రుక్మిణీ గోపాల్ కథలు చదివాను. సమాజంలో వున్న స్త్రీల స్థితిగతులకు సాక్ష్మీభూతంగా నిలిచాయనేది వాస్తవం. ఈ కథల్లో
ఉన్న స్త్రీ పాత్రలన్నీ మనకి తెలిసినవే అన్నట్టు, మన ఇంట్లోనో, మన ఇరుగుపొరుగునో, మన బంధువులలోనో, స్నేహితులలోనో ఎవరో ఒకరు ఉన్నట్లు ఏదో తెలియని అనుభూతి మనసుని కదిలిస్తుంది.
రుక్మిణీగోపాల్ గారు ఇప్పుడు ఎనభై ఏళ్ళ వయసులో ఉన్నా ఆవిడ ముప్ఫయి, ముప్ఫయి అయిదేళ్ళ వయసులో రాసిన రెండు కథలు ఈ కథా సంపుటిలో కనిపించగానే నాకు చాలా ఆనందమనిపించింది. తక్కిన కథలన్నీ 2007 నుంచి 2016 వరకు ఉన్న కాలంలో రచించినవి.
ఒకనాటి ఉమ్మడి కుటుంబాలు, ఆప్యాయతలు, ఆదరణలు, బంధుత్వాలు చూశారు ఆవిడ. నేడు కుటుంబ వ్యవస్థ ఎలా ముక్కలయిపోయిందో కూడా చూస్తున్నారు.
ఈ కథలు చాలావరకు ఒకే దారంతో చుట్టబడ్డాయి. కొడుకుల కాపురాల్లో ఉండాలనుకునే తల్లుల స్థితిగతులేమిటి! ”అదేనండీ నా బాధ, ఒక్క కొడుకు. వాణ్ణి వదులుకుని దూరంగా ఉండవలసిన ఖర్మేమిటండీ మనకు” అన్న తల్లి సుభద్ర, చివరకు ”ఇంతకాలం తనదికాని చోటులో ఉన్నట్టు, ఇప్పుడు తన స్వస్థలానికి చేరుకుంటున్నట్టు అమెలో భావన కలిగింది” (ఒడ్డున పడ్డ చేప) – ఎందుకో కథ చదివితే అర్థమయిపోతుంది కదా!
మరో కథలో, ”వరలక్ష్మమ్మకు జీవిత సత్యాలు తెలుస్తున్నాయి. కొడుకు ఎప్పుడూ తన పక్షమే అన్న భ్రమ తొలగిపోయింది. తనకి, కోడలికి మధ్య గొడవ వస్తే కొడుకు పెళ్ళాన్నే సమర్ధిస్తున్నాడు” (ఎండమావులు) – భ్రమలు తొలగిపోయిన తల్లి!
‘ఆదర్శం’ కథలో కూడా, భర్త పోయాక కొడుకు దగ్గరకెళ్ళిన తల్లి, చివరకు ఆ ఊరు వదిలి పెన్షన్ డబ్బులతో బతుకుతోంది. ఈ కథలు ఎన్ని చదివినా, చివరికి వినిపించే సత్యం ఒకటుంది. ”భర్త పోగానే ఒంటరితనాన్ని భరించలేక కొడుకుల పంచన చేరతారు. అలా చాలామంది జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు. వారి దయాధర్మాలపై ఆధారపడి జీవచ్ఛవాల్లా బతుకుతారు” – కనుక ఒంటరిగా జీవించటానికి నిశ్చయించుకున్న రమలాంటివాళ్ళు ఒక ఆదర్శ వ్యక్తిగా కథలో చూపించారు రుక్మిణిగారు.
రుక్మిణిగారి కథల్లో చాదస్తపు ఆలోచనలు, మూర్ఖపు పట్టుదలలు ఉన్న పాత్రలు కనిపించవు. పాత సంప్రదాయాలను నిర్మొహమాటంగా వ్యతిరేకించటం రుక్మిణిగారి అభ్యుదయ ధోరణికి నిదర్శనం. ‘ఏం, భర్త పోతే బొట్టెందుకు పెట్టుకోకూడదు. అది భర్తతో వచ్చింది కాదు కదా’ అని ‘ఆదర్శం’ అనే కథలో భర్తపోయిన రమ చేత అనిపించడం నేటి కాలానికి తగ్గట్టే ఉంది.
‘గుండెకోత’, ‘సాంప్రదాయ బంధనాల్లో’ కథల్లో వైధవ్యం వచ్చిన స్త్రీల దీనస్థితిని చెబుతూనే, ఒక ఇంటి చాకలి స్త్రీ చేత గొప్ప సందేశాన్ని చెప్పించి, అందరి కళ్ళూ తెరిపించిన రుక్మిణిగారు అభ్యుదయ పథగామి!!
”అలాంటి పిచ్చిలు యీ బాపనోళ్ళకు కానీ మాకు లేవమ్మా. ఈ చేతులతో ఇలాంటి పనులు ఎన్ని చేశానో! నా బొట్టు, సూత్రాలకు ఏ లోటు రాలేదు. మా ఆయన నిక్షేపంలా ఉన్నాడు… నాకు ముందు మా అత్త ఈ పనిచేసేది. మా మామ తొంభై ఏళ్ళు బతికిండు. ఎవరి ఆయుర్దాయాన్ని ఎవరూ తీసేయలేరమ్మా. ఇదంతా మీ చాదస్తాలు” – ఆ చాకలామె, వితంతువుకు ఆ సమయంలో చేయాల్సిన పనులకి, తీసుకెళ్ళే వస్తువులకి ఏ పాటి జంకలేదు కదా – వీళ్ళకి కలగని దోషం వాళ్ళకెందుకు కలుగుతుందో – ఈ కథ అందరూ అర్థం చేసుకుని, ఆచరించాల్సిన గొప్ప కథ.
‘పదవరోజు’ కథలో ”దాని ముఖాన్ని చూడడం ఇష్టంలేని వాళ్ళను చూడొద్దనే చెప్పండి” అని ఒక తల్లి అనటం అద్భుతం. – ”తల్లి ధైర్యం”.
ఈ కథల్లో, లోకంలో జరిగే అన్యాయాలు, మోసాలు ఎన్ని విధాలో కూడా సహజ సుందరంగా రాశారు.
ఆకలి కథలు రెండున్నాయి. ఇవి కరుణ రసాత్మకంగా రాశారు రుక్మిణిగారు. తమిళుల పెళ్ళి – పెద్ద అన్నం ముద్దలతో పెళ్ళికొడుక్కి, పెళ్ళి కూతురికి దిష్టితీసి బయటకు విసిరేయడం ఆచారం. బయటికి విసిరేసినా అది అన్నమే. ఐదేళ్ళ రంగి, రెండేళ్ళ తమ్ముణ్ణెత్తుకుని అది చూస్తోంది. ఆకలితో పేగులు అరుస్తున్నాయి. ఒక్క ముద్ద నాకిస్తే నేనూ, తమ్ముడూ తింటాంగా అనుకుంది. మట్టిలో పడ్డ ముద్ద తీసి మట్టి దులిపి తినాలనుకున్నా మట్టి అన్నం తినలేకపోయింది.
రంగి కడుపులో ఆకలి మంటలు -భోజనాలయ్యాక, విస్తళ్ళు బయట పడేస్తే, ఎంగిలి విస్తళ్ళల్లోంచి ఏదైనా ఏరుకోవచ్చా. కానీ ఆ ఎంగిలి విస్తళ్ళ కోసం ఎగబడే కుక్కలు. రంగికి దుఃఖం పొంగిపొర్లినా, ఆకలి కడుపును దహిస్తున్నా – ఏడుస్తున్న తమ్ముడిని చంకనేసుకుని గుడిసెవైపు నడిచింది. ”ఆకలి తీరదు”
‘గర్భ దరిద్రులు’ కథ అముద్రితం. రామనాధం చిన్న ఉద్యోగి. అతని భార్య మహా పొదుపరి. పెసరట్టు తినే కోరిక ఎలా తీరాలో. బండి మీద పెసరట్టు ఒక్కటి కొనుక్కుని తింటాడు. ఆ బండి పక్కనే ఎముకల గూడులా ఉన్న ముష్టి కుర్రాడు చెయ్యి చాస్తుంటాడు. ఏదో చిన్న ముక్క పడేస్తాడు. కానీ రోజూ ఇదే. పోలీసువాడు లాఠీతో కొట్టాడు అతడిని. రామనాధం పళ్ళెంలో ఉన్న పెసరట్టు జారిపడింది. – ఆ ముష్టి పిల్లాడు పోలీసు కొట్టిన దెబ్బలకి ఏడుస్తున్నాడు. రామనాధానికి ఆ బండివైపు వెళ్లాలనిపించలేదు ఆ తర్వాత. గర్భ దరిద్రుడిది ఒకరకమైన ఆకలి. ముష్టి కుర్రాడిది ఒక రకమైన ఆకలి. – రుక్మిణిగారు రచించిన ఆకలి కథలు రెండూ కదిలించాయి.
1952లో ఆంధ్ర పత్రికలో ప్రచురించబడిన ‘సంఘ జీవిత’ కథలో ఉన్న హేమ, రాజేశ్వరి లాంటివారు చాలా మంది నేటికీ
ఉన్నారు. హేమ భర్తకి సంఘ జీవితం చాలా అవసరమనే భావంతో తాను, స్నేహితుడు పక్క వాటాల్లో వుండేలా ఒక ఇల్లు తీసుకున్నాడు. స్నేహితులు హాయిగా ఉన్నా భార్యలు ఎవరి అహంతో వారు ఉండి, భర్తల మనసుల్ని చెడగొట్టి, చివరికి ఇల్లు మారిపోదామనే భావన కలిగేటట్లు చేయడంతో కథ ముగిసింది. ఏ ఇద్దరు కలిసి ఉండాలన్నా, సర్దుబాటు, సహనం ముఖ్యం.
1955లో ఆంధ్రపత్రికలో వచ్చిన ‘ఆడవాళ్ళు అనుమానం మనుషులా’ అనే కథలో సరస్వతి చాలా అనుమానపు మనిషి. భర్త ఎవరివంక చూసినా ఆ ఆడాళ్ళని అనుమానిస్తుంది అనే భావం కలుగుతుంది. కానీ, అసలు కారణం భర్త స్వభావం మంచిది కాదని, ఆడవాళ్ళంటే తేలిక భావమని ఆమెకు తెలుసు. తననే, తనే అనుమానపు మనిషి అని అందరూ అనుకున్నా దాని వెనుక ఉన్న అసలు విషయం భర్త ప్రవర్తన అని అర్థమయ్యాక, భర్త కంట ఆడవాళ్ళు పడకుండా కాపాడుకుంటూ కుటుంబ గౌరవం నిలబెడుతోందని తెలిసి సరస్వతిపై కోపం రాదు – అర్థం అవుతుంది ఆమె.
రుక్మిణి గారి కథలు వైవిధ్య భరితాలు. సమాజంలో ఉన్న అన్ని అంశాలూ కథలకి వేదికలయ్యాయి. కథల్లో పురోగమన శీలతను చూస్తుంటే, రుక్మిణీదేవిగారి వ్యక్తిత్వంలోని విశిష్టతపై గౌరవం కలుగుతుంది. మొదటిసారిగా కథా సంపుటాన్ని వెలువరించినందుకు నా అభినందనలు తెలియచేస్తున్నాను.
‘సహిత స్వభావం సాహిత్యం’ కనుక, మీరు సాహిత్యానికి మరిన్ని కథలు అందించవలసిందిగా కోరుతూ, నమస్కరిస్తున్నాను.