నా కళ్ళల్లో పుట్టే మెరుపుల్ని దోసిళ్ళతో పట్టుకుని గుండెమీద చిలకరించుకుంటుంటావ్…
పెంకుల్ని చిన్ని ముక్కుతో పొడిచేసుకుంటూ అప్పుడప్పుడే
బయటికొస్తున్న బుజ్జిబుజ్జి కోడిపిల్లల్ని రెక్కలకింద వెచ్చగా దాపెట్టుకునే తల్లికోడిని చూస్తూ కేరింతలు కొట్టే నన్ను చూస్తూ…
ఇదంతా నేను లంగావోణీలో చెంగుచెంగున లేడిపిల్లలా గెంతుతున్నంతసేపే ఉంటుందని నాకూ తెలీదప్పుడు…
నీకూ అర్థం కాదు నా మేనిలో ఒక్కో వంపుకూ ఒక్కో అర్ధమూ పరమార్థమూ ఉన్నాయని…
అవి ఈ సృష్టికే ఆయువుపట్లని…
అమ్మనవబోయేటపుడు ప్రాణాన్ని పణంగా పెట్టి నేనా ప్రసూతిబల్ల మీదనే యముడితో గంటల తరబడి పోరాడేటప్పుడు
నా బరువునీ ఊపిరినీ… నీ బిడ్డ (అని నువ్వనుకుంటావ్) బరువునీ మోయగల బిగువంతా ఆ సన్నటి నడుముదేననీ నీకెప్పటికీ అర్థం కాదు…
కేర్ కేర్మనే పసిగొంతుక ఏడుపు విని మాత్రం మీసం దువ్వేస్కుంటావ్…
అంత కష్టాన్నీ భరించాకా తెప్పరిల్లుతుంటే
నువ్వంటావ్ నిర్దాక్షిణ్యంగా
అమ్మాయా అని…
వద్దు పెంచటం కష్టమనో
అబ్బాయి పుట్టేదాకా యంత్రంలా కంటూనే ఉండమనో
నే కాదంటాను పౌరుషాగ్నిని చిమ్ముతూ
నువ్వూ అంటావ్ నేనసలు ఆడదాన్నే కాదని
ఎవరంటారు?? నువ్ మగ అని
నేను అమ్మని కాగలిగితే తప్ప…
నన్ను అమ్మని చేయడానికి నువ్ పడే కష్టం కా… సే… పే…
నేన్నిన్ను నాన్నని చేయడానికి పడే కష్టం ఒక జీవితకాలం…
సున్నితాల కొమ్మననో సుకుమారపు రెమ్మననో
కష్టం చేయలేననో నిర్లక్ష్యం కదా నీకు నేనంటే…??
ఇప్పుడు చెప్పు…??
నువ్వెన్ని బస్తాలు మోస్తే నా ఒక్క అరుపుకు పుట్టే స్వేదానికి సమానమౌతుంది…????