మనిషి నదిలా ప్రవహించడం నేర్చినట్లు
మట్టిమీద పూర్తిగా విస్తరించుకున్నట్లు
చేతుల్ని విశాలం చేసి ఎదుటి మనిషిని
ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నట్లు కలగంటాను
యుద్ధాల్ని బహిష్కరించిన నేలలన్నీ చిగురించి
మనుషులు పువ్వుల పక్కనే నడుస్తూ
రాత్రింబవళ్ళని పలకరిస్తూ వెళ్తున్నట్లు కల
స్పష్టంగా ఎప్పుడూ చూడలేదు మనిషిని
దీపాలు ముట్టించినాక
సూర్యుడు ఉదయించిన తర్వాత
దివ్యతేజంతో ప్రేమని జోలెలో కట్టుకుని
తిరుగాడుతున్న మనిషిని కలగంటాను
అసంపూర్తి గీతాలవుతున్నాయి బతుకులు
ప్రేమని గుండెలోకి ఆహ్వానించడం చేతగాక
తెగిన చేతులతో నిలబడిన దేహాలు
ప్రపంచం నిండా నిండిపోయున్నాయి
జీవించడం నేర్చిన మనుషులు కావాలి
జన్మిస్తూ మరణించడమే జాతి చరిత్ర కాదు
పల్లవిస్తూ ప్రపంచాన్ని ప్రేమిస్తూ
ఎప్పటికీ బతికుండడమే నిజమైన బతుకు
జనంకోసం జనంలోంచి
ప్రేమగా చిగురించిన మనిషికోసం కలగంటాను.