ప్రిజన్ పేజి… చంచల్ గూడా మహిళా ఖైదీల మనోగతాలు
అనగనగా ఒక రాజు. ఆ రాజు ఎందరో చక్రవర్తులను ఓడించి విస్తారమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దాంతో పాపం అతనికి ప్రాణభయం పెరిగిపోయింది.
తన ప్రాణాలకు ఏ మాత్రం ముప్పు రాకుండా ఉండాలని ఒక అందమైన ప్యాలెస్ నిర్మించుకున్నాడు. శత్రు దుర్భేద్యంగా ఉండాలని దానికి కేవలం ఒక ద్వారమే ఏర్పాటు చేసుకున్నాడు. కిటికీలు అసలే ఉండవు. ఆ ఉన్న ఒక్క ద్వారం గుండా ఎవరూ లోనికి రాకుండా ఒక గార్డును గమనిస్తూ మరోగార్డు ఇట్లా ఏడంచెల రక్షణ వలయాన్ని నిర్మించుకుని గట్టి బందోబస్తు మధ్య జీవించసాగాడు.
ఆ సంగతి ఒక వీధిలోని యాచకుడు పసిగట్టి నవ్వసాగాడు. దాంతో రాజుకు చాలా కోపం వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావని కేకలు వేసాడు.
అందుకు ఆ యాచకుడు ”అయ్యా మీరు మహా చక్రవర్తి కానీ, మీరు ఒకే తలుపుతో కూడిన అంత పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నారు గానీ ఆ తలుపును కూడా మూసేసుకోండి నిమ్మళంగా ఉంటుంది అంటాడు.
అదేంటి? అప్పుడెలా బయటకు వస్తా అంటాడు రాజు. ‘అయ్యా మీరు బయటకు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. మీరు నిర్మించుకున్నది ప్యాలెస్ అని మీరనుకుంటున్నారు కానీ అది సమాధి. దాదాపు మీరు తొంభై తొమ్మిది శాతం సమాధిలోనే ఉన్నారు. ఆ ఒక్క తలుపునీ మూసేస్తే సరి! అంటాడు. రాజుకు అర్థం కాదు.
నిజమే ఆ రాజుకు ఎప్పటికీ అర్థం కాదు. భయాందోళనలతో బతికే ఎవరికీ, తమంతట తాము ఖైదు అయ్యే మరెవరికీ జీవితం అన్నా, తలుపులూ, కిటికీలు అన్నా రక్షణ వలయం లేని జీవితపు భరోసా అన్నా ఎలా తెలుస్తుంది? తెలియదు! అర్థమయ్యే అవకాశమే లేదు. అందుకే, ఆ రాజే కాదు ఏ విషయంలోనైనా సరే భయంతో బతికే మనిషి ఆ క్షణాలను జీవిస్తాడనుకుంటే పొరబాటే. అదే మృత్యువు. అందుకే నిర్భయంగా జీవించడానికే జీవితం. లేదంటే అది మృత్యువే అని నమ్ముదాం.