ఆడదాని మెడలో మూడుముళ్ళు బిగించి
తన సొత్తు అనుకుని పెత్తనం సాగించే
మగరాయుళ్ళ పీచమణచడం
ఫెమినిజమైతే నేనూ ఫెమినిస్టునే !!
మద్యం మత్తులో భార్యను చేపల పులుసు చేయలేదని
చితకబాదిన త్రాగుబోతు భర్తను
తిరిగి తన్నడం ఫెమినిజమైతే
నేనూ ఫెమినిస్టునే !!
తన భార్య పవిత్రంగా ఉండాలి
తాను మాత్రం తిరుగుబోతుగా ఉండాలనుకునే
పుండాకోరులకు బుద్ధిచెప్పడం
ఫెమినిజమైనే నేనూ ఫెమినిస్టునే !!
అడుగడుగునా రాచి రంపాన పెడుతూ
శంకలతో వంకలు వెదుకుతూ
భార్యలోని ప్రతిభను అణచాలని చూసేవాడిని
ఎదిరించడమే ఫెమినిజమైతే
నేనూ ఫెమినిస్టునే !!
పెళ్ళినాటి ప్రమాణాలను తుంగలో తొక్కి
అధిక కట్నానికై హత్యలు చేస్తూ
శిక్షలు తప్పించుకు తిరుగుతున్న హంతకులను
రాళ్ళతో కొట్టి చంపాలనడం ఫెమినిజమైనే
నేనూ ఫెమినిస్టునే !!-