నాన్న పోయాక
అక్కె ఇంటి పెద్దైంది
తన ఇష్టాన్ని కాదన్నాడని
మొగుడ్ని ఒదిలేసింది మా కోసం
అమ్మ చేతికి మల్లె
మేం ఐదుగురం ఆడపిల్లలం
ఆరో దాన్ని నాన్న తాగిన మత్తులో
నేల మట్టం చేశాడని
తండా నాలుకలు ఆడిపోసుకుంటుంటాయి
అక్క ముగ్గుర్ని మంచి ఇల్లకు పంపిందని
కైకిలు కాడ కొందరు మాట్లాడుకోవడం విన్నాను
ఏడపోయినా కమలక్క గురించే చర్చ
పొద్దున్నుండి పొద్దు కుంకేదాకా
అక్క రెక్కలు తిరుగుతూనే ఉంటాయి
మల్లి రేతిరికి అక్క రెక్కల్ని కప్పుకుని
అమ్మ నేను మా గుడిసె వెచ్చగా నిద్రపోతాము
అక్క మా గూడుకూ
మా శీలాలకు కాపులా కాస్తూ
ప్రకృతిని ధిక్కరిస్తుంది
ఎడ్లబండి నుండి నాగలి నిద్రదాకా
ఒడ్డు ఒలుచుడు నుండి పంట యవ్వనానికొచ్చే దాకా
అడవి చెట్ల నుండి కుండలోని గంజి దాకా
అంతా అక్కదే పని
మా అమ్మ కమలక్కని మగాడికంటె
నువ్వు చాలా ఎక్కువె అంటు మెచ్చుకుంటుంది
మా ఇంటి పెద్ద దిక్కు
మా కమలక్క