ఎన్ని సముద్రాలు దాటుంటాం
ఇలా నిటారుగా నిలబడడానికి…
అల్ట్రాసౌండు తెరను దాటి
భూమ్మీద పడడానికి ముందే
ఇంకా చూడని లోకంతో యుద్ధం మొదలు…
అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటున్న
లేలేత పిండాన్ని కాకపోతే అస్తిత్వాన్ని
కంటి చివర పొడుస్తున్న కలలపొద్దునో…
అడుగడుగునా హక్కుగా హత్యచేసే
తల్లిదండ్రులు
ఏ పిల్లా…పిచ్చా నీకు… ఇది ఆడాళ్ళ ఆట కాదు
బుద్ధిగా డాక్టరో ఇంజనీర్ చదివి కన్నవారి
కలలను మోయాలన్న మామయ్యో బాబాయో స్కూలు టీచరో…
ఇంత రాత్రి దాకా ఎక్కడ తిరిగొస్తుంది
మీ అమ్మాయి మగరాయుళ్ళా…
ఆ బట్టలేంటి సిగ్గూ ఎగ్గూ లేకుండా
పనీపాటా లేని పక్కింటి పంకజాక్షులు…!
పాత తరం అమ్మమ్మలూ…
అవకాశమై మొలకెత్తడానికి
కడుపులో శూలాలతో
కన్నీళ్ళతో కప్పుకున్న కనుపాపలతో
శ్వాసించినన్నిసార్లు చచ్చి బ్రతికి
పాతాళం నుండి చీల్చుకుంటూ వచ్చిన
పొరలు…శిలలు!
లక్షల కన్నులతో
బంతిని ఎగరేసే మణికట్టు ఒడుపునొదిలి
పిక్కలకు జలగల్లా కరుచుకున్న
అనాచ్ఛాదిత చూపులు!
కళ్ళు వాలిపోయినప్పుడల్లా
భేతాళ ప్రశ్నలు
తల ఎవరెస్టయినప్పుడు భజంత్రీలు
గెలిచిన ఆనందాన్ని… ఆత్మస్థైర్యాన్నీ
బాయ్ ఫ్రెండు కథనాలతోనో
పెళ్ళెప్పుడన్న ప్రహసనాలతోనో
ఎగరేసుకెళ్ళే మీడియా గద్దలు!
ఇదిగో… ఇప్పుడిలా
గడ్డకట్టిన బిందువు సింధువై నిలిచి
దిగంతాల అంచున జీవితమే పతాకమై ఎగిస్తే…
వెలుగు పావురాయిని మోస్తున్న భుజాలు
పాతాళానికి తోసేయడానికి ఒక్క చీకటి చాలు
మా బిడ్డ అని చెమర్చే కళ్ళతో
ఉప్పొంగే మనసులెన్ని…
పుట్టక మునుపు హత్తుకున్న వాకిళ్ళెన్ని…
ఒక్కమాట…
ఈ రెక్కలు మీరిచ్చిన నిద్ర కాదు
మిమ్మల్ని దాటుకొని తూరుపై మొలుచుకొచ్చినవి
గుండెల్లో దమ్ముంటే పురిటిబిడ్డకు రెక్కలివ్వు
కళ్ళల్లో ఆకాశం వాలకపోతే ఒట్టు…!!