ఆమెకి పొగరు…
ఆమె మొన్ననే మొగుణ్ణి నడిరోడ్డులో చెప్పుతో కొట్టిందట…
తను గొడ్రాలట…
ఆమెకి ఫలానా వారితో ఫలానా అట…
చుట్టుపక్కల అమ్మలక్కల మాటల్లో,
వీథిలోని మగరాయుళ్ళ కాలక్షేపపు బాతాఖానీల్లో…
ఆమె ఇపుడు ప్రధాన వస్తువు.
ప్రపంచం ఆమెకి
”తిరుగుబోతు” ముద్ర వేసేసింది
అత్తింటివారు బరితెగించిందంటూ
బంధువుల్లో బాకాలూదారు…
పుట్టింటివారు పరువు తీసేసిందంటూ
దరిదాపుల్లోకి రానీయకుండా వెలివేశారు…
కానీ…
ఆమె మాత్రం
ఇవేవీ పట్టించుకోకుండా
దూరంగా కనిపిస్తున్న సంద్రాన్ని,
అలసిపోని అలలను, మరోమారు కొత్తగా ఉదయించే
సూర్యోదయాన్ని ఆస్వాదిస్తోంది
బాల్కనీలో కాఫీ తాగుతూ…
మొన్నటివరకు తాళి తగిలినపుడల్లా
బాధించిన గాయాలు మెల్లమెల్లగా
మానుతున్నాయి…
మచ్చలు మాత్రం మిగిలిపోతాయేమో
మరచిపోనివ్వని మనోవేదనని అందించిన మగడిని గుర్తుచేస్తూ…
ప్రపంచానికిప్పుడు
ఆమెని ప్రశ్నించే ధైర్యంలేదు…
ఆమెకి ప్రపంచానికి జవాబివ్వాల్సిన అవసరం లేదు…
ఆమె
మానిన గాయాల రెక్కలను
మరోసారి తపతపలాడిస్తున్న
స్వేచ్ఛాపావురం…