ఏ రోజు నాది అని అనుకోవాలి
పుట్టాకా మగ, ఆడ పుట్టుకలో తల్లితండ్రుల్లో వ్యత్యాసం చూసినపుడా
చదువుపై మమకారాన్ని మధ్యలోనే తుంచి మొగుడిని కట్టబెట్టినప్పుడా…
పసితనపు ఛాయలు వీడకుండానే…
సంసారమనే అత్యాచారానికి బలయినపుడా…
మొగుడనే అహంకారంతో నాదైనా నా శరీరంతో ఆడినపుడా…
గర్భం మోస్తున్నా మొగుడి శారీరక ఆకలికి నలిగినపుడా…
ఆడుకునే వయసులో అమ్మనవుతూ… ఆపసోపాలు పడినపుడా…
ఎదురింటోడి, పక్కింటోడి చూపుల్లో అనవసర అపార్ధాలు కల్పించుకుని అనుమానపు,
అవమానకరపు వాక్కులతో నా మదిని కర్కశంగా మొగుడు తూట్లు పెట్టినపుడా…
మొగుడి అహం తృప్తికై నా తనువుపై చిహ్నాలు కనిపించినపుడా…
నా అందమే నాకు శత్రువై నా మొగుడికి కంటకింపుగా మారినపుడా…
మొగుడు కొట్టినా తిట్టినా పట్టించుకోకున్నా…
నువ్వేం మనసులో పెట్టుకోకూడదమ్మా అని నీతిబోధలు చేసే అమ్మానాన్నలను వెఱ్ఱి మొహం
వేసుకుచూస్తూ ఎందుకు పుట్టానా అని నన్ను నేను నిందించుకున్నపుడా…
మీరు జన్మ ఇచ్చినందుకు బదులు ఇలా తీర్చుకుంటున్నారా లేక సమాజంలో మీ పరువుకున్న ప్రాముఖ్యాన్ని ఠీవిగా నిలబెట్టుకోవాలన్న ఆశనా ఇది అని అడగలేక లోలోపలే ఆక్రోశాన్నీ, బాధనీ దిగమింగి కుమిలినపుడా…
భార్య జన్మ మొగుడికోసమే… నువ్వు ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు అన్న కన్నవాళ్ళ మాటలు వింటూ నవ్వాలో, ఏడవాలో అర్థంకాక పిచ్చిపడితే బాగుండు అన్న ఆలోచనతో లోలోపలే ఏడ్చినపుడా…
పెరుగుతున్న కన్నబిడ్డలపై సమస్త ఆశలు ఉంచి, పెంచి రెక్కలొచ్చాకా వారి సంతోషాలకై నాలో తల్లిమనసు మురిసి దీవెనలిచ్చి… దీర్ఘంగా తృప్తిగా నిట్టూర్చి… తల ప్రక్కకు తిప్పితే ఏముంది…
వెక్కిరించే ఇంటిగోడలు, నీకు నాకు మధ్య నిశ్శబ్దం తప్ప
ఎదురెదురుగా ఉన్నా కొలనలవిలేని వేళ్ళ మైళ్ళ దూరాలు తప్ప
ఎన్నటికీ మనసువిప్పి మాట్లాడలేని మాటలు తప్ప
ఎన్నటికీ పూడ్చలేని మానసిక వెలితి తప్ప
క్షోభిల్లే హృదయాశ్రువులు తప్ప
అడుగంటిన స్పందనలు తప్ప
నాకేమీ అని అనుకుంటూ వ్యర్ధంగా మురిసిపోవడం తప్ప
నాకంటూ ఒక రోజుని కేటాయించారు అన్న బూటకపు సంతానం తప్ప
బ్రతుకునీడ్చే రెండు శరీరాలు తప్పించి ఇద్దరిమధ్య జీవనం ఎక్కడా…
అందుకే నాకు అన్నీ దినాలే… నాకంటూ రోజు లేదు
నాకే కాదు… నాలాంటి స్పందనరహితంగా బ్రతికే ఏ స్త్రీకీ లేదు
సంవత్సరానికొచ్చిపోయే సంవత్సరీక దినాలెందుకు…
వీలైతే ప్రతిరోజూ రోజులా ఉంచండి చాలు…
అదే పదివేలు