అనారక్షిత అపవాదు
సముద్రంలోకి
అగ్ని పునీత సీతను
అనుక్షణం నెడుతున్న
అనాగరిక హోరు
లంగరు కోసం
వెతుకులాటలో
ఏకాకి నౌకలా
మధ్య తరగతి
ఒంటరి గృహిణి
ఎంత చదువుకున్నా
సమాంతర పై స్థాయి
ఉద్యోగ హోదాలు వెలగబెడుతున్నా
పిల్లి ఎలుక వివాహ
చెలగాట చట్రంలో
కలిసి ఉన్నా నరకమే…
లేకున్నా భయమే…
మొగుడు వదిలేస్తాడన్నా
భయమే…
మొగుడ్ని వదిలేసిందన్నా
భయమే…
భయాల చీకటి నీడల్లో
రక్తంలో రక్తంగా
పుట్టుకొచ్చిన
పిల్లల భవితే
జీవన ప్రాణాలు
రెక్కలు తొడిగిన పిల్లలకు
కెరీరే పరుగులాటైన
ఆధునిక కాల ధర్మంలో
గృహిణి అస్తిత్వానికి
లంగరెక్కడ..?
ఉనికినే మరచిన
అస్వతంత్ర ప్రయాణం
హోరుగాలిలో ఎంతకాలం…?
సమాజం కోరుకునే
ఆదర్శ గృహిణి ఆత్మవంచనకు
చెల్లుచీటీ రాయక తప్పదు
చరిత్ర తిరగరాయాలంటే
ముందు వ్యక్తిత్వ తిరుగుబాటుకు
లంగరేయ్
సమున్నత పతాకలా
జీవితపు తెరచాపను
విశ్వాసంతో ఎగరెయ్
ఆత్మస్థయిర్యపు చుక్కానిని
నీకు నీవే చేతబట్టు
మొగుడొచ్చినా రాకున్నా…
పిల్లలైనా దారికొస్తారు
సుద్రుఢ వ్యక్తిత్వ నిర్మాణంతో
భావి పథనిర్దేశకులవుతారు