ఒక స్త్రీ కేరింతల దేహ సముద్రం
మరో స్త్రీ దుఃఖపు తీరం
సంగీతాల సవ్వడిని మర్చిపోయిన భర్తలు
గురువులు నోటికి వేసిన సంకెళ్ళను
తమ భవిష్యత్తుకు తొడుక్కున్న
క్రమశిక్షణ లేని పిల్లలు
బెదరగొడ్తున్న భవిష్యత్తు
ఆమెకు ఓదార్చడమే తెలుసు
చీల్చి చెండాడటం
నిన్న మొన్నటిదాకా తెలీదు
ఇప్పుడు స్త్రీ భూమిని చిమ్ముతోంది.
సముద్రాన్ని కడుగుతోంది
నింగి దాటి ఎగురుతోంది
ఒకానొక అదృశ్యశక్తి
దృశ్యమై నిలిచినప్పుడు
స్త్రీ ఎదిగింది అనరు
బరితెగించింది అంటారు
పురుషుడి గుండెల్లో
భయం బీజం మొలకెత్తింది కదా మరి.