ఈ సమయంలోనే ప్రెస్‌బిల్ విషయంలో భారత ప్రభుత్వం ఒక బిల్లు తేవాలని అనుకుంది. ప్రెస్‌కి సంబంధించిన వాళ్ళందరూ ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు మద్దతు ఇచ్చాయి. నేను పాట్నా, హజారీబాగ్‌ల ధర్నాలలో పాల్గొన్నాను. సెషన్‌లో కూడా ఈ విషయానికి సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తారు. మర్నాడు దీనిపై చర్చ జరపాలి. ముందురోజే సెషన్‌కి వెళ్ళే సమయంలో నేను నా బ్యాగ్‌లో చీర, గాజులు పెట్టుకున్నాను. చీరతీసి అధ్యక్షుడిపై పడేశాను. చీర తిరుగుతున్న ఫ్యాన్‌లో చిక్కుకుని చివరికి అది అధ్యక్షుడిపై పడింది. నేను గాజుల బండిల్‌ను అధ్యక్షుడి పక్కన నిల్చుని ఉన్న అంగరక్షకుడికి ఇచ్చాను. అతను దాన్ని అధ్యక్షుడికి ఇవ్వగా ఆయన తెరిచి చూశారు. అది గాజుల బండిల్… సభలో అంతా నిశ్శబ్దం వ్యాపించింది. దీంతో ఆయన సెషన్ మూసేసి తన ఛాంబర్‌లోకి వెళ్ళిపోయారు. పైన గ్యాలరీలో ప్రెస్ ప్రతినిధి చూస్తున్నారు. గ్యాలరీ పూర్తిగా నిండిపోయి ఉంది. ఎందుకంటే ప్రెస్‌బిల్లుపై చర్చ జరపాలి. నేను ఇంటికి వెళ్ళిపోయాను. జ్ఞానేంద్రపతికి జరిగినదంతా చెప్పాను. అంతా విన్నాక ”చీర, గాజులు ఇచ్చి నీవు అధ్యక్షుడి ద్వారా ప్రభుత్వానికి పిరికి పంద అని చెంపపెట్టు పెట్టావు, అవమానించావు, కానీ ఈ వస్తువులు స్త్రీలకు ప్రతీకలు. నీవు చీర, గాజులు ఇచ్చి స్త్రీలనే అవమానించావు. నీవు ప్రభుత్వానికి ఇదే చెప్పావు. ప్రభుత్వం కూడా స్త్రీలలాగా పిరికిది, బలహీనురాలు అని. ఇదా నువ్వు ప్రభుత్వానికి ఇచ్చే సందేశం” అన్నారాయన.
నేను ఆలోచనలో పడ్డాను. పురుషుల ప్రభావం మనమీద ఎంతగానో ఉంటుంది. అందుకే వాళ్ళలాగా ఆలోచించి వాళ్ళలాగానే పనిచేస్తాం. తెలియకుండానే ఆడవాళ్ళు కూడా తమని తాము తిట్టుకుంటూ ఉంటారు. ఆ రోజు నుండి నా మనస్సులో ఈ విషయం నాటుకుపోయింది. అప్పటినుండి స్త్రీల చిహ్నాలను పిరికితనానికి ప్రతీకగా నేను ఎప్పుడూ వాడలేదు. ఆడదానికి మాత్రమే వర్తించే తిట్లన్నీ నేను తిట్టడం మానేశాను. విచారకరమైన విషయం ఏంటంటే తిట్లన్నీ స్త్రీలను దృష్టిలో పెట్టుకునే తయారుచేశారు. నిజానికి ”హరామ్‌జాదే” అంటే పురుషుడిని తిట్టినట్లు అనుకుంటారు. కానీ పురుషుడిని కాకుండా స్త్రీకే చెందుతుంది ఈ తిట్టు. ”ఉల్లూ (గుడ్లగూబ) కా పఠా” అంటే తండ్రిని సంభోదిస్తూ తిట్టే తిట్టు. తండ్రి ఉల్లూ అని అర్థం.
మర్నాడు అధ్యక్షుడు నన్ను ఛాంబర్‌లోకి పిలిచారు. ”మీరు కాబట్టి నేను ఏమీ అనలేదు. మీ బదులు మరొకరు అయి ఉంటే అవమానించారని కేసు పెట్టేవాడిని” అన్నారు.
… … …
నేను నా మాటను ఒప్పించడానికి సభలో ”వెల్” లోపలికి రావల్సి వచ్చేది, టేబుల్‌మీద ఎక్కి అరవాల్సి వచ్చేది. ఇలాంటి సందర్భాలు ఎన్నో వచ్చాయి. నాకు ముందు సాధారణంగా ఏ స్త్రీ సభ్యురాలు ఇలా చేయలేదు. కానీ నేను వ్యతిరేకతను ప్రదర్శించడానికి ఈ పరంపరని మొదలుపెట్టాను. లేకపోతే మా మాట వినే నాధుడు ఎవడూ ఉండడు. స్త్రీకి ఒక్కొక్కసారి సిగ్గులేకుండా కూడా ప్రవర్తించాల్సి వస్తుంది. పురుషుడు ధైర్యవంతురాలైన స్త్రీని చూస్తే సహించలేడు. నాకు ఇంకా గుర్తుంది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సభ వెల్‌లో ఉన్నారు. కర్పూరీగారు కూడా ఉన్నారు. నేను కూడా ఉన్నాను. నేను బల్ల మీదికి ఎక్కి అరవడం మొదలుపెట్టాను. ఎందుకంటే కింద నిల్చుంటే గుంపులో ఎక్కడ నలిగిపోతానో అని భయం. అధికార పార్టీవాళ్ళు కూడా సీట్లమీద నుండి లేచి బల్లలెక్కి ప్రతిపక్ష పార్టీవాళ్ళకు ఎదురుగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వాడిగా-వేడిగా చర్చలు మొదలయ్యాయి. ఇంతలోనే రఘునాధ్ ఝా (ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తర్వాత సమతా పార్టీకి అధ్యక్షులయ్యారు. ఇప్పుడు ఎం.పి.గా ఉన్నారు) నన్ను సంభోదిస్తూ చప్పట్లు కొడుతూ ”నాచ్ నచనియా నాచ్…” (ఆడవే బొమ్మా ఆడు) అంటూ అరవడం మొదలుపెట్టారు.
నేను బల్లమీద నుండి దిగలేదు. ఒకవేళ దిగితే, నినాదాలు ఆపేస్తే ఆయన ఆశయం పూర్తవుతుంది.
నేను ఇంకా పెద్దగా అరవడం మొదలుపెట్టాను. ప్రతిపక్ష పార్టీవాళ్ళు నాకు మద్దతిస్తూ ఇంకా పెద్దగా అరవసాగారు. అధికార పార్టీ వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, వ్యంగ్య బాణాలు విసురుతున్నారు. తర్వాత అధ్యక్షుడి ఆదేశంతో ఇదంతా ఆగిపోయింది. కానీ నా స్మృతిలో నుంచి మాత్రం ఈ సంఘటనలను తొలగించడం కష్టం.
అధ్యక్షుడు సభను వాయిదా వేశారు. కానీ సభలో అధికార పార్టీ, ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మధ్య చర్చ నడుస్తూనే ఉంది. కర్పూరీగారు ఎప్పుడూ నాకు ధైర్యం చెబుతూనే ఉన్నారు. మున్షీలాల్ రాయ్ నన్ను ఎంతో నిరుత్సాహపరిచేవారు. లాల్ యాదవ్ ఆ రోజుల్లో నా పక్క బెంచీలో కూర్చునేవారు. ఆ బెంచీమీద రామ్‌లఖన్ యాదవ్, నామ్‌ధారీ సింహ్ (వీరు తర్వాత లాలూతో విడిపోయారు) నాకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. వృషిణ్ పటేల్ గణేష్ యాదవ్‌తో పాటు ఉండేవారు. మున్షీలాల్ రాయ్ లోపలి నుండి కర్పూరీ గారికి ఎప్పుడూ వ్యతిరేకే. కర్పూరీగారు ఆయనను విధానసభకు అధ్యక్షుడిగా చేయాలనుకున్నారు. కానీ మున్షీలాల్ రాయ్ ఆయనతోపాటు
ఉంటూ వెనుక గోతులు తవ్వేవారు. ఆ రోజుల్లో శివనందన్ పాశ్వాన్ ఎంతో నమ్మకమైన దళిత నేత.
లాబీకి హిమాన్షుగారిని ఉపాధ్యక్షునిగా చేయాలన్న అభిప్రాయం ఉండేది. మేమందరం కర్పూరీగారితో పాటు
ఉండేవాళ్ళం. నేను ధైర్యస్థురాలిని. మాటకారిని కూడా. అందుకే నన్ను అందరూ వ్యతిరేకించేవారు. శ్రీ బాబు (శ్రీ కృష్ణ సింహ్) కుమారుడు నరేంద్ర నన్ను వ్యతిరేకించేవారు. ఆయన తండ్రిని నేను నా యూనియన్ లోనుంచి తీసేశాను. ఆయన గోపాల్ సింహ్‌తో కలిసి నాకు వ్యతిరేకంగా మాట్లాడేవారు.
ప్రణవ్ ఛటర్జీ బతికి ఉన్నన్ని రోజులు మాకు సంరక్షణ ఇచ్చారు. దాని తర్వాత కర్పూరీగారు ఒంటరివారు అయిపోయారు. ఆయనకి జనసమర్ధన చాలా ఉంది. కానీ కొందరు అతితెలివి ప్రదర్శించేవాళ్ళు ఆయనని ఇష్టపడేవాళ్ళు కాదు. కొంతమంది తమంతటివారు లేరనే అహంతో ఉండేవారు. అసలు తాము కర్పూరీగారిని తమ తెలివితేటలతో ఎందుకు ఓడించలేకపోతున్నామా అని కుళ్ళుకునేవాళ్ళు. నేతృత్వానికి కేవలం తెలివితేటలే పనికిరావు. గెలవడానికి ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలి. దానిపట్ల నమ్మకముండాలి. పార్టీలోని ఈ అతితెలివి వాళ్ళు భూస్వామ్య మనస్తత్వం ఉన్నవాళ్ళు. జననాయకుడు అంటే కేవలం కర్పూరీగారే. ఆయన తర్వాత బీహార్‌కి ఏ జననాయకుడూ దొరకలేదు. లాలూగారి రూపంలో బీహార్‌లో ఒక జననేత ఉన్నారు. లేకపోతే బీహార్ కౌరవ-పాండవ యుద్ధ స్థలమయ్యేది. లేకపోతే దస్యు యుగం అయ్యేది. బీహార్ నరసంహార భూమిగా మారింది. కానీ బీహార్ ప్రజలలో చైతన్యం వచ్చింది. ఉన్నత కులాలు, ఉన్నత వర్గాల భూస్వామ్య మనస్తత్వం గల నేతలతో తలబడుతోంది. మండల్ కమిషన్ నిర్ణయం, లాలూ యాదవ్ నక్సల్స్ ఉద్యమం… ఈ రెండు శక్తుల కలయిక ప్రభావం వలన జనానికి నమ్మకం కలిగింది. స్వాతంత్య్రం వచ్చిన 56 సంవత్సరాల తర్వాత వరకు రాజ్యం చేసిన కాంగ్రెస్ ప్రజలలో ఆత్మాభిమానాన్ని, విశ్వాసాన్ని తేలేకపోయింది.
సోషలిస్టులు ‘పిఛడే పావ్ సౌమే సాఠ్’ (వెనకబడ్డ చరణాలు – వందలో అరవై) నినాదంతో బీహార్‌లో అంతో ఇంతో చైతన్యం తెచ్చారు. జాగ్రత్త పడకపోతే ఈ కులాల పాలసీని వెనకబడ్డ వర్గం వాళ్ళలో పైకి వచ్చిన వర్గాలవాళ్ళు హైజాక్ చేస్తారని లోహియా గారు అన్నారు. బీహార్‌లో ఆయన మాట నిజమయింది కూడా. ‘పిఛడే పావ్ సౌమే సాఠ్’ ఉద్యమంలో దళితులు కూడా ఉన్నారు. కానీ వ్యావహారికంగా వెనకబడిన వాళ్ళు, దళితులు తమ తమ కులాల వాళ్ళ బలాన్ని పెంచడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ‘కులం లేని సమాజం’ ఉద్యమం పొంగు తగ్గిపోయింది. ‘కులాల బలం’ ఉద్యమం ఆరంభమయింది. లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళలో దృఢ విశ్వాసాన్ని పెంచారు. లాలూగారి గ్రూపులో కర్పూరీగారిని విరోధించేవారే ఎక్కువ ఉన్నారు. తర్వాత లాలూగారు కర్పూరీగారి గ్రూప్‌లోకి వచ్చేశారు. ఆయన స్నేహితులు కూడా ఆయనతోపాటు కర్పూరీగారి గ్రూప్‌లోకి వెళ్ళగా మరికొందరు ఆయన్ని వదిలేశారు.
… … …
కాంగ్రెస్ లేని ప్రభుత్వం ఏర్పాటు – నా భూమిక
నా సహాయంతో ఎన్నో పెద్ద పెద్ద పనులు జరిగేవి. వీటిని గురించి చాలా తక్కువమందికి తెలుసు. ఒకటి, రెండు సంఘటనల గురించి వివరిస్తాను. బీహార్‌లో సంవిద ప్రభుత్వం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో చీలికలు వచ్చాయి. భోలా పాశ్వాన్ శాస్త్రి బీహార్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. కానీ ప్రభుత్వం పడిపోలేదు. వారు గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక ప్రస్తావన వచ్చింది. శాస్త్రిగారు కాంగ్రెస్‌కి రాజీనామా ఇచ్చి ప్రతిపక్ష పార్టీతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి దానికి నేతృత్వం వహించాలని అన్నారు. కానీ ఏమీ జరగలేదు. ఒకరోజు ప్రణవ్ ఛటర్జీ (సంయుక్త సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు) నన్ను పిలిచారు. అక్కడ పి.కె.మిశ్రా (బీహార్ విధానసభ సభ్యుడు, తర్వాత మంత్రి అయ్యారు) కూర్చుని ఉన్నారు. ఆయన మొదట కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ప్రణవ్ నాతో అన్నారు – ”రమణికగారూ! కర్పూరీగారు మీకు ఒక పని చెప్పారు. మీరు భోలా పాశ్వాన్ శాస్త్రి గారిని, కృష్ణ సింహ్ గారిని కలవాలి. వారు తమ రాజీనామాని ఇవ్వాళే పంపించేయాలి. దీనివల్ల బీహార్‌లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది”.
తర్వాత మిశ్రాగారు ”రమణిక గారూ! మీరు మొదట కాంగ్రెస్‌లో ఉన్నారు. బి.పి.సి.పి. మెంబర్‌గా కూడా ఉన్నారు. మీకు అందరూ తెలుసు. మీరు అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటో కనుక్కోండి” అన్నారు.
మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది. నేను వెంటనే రిక్షాలో శాస్త్రిగారి ఇంటికి వెళ్ళాను. నేను లోహియాగారి మీద ఆర్టికల్ రాయాలనుకుంటున్నానని చెప్పాను. నేను శాస్త్రి గారితో ”మీకు లోహియాగారి పట్ల ఎంతో గౌరవం ఉంది. ఆయనలాగా స్త్రీల పట్ల మీకు గౌరవం కూడా ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను. లోహియాగారి వర్థంతికి మీ ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని వార్తా పత్రికల కోసం ఒక ఆర్టికల్ రాస్తాను” అన్నాను.
శాస్త్రిగారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మాటల్లో మాలవీయ్ గారి గురించి చర్చ వచ్చింది. మాలవీయ్ గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ నుండి బయటికి వచ్చేశారు. ”పాపపు కుండ నిండిపోతే కృష్ణుడు అవతారమెత్తుతాడని అందరూ అంటారు. నిజానికి కృష్ణుడు కాదు, వాళ్ళ మనసుల్లో క్రాంతి భావన వస్తుంది. ఈ క్రాంతి భావనే కృష్ణుడు. ఇప్పుడు కాంగ్రెస్ పాపపు కుండ నిండిపోయింది. ఇక ఇప్పుడు కృష్ణుడు భూమికను మీరు నిర్వహిస్తారో లేదో మీ మీద ఆధారపడి ఉంది” అన్నాను.
శాస్త్రిగారు ఆలోచనలో పడ్డారు. ”అందరూ కాంగ్రెస్‌ని వదలి వెళ్ళిపోతున్నారు. మర్యాదస్తుడెవరూ ఇంక ఆ పార్టీలో ఉండలేరు. మాలవీయ గారు కూడా వెళ్ళిపోయారు. రమణికగారు ఎంతో చదువుకున్న విదూషీమణి. వీరికి కూడా కాంగ్రెస్ పార్టీని వదిలివేయాల్సి వచ్చింది. నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు రాజీనామా ఇచ్చేస్తాను” అన్నారు.
ఇంతలో ఆయన పిఏ వచ్చాడు. అపాయింట్‌మెంట్ ఇచ్చారని, అక్కడికి వెళ్ళాలని గుర్తుచేశాడు. నా పని అయిపోయింది. నేను లేస్తూ ”ఫర్వాలేదు, నేను మిమ్మల్ని మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఇప్పుడు కర్పూరీ ఠాకూర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అభిప్రాయం తెలుసుకోవాలి” అన్నాను.
నేను వెనక్కి వచ్చాను. ”రాజీనామా వచ్చేస్తుంది. మీరు ఠాకూర్‌గారిని ఆయనతో మాట్లాడమని చెప్పండి” అని ప్రణవ్‌గారితో చెప్పాను.
శాస్త్రిగారు ఆ రోజు రాజీనామా పంపించేశారు.
నేను సాయంత్రం కృష్ణకాంత్ సింహ్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన రాజకీయాలలో ఎప్పుడూ నావైపే నిలిచారు. రాజ్‌పూత్ లాబీ ఒత్తిడివలన బాబూ సత్యేంద్ర నారాయణ్ సింహ్ శిష్యులు నన్ను ఎంతో వ్యతిరేకించేవారు. కృష్ణకాంత్ సింహ్ నా పక్షం వహించేవారు. కృష్ణ వల్లభ్ సహాయ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోని మాట ఇది. నేను కృష్ణకాంత్ గారితో సరాసరి మాట్లాడాను. ”మీరు ఏదైనా నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదు. మీరు చేస్తున్న ఆలస్యం వలన అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి” అన్నాను.
నా మాటను మన్నిస్తూ ఆయన అదేరోజు రాజీనామా పంపిస్తానని చెప్పారు. భోలా పాశ్వాన్ నేతృత్వంలో బీహార్‌లో సంవిద్ కాంగ్రెస్ లేని ప్రభుత్వం ఏర్పాటయింది.
… … …
స్త్రీల పట్ల, పత్రికలు – పార్టీల అభిప్రాయం
స్త్రీల పట్ల స్త్రీల అభిప్రాయం
పత్రికల వైఖరి :-
మహిళా నేతల పట్ల పత్రికల వారి వైఖరి వింతగా ఉంటుంది. వాళ్ళు కూడా అవకాశమిస్తే చాలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. కొంతమంది పత్రికా విలేఖరులు నేతల పట్ల విపరీతమైన అభిమానం చూపిస్తారు. ప్రారంభంలో పత్రికల వాళ్ళు నన్ను చాలా తిప్పలు పెట్టారు. రాజకీయాలలోకి వచ్చే మహిళలను అందరూ ఏదో తినే వస్తువుగా చూస్తారు. ఆకలేస్తే తమకు తినే హక్కు ఉందని అనుకుంటారు. వార్తలలో వచ్చే నేతలను చాలా వేధిస్తారు. వాళ్ళు పురుషులైనా, స్త్రీలయినా సరే. పురుషులను ఆర్థికంగా వేధిస్తే మహిళలను శారీరకంగా వేధిస్తారు. నేను పెద్ద పెద్ద రాజకీయ నాయకులను పత్రికల వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేయడం చూశాను. (నేను నా ఆత్మకథలో వివరణ ఇచ్చాను. అది త్వరలో ప్రచురణ కాబోతోంది) మహిళా నేతలను, ఎమ్మెల్యేలను, మంత్రులను బ్లాక్‌మెయిల్ చేస్తారు. మహిళలు కూడా స్వయంగా శోషణకి గురికావడానికి దోహదపడతారు. వార్తలకెక్కాలన్న కోరికతో పత్రికల వారితో వ్యాపారం చేయడానికి కూడా వెనుకాడరు. నిజానికి ఇటువంటి పరిస్థితులు కల్పించేది పత్రికల వాళ్ళే.
పత్రికల వాళ్ళు సినిమాలలోని మహిళా యాక్టర్లతో ఎవరో ఒక నేతకు సంబంధాలు అంటగడుతూ ఉన్నవీ, లేనివీ కల్పించి రాస్తారు. నేను ఎవరిని కలిసినా, నా మిత్రులతో సంబంధాలు ఉన్నా ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు. మీడియాకి ఎవరినైనా సరే పట్టుబడేలా ప్రయత్నించి బ్లాక్‌మెయిల్ చేసే స్వభావం ఉంటుంది. ఎక్స్‌పోజ్ చేసి వారిని సరిచేద్దామన్న ఉద్దేశ్యం ఉండదు. రాజకీయంగా మనం స్వతంత్రులమయ్యాం. వేషభాషలు మారాయి. కానీ ఆలోచనా విధానంలో ముఖ్యంగా మహిళల పట్ల, లైంగికపరమైన విషయాలలో మన మనస్తత్వం మధ్యతరగతి వాళ్ళదే. నిజం చెప్పాలంటే 16వ శతాబ్ద మనస్తత్వమే ఇంకా మనలో ఉంది. మనం సూడో మోడరన్ కానీ మోడరన్ కాదు. అవతలి వాళ్ళను అవమానించడానికి వాళ్ళను ముందు డీమోరలైజ్ చేస్తారు. తర్వాత షరతులు పెడతారు. బూర్జువా రాజకీయ నాయకుల విషయంలో పత్రికల వాళ్ళ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 60, 70 లలో పత్రికల వారి మనస్తత్వం ఇలాగే ఉండేది. 80’ల తర్వాత వారి మనస్తత్వాలలో కొంచెం మార్పు వచ్చింది. ఇది మంచికేనా అంటే అదీ ఖచ్చితంగా చెప్పలేం. నాకు ఒక పత్రికా విలేఖరి ముఖం ఇంకా గుర్తుంది. అతడు ప్రతి మహిళా నేతల నిజజీవితంలోని సంబంధాలను తెలుసుకుని వాళ్ళతో తానూ సంబంధం పెట్టుకోవాలని చూసేవాడు.
మా ఉద్యమాల విషయంలో కూడా పత్రికల వాళ్ళు వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. నేను ఒక్కదాన్నే ఉద్యమాన్ని మొదలుపెట్టాను. అందువల్లే ట్రేడ్ యూనియన్ ఉద్యమాల వల్ల హజారీబాగ్‌లోని కొందరు పెద్ద పెద్ద పత్రికా విలేకరులకు ఎన్నో లాభాలు కలిగాయి. నేను సరాసరి రాజకీయ రంగంలో దిగలేదు. అందువల్ల నాకు ఇదంతా కొత్తగా అనిపించేది. ఒకసారి ఒక విలేఖరి నాతో ”మీకు సంబంధించిన వార్తలు ప్రచురిస్తే మీకేగా లాభం” అన్నాడు. దానికి సమాధానంగా నేను ”మీరు స్థానికుల గురించి, అణగదొక్కబడిన వారి గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతారుగా. అసలు వార్తలను సేకరించాలనేగా మిమ్మల్ని నియమించారు. మీరు వార్తలు ప్రచురించకపోతే నాకేం నష్టంలేదు. నిజమైన, విలువైన వార్తలు ప్రచురించకపోతే మీకే నష్టం. నేను ఎవరికోసం అయితే పోరాడుతున్నానో వాళ్ళు మీ పత్రిక ఎటూ చదవరు. అసలు చదవడం రాదు. హజారీబాగ్‌లో పత్రికలు చదివే వాళ్ళందరూ మమ్మల్ని శత్రువులుగా చూసేవాళ్ళే. మీకు విలువైనదిగా అనిపిస్తే ప్రచురించండి. లేకపోతే మానేయండి” అన్నాను.
మా ఉద్యమం విలువ రోజురోజుకీ పెరిగిపోతోంది. వాళ్ళు వార్తలను చచ్చినట్లు ప్రచురించాల్సి వచ్చింది. ఆ రోజుల్లో పత్రికా విలేఖరి రాజేంద్ర రాణా స్థానికులకు ఉపాధి కల్పించాలని పోరాటం చేశారు. నేను కూడా స్థానికుల కోసం ఎంతో పోరాడాను. కానీ పత్రికల వాళ్ళు మా ఉద్యమాలకి సంబంధించిన వాస్తవమైన వార్తలు ప్రచురించేవారు కాదు.
బూర్జువా పార్టీలు – మహిళలు:-
బూర్జువా పార్టీలలోని రాజకీయాలలో మహిళలను ”ఫర్ గ్రాంటెడ్”గానే తీసుకుంటారు. ఎదురుగా మాత్రం వారి ధైర్యానికి మెచ్చుకుంటుంటారు. విశృంఖలంగా ఉండడం తప్పేమీ కాదని చెబుతూ విశృంఖలంగా నడవడానికి ప్రోత్సహిస్తూ, వాళ్ళ వెనుక ఆ మహిళను కులట అంటూ తిట్ల వర్షం కురిపిస్తారు. తమ తమ కుటుంబాలలోని మహిళలను ఎంత మాత్రం వీళ్ళతో కలవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా ప్రవర్తిస్తారేమోనని వీళ్ళ భయం. నేను నేతల భార్యలతో స్నేహంగా
ఉండేదాన్ని. కనీసం ఇళ్ళల్లో నాకు డిఫెన్స్ చేస్తారన్న ఉద్దేశ్యం కూడా ఉండేది. లెఫ్టిస్టుల పార్టీలలో స్త్రీల గురించి ఇంత నీచంగా అనుకోవడం, చూడడం అనేవి ఉండేవి కాదు. ఒక సహజమైన వాతావరణం
ఉండేది. అక్కడ ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం కన్నా, చరిత్ర హీనులు అంటూ అవమానపరచడం కన్నా కలిసికట్టుగా పని చేస్తారు. అక్కడ కూడా స్త్రీల పట్ల బూర్జువా, భూస్వామ్య మనస్తత్వం ఉంటూనే
ఉంటుంది. ఇవి స్త్రీ అభివృద్ధి చెందకుండా అడ్డుపడతాయి. ముఖ్యంగా మహిళ ఒక్కతే ఉద్యమం చేపట్టిందంటే ఎవరూ సహించలేరు. పార్టీలోని వరిష్టులైన వారు యూనిట్ క్లాస్ తీసుకుని కేడర్‌లోని అనుమానాలను దూరం చేస్తారు. సంఘం ఆచారాలు, కట్టుబాట్లు, గుడ్డి నమ్మకాలు, దళతులు, ఆదివాసీలు, అల్ప సంఖ్యాకుల విషయంలో, స్త్రీల విషయంలో వీటి ప్రభావం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ సరిహద్దులను వాళ్ళు దాటలేరు. పార్టీల ద్వారా కొంత ఈ దిశవైపు ప్రయత్నం చేయాలి. చేయాల్సిన పని చాలా ఉంది.
రాజకీయాలలో ఏ స్త్రీ అయినా నిలదొక్కుకుంది అంటే ఆమె సహన శక్తే దానికి కారణం. దీనివల్ల ఆమెకు పేరు, ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అక్కడ స్త్రీ, పురుషుడు అనే భేదం ఉండదు. ఆమె వ్యక్తిత్వం చూసి ఎదుటివాళ్ళు భయపడతారు. ఇవన్నీ ఆమెకు కొంత రక్షణ కల్పిస్తాయి.
నేను ఏ పురుష వర్గం విషయం మాట్లాడుతున్నానో వాళ్ళు నేతృత్వం విషయంలో పోటీలు పడుతుంటారు. ఒక్కొక్కసారి వీళ్ళకి స్త్రీ చేయూతనిస్తుంది. ఒకవేళ ఈ వర్గం పురుషులు తాము అనుకున్నది చేయలేకపోతే ఛాన్స్ దొరికితే కాటు వేస్తారు, భస్మాసురుడిలా ప్రవర్తిస్తారు. ఇక వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధం ఒక్కటే. స్త్రీలను చరిత్ర హీనులుగా ప్రచారం చేయడం. ఇటువంటి వాళ్ళతో కఠోరంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ‘పునః మూర్షికోభవ’ ఫార్ములా అప్లై చేయాలి. నిజానికి ఎవరితోనైతే మధురమైన సంబంధం ఉంటుందో, ఎవరినైతే మిత్రులుగా భావిస్తామో ఆ సంబంధాన్ని, మితృత్వాన్ని వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసినపుడు, చొంగ కార్చుకుంటూ అందరిమధ్య అవమానకరంగా ప్రవర్తించినపుడు చాలా బాధ కలుగుతుంది. ఇటువంటి అనుభవాలు నాకు ఎన్నో కలిగాయి. జీవితంలో చేదు మిగిల్చినా నేనెప్పుడూ ధైర్యం వీడలేదు. వాటిని అంతగా పట్టించుకోనూ లేదు.
స్త్రీల పట్ల స్త్రీల మనస్తత్వం:-
మర్యాదకు భంగం కలుగుతుందన్న భయంతో పురుషులు ఎంత నీచంగా చూసినా, అవమానకరంగా ప్రవర్తించినా స్త్రీలు సహనంతో భరిస్తారు. ”పోనీలే, ఎవడు పోట్లాడతాడు ఈ వెధవతో? వాడి నోరెప్పుడో ఒకప్పుడు మూతపడుతుంది” అని అంటూ పట్టించుకోరు.
సాధారణంగా ఎప్పటిదాకా అయితే వాళ్ళ భార్యలతో, కూతుళ్ళతో ఎవరో ఒకరు అసభ్యంగా ప్రవర్తిస్తారో అప్పటివరకు స్త్రీల పట్ల పురుషులు అశ్లీలంగా ప్రవర్తించినా మౌనంగా ఉంటారు. నేను వాడితో లంపటత్వాన్ని తుడిచి పడేసేదాకా ప్రయత్నించేదాన్ని. ఎంత దూరం పోయినా సరే నేను మౌనంగా ఉండను. ఎందుకంటే మౌనంగా ఉంటే భయపడుతున్నారని, ఒప్పుకుంటారని భావిస్తారు. మిగిలిన వాళ్ళతో కూడా అశ్లీలంగా ప్రవర్తిస్తూనే ఉంటారు. చిన్నప్పుడు నా పట్ల కూడా ఇలాగే ప్రవర్తించారు. అందువల్ల నేను ఆడదాన్ని కనుక భయపడతాను అని వాళ్ళు అనుకునే అవకాశమే రాజకీయాలలో రాకుండా జాగ్రత్తపడ్డాను. దీని వెనుక నాకు రక్షణ లేదు అన్న భావం కూడా కావచ్చును. స్త్రీకి సహజంగా ఉండే సిగ్గు కూడా అయి ఉండవచ్చు. సిగ్గు ఎప్పుడూ పలాయనం చేయడానికి ప్రోత్సహిస్తుంది. లంపటులు, ధూర్తులతో సిగ్గు గిగ్గు వదిలేసి కఠోరంగా ప్రవర్తించాలని నా ఉద్దేశ్యం, లేకపోతే వాళ్ళు లొంగదీసుకుంటూనే ఉంటారు.
పురుషులు స్త్రీలను శిఖండులుగా మార్చి వాళ్ళని గుప్పిట్లోకి తెచ్చుకుంటారు. రాజకీయాలలో మొదట వచ్చిన మహిళలు కొత్తగా వచ్చిన మహిళలపై బురద జల్లుతూ తెలుసో తెలియకో పురుషుల చేతుల్లో ఆయుధాలైపోతారు. బురద చల్లడంలో స్త్రీలు తక్కువవాళ్ళేం కాదు. విద్యావంతులైన స్త్రీలు బురద జల్లడంలో వెనుకంజ వేయరు. ఎవరైనా మహిళా నేత పైకి వస్తోందంటే పురుషులు చూడలేరు. అందుకే ఆమెపై బురద జల్లితే ఇక ఆమె వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ అయిపోతుందని వాళ్ళ ఉద్దేశ్యం. నేను ఇటువంటి నీచులతో ఎంతో పోరాటం చేశాను. అగ్నిపథంలో నడిచాను. రాజకీయాలలో ఎక్కువగా భూస్వామ్య కుటుంబాల నుండి వచ్చిన స్త్రీలే ఉంటారు. కొంతవరకు దళిత కుటుంబాల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మహిళలు లైంగిక శోషణను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్ద కుటుంబాల స్త్రీలకు తమ తమ కుటుంబాల నుండి రక్షణ ఉండడం వల్ల వాళ్ళు కేవలం పెద్దవాళ్ళను సంతృప్తి పరచవలసి ఉంటుంది. తమ కుటుంబ సభ్యులు, భర్తల ఆధ్వర్యంలో ఇదంతా కొనసాగిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద పెద్ద నేతలతో స్నేహంగా ఉంటారు. వెనుకబడిన వర్గం స్త్రీలు చిన్నా, చితకా నేతల ద్వారా పెద్దల దగ్గరికి చేరుతారు. ఎంతో మంది మహిళలకు ఈ విషయంలో తండ్రి, భర్త సహకరిస్తారు. వాళ్ళు ఈ శోషణని పైకి ఎక్కి వచ్చే నిచ్చెన మెట్టుగా భావిస్తారు. ఈ రెండు రకాల వాళ్ళని నేను చూశాను. నేను వాళ్ళలో ఎటువంటి పశ్చాత్తాపము చూడలేదు. కానీ ఏ స్త్రీ అయినా నీతి, నిజాయితీలతో ఉంటూ తన మజిలీకి చేరుకోవాలంటే ”నైనా సహానీ” కావాల్సి వస్తుంది.
పురుషులలో స్త్రీల పట్ల ఎప్పుడూ చులకన భావమే ఉంటుంది. అది వాడితో వెళ్లగా లేనిది నాతో ఎందుకు రాదు? అన్న భావంతో స్త్రీలను అవమానపరుస్తారు. నేను ఇటువంటి నీచపు ఆలోచనను రూపుమాపడానికి ప్రయత్నించాను. పోరాడాను. ఎవడైనా సరే నా మీద అధికారం చూపిస్తే నేను సహించలేదు. ఎవరికీ నేను లొంగలేదు. దీనివల్ల నేను ఎంతో బద్‌నామ్ అయ్యాను. అయినా నేను ధైర్యంగా నిలదొక్కుకున్నాను. ఎవడి ఆటలను సాగనివ్వలేదు. నన్ను ఎన్నో ఎన్నెన్నో ఆశ్లీలమైన మాటలతో అవమానించారు. కానీ నేను చెంప పగలగొట్టి గుణపాఠం నేర్పాను. ”నాకు ఇష్టం లేకుండా ఎవడైనా సరే నా మీద హక్కు ఎట్లా చూపిస్తాడు?” మొదటినుండి దీనికోసమే నాలో పట్టుదల పెరిగింది. నాకు ఇష్టమైతే ఏదైనా సంభవమే. నాకు ఇష్టం లేకపోతే ఛస్తే ఒక్క ఆకు కూడా కదలదు. ఎవరినైనా నాకు ఇష్టం అయితే స్వీకరిస్తాను. నాకు ఇష్టం లేకపోతే ముఖ్యమంత్రిని అయినా సరే నా దగ్గరికి రానివ్వను. ఎవరో ఒకరితో సంబంధముంటే అందరితో సంబంధముండాలన్న అర్థం ఎంతమాత్రం కాదు. కానీ భారతీయ పురుషుడు ఏ స్త్రీతోనైనా ప్రేమ, సంబంధం పెట్టుకుంటే తనకు లైసెన్స్ ఉంది అనుకుని ఆమెపై అధికారం చూపిస్తాడు. దీనివల్లే వాదోపవాదాలు పెరుగుతాయి. స్త్రీ తన రాజకీయ యాత్రలో పురుషుల ఈ ధోరణిని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను ఈ ధోరణి గల పురుషులను ఎదిరించాను. ధైర్యంగా ముందడుగు వేశాను.
… … …
స్త్రీ విముక్తి అంటే పురుషుడ్ని ద్వేషించడం ఎంతమాత్రం కాదు
నేను స్త్రీ విముక్తిని కోరుకుంటాను. కానీ పురుష ప్రపంచాన్ని ఎంత మాత్రం ద్వేషించను. పురుషులు నాకు శత్రువులు కారు. అసలు పురుషులను కాదనుకునే మహిళా ముక్తిని నేను హర్షించను. స్త్రీకి బలహీనత పురుషుడే అని తెలుసు. అలాగే పురుషుడి బలహీనత స్త్రీనే అని కూడా తెలుసు. అందువల్ల స్త్రీ పురుషులిద్దరూ కలిసి నడవాలి. పరస్పర ద్వేషం వలన ప్రేమకూడా పుడుతుంది. రక్షణ లేకపోవడానికి భయానికి కారణం కూడా ఇదే అవుతుంది. అందువల్ల పరస్పర ప్రేమ, ద్వేషం స్వాభావికమే. నేను కేవలం మహిళలకు మాత్రమే నేతృత్వం వహించలేదు. నేను ఒక విశాలమైన శ్రామిక వర్గాన్ని, ఒక విశాలమైన రైతు సంఘాలని, దళితులని, ఆదివాసీలని నాతోపాటు నడిపించాను. వాళ్ళకి నేతృత్వం వహించాను. నిజానికి వీళ్ళలో ఆడదాన్ని ‘డాయన్’ (మంత్రగత్తె) అని చంపేస్తారు, కానీ వీళ్ళలో స్త్రీకి స్వేచ్ఛ కూడా ఎక్కువే ఉంది. పురుషుడికి సమ ఉజ్జీ కూడా ఆమే. సంపాదిస్తుంది, కష్టపడుతుంది. ఈ సమాజంలోని స్త్రీ పురుషులు నాకు ఎంతో ప్రేమను, సముద్రమంత ఉత్సాహాన్ని ఇచ్చారు.
బాదల్ అనే యువకుడు ఉండేవాడు. నామీద లాఠీ దెబ్బ పడుతున్నప్పుడు అతను అడ్డు వచ్చాడు. ఆ దెబ్బ అతడి తలకి తగిలింది. ”అమ్మా! రక్షించుకో!” అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. కేదలా రామచంద్ర నోనియాం అల్లర్లను పురుష సమాజమే చేయించింది. ఒక వ్యక్తి లాఠీ తీసుకుని నేలపైన కొడుతూ వెళ్ళేవాడు. ఎవరైనా ఠేకేదార్లు భూమిలో సొరంగాలు చేసి మందుగుండు సామాను పెట్టారేమోనని చెక్ చేసేవారు. వాళ్ళకు ఏమైనా ఫర్వాలేదు కానీ నాకు, నా కారుకి ఏమీ కాకూడదని ఎంతో జాగ్రత్తపడేవాళ్ళు. ఈ శ్రామిక వర్గం దాదాపు ఒకటిన్నర సంవత్సరంపాటు స్ట్రైక్ చేయడంవల్ల తిండీ తిప్పలు లేకుండా గడిపారు. కుటుంబంలో ఎంతోమంది చనిపోయారు. అయినా తలవంచలేదు, వాళ్ళకి నా మీద ఎంతో నమ్మకం. పలామా అల్లర్లు డిసెంబర్ 4, 1972న జరిగాయి. అదేరోజు స్ట్రైక్ మొదలుపెట్టారు. నన్ను పోలీసుల నుండి రక్షించి వాళ్ళ నివాస స్థానాలకు తీసుకువెళ్ళారు. రాత్రంతా కాపలా కాశారు. సీసాలలో మట్టి, రాళ్ళు నింపి దాడి చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు.
సాధారణంగా పురుషులందరూ సమూహంగా కలిసి ఏదైనా చేయాలనుకున్నప్పుడు స్త్రీ నేతృత్వాన్ని స్వీకరిస్తారు. అక్కడ స్త్రీనా, పురుషుడా అని ఎవరూ పట్టించుకోరు. వాళ్ళు ఆమెని కేవలం నేతగానే చూస్తారు. ఆ స్త్రీలో ధైర్యం ఉందా? నిలదొక్కుకునే శక్తి ఉందా? నేతృత్వం చేయగల సామర్ధ్యం ఉందా? వాళ్ళు స్త్రీలో ఈ గుణాలనే చూస్తారు. నిజానికి స్త్రీలో ఈ గుణాలే ఉండాలి. ఈ గుణాలను చూసి స్త్రీ నేతల పట్ల పురుషులకి గౌరవం పెరుగుతుంది. భారతీయ సమాజంలో స్త్రీని దేవతగా పూజిస్తారు. వ్యావహారికంగా ఎట్లా ప్రవర్తించినా ఏ స్త్రీ అయినా సమూహానికి నేతృత్వం వహించగల సామర్ధ్యం ఉంటే ఆమె పురుషుడి దృష్టిలో దేవత అన్నా అవుతుంది, అమ్మ అన్నా అవుతుంది, నేత అన్నా అవుతుంది. వాళ్ళు ఆ స్త్రీ పట్ల అమితమైన గౌరవం చూపిస్తారు. ఆమెలోని లోపాల వైపున ఏ మాత్రం దృష్టి పెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఆమెపట్ల అదే శ్రద్ధ చూపెట్టి ఆమె ద్వారా తమ తమ మజిలీలను చేరుకోవాలని కలలు కంటారు.
నిజానికి సాధారణ ప్రజలు అంటే సర్వహారావర్గ్. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలు, నమ్మకం వాళ్ళ వాళ్ళ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. శ్రామిక వర్గం వ్యావహారికంగా ఆలోచిస్తుంది. తర్కం చేస్తారు. కానీ వాళ్ళెప్పుడూ దారి మరచిపోరు. వాళ్ళు తమ లక్ష్యాన్ని పొందడానికి కొంత మేరకే భావుకులై ఉంటారు. వాళ్ళు మధ్యమ వర్గం వాళ్ళల్లా లొసుగులు చూడరు. మధ్యవర్గం నుండే నేతృత్వం కేడర్ మొదలవుతుంది. శ్రామిక వర్గం వ్యక్తిగతమైన విషయాలను పట్టించుకోదు, శీలంపై బురద చల్లదు. వ్యక్తులలోని లోపాలు ఎన్నుతూ ఎవరినీ కించపరచదు. ఈ వర్గం నేతలు కేడర్ల నైపుణ్యం, కార్యాచరణలపైన అందరినీ ఒక తాటిపై నడిచేలా చేస్తుంది. అవసరమొస్తే ఎంత అపాయమైనా సరే ముందంజ వేస్తుంది. అప్పుడప్పుడూ ఈ వర్గం వారి ఈ గుణాన్ని సమాజం ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది. కానీ వారిలోని ఈ గుణం సామూహికంగా, వ్యక్తిగతంగా ప్రతి పోరాటానికి మాకు బలాన్ని ఇచ్చింది. ఉద్యమంలో వ్యక్తికన్నా సమాజానికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. శ్రామిక వర్గం వారి ఈ బలం, ఈ నమ్మకం, ఈ శ్రద్ధ నాపైన ఉచ్చు బిగించాలని చూసినవాళ్ళని అణచి నన్ను ముందుకు నడిపించాయి. ఎంతోమంది వ్యక్తులు నా ఉద్యమాలను ఆపించాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ నేను ప్రతి విషయాన్ని ప్రజలలోకి తీసుకువచ్చి వాళ్ళను ఓడించేదాన్ని. నా శీలంపై బురద జల్లడానికి ప్రయత్నించిన వారిని నా వ్యక్తిగతమైన విషయాలను, నాపై మోపబడిన అపనిందల గురించి నేను నా వర్గం వారికి చెప్పేదాన్ని. ఎప్పుడూ ఏదీ దాచలేదు. నాకు ఏ రహస్యాలూ లేవు. నా బలహీనతలనూ నేను దాచలేదు. అందరిలాగానే నేనూ ఒక మనిషినే. వాళ్ళకు ఏ కోరికలు ఉంటాయో నాకూ అవి ఉంటాయి. నా బలహీనతలను శ్రామిక వర్గం అర్థం చేసుకుంది. వాళ్ళ గుడ్డి నమ్మకాలపైన నేను కఠోరంగా మాట్లాడేదాన్ని. అయినా వాళ్ళు ‘అమ్మ ప్రేమగా నాలుగు మొట్టికాయలు మొట్టింది’ అని అంటూ ప్రేమతో నవ్వుకునేవారు. అటువంటి సమయంలో నాకు వీళ్ళలో ఆ మూఢనమ్మకాలని ఎలా పోగొట్టాలో అర్థమయ్యేది కాదు. ఈ విధంగా నేను కోప్పడినా విలువ ఇస్తూ కూడా గుడ్డి నమ్మకాలను వదిలిపెట్టేవాళ్ళు కాదు. నేను ఎంత పోరాటం సలిపినా వీళ్ళలోని మూఢనమ్మకాలను పోగొట్టే సామర్ధ్యం లేకపోయింది. ఇప్పుడనిపిస్తుంది బహుశా శ్రామిక వర్గం పట్ల నాకున్న నమ్మకం, కష్టనష్టాలు ఓర్చుకోవడానికి నాకు ప్రేరణనిచ్చింది. ఏ అపాయాన్నైనా అధిగమించే శక్తి, ధైర్యం, సాహసం, తలవంచని తత్వం మొదలైనవే వాళ్ళలో నా పట్ల భక్తిశ్రద్ధలు కలిగించాయి. నా వ్యక్తిగతమైన శీలం, అందం, స్త్రీ అన్న భావన మాత్రం కాదు. నా తర్కం, దృఢత్వం, నా పట్టుదల మొదలైనవి వాళ్ళకు ప్రేరణ కలిగించాయి. వాళ్ళ నమ్మకం నాకు ప్రేరణ కలిగించింది. నాలో శక్తిని పెంచింది. నా ఈ గుణాలు, నా ఈ వైఖరి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపింది. నా ఈ గుణం శ్రామికులకు లోపల ఉన్న భయాన్ని పోగొట్టేది. నేను నిరాశా నిస్పృహలకు లోనయ్యేలా అవతలివాళ్ళు ఎంత ప్రయత్నించినా నేను పారిపోలేదు. ధైర్యంగా నిల్చుని అన్నింటినీ ఎదిరించాను. నేను పోరాటాల ఫలితంగా ‘అయ్యో నేను స్త్రీనే’ అనే హీన భావన నుండి విముక్తినయ్యాను. నేను ”నేను స్త్రీని” అనే నిజాన్ని స్వీకరిస్తూ పోరాటం చేశాను. నా బలహీనతలను స్త్రీల బలహీనత అని భావించకుండా మనుషుల స్వభావసిద్ధమైన బలహీనతలతో, గుణాలతో జోడించాను. నా గుణాలు-దోషాలను స్త్రీ-పురుషుడు అంటూ వేర్వేరుగా విభజించకుండా మనుష్య-మాత్రుడు అనే బోనులో నిలబెట్టాను. నేను సైకాలజీ విద్యార్థినిని. అందువల్ల ప్రతి విషయాన్ని మనోవైజ్ఞానిక దృష్టితో ఆలోచించడానికి అలవాటు పడ్డాను. ఫ్రాయిడ్ ప్రభావం నా మీద చాలా ఉంది. అందువల్ల లైంగిక సంబంధాలను హీనదృష్టితో చూడలేదు. నేను శారీరక కోరికలను బలహీనతలుగా కాకుండా ప్రకృతి సహజమైనవిగా చూశాను.
చివరిగా ఒక సంఘటన గురించి చెప్పి ఆపేస్తాను. ఒకరోజు ఒక సజ్జనుడు గబగబా నా గదిలోకి వచ్చాడు. అటూ ఇటూ చూస్తూ నా మేలు కోరుకున్నవాడిలా అడిగాడు, ”మీ భర్త మీకు విడాకులిచ్చారని విన్నాను”. నేను కూడా నవ్వుతూ అదే లయలో అన్నాను, ”అవును! ఆయన విడాకులు ఇచ్చేటప్పుడు మిమ్మల్నే పెళ్ళి చేసుకోమని సలహా కూడా ఇచ్చారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా?”.
అంతే! ఆ వ్యక్తి నీరుగారిపోయాడు. తేలు కుట్టిన దొంగలా అయిపోయాడు. ముఖంలో నెత్తుటి చుక్క లేదు. ”చాలా ధైర్యస్థురాలివే” అంటూ లేచి గాడిద తల నుండి కొమ్ములు మాయమైనట్లు మాయమైపోయాడు. ఇదీ ఒక దుర్ఘటనే….
ఎడిటర్స్ నోట్ :- రమణికగుప్త ఆత్మకథను జీవితానుభవాలు శీర్షికన గత 34 నెలలుగా ధారావాహికంగా ప్రచురిస్తున్నాం. ఇది ఈ సంచికతో ముగిసింది. వచ్చే సంచిక నుండి ఇదే శీర్షికన భూమిక తొలినాళ్ళ సంచికల్లో ప్రచురితమైన వివిధ రంగాలకు చెందిన మహిళల జీవితానుభవాలను మరల ప్రచురించదలచాం. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.