వాళ్ళంటారు
ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
శిఖరం ఎక్కేటప్పుడు వీపుమీద మోసిన బ్యాగ్‌లో
శానిటరీ ప్యాడ్స్ కూడా ఉంటాయని
వాళ్ళంటారు
యుద్ధంలో శత్రువుతో పోరాడినందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ, వాళ్ళకు తెలియదు
బుల్లెట్ తగిలిన గాయంనుంచి మాత్రమే రక్తస్రావం జరగలేదని
వాళ్ళంటారు
చదువుల్లో ర్యాంకులు సాధించినందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ, వాళ్ళకు తెలియదు
చదివించటంలో వివక్షతని చూసినప్పుడల్లా
చీకటిలో మౌనంగా కన్నీరొలికేదని
వాళ్ళంటారు
బస్సులు విమానాలు నడుపుతున్నందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
డ్యూటీలో చంటి పిల్లలు గుర్తొచ్చినప్పుడల్లా
స్థనాలు రెండూ బరువెక్కుతాయని
వాళ్ళంటారు
ఉద్యోగాల్లో క్రీడల్లో ముందున్నందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
బయటివారి చూపుల అవమానాలకి
భర్తగారి అనుమానాలేమీ తీసిపోవని
వాళ్ళంటారు
మనసుకు నచ్చినవాణ్ణే చేసుకున్నందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
పదోసారి ప్రదర్శన గొర్రెగా నిలబడటానికి
ఫోటో షాప్ చేసిన చిత్తరువే కారణమయిందని
వాళ్ళంటారు
ప్రేమనేదాన్ని వ్యక్తపరుస్తున్నందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
యాసిడ్‌లో కాలిన చర్మపు తొడుగుల కింద
జీవచ్ఛవం కూడా బతికుండొచ్చని
వాళ్ళంటారు
సైన్స్ చదివిన మోడర్న్ హ్యూమన్ అయినందుకు
నేను వాళ్ళతో సమానమని
కానీ వాళ్ళకు తెలియదు
ముట్టినవన్నీ పసుపు నీళ్ళతో కడుగుతున్నపుడు
అనామకంగా నా కళ్ళు నేలను చూస్తుంటాయని
కానీ సగ భూభాగంలో నాతోపాటు సహజీవనం చేసే ఓ మగవాడా…??
నెల నెలా నా కడుపులో గుండ్రాళ్ళలా పేగులు పరిగెత్తినపుడు
పూజలకూ కార్యాలకూ ప్రిమోల్టన్ మాత్రలు ముందుగానే మింగినపుడు
శీష జూఱశ్రీశ్రీర తెరల మాటున శరీరాన్నొక మోతమోగించినపుడు
అద్దంలోని ప్రతిబింబం బలవంతపు అబార్షన్‌తో కడుపులో ముక్కలైనపుడు
పది తలల రావణుడు నిర్భయంగా ఇరవై చేతులతో నన్ను చిదిమేసినపుడు
ఇల్లనే రంగస్థలం మీద పది పాత్రల్ని స్వకాయ ప్రవేశం చేసుకున్నపుడు
నవమాసాలు కనిపించని నా కాళ్ళని రెండు చిట్టి చేతులు తాకుతున్నపుడు
వేల కత్తులు పొత్తిళ్ళలో గుచ్చినట్టుండే పురిటినొప్పిని చేతి పిడికిలిలో బంధించినపుడు
ముర్రు పాలు పంచుతున్న సమయాన మురిపాలకోసం ఒకడు కాచుకున్నపుడు…
అపుడు… అదిగో సరిగ్గా అపుడు
స్త్రీత్వం నా ఒంటినిండా పులుముకున్నపుడు
ఆ గర్వం మనసునిండా పొంగుతున్నపుడు
తల పైకెత్తి, నీ గల్లా పట్టుకుని అడగాలని ఉంటుంది
”నేను నీతో ఎట్టా సమానం రా…!!!?” అని.