నుదుటిమీద సూర్యున్ని అతికించుకుని
మబ్బుల్నె లేస్తది అమ్మ
అపుడపుడు నిద్రలో ఉన్న
నా మసక కళ్ళకు కూడా…
ఆమె పరిపూర్ణంగ కనిపిస్తది
చంద్రుడు
డ్యూటీ ఎక్కి
సూర్యుడు నడుం వాల్చుకున్నాక కూడా
విరామమెరుగని ఆమె చేతులు
జోల పాడుతూ
నా గుండెల్ని ముద్దాడుతాయి
అమ్మకెందుకో
పనంటే విసుగు రాదు
ఎప్పుడూ ఇంట్లోనే ఉన్నా బోర్ కొట్టదు
ఎంత పని చేసినా అస్సలు అలసిపోదు
దగ్గరోళ్ళు కనపడగానే పెదాలమీద
ప్రత్యక్షమయ్యే నవ్వు
ఎప్పటికీ వాడిపోదు
లోటెడు చాయల
డబల్ రొట్టె ముంచుక తిన్నంత కమ్మగా అనిపిస్తది
అమ్మ గుర్తొస్తే…
నాకు తెలిసి ఇప్పుడు కూడా అమ్మ
నా గురించో…
నాన్న గురించో…
లేకపోతే…
ఇంట్లో పని గురించో ఆలోచిస్తుంటది…