పచ్చి పసిగుడ్డును ఎండపొడకు సూపి
బతుకుకు పచ్చదనాన్ని ఇచ్చిన చేతులు.
కంకెడు ఎండు మిరపకాయల బతుకును
కాటికెలా నూరిన చేతులు.
దొరవారి జమీనంతా
వరి, మక్కసేను, పజ్జోన్న, మిరప
పంటచేన్లకు కంటిపాప ఆ చేతులు.
పచ్చి బాలింత కడప లోపలికి వచ్చినప్పుడు
పసివిల్ల తల్లివి అట్లుండుమని
ఒడిలో గిద్దెడు బియ్యం, రెండు మూడు ఎల్లిగడ్డలువోసి
నొసటికి బొట్టువెట్టి పంపిన చేతులు.
లేగదూడను నేలసాట్లకు పడేసిన
తల్లియావుకు ఉడుకునీళ్ళు కాగవెట్టి
పులిసిన రెక్కలకు, బొక్కలకు ఎచ్చదనాన్ని నింపే చేతులు.
బర్రెసచ్చిపోయిన దుడ్డెకు
ఎన్నాద్రిపోసలతో ఆకలిదీర్చి
మనువడు, మనురాలు లెక్క ఎంట వెట్టుకున్న చేతులు.
ఈ భూమ్మీద
మనుషులెంతో
గొడ్డు, గోద, కోడిపిల్ల, కొంకనక్క, అరొక్కటి
నోరులేని జీవాలంతేనని
అనాదిగా సృష్టిని పావురంగా జూసిన చేతులు.
పోరుబాటవట్టి రగరగ పొద్దులైన
కొడుకును, బిడ్డను
మట్టిలో దాసిపెట్టుకున్న చేతులు.