చీకటి చిత్తడిని చీల్చుకుని
వెలుతురు కత్తులు
పొడుచుకొచ్చాయ్…
ఒక సుప్రభాతం
నలుదిక్కుల్ని తట్టిలేపింది
నిరాశల క్రీనీడల్ని, మృత్యుతీరం చేర్చింది…
నీలుక్కుంటూ నడుస్తున్న కాలానికి
చిరునవ్వుల దండను వేసి ముందుకు నడిపిస్తోంది,,,
సరిహద్దులు దాటి మునుముందుకు వెలుగురేఖలు పరుచుకుంటున్నాయ్…
అయినా సొంత అస్తిత్వాన్ని పట్టి
నలుపుతుందో గాయం…
ఎవరో నియంత ఫిడేల్ వాయిస్తూ
పాడుతున్నాడు మృత్యుగేయం…
విధ్వసంమౌతున్న కొద్దీ…
విచ్ఛిన్నమౌతున్న కొద్దీ…
అంతర్లీనంగా తిరుగుబాటు…
అడుసుల్ని దాటుతూ విషపు చూపుల నుంచి
తప్పుకుంటూ విచ్చుత్తుల మీంచి దుమికి…
అజ్ఞానపు గండశిలలను కదిలించి కరిగిస్తోందామె…
ఆమె ఓర్పును కాలరాస్తున్న వారిని సైతం
చిరునవ్వుతో స్వాగతిస్తోంది.
తరగని సహనం మునుముందుకు తరుముతోంది…
ఆ చూపుల్లో ఉరకలెత్తే
సముద్రపు అలలు…
ఆ గుండెల్లో పరుగులెత్తే ధైర్యం
ఒక తెరిచిన పుస్తకం… చక్కటి విశ్లేషణం
ప్రకృతి పుట్టుకకు మూలాధారం
పోరాటాల్లో భాగానికి పుస్తక రచనల్లో వేగానికి
కుటుంబ నిర్వహణలో త్యాగానికి ఆ శక్తే హార్డ్వేర్…
కంప్యూటర్ స్కిల్స్, కమ్మని పాటలు, ఐటీ ఉద్యోగాలు…
ఆల్ వెరైటీస్ వంటకాలు…
అన్ని రంగాల్లోనూ
ఆమె ఓ నదీ ప్రవాహం…