అనగనగా ఒక గ్రామంలో పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు కింద చిన్న పూరిగుడిసె. ఆ గుడిసెలో ఒక అవ్వఉండేది. ఆ అవ్వ గవ్వలు అమ్ముకుంటూ జీవిస్తుండేది. ఒకరోజు సాయంత్రం పెద్ద వాన కురుస్తున్నది. బాగా తడిసిన ఒక కుర్రవాడు గుర్రంమీద వచ్చి మర్రిచెట్టు కింద ఆగాడు. అవ్వ జాలిపడి అతన్ని లోపలికి రమ్మని పిలిచింది. గుర్రాన్ని చెట్టుకు కట్టి కుర్రవాడు ఇంటి లోపలికి వచ్చాడు. వాన తగ్గలేదు.
అవ్వ ఆ కుర్రవాడికి బువ్వ పెట్టింది. ఆకలితో ఉండడంవల్ల కాదనలేక తిన్నాడు. చాప ఇచ్చి కుర్రాణ్ణి పడుకోమంది. ”అవ్వా! నువ్వు తిన్నావా బువ్వ” అని అడిగాడు. అవ్వ మాట్లాడలేదు. అవ్వ వండుకొన్న బువ్వ తినకుండా తనకు పెట్టిందన్న విషయం అర్థమై కుర్రవాడు బాధపడ్డాడు.
తెల్లవారింది. వాన తగ్గింది. కుర్రవాడు బయలుదేరుతూ ”అవ్వా! ఈ రవ్వల హారం ఉంచుకో, నీ కష్టాలు తీరతాయి” అని ఇచ్చాడు. అవ్వ చిరునవ్వు నవ్వి, ”నాయనా! ఆ రవ్వల హారాన్ని నేనేం చేసుకుంటాను? రేపో మాపో రాలిపోయేదాన్ని” అంది. ఆ మాటకు కుర్రవాడు ”అవ్వా! నువ్వు మా ఇంటికి రా. నాతోనే ఉందువుగాని” అన్నాడు. అప్పుడు అవ్వ ”నాయనా! నేను ఎక్కడికీ రాను. ఈ దారిన పోయేవారికి సేవచేయడంలోనే నాకు తృప్తి ఉంది” అంది. ఆ కుర్రవాడిమీద ఆమెకు అభిమానం కలిగింది. తన దగ్గరున్న ఒక ఉంగరాన్ని చూపెట్టింది. ”నాయనా! ఈ ఉంగరం మా పూర్వీకులకు ఓ మహర్షి ఇచ్చారట. ఇది నీ వంటి వాళ్ళ దగ్గర ఉంటే చాలా మంచిది. ఇది రెండు కోర్కెలను తీరుస్తుంది. దీన్ని స్వార్ధానికి ఉపయోగించకు” అంటూ ఉంగరాన్ని కుర్రవాడి చేతిలో పెట్టింది. దాన్ని తీసుకొని ఆ కుర్రవాడు తన ఊరికి వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు ఎవరో కాదు. ఆ దేశపు రాజకుమారుడు.
కొంతకాలం గడిచింది. ఒక వారం రోజుల పాటు కుండపోతగా వర్షం కురిసింది. చెరువులు తెగిపోయాయి. నదులు ప్లొాంయి. పండిన పంటచేలు కొట్టుకుపోయాయి. ఆ సంవత్సరం కరవు వచ్చింది. ఆకలితో ప్రజలు చచ్చిపోయారు. రాజకుమారుడికి అవ్వ ఇచ్చిన ఉంగరం విషయం గుర్తుకువచ్చింది. దాన్ని తీసుకొన్నాడు. ”ఉంగరమా! నా బంగారు తల్లీ! ఈ దేశ ప్రజలందరికీ ఒక ఏడాదికి సరిపడే ఆహారధాన్యాలు ఇవ్వమ్మా” అని కోరాడు. వెంటనే దేశంలో అందరికీ ఒక సంవత్సరానికి సరిపడేటన్ని గింజల మూటలు రాజధానిలో ప్రత్యక్షమయ్యాయి. రాజకుమారుడు వాటిని ప్రజలకు పంచిపెట్టాడు. ప్రజలందరూ రాజకుమారుణ్ణి పొగిడారు. కొన్నాళ్ళ తరువాత రాజకుమారుడికి అవ్వను చూడాలని అనిపించింది. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. తనకు బువ్వ పెట్టిన అవ్వ లేదు. అవ్వ కోసం విచారించాడు. అవ్వ చనిపోయిందని తెలుసుకున్నాడు. రాజకుమారుడు బాధతో ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి మేడమీద పడుకున్నాడు. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. రాజకుమారుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఉంగరం తీసి, ”ఓ ఉంగరమా! ఆ అవ్వ రూపం నాకు చంద్రబింబంలో కనిపించేలా చెయ్యి, అందులో ఎప్పటికీ నిలిచిపోయేలా చెయ్యి” అని వరం కోరాడు. అప్పటినుండి అవ్వ చంద్రుడిలో కనిపిస్తూ ఉందికదా మనకు!