రేకలు వారకముందే లేచి వాకిలమ్మకు తానం చేయించి తెల్లని సుక్కబొట్లుబెట్టి మురిసిపోదువు మూడు రోజులకొక్కసారి తలంటు పోసుకున్నా
తేటని నీళ్ళలెక్క నీ మనసుంటది దండెం మీద ఆరేసిన బట్టలన్ని నీ చేతుల్ని ముద్దాడాలని చూస్తుంటవి ఏ పూజలు ఎరుకలేదుగానీ కట్టుకున్నోడిని కండ్లల్లబెట్టి సూసుకుంటవు కనుకున్న బిడ్డలకోసం జీవితమంతా ధారవోస్తవు
తల్లిగారింటినుంచి తెచ్చుకున్న కొడవలిని అపురూపంగా దాసుకుంటవు అన్నదమ్ములు బెట్టిన చీరను కట్టుకొని అందరికీ చెప్పి తల్సుకుంటవు
కొంగు నడుముకు చుట్టుకొని కలుపుచేలో నువ్ పదం జెప్తే ఎగిరే కొంగలన్నీ
గట్లమీద నిలబడి నీ పాటవింటవి నీతోటి అమ్మలంతా గొంతు కలుపుతూ బతుకును పాటలోకి ఒంపుకుంటరు.
కుమ్మరిపురుగు లెక్క బురదపొలంలో తిరుగుతుంటే నుదుటిమీద కుంకుమను కొన్ని చెమటచుక్కలు ముక్కు మీదకు
తీసుకుపోతూ కలుపుచేల్లో శ్రమకావ్యం రాస్తుంటవి.
నెత్తిన కట్టెలమోపు పెట్టుకొని పెద్దపెద్ద అంగలేసి నడుస్తుంటవు నీవు మోస్తున్న దుఃఖం కన్న ఆ మోపు ఏమంత బరువేం లేదంటవు పాలుతాగే కొడుకు గుర్తుకొస్తే పిల్లబాటల గుండా నడకపెంచినపుడు అడ్డమొచ్చిన మట్టిపెళ్ళలన్ని నీ పాదాలకు దండం బెడ్తవి.
ఈ మట్టిలో పుట్టినందుకేగాదు ఈ కూలితల్లి కడుపులో పుట్టినందుకూ మట్టివాసనతో మనిషిలెక్క బతకాలే!