”నన్నెందుకు ప్రేమిస్తావు
నువ్వు?” అప్పుడప్పుడూ
అడిగేదామె…
వంటింట్లో గిన్నెలు
కడుగుతున్నప్పుడో లేదూ నాకు
మూడవ కప్పు టీ ఇస్తున్నప్పుడో
”ఎందుకంటే నువ్వు నా ప్రాణం
కాబట్టి” చెప్తాను ఒక చిరునవ్వుతో
సిగరెట్టు బూడిద ఫ్లోర్ మీద
రాలుస్తో లేదూ ఎంగిలి టీ కప్పుని
తన చేతిలో ఉంచుతోనో…
అత్యంత దయతో… నన్ను చేరి
చేతులతో చుట్టేసి… తనంటుంది…
ఔను…! నువ్వు నన్ను
ప్రేమించేవాడివే…
పసుపు పాదాలతో ఇల్లంతా తిరిగిన
మూడవరోజు సాయంత్రం
తీవ్రమైన కడుపు నొప్పితో తాను
మళ్ళీ నాకోసం టీ సిద్ధం చేస్తో
అనుకుంటుంది…
ఇది నన్ను ప్రేమించేవాడికోసం…
స్నానానికి నీళ్ళు పెడుతూ,
మంటపుట్టే చేతులతో బట్టల్ని
ఉతుకుతూ కూడా ఆమె మళ్ళీ
మళ్ళీ అనుకుంటుంది…
అతడు నన్నెంతగా ప్రేమిస్తున్నాడో
కదా…! అని
ఆఫీసుకు రెడీ అవుతూ, నా షర్ట్
ఇస్త్రీ చేస్తూ
తన నెలజీతం నా చేతిలో పెడుతూ
కూడా
నిజంగా తాను లేని నేను లేనని,
ఒకానొక నా లోలోపలి
బానిసత్వమే ఆమెకి నన్ను
యజమానిని చేసిందని
నిజంగా ఆమె గమనించనే
లేదా????
ఒకరోజు తనకి జ్వరం వస్తుంది…
రెండు కప్పుల టీ చేస్తాను లేదూ
చేయడానికి ప్రయత్నిస్తాను…
చెయ్యికాలుతుంది… తను
ఏడుస్తుంది…
కన్నీళ్ళ చాయ్ కప్పు నా చేతుల్లో…
నా చేతిని తాకి అంటుంది…
”ఎంత ప్రేమ నీకు… చెయ్యి
కాల్చుకున్నావ్ కదా”
అప్పుడు అనిపిస్తుంది…
చెప్పనా…నిజమేమిటో చెప్పనా??
ఆమెకి…
నిజానికి నా ప్రేమ ఒక వంచనేమో…
ఆమె శక్తిని ప్రేమతో
కట్టిపడేస్తున్నానేమో
తనకి చెప్పెయ్యనా??
తల విదుల్చుకొని…కళ్ళు
తుడుచుకుంటూ బయటికి
నడుస్తాను…