మా బతుకులు – ఒక దళిత స్త్రీ ఆత్మకథ -ఉమా నూతక్కి

”మాకు నాలుగు కాళ్ళు కాక రెండే కాళ్ళు ఉండడం వల్ల మాత్రమే మమ్మల్ని మనుషులు అనవలసి వస్తోంది.

వాళ్ళ పెరట్లో కట్టేసి ఉంచే ఎద్దులకంటే హీనమైన పరిస్థితికి మమ్మల్ని దిగజార్చారు.

కనీసం ఎద్దులకి ఎండుగడ్డయినా వేస్తారు.

మాకు మాత్రం ఎంగిలి మెతుకులే గతి.

అయితే తేడా ఏంటంటే ఎడ్లు కడుపునిండా తిని వాళ్ళ యజమానుల పెరటిలోనే ఉంటాయి.

మేము ఉండేది ఊరవతల పెంటకుప్పల్లో. అగ్రకులాలు ఆ పెంటకుప్పల మీదికి విసిరేసే చచ్చిన జంతువులకి మాత్రమే మేము యజమానులం.

ఆ జంతువుల చర్మాలని ఒలిచే హక్కుని నిలబెట్టుకోవడానికి మేము కుక్కలతోటి, పిల్లులతోటి, గెద్దలతోటి, రాబందులతోటి కొట్లాడాలి.

ప్రపంచం నిలబడి ఉండడానికి కారణం మాత్రం మేమే.

పర్వతాలను సైతం తనలో దాచుకోగలిగే అనంత సముద్రం లాగా అగ్రకుల పాపాల పర్వతాలను కప్పి ఉంచే సముద్రాల వంటి వారం మేము.

అందుకే సముద్రానికి దక్కినట్టే ప్రపంచపు మొత్తం ఆరాధన మాకు దక్కాలి”.

-బేబీ కాంబ్లే

(ఈ పుస్తక రచయిత్రి)

కన్నీళ్ళు ఆగట్లేదు కదూ…! ఆగవు. ఒక దళిత మహిళ ఆత్మకథ ఇది. ఆమె జీవిత అనుభవాలు ఇవి. మూడు తరాల దళిత మహర్‌ మహిళల బ్రతుకు పోరాట చిత్రం ‘మా బతుకులు’.

బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నడిపిన చారిత్రాత్మక దళిత ఉద్యమంలో తొలి తరం మహిళా కార్యకర్త బేబి కాంబ్లే. ఎప్పుడో 1962లో రాసిన ఆమె ఆత్మకథ 2008లో The Prisons We Broke గా ఇంగ్లీష్‌లో వచ్చింది. ఒక సాధారణ దళిత మహిళ అనుభవాలు, ఆలోచనలూ వెలుగులోకి రావటం ఎంత కష్టమో ‘మా బతుకులు’ పుస్తకం చదివితే అర్థమవుతుంది.

దళితుల ఆమూహిక దృశ్యాన్ని, సమాజంలోని అసమానతల రూపాన్ని చిత్రించే నవలలు, ఆత్మకథలూ చాలానే వచ్చాయి. అన్ని కథలూ అగ్రకుల సమాజపు దౌర్జన్యాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ సమాజ మార్పుని కోరతాయి. అయితే ఆ పుస్తకాలకి ‘మా బతుకులు’ పుస్తకానికి చాలా తేడా ఉంది.

‘మా బతుకులు’ ఒక దళిత మహిళ దృష్టి కోణం నుంచి దళిత మహిళల జీవితం కేంద్రంగా దళిత జీవితాన్ని… మొత్తంగా సమాజపు స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అగ్రకుల ఆధిపత్యంపై విశ్లేషణతో పాటు, దళిత సమాజంలో ఉన్న అసమానతల్ని, వివక్షా రూపాన్ని, హింసని సమగ్రంగా చిత్రిస్తూ మనసుని కుదిపేటట్లు చూపించడం ఈ పుస్తకం ప్రత్యేకత.

ఈ పుస్తకంలో మహారాష్ట్రలో అంటరాని కులస్తులైన మహర్ల జీవితాలని ప్రధానంగా రెండు భాగాలుగా విభజించి చూపించారు. మొదటి భాగంలో మహర్ల సాంప్రదాయక సంస్కృతి జీవితం, రెండవ భాగంలో అంబేద్కర్‌ ఉద్యమ వెలుగులో మహర్లు ఆధునికతవైపు ఆడుగులు వేయడం వర్ణింపబడింది. పేదరికం, అంటరానితనం, అజ్ఞానంలో బ్రతుకుతున్న మహర్లు అంబేద్కర్‌ ఆలోచనలకి, ఉద్యమానికి ఆకర్షితులై చైతన్యవంతులుగా ఎదిగి మానవ మర్యాద, ఆత్మగౌరవం సాధించుకున్న తీరు ‘మా బతుకులు’ ఇతివృత్తం.

మహారాష్ట్రలో పోనా సమీపంలోని వీర్‌ గావ్‌ గ్రామంలో పుట్టింది బేబీ కాంబ్లే. అంటరానితనం, కుల వివక్ష, పేదరికంతో దుర్భర జీవితం గడుపుతూ ఉంటారు మహర్లు. తరతరాలుగా వాళ్ళపై రుద్దబడ్డ బ్రాహ్మణీయ భావజాలం వల్ల మహర్లు తమకు తెలియకుండా తాము ఒక విధమైన భావ దాస్యంలోకి నెట్టివేయబడతారు.

హిందూ సంప్రదాయాలని అరకొరగా ఆచరిస్తూ, అగ్రకులాలని అనుసరించడంలో మహర్లు చూపించే అజ్ఞానం, ఆ అజ్ఞానానికి పేదరికం తోడయ్యి తమను తాము తక్కువ వారిగా బానిసలుగా భావించుకునే స్థితిని రచయిత చక్కగా చూపించారు.

మహర్‌ కులంలో అమ్మాయిలకు బాల్య వివాహాలు జరుగుతాయి. శారీరకంగా ఎదగక ముందే తల్లులవడం, మంత్రసానుల నాటు పద్ధతుల వల్ల చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది.

ఇదంతా ఒక ఎత్తయితే మహిళల పట్ల కుటుంబంలో పురుషుల హింస మరో ఎత్తు. అగ్రకుల వివక్షకు గురై డిప్రెషన్‌లో మహర్‌ పురుషులు తమ భావజాలాన్ని రుద్దడానికి, తమ కాంప్లెక్స్‌ని దూరం చేసుకోవడానికి స్త్రీలని ఎలా బలిచేస్తున్నారో చాలా బాగా వ్యక్తం చేయబడింది ఈ పుస్తకంలో.

మహర్‌ జీవిత చిత్రణలో తన జ్ఞాపకాలను అనేక దృశ్యాలుగా, వివరమైన వర్ణనలతో చూపించారు బేబి కాంబ్లే. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు గురించి, పెళ్ళిళ్ళలో మిగిలిన ఆహారం తినడం, చచ్చిన గొడ్డు మాంసాన్ని దాచుకుని రోజుల తరబడి తినడం, ఆకలితో చావలేక బ్రహ్మ జెముడు కాయలు తిని బ్రతకడం చదువుతుంటే మనసు కన్నీళ్ళ సముద్రమై గుండెను ముంచేస్తున్న భావన కలుగుతుంది.

‘అప్పటిదాకా జంతువులుగా బ్రతికిన మమ్మల్ని అంబేద్కర్‌ మనుషులుగా మార్చారు’ అంటారు బేబి కాంబ్లే. ఈ పుస్తకంలో అంబేద్కర్‌ ఒక పాత్రగా, స్ఫూర్తి ప్రతీకగా కనిపిస్తారు. 1940లలో అంబేద్కర్‌ చేసిన ఒక ప్రసంగం మహర్‌ కులస్తులలో రేపిన దుమారం… మెల్లగా వాళ్ళలో వచ్చిన మార్పు… మహర్లు చదువుకోవడం, అంబేద్కర్‌ జయంతి నాడు తెల్లని బట్టలు ధరించి ఆత్మ గౌరవంతో నడుస్తూ మహర్లు కొత్త మనుషుల్లాగా కనిపించడంతో ఈ పుస్తకం ముగుస్తుంది. పుస్తకం చివర్లో చదువుకున్న దళితులు స్వార్థంతో జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారని… అంబేద్కర్‌ ఆశించింది ఇదేనా అని బేబి కాంబ్లే ప్రశ్నిస్తుంది.

‘మా బ్రతుకులు’ పుస్తకమంతా అప్పటి దళితుల మనసులలో అంతర్భాగమైన అజ్ఞానం, న్యూనతా భావం, భావ దాస్యం… ఇత్యాది సమాజ రుగ్మతలను సమూలంగా తొలగించడానికి అంబేద్కర్‌ చేసిన కృషిని కళ్ళకు కట్టినట్లు చెప్పారు బేబి కాంబ్లే. అగ్ర కులాలు దళితుల్ని ఎలా అణచివేస్తున్నాయో చెప్తారు కానీ దానికన్నా ప్రధానంగా తమ భావజాల బానిసత్వం ఎలా తొలగించుకోవాలి అన్నదే ముఖ్యమంటారు రచయిత్రి.

ఈ పుస్తకం 1982లో ఒక మరాఠీ స్త్రీ వాద పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడినప్పుడు అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగులో అనురాధ గారు చేసిన అనువాదం సరళంగా, అత్యంత సహజంగా ఉంది.

చివరగా ఒక్క మాట… ఈ పుస్తకంలోకి వెళ్ళేటప్పుడు మనసులోని అన్ని వాదాలను తుడిచేసుకుని ఒక తెల్ల కాగితంలా వెళ్ళండి. మీరు చదివేది మనలాంటి మనుషుల కథే అని మాత్రం గుర్తుంచుకోండి. అంతా అయ్యాక కంటి చివర ఒక్క కన్నీటి బొట్టు వేళ్ళాడటమే మనమింకా మనుషులుగా కొనసాగవచ్చు అని చెప్పడానికి సాక్ష్యమవుతుంది.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.