా పత్రాన్ని పంపాను. నాకు మీటింగుకి రావడానికి అనుమతి ఇవ్వాలని, పాట్నా వెళ్ళే ఏర్పాటు చేయాలని రాసాను.
క్లోజ్డ్ లెటర్
డిప్యూటీ డైరెక్టర్, హజారీబాగ్
అయ్యా! మా నేత కర్పూరీ ఠాకూర్‌గారు మాకు ఇచ్చిన సూచన ప్రకారం ముఖ్యమంత్రి గారు హజారీబాగ్ డిప్యూటీ డైరెక్టర్ ద్వారా ఇవ్వబడిన వాగ్దానాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉద్యమాన్ని నిలిపివేస్తున్నాం. ప్రభుత్వం సి.సి.ఎల్, టాటా కంపెనీలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి అవకాశమిస్తుంది. 12-09-80న కాబోయే సమావేశం శాంతియుతంగా జరుగుతుంది.
అందువలన పైన ఇచ్చిన సూత్రం ప్రకారం లోక్‌దళ్ నేతృత్వంలో తేదీ 18-8-80 నుండి నడుస్తున్న ఉద్యమాన్ని కొంతకాలం ఆపేస్తాం. నిర్వాసితుల భూములకు నష్టపరిహారం, ఉద్యోగం కోసం మూడెకరాల నియమాన్ని తొలగించాలి, మిషనీకరణని నిలిపివేయాలి. స్థానీయులకు ఉద్యోగాలకోసం చేయబడిన పాలసీలో మార్పు, స్థానీయతకి పరిభాష, పరంపరాగత ఉద్యోగాల గురించిన వివరాలు కావాలి. మూయబడిన గనులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బంతా జిల్లాల్లోనే ఇవ్వాలి. ఠేకేదారి విధానాన్ని వాషరీలలో సమాప్తం చేయాలి. శ్రామికులను రెగ్యులరైజ్ చేయాలి. గ్రామీణులకు టెక్నికల్ ట్రెయినింగ్ ఇవ్వాలి. దీనివల్ల కొత్త ప్రాజెక్టులలో, వాషరీలలో వాళ్లకు ఉద్యోగాలు దొరికే అవకాశముంటుంది. హోమ్ గార్డులకు, సాధారణ ప్రజలకు సి.సి.యల్.లో సెక్యూరిటీ గార్డుల నియుక్తికి ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు అన్న నియమాన్ని తొలగించాలి. టాటా వాళ్ళు తీసుకున్న బంజీ, చైన్‌పుర్‌లో ఇదివరకటి భూములపైనే ఉద్యోగాలు ఇవ్వాలి… మొదలైన డిమాండ్లతో ఉద్యోగాలు మొదలుపెట్టాం. మేము మా నేత సూచన ప్రకారం 10-9-1980న ఉద్యమాన్ని ఆపుతున్నాం
12-9-80న జరగబోయే మీటింగు శాంతియుతంగా జరపాలని మేము కోరుకుంటున్నాం. ఆ మీటింగుకి లోక్‌దళ్ తరఫు నుండి నేను మీటింగులో పాల్గొనే ఏర్పాటు చేయండి. ఈ ఉద్యమంలో పాల్గొన్న సత్యాగ్రహులకు, హజారీబాగ్ లోక్‌దళ్ అధ్యక్షులైన బైకుంఠ్‌నాథ్‌ని మీ ద్వారా ఇవ్వబడిన వాగ్దానాల ప్రకారం వదలిపెట్టాలి.
అభినందనలతో, మీ శ్రేయోభిలాషి
రమణిక గుప్తా (స.వి.స.)
కేంద్రీయ కారాగారం,
హజారీబాగ్
10-08-90
డిప్యూటీ డైరెక్టర్ నాకు పాట్నా వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో మేము లేకుండానే పై స్థాయిలో సమావేశం జరిగింది. దానిలో పాల్గొనడానికి రామ్ చతురానన్ మిశ్రా వెళ్ళారు. మా ఇద్దరినీ జైలునుండి పాట్నాకి పంపించలేదు. అందువలన కర్పూరిగారు, కపిలదేవ్ బాబుని ఈ కమిటీకి వేశారు. కానీ కొన్ని కారణాల వలన వారు ఆ సమావేశానికి వెళ్ళలేకపోయారు. ఆ కమిటీలో కె.బి.సక్సేనా ఉన్నారు. ఆయన పేదల పట్ల ఎంతో సానుభూతి చూపిస్తారు. ఆయనను పేదల మసీహా అని అనేవారు. వారే మా వైపు నుండి మాట్లాడారు. ఒక ఒడంబడిక జరిగింది.
నేను 10-9-80న సుప్రీంకోర్టు ముఖ్య న్యాయాధికారికి ఒక క్లోస్డ్ లెటర్ రాశాను. అందులో పోలీసులచే అత్యాచారాలు, అబద్ధపు కేసులు పెట్టడం, ఆదివాసీల భూములపై హక్కులను లాక్కోవడం, వాళ్ళని వెళ్ళగొట్టడం, మొదలైన విషయాలను ఉటంకిస్తూ ఫిర్యాదు చేస్తూ ఒక క్లోస్డ్ లెటర్ రాశాను.
క్లోస్డ్ లెటర్
మహారాజశ్రీ ముఖ్య న్యాయాధిపతికి,
సర్వోత్తమ న్యాయస్థానం, కొత్త ఢిల్లీ తేదీ 10-9-80
1. నేను రమణిక గుప్త, విధానసభ సభ్యురాలు, మాండూ క్షేత్ర ముఖ్యమంత్రి కోల్‌ఫీల్డ్ లేబర్ యూనియన్, లెపోరోడ్, హజారీబాగ్ (బీహార్) తేదీ: 23-8-80 న డి.సి.హజారీబాగ్ సర్క్యూట్ హౌస్‌లో మాండూ క్షేత్ర ఉద్యమం గురించి మాట్లాడడానికి వాళ్ళు పిలిచిన సమయానికే వెళ్ళాను.
2. ఈ ఉద్యమం మాండూ క్షేత్రం నుండి జరుగుతోంది. నేను ఇక్కడి ఎం.ఎల్.సి.లను నిర్వాసితులకు, స్థానికుల ద్వారా తీసుకోబడిన భూముల నష్టపరిహారం, ఉద్యోగాలు, సెంట్రల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ, దర్బంగా హౌస్, రాంచీ, టాటాల వెస్ట్ బొకారో బొగ్గు గనుల ఘాటో టాండ్ ఘాటో ద్వారా రైతుల భూములపైన నోటీసు ఇవ్వకుండా, పరిహారం లేకుండా, భూమార్జన నియమాలను పాటించకుండానే చట్టవిరుద్ధంగా భూములను కబ్జా చేయడం, డీపిలరింగ్ చేయడం మొదలైన వాటికి విరుద్ధంగా ఈ ఉద్యమం సాగుతోంది. ఈ కంపెనీలు చట్టవిరుద్ధమైన పాలసీలను ఉపయోగిస్తూ తమ తమ సంస్థలలో ఉద్యోగాలను వంశపారంపర్యం చేశాయి. టాటా కంపెనీలో రిక్తస్థానాలను కేవలం సిబ్బంది ఆశ్రితులకు మాత్రమే ఇస్తున్నాయి. ట్రెయినింగ్‌కు కూడా వాళ్ళవాళ్ళనే తీసుకుంటారు. సి.సి.ఎల్.లో కూడా వాలంటరీ రిలైర్‌మెంట్ కింద పీస్ రేటెడ్ కేటగిరీ-4 కార్మికులు ఎక్కువగా ఛోటా నాగపూర్‌కి బయటివాళ్ళే. వీళ్ళ రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు. పరంపరాగత ఉద్యోగాలలా ఉద్యోగాలను మార్చుకుంటారు. ఫలస్వరూపంగా బయట క్షేత్రాలలోని వారు ధనబలం మీద కోర్టులో అఫిడవిట్ ఇచ్చి, అబద్ధపు కోర్టు మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చి అల్లుళ్ళవుతారు. వీళ్ళు స్థానికుల ఉద్యోగాలను చేజిక్కించుకుంటారు. పరంపరాగతమైన
ఉద్యోగాలవల్ల దాదాపు 80 శాతం ఉద్యోగాలు ఎప్పటికీ ఖాళీ అవవు. ఇక్కడి రైతులకు, నిర్వాసితులకు ఈ గనులలో ఉపాధి దొరకదు.
ుడ్డిగా యాంత్రీకరణ చేయడంవల్ల కూడా కార్మికులకు ఉద్యోగాలు దొరకడంలేదు.
3. ఈ కారణాలవల్ల ఉద్యమం ప్రారంభించాం. ప్రభుత్వం 144 సెక్షన్‌ని విధించింది. ఆ క్షేత్రంలో రైతులను వాళ్ళ స్థలాలకు వెళ్ళారని నేరం మోపుతూ అరెస్ట్ చేశారు.
4. ఈ ఉద్యమం గురించి, అరెస్టుల గురించి మాట్లాడి వెనక్కి వస్తున్నాను. జిల్లా పరిషత్ మలుపులో హజారీబాగ్‌లో రాత్రి ఏడున్నర గంటలకు హజారీబాగ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సదర్‌థానా శ్రీరామ్, ఇంకా మిగిలిన పోలీసు అధికారులు నా జీపును ఆపి అరెస్ట్ చేశారు.
5. మా ఇంటిదాకా రమ్మనమని (మా ఇల్లు హజారీ బాగ్‌లోనే ఉంది) ప్రార్థించాను కాని వాళ్ళు రాలేదు.
6. అక్కడినుండి నన్ను సరాసరి హజారీబాగ్‌లోని సి.జి.యం కోర్టుకి తీసుకెళ్ళారు. కోర్టు మూసి ఉంది. సి.జి.ఎం నివాస స్థానంలో, పి.డబ్ల్యు.డి. రెస్ట్ హౌస్ ఉంది. మమ్మల్ని రెండు మూడు గంటలు అక్కడ కూర్చోబెట్టారు.
7. రాత్రి కస్టడీ వారంట్‌పై సంతకం చేయడానికి హజారీబాగ్ సి.జి.ఎం. నిరాకరించారు.
8. తర్వాత దాదాపు 9.30 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ 12 గంటలవరకు కూర్చోబెట్టారు.
9. రాత్రి 12.30 గంటలకు లాల్‌చంద్ మహతో (మాజీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు)ని పి.డబ్ల్యు.డి రెస్ట్ హౌస్‌కు తీసుకెళ్ళారు. నాకు, లాల్‌చంద్ గారికి ఒక గది ఇచ్చారు.
10. దాదాపు ఒంటిగంటకు ఎస్.డి.లో సదర్ (హజారీబాగ్) వచ్చారు. మమ్మల్ని మేల్కొలిపారు. మమ్మల్ని కెన్హారీ రెస్ట్‌హౌస్‌లో ఉంచాలని ఆర్డర్ వచ్చిందని చెప్పారు.
11. నేను ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడే ఉంటాం, బట్టలు కూడా మార్చుకున్నామని చెప్పాను. కానీ అది ఆర్డర్ కాబట్టి అక్కడికే వెళ్ళాలన్నారు. మా ఇద్దరినీ నగరానికి దూరంగా ఉన్న రెస్ట్‌హౌస్‌లోకి ఒంటిగంటన్నరకు తీసుకెళ్ళారు.
12. 24-8-80న మమ్మల్ని సి.జె.ఎం. నివాస స్థలానికి తీసుకెళ్ళారు. మధ్యాహ్నం 12 గంటలకు మమ్మల్ని జైలుకు పంపించారు.
13. 23-8-80 రాత్రి మాపై కేసు మోపారు. సి.జి.ఎం.కు రాత్రి తీసుకువచ్చారు. (మేం అక్కడే ఉన్నాం) అప్పుడు ఆయన కస్టడీ వారంట్‌పైన సంతకం చేయలేదు. ఆ కేసులలో ఆ సమయంలో సెక్షన్ 120 (ఐ.పి.సి.) పెట్టలేదు. అన్నీ మామూలు కేసులే. సత్యాగ్రహం చేసేవాళ్ళపై సెక్షన్ 143, 144, 188 పెట్టవచ్చు. కానీ పొద్దున్న 11 గంటలకు సి.జి.ఎం. రెండోసారి నన్ను తీసుకువచ్చినపుడు నాతోపాటు లాల్‌చంద్ గారు కూడా ఉన్నారు. మాపై సెక్షన్ 120 (ఐ.పిి.సి.) కాకుండా మిగిలిన సెక్షన్లు కలపారు. అంతేకాదు 21-8-80 కేసు నంబర్ మాండూ పి.ఎస్. 28-8-80 సాయంత్రం 5.30 గంటలకు హజారీబాగ్ నుండి 25 మైళ్ళ దూరంలో బంజీగ్రామ్ దగ్గర అజ్ఞాత వ్యక్తుల పేరున టాటా కంపెనీ అధికారి ఒకరు కేసు పెట్టారు. అసలు ఆ కేసులో దొంగతనం కానీ మరే నేరం కానీ స్పష్టంగా లేదు. నేను అక్కడి ఎమ్మెల్సీని. అక్కడే ఉంటే నా పేరు తప్పకుండా రాసేవారు. కనీసం ఒక మహిళ అక్కడ ఉందని కూడా రాసేవారు. కేసులో మా ఇద్దరినీ ఇరికించారు. కేసులో తర్కం లేదు. ఉచితమైనది కూడా కాదు. ఆ రోజంతా మేమిద్దరం ఎస్.పి., డి.సి.లను కలుస్తూనే ఉన్నాం. పొద్దున్న 10 గంటలకు మేం అక్కడే ఉన్నాం. ఈ విధంగానే 22.8.80వ తేదీన మాండూలో పి.ఎస్.కేసు నం.29-8-80లో మా పేరు రాశారు. అది కూడా తప్పుడు కేసే. ఆ రోజు మేము డి.ఇ.ని, ఎస్.పి.ని కలుస్తూనే ఉన్నాం. సమస్యకి సమాధానంగా డిప్యూటీ డైరెక్టర్ కంపెనీ వాళ్ళను పిలిచి మాట్లాడుదాం అన్నారు. ఆయన సలహాతోనే మేము సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళ దగ్గర్నుండి వచ్చేసి పద్మా బస్తీ దగ్గర ఉన్న పద్మా ప్యాలెస్‌లో బీహార్ హోం సెక్రటరీని కలవడానికి వెళ్లాం. వెనక్కి తిరిగి వచ్చాక చైన్‌పుర్ సైడింగ్‌లో ఉదయం రెండు గంటలకు మాండూ ప్రభారీ రామాశ్రయ్ సింహ్ (బాగా తాగి వున్నారు) టాటా ఇచ్చే లంచాలకు లొంగిపోయి శాంతిపూర్వకంగా సత్యాగ్రహం జరిపిస్తున్న వారిపై, సత్యాగ్రహం చేసేవారిపై దయాదాక్షిణ్యాలు లేకుండా లాఠీఛార్జీ చేశారు. అప్పుడు 50 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని స్టేషన్‌కు తీసుకెళ్ళారు. ట్రక్ ఎక్కించాక రామాశ్రయ్ సింహ్ రైఫిల్‌తో కొట్టారు. మేం వెంటనే ఆ విషయం చెప్పడానికి ఎస్.పి. దగ్గరకు వెళ్ళాం. సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లకు కూడా టాటా కంపెనీ వాళ్ళు బాగా తాగించారన్న విషయం కూడా మాకు తెలిసింది. చాలామంది మత్తులో ఉన్నారు. శ్రీ విజయ్ రాణా, మక్బూల్, ఆలమ్, చైన్‌పుర్, మాండూ, సోన్‌డీహ్‌కు చెందినవారు. 22వ తేదీన నాలుగు గంటలకు పోలీసులు ఘాటో పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆయన్ని బాగా హింసించారు. మర్నాడు సాయంత్రం ఆరు గంటలకు చరహి స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇదంతా చట్టవిరుద్ధమైన పని. వీళ్ళ ముగ్గురినీ చేతులకు బేడీలు వేసి తీసుకువచ్చారు. ఇది కూడా మీ ఆజ్ఞను ఉల్లంఘించడమే. 23-8-80 రాత్రి సి.జి.ఎం. కోర్టుకి నన్ను తీసుకువెళ్తున్నారు. ఆ ముగ్గురు కూడా ట్రక్‌లో ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళ కాగితాలు కూడా సి.జి.ఎమ్‌కు వచ్చాయి. కానీ వాటిలో మా పేరు లేదు. నేను స్వయంగా అడిగాను, కానీ తర్వాత ఈ కేసులో మా పేర్లు కూడా ఇరికించారు.
14. హజారీబాగ్ సి.జి.ఎం. సెక్షన్ 120 (ఐ.పి.సి.) కేసులన్నీ కొట్టేశారు. ఎందుకంటే వీటిల్లో ఎఫ్.ఐ.ఆర్.లో ఈ సెక్షన్ మాటే లేదు. రాత్రి పోలీసుల కస్టడీలో వీళ్ళు ఉన్నారు. అప్పుడు కుట్ర ఎలా పన్నగలుగుతారు?
15. రాత్రి నన్ను (మహిళను అరెస్ట్ చేయకూడదు) అరెస్ట్ చేయడం, ఈ ప్రకారంగా మాపై కేసులు పెట్టడం, సెక్షన్ 377 (ఐ.పి.సి.) పెట్టి మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడంతో పాటు మమ్మల్ని జైల్లో పెట్టించాలన్న కుట్ర కూడా జరిగింది. ఇదంతా ఎమ్మెల్సీగా నా పనులకు ఆటంకం కలిగించడమే కాక నా సిటిజన్ ఫ్రీడమ్ విషయంలో కల్పించుకోవడం జరిగింది. దీనివల్ల నేను నా నియోజకవర్గంలో ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా, నోటీసు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, భూములను ఎవరి దగ్గరైతే లాక్కున్నారో వాళ్ళవైపు నుండి నేను నోరు ఎత్తకుండా ఉండకూడదనే అధికారులతో చేతులు కలిపి ఈ విధంగా చేశారు. రైతులపైన నేరస్థులని ముద్రవేసి అరెస్టు చేసారు. 20.08.80 నుండి 23.08.80 వరకు 734 మంది సత్యాగ్రహం చేసేవాళ్ళని జైళ్ళకు పంపించారు. ఆ తర్వాత ఎంతోమంది అరెస్టయ్యారు.
16. మీరు తక్షణం న్యాయం చేకూర్చాలి. అప్పుడు నేను ఒక సిటిజన్‌గా నా కర్తవ్యాన్ని నిర్వహించే అవకాశం, ఎమ్మెల్సీగా చేయవలసిన పనులను చేయగలుగుతాను. టాటా కంపెనీ పరిధిలో ఉన్న మాండూ, చైన్‌పూర్ సైడింగ్ పోలీస్‌స్టేషన్‌లో దయాదాక్షిణ్యాలు లేకుండా లాఠీఛార్జి జరిపిన అధికారులు, చేతులకు బేడీలు వేసి అరెస్ట్ చేశారు. మాపై అబద్ధపు కేసులు పెట్టారు. ఈ విషయంలో మీరు కల్పించుకుని మాకు న్యాయం చేయాలి.
17. నాపైన, లాల్‌చంద్ గారిపైన పెట్టబడిన కేసుల వివరాలు ఇవి.
మాండూ పి.ఎస్. సెక్షన్ (ఐ.పి.ఎస్.)
1. 19 (8) 80 147, 149, 342, 341, 188, 107, 114
2. 20 (8) 80 147, 149, 342, 341, 188, 107, 114
3. 21 (8) 80 147, 149, 342, 341, 188, 107, 114
4. 22 (8) 90 147, 149, 342, 341, 188, 107, 114
5. 23 (8) 80 147, 149, 342, 341, 188, 107, 114
6. 24 (8) 80 147, 149, 342, 341, 188, 107, 114
7. 28 (8) 80 147, 109, 342, 341, 144, 188, 114, 323, 379, 307, 127
8. 29 (8) 80 307, 352, 353, 147, 180, 341, 342, 323, 188, 109, 119
18. పైన ఇవ్వబడిన కేసులన్నీ ఒకవైపు నుంచి పెట్టబడినవే. వాళ్ళు భూములను కబ్జా చేశారు. అన్యాయం చేశారు. టాటా కంపెనీ పెద్ద పెట్టుబడిదారులు. ఆ కంపెనీని రక్షించడానికి మా వంటి పేదలపట్ల అన్యాయం చేస్తున్నారు. న్యాయం జరిపించాలని ప్రార్థిస్తున్నాను.
స్థానం: కేంద్రీయ కారాగారం భవదీయురాలు
హజారీబాగ్ రమణిక గుప్తా
బీహార్ విధానసభ సభ్యురాలు
కోల్‌ఫీల్డ్ లేబర్ యూనియన్ సెక్రటరీ
జైల్లో మేము మా తోటివాళ్ళకి భోజన సదుపాయం ఉండేలా చూశాం. మేము మా ఎదురుగా రేషన్ సామగ్రిని తూయించేవాళ్ళం. గ్రామీణులకు ఇచ్చేవాళ్ళం. వాళ్ళందరూ కలిసి మిగిలిన ఖైదీల సహాయంతో (వీళ్ళ సహాయార్ధం ఖైదీలను ఇస్తారు) వంట వండుకునేవారు. మహిళా ఖైదీలకు రాళ్ళు ఉన్న పప్పు తినాల్సి వస్తుంది. వాళ్ళకు వేరుగా రేషన్ దొరకదు. నేను వాళ్ళతోపాటే ఏది పడితే అదే తినేదాన్ని. జబ్బు పడినవాళ్ళను ఆస్పత్రికి పంపించే ఏర్పాట్లు చేసేవాళ్ళం. వాళ్ళకు పాలు, వెన్న అందేలా చూసేవాళ్ళం. రెండు పూటలా జైల్లో మేము సమావేశం ఏర్పాటు చేసేవాళ్ళం. క్లాసులు తీసుకునేవాళ్ళం. నినాదాలు చేస్తూ గ్రామస్థులలో ధైర్యం పెంచేవాళ్ళం. ఈ ఉద్యమ సమయంలో రాసిన పాటలను స్త్రీలు జైల్లో పాడేవాళ్ళు.
కేదలా ఆదివాసీల కర్‌మూల్ దళితులైన ఘంజా స్త్రీలు పాటలు పాడేవారు. వాటి అర్థం –
నిర్వాసితులం మేము ఫుట్‌బాల్‌లా
అటువైపు నుండి కంపెనీ కిక్ కొడితే భూముల నుండి వేరయ్యాం
ఇటువైపు నుండి ప్రభుత్వం కిక్ కొడితే జైల్లో వచ్చి పడ్డాం
జైల్లో గుప్తారాణి కిక్ కొడితే మా ఊళ్ళో, మా భూములపై వెళ్ళిపడతాం
‘ఛలో జార్ఖండ్’ అనే గీతాన్ని వాళ్ళు ఎంతో ఆనందంగా పాడేవాళ్ళు. ఊళ్ళ చరిత్ర కూడా ఈ గీతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది.
రహగైల్ జోడా బాంధ్ లే నిషాన్,
దీని అర్థం: రాజా బేటా చనిపోయాడు / మోదీ చనిపోయాడు / కేవలం సరస్సులు, ప్రాజెక్టులు
మాత్రమే గుర్తులు…
ఈ గీతం గ్రామీణ వికాసాన్ని వర్ణిస్తుంది. చరిత్రని కూడా. అక్కడ సరస్సులను, డ్యామ్‌లను కూడా…
తేతర్ పాత్తా చీరా-చీరా / ఆంబా పాత్తా లాంబాంరే / నీంబూ పాత్తా ఫతే గోల్ గోల్
ఈ గీతంలో వాళ్ళ ఊహా సౌందర్యం కనిపిస్తుంది. వాళ్ళు ఎంతో భావుకతతో ఈ గీతం పాడేవాళ్ళు. ఈ పాటను వింటుంటే జైలులో మా మనస్సులు ఆనందంతో నిండిపోయేవి. వాళ్ళు కలల్లో తేలిపోయేవాళ్ళు. కలల్లో అడవులను చూసే వాళ్ళు. వాళ్ళు స్వేచ్ఛగా అడవులకు వెళ్తున్నారు… కావలసిన కట్టెలు తెచ్చుకుంటున్నారు… ఎవరూ ఆపడంలేదు… వాళ్ళ వాళ్ళ పొలాల్లో విత్తనాలు జల్లుతున్నారు, కలుపులు తీస్తున్నారు… కోతలు కోస్తున్నారు… కానీ ఆ కలలన్నీ కల్లలయ్యాయి. భూములు పోయాయి. ఉద్యోగాలు దొరుకుతాయని కలలు కంటున్నారు… జైళ్ళ నుండి బయటపడతారు… ఉద్యోగాలు దొరుకుతాయి. డ్యూటీ చేస్తారు, నెలకి జీతం లభిస్తుంది. మళ్ళీ భూములు కొనుక్కుంటారు. అంతే అంతకంటే వాళ్ళేమీ కోరుకోరు. నిజానికి చూస్తే ఈ కలలు ఎంత చిన్న చిన్నవిగా అనిపిస్తాయ. కానీ ఈ స్వప్నాలే దేశాన్ని సమృద్ధిపరుస్తాయి. పచ్చటి పైరులతో, దేశాన్ని సుభిక్షంగా తయారు చేసే కలలు. అంతటా సస్యశ్యామలం, ఈ కలలు పండితే… కానీ ఈ వ్యవస్థ ఈ కలలని అర్థ¸ం చేసుకోదు.
తాపిన్ గంఝా మహిళలు ఎంతో ధైర్యస్థులు. ఉద్యమం సమయంలో తాపిన్ నార్త్‌లో ఒక డోజర్ ఆపరేటర్ గ్రామీణుల పొలాలపైన, డోజర్ నడపాలనుకుంటుంటే తమ తమ కలలని పండించుకోవాలని తాపిన్ ఊరులోని చాలామంది మహిళలు డోజర్ ఎదురుగుండా పడుకున్నారు. డోజర్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. చాలా దగ్గరికి వచ్చింది. అయినా వాళ్ళు భయపడలేదు. పోలీసులు డోజర్‌ని ఆపి తాపిన్ మహిళలను అరెస్ట్ చేశారు. సర్పంచ్ భార్య ముందంజ వేసింది. ఆమె నేతయింది. వాళ్ళు జైళ్ళనుంచి బయటకి వస్తే
ఉద్యోగాలు దొరుకుతాయని కలలు కన్నారు. కానీ కలలు కల్లలయ్యాయి.
మాపైన ఉన్న కేసులను వెనక్కు తీసుకున్నారు. కర్మా పండుగకి ఒకరోజు ముందు మమ్మల్ని వదిలేశారు. సెప్టెంబరులో మేము విడుదలయ్యాం. జైళ్ళ నియమాల ప్రకారంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ దుప్పట్లు, కంబళ్ళు, నిక్కర్లు మొదలైనవి ఇప్పించేవాళ్ళు.
ఈ ఉద్యమం ఫలితంగా బీహార్ ప్రభుత్వం జిల్లా స్థాయిలో గ్రేడ్ ఫోర్‌లోని ఉద్యోగాలు, గ్రేడ్ త్రీ 50 శాతం స్థానికులకు రిజర్వ్ చేయడానికి ఒప్పుకుంది. మేము చట్టంలో మార్పు తెచ్చి ఆఫీసులో కేవలం స్థానికుల పేరు మాత్రమే నమోదు చేయడానికి ఒత్తిడి చేశాం. నిర్వాసితులకు ఉద్యోగాలు 1908 సర్వే ప్రకారం తయారు చేయబడిన జాబితాలో రైతుల వంశంలోని వర్తమానంలో ఉన్న వారసులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేశాము.
ప్రభుత్వం నిర్వాసితుల ఉద్యోగాల కోసం 1908 సర్వే రిపోర్టు ఆధారాన్ని చేసుకుని స్థానికులంటే ఎవరని పరిభాషించారు. మొత్తం బీహార్‌లో గ్రేడ్ 4 వంద శాతం, గ్రేడ్ 3 50 శాతం ఉద్యోగాలు జిల్లాలలోని స్థానిక నివాసీయులకు ఆరక్షితం అన్న నియమం పెట్టారు. హజారీబాగ్‌లో ఐ.ఐ.టి.లో డోజర్ ఆపరేటర్లకి శిక్షణనిస్తారు. వీళ్ళకి బొగ్గు గనులలో ఉద్యోగాలు దొరికే అవకాశముంటుంది. వీళ్ళకి సి.సి.ఎల్. టీచర్లని, పనిముట్లను ఏర్పాటు చేయాలి. కోల్ ఇండియా ససేమిరా ఒప్పుకోలేదు. నిర్వాసితుల ఉద్యోగాలు ఇచ్చే విషయంలో మూడు ఎకరాలు ఉండాలన్న నియమం పెట్టారు. ముఖ్యమంత్రి డా.జగన్నాధ్ మిశ్రా మా డిమాండ్లను అనుసరించి కేంద్ర ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం ధన్‌బాద్‌లో ఉన్నత స్థాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర, నిర్వాసితులకు, కుటుంబంలో వేరుకుంపటి పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ సంచితమైన భూమిపై రెండెకరాల మీద ఉద్యోగం, మెట్రిక్ పాస్ అయిన నిర్వాసితులకు ఒక ఎకరం భూమిపై ఉద్యోగాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ సమావేశంలో నష్టపరిహారం ఎంతివ్వాలో నిర్ణయించమని బీహార్ ప్రభుత్వానికి బాధ్యత అప్పగించారు.
ఈ ఉద్యమం వల్ల ప్రతి క్షేత్రంలో బొగ్గు గనులలో ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఊళ్ళల్లో ‘సాముదాయక్ వికాస్ యోజన’ను అమలు జరపాలని నిర్ణయం జరిగింది. దీని ప్రకారం పాఠశాల భవనం, పులియా, లింక్ రోడ్డు, బావులు, బోర్‌వెల్‌లు, ఆరోగ్య కేంద్రాలు, సాంకేతిక శిక్షణా కేంద్రాలు మొదలైనవి ఏర్పాటు చేయడానికి ప్రతి ప్రాంతానికి ఒక లక్ష రూపాయలదాకా పెంచారు. యూనియన్లు, మేనేజ్‌మెంట్ ప్రతినిధులు కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో ఏమేమి లేవో వాటిని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఈ సమావేశాలకు ముఖియా, సర్పంచ్, బి.డి.ఓ., ఎడ్యుకేషన్ అధికారి, స్థానిక ఎమ్మెల్సీలు, ఎం.పి.లను కూడా పిలవడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ కలిసి అవసరాన్ని బట్టి గ్రామాలను నిర్ణయించి, నిధులను వితరణ చేసేవారు. దీన్ని కార్యాచరణలో పెట్టడానికి మేమందరం యూనియన్ల ప్రతినిధులుగా మా క్షేత్రాలకు వెళ్ళేవాళ్ళం. ఈ నిధులతో ఏమేమి పనులు జరుగుతాయో, వాటిలో కాంట్రాక్టుల పద్ధతిని మేము, ముఖ్యంగా నేను, స్వీకరింపబడకుండా చూశాను. దీన్ని గ్రామస్థులు, కార్మికులు ఏ మాత్రం లాభం తీసుకోకుండా చేసేవారు. పనిచేసే గ్రామస్థులకు, పనులు చేయించే గ్రామస్థులకు, ఆ నిధుల్లో కొంత ఇచ్చే సౌకర్యం ఈ ప్రణాళికలో ఉంది.
ఇవి ప్రభుత్వం ఒకవైపున తీసుకున్న నిర్ణయాలు. మా డిమాండ్లను అనుసరించే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది కానీ, మమ్మల్ని ఇందులో భాగస్వాములుగా చేయలేదు. దీనివల్ల ఎన్నో లొసుగులు కూడా వచ్చాయి. ఈ ఉద్యమం వల్ల గ్రామస్థులు కొంత లబ్ది పొందారు. కొంత శాంతి కలిగింది. కానీ చాలావరకు ఇంకా పొందాల్సినవి ఉన్నాయి. ఈ నిర్ణయంవల్ల కొంతమందికి ఉద్యోగాలు దొరికాయి. నష్టపరిహారం ఎక్కువ ఇవ్వసాగారు. కానీ యాజమాన్యం వారు మాకు శిక్ష వేయాలన్న ఉద్దేశ్యంతో ఆదివాసీలను, దళిత కార్మికులను జాలీ అంటూ ఎటువంటి దర్యాప్తు లేకుండానే, ఒకవేళ దర్యాప్తు చేసినా ఒకవైపు నుండే చేసి వాళ్ళని ఉద్యోగాలనుండి తీసేసారు. దీనికోసం మేము ఎన్నో సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఎక్కువగా ఛోటా నాగ్‌పూర్‌కి చెందిన ఆదివాసీ కూలీలనే ఉద్యోగాల నుండి తీసేశారు. వీళ్ళందరూ మా యూనియన్‌లో సభ్యులుగా ఉండేవారు. కార్మికుల ఉద్యమాలలో కలిసికట్టుగా మాతో పనిచేసేవాళ్ళు. వీళ్ళందరినీ ఉద్యోగాల నుండీ తీసేయడానికి కారణం యూనియన్ బలహీనపడుతుందనే ఉద్దేశ్యంతోనే. కానీ అలా జరగలేదు. మేము బలహీనపడలేదు.