వర్తమాన లేఖ – శిలాలోలిత

పియాతి ప్రియమైన విమలా!

ఎలా ఉన్నావ్‌? నేనొచ్చి రెండ్రోజులయింది. నిన్ను తొందర్లోనే కలుస్తాను. మనం కలిసి కూడా చాలాకాలమైంది. కేరళలో ‘చెంగన్నూర్‌’ పొయిట్రీ ఫెస్టివల్‌లో మూడు రోజులపాటు కలిసున్నాం కదా! ఎన్నో ఎన్నెన్నో విషయాల్ని, జీవితాల్ని, సాహిత్యాల్ని కలబోసుకుని తిరిగాం. తమిళ రైటర్‌ లక్ష్మిగారు కూడా బాగా ఆత్మీయంగా

ఉన్నారప్పుడు. విమలా ఎలాఉన్నావ్‌? ఆ మధ్యకాలంలో సాహిత్యంతో కొంత గ్యాప్‌ వచ్చిన తర్వాత, మళ్ళీ ‘కవి సంగమం’ మీటింగ్‌ల వల్ల మళ్ళీ కవిత్వంలోకి వచ్చి పడ్డానన్నావ్‌, గుర్తుందా? విమలా! నువ్వంటే నాకు ఇష్టంతో కూడిన, ఆరాధనతో కూడిన పిచ్చి ప్రేమ. నిన్ను కల్సినప్పుడల్లా ఎంతో ఉత్తేజితురాలినవుతాను . మనుషుల కోసం నే చేసే తండ్లాటలో దొరికిన స్నేహ చెలమవు నువ్వు. అవును విమలా! నిజం. నువ్వంటే ఎంతో గౌరవం. ప్రజల కోసం పోరాడే నీ స్ఫూర్తి, నీ నిబద్ధత, స్త్రీల గురించిన నీ ఆరాటం. మానవత్వాన్ని మంటగలుపుతున్న వారిపై నీ ఆగ్రహం. ఇవన్నీ కూడా విమలను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

నేను ఎం.ఫిల్‌ చేసే రోజుల్లో నీ కవిత్వ పుస్తకం రాలేదింకా. నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో! ‘బసంత్‌ ఫంక్షన్‌ హాల్‌’లో నిన్ను కలవడానికే వచ్చాను. అప్పటివరకూ నువ్వు రాసిన కవితల జిరాక్స్‌ కాపీలిచ్చారు. ఒక నిధి దొరికినంత సంతోషమప్పుడు. ఆ తర్వాత 90’లలో అనుకుంటా ‘అడవి

ఉప్పొంగిన రాత్రి’ పేరిట కవిత్వం పుస్తకంగా వచ్చింది. అంతిమ విజయం ప్రజలదేనన్న దృఢవిశ్వాసాన్ని ప్రతి కవితా నొక్కి చెబ్తుంది. నీది పసిపాప మనస్తత్వం విమలా! అదే క్షణంలో ఎంత కఠినంగా ఉండగలవో, ఎంత కమిట్‌మెంట్‌ ఉన్నదానివో కూడా స్పష్టంగా నీ మాటలో, కవితలో, కార్యాచరణలో కన్పిస్తాయి. నీ నిజాయితీనే నన్ను బాగా ఆకర్షించిన అంశం. చాలా సందర్భాల్లో నిన్ను దగ్గరగా గమనించాక నీ పట్ల ప్రేమ మరింతగా పెరిగింది. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతోమంది స్త్రీలు పోరాటాలలో పాల్గొన్నప్పటికీ, ఆ స్త్రీల అనుభవాలు అతి తక్కువగా నమోదయ్యాయి. నీ కవిత్వం ఆ లోపాన్ని కొంతమేరకు పూరిస్తుందని భావించొచ్చు. నీ కవిత్వంలో తరచుగా పోరాట ప్రాంతాలే కవిత్వ ప్రతీకలు అవుతాయి. ‘పాండవుల గుట్టలు, గురజాల మోడు వంటివి’/లేకుంటే నిలబడగలిగేవాళ్ళం కావన్నావొక చోట. సూక్ష్మదృష్టితో చూసినప్పుడు, సమాంతర అర్థాలను అందిస్తూ ఉంటుందనే విషయం ఎక్కువగా అర్థమవుతుంది. భావతీవ్రతతో పాటు భావ సంబంధిత విస్తృతి ఎక్కువ నీలో. స్త్రీల కవిత్వంలో, పరిధి, పరిమితత్వం అధికమని అంటూండడం పరిపాటి. నీ కవిత్వం విశాలమైన పరిధిని కలిగి ఉన్నటువంటిది. స్త్రీగా అనుభూతి చెందిన స్వీయానుభవం కవిత్వంకన్నా సామాజిక అనుభవాన్ని నీ రాజకీయ చైతన్యంతో, విప్లవ దృక్పథ ప్రాధాన్యాన్ని భంగపరచకుండా రాసిన కవిత్వం నీది.

‘తెగబడిన మా కలల ప్రపంచం’ కవితలో పునరుత్పత్తి పరికరంగా మాత్రమే చూడబడుతున్న స్త్రీల మేధస్సు, కలలు అన్నీ నిరపయోగం, భగ్నం అయిపోతున్న సామాజిక విషాదస్థితిని చెప్పి, స్త్రీల జీవితాలలోకి స్వేచ్ఛాపుష్పాల్ని ఎవరూ మోసుకురారని తెగేసి చెప్పి – ‘స్వేచ్ఛ అనేది పోరాడి సాధించుకోవాల్సిన హక్కు’ అన్నావ్‌. ‘అంట్లగిన్నెల తిరగమాతల పొగలో/మాసిన బట్టల మోపుల మధ్యన బందీ అయిన స్త్రీలు / ఇన్నాళ్ళ అమానవీయ హింసలో / మెరుపుల పిడికిళ్ళెత్తిన / పోరాట ప్రచండ ఘోషను తెగబడిన దృశ్యాన్ని / ఐనా మిగిలిన సగం ప్రపంచమా! / నీవిప్పుడు వినక చూడక తప్పదు” – అని మహిళా విముక్తి ఉద్యమం కేవలం మహిళలతో మాత్రమే సాగేది కాక, మిగిలిన సగం ప్రపంచాన్ని కూడా కలుపుకు పోవాల్సిన, చైతన్యపరచాల్సిన ఉద్యమమన్న స్పృహతోే

ఉండాలన్నదే నీ వాదన. నీ భాష సరళంగా ఉంటుంది. భావాల గాఢత ఎక్కువ. నీకూ, ప్రపంచానికీ మధ్య మాటల వంతెనగా కవిత్వాన్ని కట్టుకున్నావ్‌. ఆలోచనాత్మకమైన కథలు రాశావు. ‘మృగన’ నీ కవిత్వ సంపుటి కూడా మారిన రాజకీయాల నేపథ్యంలో వచ్చిన అద్భుతమైన పుస్తకం. ‘వంటిల్లు’ కవిత గొప్ప సంచలనాన్ని తీసుకొచ్చింది. ‘సౌందర్యాత్మక హింస’ అద్భుతమైన కవిత అది. స్త్రీల శ్రమను ‘వంటిల్లు’ ఎలా దోపిడీ చేస్తుందో, బయటపెట్టావీ కవితలో. ‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి / అయినా, వంటింటి గిన్నెలన్నింటిపైనా మా నాన్న పేరే ‘అనేశావు. / ధ్వంసం చేద్దాం రండి / ఇక గిన్నెలపై ఎవరి పేర్లూ వద్ద’ని చెప్పేశావు. ఆ స్ఫూర్తితో, ‘పాత కట్టడాలెప్పటికైనా కూలిపోతాయి’ అని నేను కూడా ఒక కవిత రాసినట్లు గుర్తు. నీలో

ఉన్న ఆవేశం, ఆగ్రహం, ఆలోచన, కార్యాచరణ, ధిక్కార స్వరం, నిర్భయ ప్రకటన, నిబద్ధత, మానవత్వం ఇవన్నీ ఒక జలపాతపు హోరులా కలగలిసిపోయి సాహిత్యంలో ప్రవాహరూపాన్ని తీసుకొచ్చాయి. కవితలు కూడా చాలా పెద్దగా ఉండి అలా అలా ప్రవహిస్తూనే పోతుంటాయి. ఆ నీటి హోరులో కలగలిసిపోతాయి. ఆ మధ్యన స్ట్రీట్‌ చిల్డ్రన్‌ మీద ఓ కథ రాశావు గుర్తుందా? చదివి చాలా డిస్టర్బ్‌ అయ్యాను. విమలా! ఇంతటి దుఃఖాల్ని ఎలా మోయగలం? ఇంతింత అన్యాయాల్నీ, అసమానతల్నీ ఎలా ఎదుర్కోగలం అన్పిస్తుంది. అదిగో అలా నిరాశ నన్నావరించినప్పుడు ఆశలా నువ్వు మొలకెత్తుకుంటూ వస్తుంటావ్‌.

 

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.