నా జీవితం పరిపూర్ణం, సంతృప్తికరం – వసంత కన్నభిరాన్‌

 

మీ బాల్యం, మీరు పెరిగిన వాతావరణం, అప్పటి మీ అనుభవాల గురించి చెప్పండి.

ఇది ఒక సుదీర్ఘమైన కథ. అందుకే భయపడ్డాను ముందుగా. నేను పుట్టి పెరిగిందంతా సికింద్రాబాద్‌ ప్రాంతంలోనే. నా స్కూలింగ్‌ కూడా ఇక్కడే. చిన్నప్పటి నుండి నాకు వివక్ష అనేది తెలియదు, నాపెంపకంలో ఏ మాత్రం వివక్షలాంటిదేమీ కన్పించలేదు. అంటే, చిన్నప్పటినుండి వివక్ష పట్ల పోరాడాలనే ఉద్దేశ్యం నాకెప్పుడూ అవసరం అనిపించలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆడపిల్లగా పుట్టడం వల్ల నాకెంతో విలువ

ఉండేది. పూర్తిస్వేచ్ఛతో పెరగడంవల్ల నాకేది కావాలో అది చేశాను. ఆ రోజుల్లో చదవాలి, అంతే. పెద్దగా ఆశయాలు ఏమీలేవు. బాగా చదవాలి, ర్యాంక్‌ తెచ్చుకోవాలి అని ఎవరి బలవంతం ఉండేది కాదు.

కానీ నేను మాత్రం పుస్తకాల పురుగును. మా తాత, నాన్నగారు పుస్తకాలు తెచ్చేవారు, దాంతో ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలుండేవి. అలా ఎప్పుడూ నేనొక పుస్తకం పట్టుకునే ఉండేదాన్ని. స్కూలుకి వెళ్ళాలి, సమయం కాలక్షేపం చేయాలి. ఎక్కడైతే టీచర్లు మంచిగా చెప్పేవారో అవి బాగా గుర్తు ఉండేవి. కానీ ఒకటి మాత్రం నిజం. ఇన్ని మార్కులు రావాలి, ఫస్ట్‌క్లాస్‌ రావాలని మాపై ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు. ఒకటి, రెండు సబ్జక్టుల్లో ఫెయిలయినా ఎవ్వరూ ఏమీ అనుకోకపోతుండె. అలా నా చదువు ఎలాంటి ఒత్తిడిలేకుండా సాగింది. నేను చదువులో బాగానే మేనేజ్‌ చేసేదాన్ని. ఎప్పుడూ క్లాస్‌ఫస్ట్‌ లేదా ఫస్ట్‌క్లాస్‌ వచ్చేది కాదు కానీ సులభంగా అన్నింటినీ దాటుకోగలిగాను. అలాగే చాలా సులభంగా ఇంటర్మీడియట్‌కూడా పూర్తి చేశాను.

నా మొట్టమొదటి స్త్రీ వాదపు ఆలోచన అంటే, నిజానికి అది నాకు తెలిసికాదు కానీ అటువంటి ఆలోచన కావచ్చు. నా వయస్సు 15, 16 సంవత్సరాలు అప్పుడు. నేను మహబూబ్‌కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పుడు మా కాలేజీలో స్టూడెంట్‌ యూనియన్‌ ఎన్నికలు వచ్చాయి. ఇంటర్మీడియట్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ గ్రూపులు వేర్వేరు భవనాల్లోఉండేవి. కొన్ని పోస్టులకు మగపిల్లలే నిలబడేవారు. అయితే, ప్రతి సంవత్సరం ఒక్క ఆడపిల్లని మాత్రం ప్రతినిధిగా పెట్టేవారు అంతే. ఒక్కతే అమ్మాయి, మిగిలిన అందరూ అబ్బాయిలే. ఎందుకో తెలియదు కానీ, అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆడపిల్లల్లో ఒక్కరే ఎందుకు పార్టిసిపేట్‌ చేయాలి అందుకు మనం కూడా పోటీ చేద్దాం అనిపించింది. నా స్నేహితురాలు పార్వతి ఉండేది. నేను ఆమెతో ‘నువ్వు ఎన్నికల్లో ప్రతినిధిగా పోటీ చెయ్యి, నీ వెనక మేముంటాం’ అని చెప్పాను. ఆ అమ్మాయి ఓకే చెప్పింది.

నిజానికి రెండే క్లాసులు – ఫస్టియర్‌, సెకండియర్‌. మొత్తంగా ప్రతి క్లాసులో 100 మంది అబ్బాయిలు, 10-15 మంది అమ్మాయిలు ఉన్నారు. అలా ఆ అమ్మాయిని నిలబెట్టాం. తను కూడా చక్కటి సామర్ధ్యం గల అమ్మాయి. ఓట్లు పడినప్పుడే ఉన్న 20 మంది అమ్మాయిల ఓట్లన్నీ తనకు, మొత్తం 200 అబ్బాయిల ఓట్లూ అబ్బాయికి పడినట్లు స్పష్టమైంది. చాలా ఆశ్చర్యమేసింది. అబ్బాయిలు అబ్బాయిలకే ఓటు వేయాలా? అబ్బాయిలు అమ్మాయిలకు ఓటు వెయ్యకూడదా?

కానీ నేను చాలా తమాషాకి పోటీ చేద్దామన్న విషయం పెద్ద యుద్ధమే అయింది. ఎన్నికలయిన వెంటనే మేము గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్‌ చెప్తూ అబ్బాయిలకు ఒకలెటర్‌ వ్రాశాము. దాన్నికూడా మా మొహాన తిప్పికొట్టారు. అంతేకాదు, ఎన్నికలయిన తర్వాత రోజు నుండీ మేము క్లాస్‌కి వెళ్ళి పుస్తకాలు పెడదామకు అని డెస్క్‌ తియ్యగానే అందులో చాలా అసభ్యకరమైన (బూతు) బొమ్మలున్న పేపర్లు

ఉండేవి. మేము చిన్న పిల్లలం. ఇంకా 15, 16 సంవత్సరాలు అంతే. అవి చూడగానే వెంటనే ఏడుపు వచ్చింది. మొత్తం వంద మంది చూపులూ మా పైనే. మేం ఏమి చేస్తున్నామా అని. వాళ్ళ ముందు ఏడవకూడదు కదా! ప్రతిరోజూ ఇదే తంతు. వెళ్ళి ప్రిన్సిపాల్‌కు కంప్లైంట్‌ చేశాం. పేపర్లన్నీ సేకరించి తీసుకెళ్ళి ఇచ్చాం. ఏం చేయనమ్మా! నేను రోజూ చెప్తున్నాను. తిడుతున్నాను, కానీ వాళ్ళు వినడంలేదు అనేవారు ఆయన. మంచివాడే, కానీ ఏం చేతకాదు. మాటలు మాత్రం అంటాడు. నిజంగా ఇది చాలాపెద్ద సమస్య అయింది. ఇంకా ఇంకా భయంకరమైన పిక్చర్లు ఉండేవి. డెస్క్‌ తెరవాలంటే భయంగా ఉండేది. పుస్తకాలు డెస్క్‌ మీదే పెట్టుకునేవాళ్ళం.

ఇదిలా నడుస్తూనే ఉన్నా ప్రిన్స్‌పాల్‌ వాళ్ళను ఏమీ చేయలేకపోతున్నారు. యూనియన్‌ ఎన్నికలయ్యాయి కదా! ఈలోగాప్రారంభోత్సవం ఫంక్షన్‌ వచ్చింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నాదేఆలోచన, మిగిలిన అమ్మాయిలందరూ నాకు సహకరించారు. మేము ప్రిన్స్‌పాల్‌కి ఒక లెటర్‌ వ్రాశాం. ఇది ఇలానే జరుగుతోంది కానీ మీరేమీ చేయలేకపోతున్నారు కదా! కాబట్టి మేం యూనియన్‌ బాయ్‌కాట్‌ చేస్తున్నాం అని వ్రాశాం. అది నా జీవితంలో ఫస్ట్‌ బాయ్‌కాట్‌. ఇలా… ఇంటర్మీడియట్‌లో ఫస్ట్‌ ఎలక్షన్‌, ఫస్ట్‌ బాయ్‌కాట్‌.

యూనియన్‌ ప్రారంభోత్సవ వేడుక, అమ్మాయిలందరూ చక్కగా తయారై కాలేజీకి వస్తారు రంగు రంగుల దుస్తులతో. మేము బాయ్‌కాట్‌ చేస్తామనగానే ప్రిన్సిపాల్‌వెంటనే అబ్బాయిలను పిలిచి గట్టిగా మాట్లాడారు. దాంతో ఇక అన్నీ బంద్‌. నాకు అప్పట్లో ఫెమినిజం కానీ, స్త్రీల హక్కుల గురించికానీ ఏ మాత్రం అవగాహన లేదు. కానీ ఎందుకో అన్పించింది మనం కూడా పోటీ చేయాలని. అంతా తమాషాగా అనుకున్నాం. కానీ వాళ్ళు చేసిన పని తట్టుకోలేనిదిగా అయ్యింది. దారుణమైన సంఘటన, అది వయొలెన్స్‌ కదా! అందుకే యూనియన్‌, కాలేజి ఫంక్షన్లన్నీ బాయ్‌కాట్‌ అనుకున్నాం. ఆ రోజు అందరం ఇంట్లోనే ఉందామని నిర్ణయించుకున్నాం. దాంతో సమస్య తీరింది. అలా అది నా మొదటి ప్రతిచర్య అనచ్చు.

నేను లిటరేచర్‌ చదవాలనుకున్నాను. మా నాన్నగారికి నన్ను మెడిసిన్‌ చదివించాలని ఉండేది. నేను మద్రాస్‌ యూనివర్శిటికి అనుబంధంగా ఉన్న ప్రెసిడెన్సి కాలేజీలో హానర్స్‌ కోర్స్‌లో చేరాను. ఎక్కడైనా, ఎప్పుడైనా నాకు తోచినది చదవడమే. కానీ ఒక పద్దతిగా ఎప్పుడూ చేయలేదు. మా అమ్మాయిలు చదివిన విధానం కానీ, ఇప్పుడు మనమరాలు చదువుతున్న విధానం కానీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం. నేను ఎప్పుడూ ఒక క్రమపద్ధతిలో చదవనేలేదు. టీచర్లు బాగా చేప్తే క్లాస్‌ని ఎంజాయ్‌ చేసేవాళ్ళం. చెప్పిన విషయాలు గుర్తుంచుకొని పరీక్షల్లో వ్రాసేవాళ్ళం. మార్కులు రావాలని కానీ, మార్కుల కోసం కానీ చదివేదే లేదు. ఇప్పుడు అలా కాదు.

తరువాత పెళ్లైంది. కన్నభిరాన్‌గారు హైదరాబాద్‌లో ప్రాక్టీస్‌ చేద్దామని నిర్ణయించుకున్నారు. నేను రెడ్డి కాలేజీలో టీచర్‌గా జాయిన్‌ అయ్యాను. కాలేజీలో బోధన నాకు చాలా ఇష్టమైన పని. నేను లిటరేచర్‌ చెప్పేదాన్ని. క్లాస్‌లో పిల్లలతో గడపటం, వారికి పాఠాలు చెప్పడం అంటే నాకెంతో ప్రియమైన పని. పిల్లలందరికి నేనంటే ఎంతో అభిమానం. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నా స్టూడెంట్స్‌ ఎంతోమంది నా దగ్గరికి వచ్చి గుర్తు చేస్తుంటారు. మృణాళిని, ఆవుల మంజులత, లలిత, రత్నమాల, అంబిక, జయలక్ష్మి, శీలారెడ్డి వంటి వారంతా నా స్టూడెంట్స్‌. ఎక్కడికి వెళ్ళినా ప్రిన్సిపాల్‌గా, డైరెక్టర్లుగా నా విద్యార్థులను చూస్తూంటే గర్వంగా ఉంటుంది.

కన్నభిరాన్‌గారు ప్రాక్టీసు…

అప్పట్లో నా ఆలోచన ఎలా ఉండేదంటే, తన ప్రాక్టీస్‌ పెరుగుతోంది కదా, ఏదో 2-3 సంవత్సరాలు ఉద్యోగం చేసి స్థిరపడ్డాక పిల్లలు, ఇంటి బాధ్యత చూసుకుందామకు అనిపించేది. అయితే రాన్రాను నాకు తెలియకుండానే, బోధన మీద ఆసక్తి నాలో పెరిగింది. బోధన వల్ల నా జీవితంలో వచ్చిన మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే, తెలుగు మీడియం పిల్లలకు ఇంగ్లీష్‌ లిటరేచర్‌ పాఠాలు చెప్పడం. రెడ్డి కాలేజి చాలా ప్రముఖమైన కాలేజి. తెలంగాణా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలకు చదువు అవసరాలు తీర్చడం కోసం ఏర్పడింది. అలాగే ఆకాలేజీలో 40 శాతం సీట్లు తెలంగాణా గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలకు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి.

అలా చాలా మంది ఆడపిల్లలు తెలుగు మీడియంలో ఉండేవారు. వారికి ఇంగ్లీష్‌ లిటరేచర్‌ ఎలా చెప్పాలి, మిల్టన్‌, షేక్స్‌పియర్‌ వంటి వారి రచనలు ఎలా అర్థం చేయించాలి అని ఆలోచించి వాటిని కొద్దిగా సులభతరం చేసి చెప్పేదాన్ని. ఇంగ్లీష్‌ మీడియం పిల్లలకి పాఠాలతోపాటు వాటికి సంబంధించిన వివిధ ముచ్చట్లు, అదనపు కథలు జోడించి చెప్పేదాన్ని. అందుకకు వాళ్ళకు నా క్లాస్‌ అంటే చాలా ఇష్టంగా ఉండేది. తెలుగు మీడియం పిల్లలకి కూడా నా క్లాస్‌ వినడం ఇష్టంగా ఉండేది. అయితే వాళ్ళు ఇంగ్లీష్‌ మీడియం పిల్లల దగ్గరికి వెళ్ళి ‘ఈ రోజు మేడం మీకు క్లాసులో ఏం చెప్పారు’ అని అడిగి తెలుసుకునేవాళ్ళు. నా తర్వాత క్లాసులో ‘మేడం మీరు వాళ్ళకి చాలా విషయాలు చెప్పారు. మాకూ చెప్పండి’ అనే అడిగేవారు. దాంతో వాళ్ళకి సులువుగా అర్థమై, జీర్ణించుకోవడానికి వీలుగా నేను పాఠాలను సమగ్రంగా చెప్పేలా ప్రయత్నం చేశాను. అలా నా బోధనా నైపుణ్యాలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన పిల్లల అవసరాలు, ఆసక్తులను గుర్తించి, వాటిని తీర్చడం అనేది నా జీవితంలో మొదటి మెట్టు. ఆ విధంగా రెడ్డి కాలేజీలో టీచర్‌గా నా అనుభవం నాకు రెండు ముఖ్యమైన విషయాలను నేర్పింది. ఒకటి వివిధ వ్యక్తులతో మెలుగుతూ వారి నుండి అభిప్రాయాలు, ఆలోచనలను తీసుకోవడం. రెండవది తెలుగు మీడియం పిల్లలతో కలిసి వివిధ సంస్కృతుల ఇంటర్‌ప్రిటేషన్లు చేయడం నా జీవితంలో ప్రధానమైనవి.

చూస్తుండగానే ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి. కన్నభిరాన్‌కి సివిల్‌ లిబర్టీస్‌పైన చాలా కేసులు వచ్చేవి. ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, నన్ను అరెస్ట్‌ చేస్తున్నారంటూ అర్థరాత్రి ఫోన్‌కాల్స్‌… అప్పుడు నా జీవితం రెండు వేర్వేరు విభాగాలుగా అయ్యింది. పొద్దున్న కాలేజీకి వెళ్ళడం, పాఠాలు చెప్పడం, అలాగే ఒక అసిస్టెంట్‌లాగా రాత్రి ఫోన్‌కాల్స్‌ తీసుకోవడం, నోట్‌ చేసుకుని చెప్పడం. చాలా వరకు ఇంటికి సాక్షులు రావడం, వారి వివరాలు ఇవ్వడానికి, కమిషన్‌ ముందు పెట్టడానికి కేసులు తయారు చేయడం, టైప్‌ చేయడం, సరిచూడడం ఇలాంటి పనుల్లో సహాయపడడం వంటివన్నీ ఇంట్లో జరిగేవి. నా వృత్తికి, కుటుంబ వాస్తవానికి రెండింటికీ మధ్య మందమైన గ్లాస్‌ గోడలాగా ఉండేది. రెండు ప్రపంచాలకు సంబంధమే లేదు.

నిజానికి మా కుటుంబంలో మొదటి నుండీ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు. మాతాతగారి తమ్ముళ్ళు. పార్టీ నుండి పెద్దపెద్ద వ్యక్తులు ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఇదంతా ఒకవైపు. అరెస్టులు, జైలుకి వెళ్ళడాలు, రహస్య పత్రాలను తగలపెట్టడం (బాయిలర్‌లో వేసి మంటపెట్టడం) వంటివన్నీ నా చిన్నతనంలో భాగమే. ప్రతి మతం, కులం నుండి మాఇంట్లో వ్యక్తులకు వివాహ సంబంధాలు ఉండడం, ఇలాంటి వైరుధ్యాల మధ్య కిచిడి కుటుంబంలాగా ఉండేది. ఈ నేపథ్యంలో పెరిగాను నేను.

ఎమర్జెన్సీ రోజులలో కన్నభిరాన్‌కి కూడా బెదిరింపులు వస్తుండేవి. మనుష్యులు వస్తూ పోతూఉండేవారు. అప్పుడే లలిత, రత్నమాల, అంబిక, వీణలతో పరిచయమయింది. నిజానికి లలిత, రత్నమాల, అంబిక నా స్టూడెంట్స్‌ అని కూడా నాకు తెలియదు. పార్టీ కార్యక్రమాలలో వాళ్ళపై కేసుల సందర్భంగా వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు. అప్పటికి నాకు స్త్రీ వాదం, స్త్రీల హక్కులు, రాజకీయం వంటి స్పృహ లేదు. కానీ కన్నభిరాన్‌ కేసుల వలన నాకు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. నేను కూడా పొలిటిసైజ్డ్‌ అయ్యానేమో. తనకి బెదిరింపులు బాగా వచ్చేవి. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్‌ చేస్తారేమో, చంపేస్తారేమో అనే భయం వేసేది.

అయితే ఈ అసాధారణ జీవితం పిల్లలపై ప్రభావం చూపకుండా ఉండడానికి నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళను తీసుకుని బయటకు వెళ్ళడం, రకరకాల వంటలు చేసి వారికి పెట్టడం, వారితో సమయం గడపడం ఇలాంటివి చేసేదాన్ని. అదే సమయంలో రమా, వీణ, లలిత ఇంటికి వచ్చేవారు. వాళ్ళు పార్టీలోఉన్నారు. రాజకీయాలతో పరిచయం ఉంది. వాళ్ళు ఇంటికి రావడం వల్ల మా మధ్యస్నేహం ఏర్పడింది. సి.ఐ.ఇ.ఎఫ్‌.ఎల్‌ లో చదువుతున్నప్పటి నుంచి సూజీతో స్నేహం ఉండేది. వాళ్ళు స్త్రీ శక్తి సంఘటన ప్రారంభించారు. మీటింగులకు పిలిచే విషయంలో ఒకసారి నన్ను కూడా పిలిచారు. నేను కన్నభిరాన్‌ భార్యనని తెలుసు. నాకు ఇంకా ఏమి తెలుసు, మాట్లాడగలనోలేదో అన్న చర్చ వారి మధ్య జరిగి ఉండవచ్చు. కానీ నేను ఆ విధంగా స్త్రీ శక్తి సంఘటనలో చేరాక నా జీవితమే మారిపోయింది. నేను చాలా ఏకాగ్రతగా ఫెమినిజం గురించి చదవడం, ఆలోచించడం, విమర్శలు చేయడం, యాక్టివిజమ్‌ ఇలా నా జీవితం మొత్తాన్ని అది కబళించివేసిందేమో అన్న భావన. అది నా జీవితంలో చాలా ముఖ్య పరిణామం అని చెప్పవచ్చు.

ఈ స్త్రీ శక్తి సంఘటన ద్వారా మనకు తెలియని మన చరిత్ర కోసం పనిచేయడం మరోగొప్ప అనుభవం. దానికి కూడా నాకు అర్హత లేదనుకుని వెళ్ళాను కానీ అది చేస్తుంటే నా ఆసక్తి బాగాపెరిగింది. ఒకేసారి తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లోదాన్ని తీసుకుని వచ్చాం. అందుకు ఆ కేసులన్నింటినీ ట్రాన్స్‌లేట్‌ చేయడం నా పనిగా ఉండేది. ట్రాన్‌స్క్రిప్షన్‌ వింటూ లలిత తెలుగులో, నేను ఇంగ్లీషులో ఒకేసారి రాసేవాళ్ళం. దాంతో నా ట్రాన్స్‌లేషన్‌ సామర్ధ్యాలు బాగా పెరిగాయి.

అలాగే స్త్రీ శక్తి సంఘటన ద్వారా చాలా చాలా కార్యక్రమాలు చేశాం. కొన్నేళ్ళకు ‘అన్వేషి’ ని ప్రారంభించాము. తర్వాత్తర్వాత నాకు ఇది సరిపోదనిపించింది. నేను ఇంకా వేరే ఏదైనా చేయాలనిపించింది. చిన్న గ్రూపులో కొంతకాలం పనిచేశాక ఏం చేద్దామా అనుకునేలోగా డిడిఎస్‌లో పనిచేయమని నా స్నేహితుడు గోపాల్‌ అడిగారు. అది కూడా నాకు చాలా ఉపయోగకరమైన అనుభవంగా అయ్యింది. నేను గ్రామీణ స్త్రీల జీవితాలను దగ్గరగా చూడగలిగాను. కొంతకాలం తర్వాత అక్కడ కూడా గ్రామం మొత్తం, కమ్యూనిటీ ఇలాంటివి పైకి వస్తాయి కానీ స్త్రీల అంశాలు, స్త్రీల బృందం కాదు కదా అని నాకు అనిపించింది. కొన్ని రోజుల తర్వాత కొందరు స్నేహితులతో కలిసి ‘అస్మిత’ను ప్రారంభించాం.

‘అస్మిత’లో జరిగిన పని నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. విస్తారమైన మెటీరియల్‌ను తయారు చేశాం. ఆంధప్రదేశ్‌తో పాటు ఇండియా మొత్తంలో ‘అస్మిత’ ద్వారా శిక్షణ పొందని గ్రూప్‌ లేదు. పాంప్లెట్స్‌, బుక్‌లెట్స్‌ అనువాదాలు చేశాం. శిక్షణ మెటీరియల్‌ తయారు చేశాం. ‘అస్మిత’ సిబ్బందికి శిక్షణనిచ్చి వాళ్ళు తిరిగి సంస్థలకు శిక్షణనిచ్చేలా చేశాం. మేము శిక్షణనిచ్చిన వ్యక్తులు తిరిగి వివిధ ప్రదేశాల్లో, ప్రభుత్వంలో శిక్షకులుగా ఉన్నారు. ఇలా ఎంతో పని జరిగింది. ఇది తలచుకుంటే గొప్ప సంతృప్తి.

అంతేకాదు, ‘అస్మిత’ ద్వారా మేము రాజకీయంగా కూడా పని చేశాం. జెండర్‌ను పొలిటికల్‌ డిస్కోర్స్‌ల్లోకి తేవడానికి ప్రయత్నం చేసి సాధించాం. ఈ క్రమంలో నేను, ఓల్గా కలిసిబీ నేను వ్యక్తిగతంగాబీ ఓల్గా, కల్పన కలిసిబీ నేను, కల్పన కలిసిబీ మేము ముగ్గురం కలిసి చాలా చాలా వ్రాశాం. వీటికి అస్సలు పోలికే లేదు, చాలా బాగా వచ్చాయి. నిజానికి మా ముగ్గురి దారులు వేరు. అయినా ఏదీ అడ్డం కాలేదు. ఆ సమయం ఎంతో విలువైనది. మేము వ్రాసి ఇచ్చిన స్టేట్‌మెంట్లు పొలిటికల్‌గా ఉండేవి. 25 సంవత్సరాలపాటు ‘అస్మిత’లో ఎంత మందికి శిక్షణలు ఇచ్చామో లెక్కలేదు.

ఎ.ఎస్‌.బి.ఎ.ఇ ప్రోగ్రామ్స్‌లో – జెండర్‌ – డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్స్‌ ఇవ్వడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు పర్యటించగల్గాను. ఆ అనుభవాలు నాకు చాలా విలువైనవి. వాటి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నాకు ఎంతో మంది స్నేహితులు ఏర్పడ్డారు.

‘భూమిక’ గురించి…

ఇంకొకటి, 25 సంవత్సరాల క్రితం ‘భూమిక’ ప్రారంభం మాకు మరొక ముఖ్యమైన అంశం. సత్యవతి గారు ‘భూమిక’ మాగజైన్‌ తెస్తున్నాం అనగానే ముందుగా మేము సంతోషించాం. మధు కిష్వర్‌ మానుషి మ్యాగజైన్‌ తెచ్చినప్పుడు కూడా అందరం చాలా సంతోషించాం. ఎందుకంటే మనకంటూ ఒక వేదిక, సృజనాత్మక వేదిక దొరికింది. అది కవిత కావచ్చు, కథ, వ్యాసం, విమర్శ ఏదైనా. అందరికీ తెలపాలనుకునేది, ఏదో చేయాలనుకున్న వారికి ఒక వేదిక కావాలి. అది ఈ ‘భూమిక’ ద్వారా దొరికింది. ‘భూమిక’లో వస్తున్న ఆర్టికల్స్‌, వ్యాసాలు, లెటర్స్‌ వంటివన్నీ చూస్తుంటే ఆ ఆశయం ఫలించిందనిపిస్తుంది. చర్చలకు అది ఒక వేదిక.

17 జులై 1997లో హైదరాబాద్‌లో సారా వ్యతిరేక ఉద్యమం నిర్వహించాం. మేము 20 వేల మందితో నిర్వహించాలనుకుంటే లక్షకిపైగా వచ్చారు. దొరికిన బస్సులు, రైళ్ళు ఎక్కి హైదరాబాద్‌ వచ్చారు. నిజానికి మహిళలతో రోడ్లన్నీ నిండిపోయాయి. ట్యాంక్‌బండ్‌, నాంపల్లి అంతా రంగులమయం. ఎవరు మొబిలైజ్‌ చేశారు వీళ్ళందరినీ అని స్పెషల్‌బ్రాంచి వారికి ఆశ్చర్యం. మేమేం చేయలేదు. ఎన్జీఓలు అందరూ కలిసి రావాలనుకుని వచ్చేశారు. అప్పటి ముఖ్యమంత్రి సారా నిషేధాన్ని ఆ వారంలో ఎత్తేయాలనుకున్నారు. అందుకకు అందరూ హైదరాబాద్‌ ఊరేగింపు సమావేశంలో పాల్గొనడానికి వచ్చేశారు. ఒకరిద్దరు కాదు లక్షకుపైగా. అందరినీ ఎలా మేనేజ్‌ చేశామో మా కస్సలు తెలియనే లేదు. మంచి కేటరర్‌

ఉండేవారు. ఇప్పటిలాగా సెల్‌ఫోన్లు లేవు, ల్యాండ్‌లైన్‌ మాత్రమే. అందరికీ బస్తాల, బస్తాల అన్నం వేడివేడిగా వండి, దాన్ని ప్లాస్టిక్‌ కవర్లలో వేయాలంటే కష్టమైంది, అయినా అందరికీ అందించగలిగాం. గుంపులు గుంపులుగా మహిళలు. పోలీసులు వీళ్ళు వెళ్తే చాలు అన్న భావనలోఉన్నారు. ఒక్కపేపర్‌ కానీ, ఒక్క న్యూస్‌ ఛానల్‌కానీ దీన్ని కవర్‌ చేయలేదు. మొత్తం బ్లాక్‌అవుట్‌. దీన్ని డాక్యుమెంట్‌ రూపంలో చేయడానికి ఒక వేదిక, స్వరం కావాలి. అలాంటి వేదికను ‘భూమిక’ అందించింది. ఇలాంటి వాటిపై వార్తలు ప్రచురిస్తోంది. ‘భూమిక’ స్త్రీలకు స్వరం అందిస్తోంది, విభిన్న స్వరాలను వినిపించడానికి, వాటిని ప్రచురించడానికి ‘భూమిక’ ఒక వేదికగా

ఉంది.

స్త్రీ శక్తి సంఘటన వీథి నాటకాల గురించి….

మేము బాదల్‌ సర్కార్‌గారి దగ్గర నుండి శిక్షణ తీసుకున్నాం. అది నాకు వ్యక్తిగతంగా చాలా సహాయపడింది. ఒక నెలపాటు మేము అక్కడ తీసుకున్న శిక్షణ, చేసిన కార్యక్రమాలను తిరిగి ‘అస్మిత’ ద్వారా శిక్షణ, వర్క్‌షాప్‌లు నిర్వహించి వీధి నాటకాలు నిర్వహించడానికి ఎంతగానో సహాయపడింది.

‘కఠోర షడ్జమాలు’ అనే శీర్షికతో వ్యాసాలు వ్రాశారు కదా! ఆ అనుభవం చెప్పండి.

నాకెందుకో రాయాలనిపించింది. ఎబికె గారి దగ్గరకు వెళ్ళాను. ఆయన అప్పుడు ఎడిటర్‌. కాలమ్‌ వ్రాస్తానన్నాను. ఆయన ఒక విధమైన ఎక్స్‌ప్రెషన్‌తో జార్గన్‌ వద్దు, జార్గన్‌ అక్కర్లేదు నాకు. జార్గన్‌ లేకుండా రాయగలిగితే వ్రాయండి అన్నారు. ఇదేంటి అనుకుంటూ బయటకు వచ్చాను. కానీ నా జీవితంలో అది చాలా విలువైన పాఠంగా అయ్యింది. జార్గన్‌ (పదజాలం) వాడకుండా, ఎక్కడా ఎవరూ ఫెమినిస్ట్‌ అనుకోకుండా, అందరికీ అర్థమయ్యే భాషలో రాయాలంటే, ఎంతో ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఇది నాకు ఒక ఛాలెంజ్‌. నిజానికి అందులో స్త్రీ వాదం గురించిన విశ్లేషణ చాలా ఉంది. చాలా మంది అది చదివాక మా జీవితాలు మారిపోయాయి అని చెప్పారు. అది నాకు చాలా సంతోషకరమైన అనుభవం. ఎక్కడకు వెళ్ళినా, అక్కడ ఎవరో ఒకరు నా దగ్గరకు వచ్చి అలా చెప్పడం ఎంతో సంతృప్తినిచ్చింది. దానికి నేను ఎబికె గారికి ఎంతో ఋణపడిఉంటాను. కాలమ్‌ రాయడానికి ఒప్పుకోవడం, జార్గన్‌ గురించి చెప్పడం, దాన్ని ఉపయోగించవద్దనడం, ఇవి నన్ను నేను చూసుకుని వ్రాయడానికి ఎంతగానో సహాయపడ్డాయి. ఆ పాఠం నా జీవితంలో అలానే ఉండిపోయింది.

ఆ పేరు పెట్టడానికి మీకు ఎదురైన అనుభవాలు..!

ఎవరో ఒక వ్యక్తి మల్లాది సుబ్బమ్మ గారి గురించి ఒక కవిత్వం వ్రాశారు. అందులో ఆయన వాడిన పదజాలంలో ఓల్గాను రష్యన్‌ గంగ అన్నారు, వసంత కోకిలను కఠోర షడ్జమం అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. నా ఇంటికి ఒకసారి వి.వి వచ్చారు. ఆయనను అడిగాను. కఠోర షడ్జమాలు అంటే ఏమిటి అని. ఆయన చెప్పారు – కోయిల పంచమంలో పాడాలి, నెమలి షడ్జమంలో పాడుతుంది. షడ్జమం Male note. పంచమం అనేది సున్నితమైనది, Female note అంటే వసంత కోకిల పంచమంలో కాకుండా షడ్జమంలో పాడుతుంది అంటే ఎంత కఠోరంగా ఉంటుంది అని అర్థం. నాకు ఇది దొరికింది కదా అనిదాన్ని టైటిల్‌గా పెట్టేశాను. అంతేకాక పంచమం అంటే ఏమిటి, షడ్జమం అంటే ఏమిటి, కఠోర షడ్జమాలు ఎలా వచ్చింది అంటూ వివరంగా విశ్లేషణ చేశాను. ఎంత వివరంగా అంటే దూదిని ఏకినట్లు. ఇది కూడా నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా, ఎవరైనా నాదగ్గరికి వచ్చి మీ దగ్గర నుండి మేము ఇది నేర్చుకున్నాం అని చెప్తే నాకెంత తృప్తిగా ఉంటుందో.

1000 మంది స్త్రీల శాంతి ప్రైజ్‌కి నన్ను నామినేట్‌ చేస్తానంటే నేను వద్దకు అని గట్టిగా తిరస్కరించాను, కోపం కూడా వచ్చింది. కానీ ఓల్గా, కల్పన బలవంతంపై ఒప్పుకున్నాను. అప్పుడు జరిగిన సమావేశంలో అభినందనలు తెలపడానికి వేల మంది మహిళలు వచ్చారు. వారంతా నన్ను కౌగిలించుకుని ‘మీకు వస్తే మా అందరికీ వచ్చినట్లే’ అన్నారు. అప్పుడు నాకు అనిపించింది. నామినేషన్‌ అంత విలువైనది ఇది అని, నాకు చాలు అనిపించింది.

నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు జీవితంలో ఎన్నో గొప్ప, గొప్ప అనుభవాలు, అనుబంధాలు ఏర్పడ్డాయి. ‘భూమిక’తో పనిచేశాను. అంతేకాక నావో (NAWO) జాతీయస్థాయిలో ఏర్పడడం, దానిలో ‘అస్మిత’ భాగం తీసుకోవడం, దాని ద్వారా రెండు CEDAWరిపోర్టులు ఎడిట్‌ చేయడం, నావో/ ఏపి ముఖ్యభాగం పోషించడం ఇవన్నీ ఎన్నో గొప్ప విజయాలు.

సెన్సార్‌షిప్‌పై మీరు చేసిన ప్రాజెక్టుగురించి చెప్పండి.

అది చాలా పెద్దప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో పాల్గొనడం నా అదృష్టం. దేశంలోని ప్రతి ప్రాంతం నుండి – కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మరాఠి, కన్నడ, గుజరాత్‌… ఇలా అన్ని భాషల నుండి రచయిత్రులను కలవగలగడం, అందరూ కలిసి అవసరమైన రెండు, మూడు రిపోర్టులు వ్రాయడం – ఇదంతా మరొక గొప్ప అనుభవం. ఈ సమావేశం చెన్నైలో జరిగింది. మొదటిసారి సెన్సార్‌ షిప్‌ ఏ విధంగా

ఉంటుంది, రచనలలో సెన్సార్‌షిప్‌ గురించి చాలా చర్చలు జరిగాయి. ఈ సెన్సార్‌ షిప్‌ ద్వారా జాతీయస్థాయిలో రచయిత్రులను కలుసుకోవడానికి అవకాశం వచ్చింది.

‘అస్మిత’ -25 సంవత్సరాల ప్రయాణం – సాధించిన విజయాలు

‘అస్మిత’ మొదలు పెట్టినప్పుడు ఒక లక్ష్యం అనుకోలేదు. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడల్లా కొత్త కొత్త లక్ష్యాలు మా ముందుకు వచ్చాయి. ప్రయాణం నేరుగా సాగలేదు. పక్క పక్క దారులు తీసుకుంటూ సాగింది. సాధించిన విజయాలు చూస్తే మొదటగా కౌన్సిలింగ్‌ను చెప్పుకోవచ్చు. ఇప్పుడు ‘భూమిక’ ఆ పాత్ర తీసుకుంది కానీ, అప్పట్లో కౌన్సెలింగ్‌కి ఏ సంస్థ కూడా పని చేయడం లేదు. అందరికీ కౌన్సెలింగ్‌ చాలా తప్పనిసరి అవసరంగా ఉండేది. ‘అస్మిత’ ఆ లోటు తీర్చగలిగింది. తర్వాత చెప్పాలంటే మెటీరియల్‌ను విస్తారంగా తయారుచేయడం, శిక్షణలు ఇలా ఎన్నో… 25 సంవత్సరాల ప్రయాణంలో చాలా విజయాలు, విస్తరణ ఇలా సాగింది ‘అస్మిత’ ప్రయాణం. ఎదుగుదల, సంస్థాగత నిర్మాణం చాలా అద్భుతంగా ఉండేవి.

కన్నభిరాన్‌గారితో మీ సహజీవనం. చాలా పోరాట శీలత ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య చర్చలు ఎలా ఉండేవి?

చర్చలు ఎప్పుడూ ఉండేవి. నిజానికి మేము, మా పిల్లల మధ్య కూడా చర్చలు ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళేవి. తను అనారోగ్యంతో బాధపడుతుంటే నాకు ఇబ్బందిగా ఉండేది. ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నప్పుడు కూడా పనిచేసేవారు. అలాంటప్పుడు కొంచెం వాదనలు ఉండేవి. మావోయిస్టుల అంశాలు వచ్చినప్పుడు కొంచెం అభిప్రాయభేదాలు కూడా వచ్చాయి. కానీ చర్చలు మాత్రం ప్రజాస్వామికంగా

ఉండేవి.

మావోయిస్టులతో మాట్లాడడానికి అడవులకి వెళ్ళడం, చర్చలు జరపడం వంటివి చాలా జరిగాయి. అలాంటప్పుడు చాలా ఎక్కువగా భయం ఉండేది. నిజం చెప్పాలంటే నాకెప్పుడూ ఒక రకమైన భయం ఉండేది, ఎప్పుడు ఏం జరుగుతుందోనని. ఒకసారి మా ఇంటి సందులో 100 మంది మనుష్యులు గుమిగూడారు. వాళ్ళలో సివిల్‌డ్రెస్‌లో ఉన్న పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక చిన్న దెబ్బ వేస్తే ఎంతసేపు. ఆ తరువాత రెండు రోజులకు గద్దర్‌ని షూట్‌ చేశారకు, తెలుసు కదా! నక్సలైట్ల వల్ల ఎఫెక్ట్‌ అయిన ప్రజలు తమ పిటిషన్లను చీఫ్‌ మినిస్టర్‌కి ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు కన్నభిరాన్‌గారిని చూడగానే అందరూ తనను చుట్టుముట్టి తనకి ఇవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళ మధ్య పోలీసులు కూడా ఉన్నారు. అలాగే ఇంకోసారి నల్గొండలో పబ్లిక్‌ హియరింగ్‌ జరిగింది. ఆ వెంటనే తను నిజ నిర్ధారణకు వెళ్ళినప్పుడు గద్ధర్‌ని కాల్చారు. నేను అతన్ని చూడడానికి గాంధీ హాస్పిటల్‌కి వెళ్ళాను. బయట గుంపు. నేను లోపలికి వెళ్ళాక అతన్ని నిమ్స్‌కి తీసుకు వెళ్ళాలని డాక్టర్లు నాతో చెప్పారు. అయితే అతన్ని బయటికి తీసుకెళ్తే చంపేస్తారని బయట ఉన్న గుంపుకి భయం. నేను వెళ్ళి అందరితో చెప్పాను ఈయన బ్రతకాలంటే నిమ్స్‌కి వెళ్ళాలి అని. వాళ్ళకి నమ్మకం లేదు. నన్ను తోడుగా అంబులెన్స్‌లో వెళ్ళమన్నారు. నాకు తెలుసు. డాక్టర్లు ఆదశలో అతన్ని ఏమీ చేయరకు. అయినా ప్రజల కోసం వెనక కారులో వెళ్ళాను.

అదే సమయంలో మరొక లీడర్‌ను కిడ్నాప్‌ చేసినప్పుడు 15 రోజులపాటు మా ఇంటి దగ్గర ఒక మారుతి వ్యాన్‌ నిలిచి ఉండేది. ఒక గన్‌ మా ఇంటి వరండా వైపు గురిపెట్టి ఉండేది. ఒకసారి ఒకతను లోపలికి కూడా వచ్చేసి మీరేనా కన్నభిరాన్‌ అని అడిగాడు. అతన్ని బైటికి పంపించేశాం. మరోసారి మా అమ్మాయికి ఫోన్‌ చేసి, నీకిద్దరు పిల్లలున్నారు. వారిని ఇంటి నుండి, లేకపోతే స్కూలు నుండి తీసుకెళ్ళిపోతాం అని బెదిరించారు. మన పిల్లల్ని రిస్క్‌లో పెట్టాం, కానీ వారి పిల్లలను కూడా అలా రిస్కులో పెట్టడానికి మనకేమి హక్కు ఉంది అని చెప్పేదాన్ని. మా మనుమరాలు 5 సంవత్సరాలు. బయట వీథిలో క్రికెట్‌ ఆడేది. తనకు ఆడొద్దు అనడం తప్పు కదా. కాబట్టి తను క్రికెట్‌ ఆడుతుంటే వాళ్ళ నాన్న లేకపోతే నా అంకుల్‌ వెళ్ళి వీథిలో కూర్చునే వారు. మరోసారి మా అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు తనకి ఒక పోలీస్‌ వ్యాన్‌ నుండి ఒక వ్యక్తి కన్నభిరాన్‌ వైపు గురిపెట్టి నిలబడి ఉండడం కనిపించింది. అతనికి గురి అందకుండా తను అటూ ఇటూ కదులుతూ ఉంది. కొంతసేపటికి అక్కడ ట్రాఫిక్‌ ఎక్కువై ఆ వ్యాన్‌ వెళ్ళిపోయింది.

అలా చాలా చాలా బెదిరింపు, ప్రాణహాని ఎప్పుడూ ఉండేది. 1975-76 నుండి ఇది ఉండేది. అయితే ఆయన ప్రాముఖ్యత పెరగగానే తనని ఏమైనా చేస్తే అది అంతర్జాతీయంగా పెద్ద సవాల్‌ అవుతుంది కదా!

మీకు కన్నభిరాన్‌ సాహచర్యంలో ఉద్యమంలో ఉన్న వ్యక్తులలో ప్రముఖులందరితో పరిచయాలు ఏర్పడ్డాయి కదా! వారి వారి ఉద్యమ జీవితాలతోపాటు వ్యక్తిగత జీవితాలపైకూడా చర్చలు జరిగేవా మీ మధ్య?

నేనెప్పుడూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేదాన్ని కాదు. వాళ్ళ వాళ్ళ కేసుల గురించి వచ్చేవారు. నోట్సు తీసుకునేదాన్ని. అవసరమైతే ట్రాన్స్‌లేషన్స్‌ చేసేదాన్ని. కన్నభిరాన్‌గారితో మాట్లాడేవారు. నన్ను కూడా పలకరించే వారు అంతే. వారి పని వారిది అంతే. నన్నెప్పుడూ ఎవరూ నియంత్రించే వారు కాదు. అప్పటికే స్త్రీ శక్తి సంఘటనలో చేరాను కాబట్టి కావచ్చు.

’80లలో స్త్రీవాద సాహిత్యం ఒక వెల్లువలా వచ్చింది. ‘నీలి మేఘాలు’ పుస్తకంపై జరిగిన చర్చ కూడా మీకు గుర్తుండి ఉంటుంది కదా! ఒక పదేళ్ళపాటు అది అన్ని రంగాల్లో ప్రభావితమైంది. ఆ క్రమంలో మీ అనుభవాలను మాతో పంచుకోగలరా. ఆ నేపథ్యం కానీ…

అప్పటి వరకూ స్త్రీలు కథలు వ్రాస్తున్నారు, కవితలు వ్రాస్తున్నారు. అక్కడక్కడా పబ్లిష్‌ అవుతున్నాయి. దాంతోపాటే నీకు అనుభవం లేకుండా ఎలా రాస్తావని వారిపై విమర్శలు. అలాగే స్త్రీ వాద రచనలపై గొడవలు జరగడం. అప్పుడు వీరికి శారీరక స్పృహ ఉంది కానీ సామాజిక స్పృహ లేదనే విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో మేము రచయితలందరినీ పిలిచి ప్రెస్‌క్లబ్‌లో మీటింగ్‌పెట్టాం. రచయితల సమావేశం లాంటిది. లౌక్యంగా కాళోజీగార్ని పిలిచాం. అప్పుడప్పుడు అలాంటి పనులు తెలివిగా చేసి, మన పనిని సాధించుకోవడం మా పనుల్లో భాగం. తెలుగు కవి సమ్మేళనం లాంటిది. ఆ రకంగా ‘నీలి మేఘాలు’ బయటకు వచ్చింది. అందరూ తమ కవితలు వినిపించి సన్మానం పొందడం అందరినీ ఒక దగ్గరికి తెచ్చింది. ఆ పుస్తకాన్ని రామారావుగారు ప్రశంసించడం మరింత గుర్తింపు తెచ్చింది.

అయితే నీలిమేఘాలు పుస్తకం తర్వాత ఒక్కసారిగా స్త్రీ వాదుల కవిత్వాలు ఎక్కువ వచ్చినప్పటికి కొన్ని అసందర్భమైన కవితలు కూడా వచ్చాయి.

అంతెత్తున స్త్రీవాద ఉద్యమాన్ని ప్రభుత్వం స్వంతం చేసుకుని స్త్రీల సాధికారత అని, జెండర్‌ అని స్త్రీ వాద పదజాలాన్ని తన ప్రయోజనాలకి ఉపయోగించుకుంటోంది. అయితే ఇదంతా ఎవరికి చేరిందని మీరు అనుకుంటున్నారు?

చేరినప్పుడు చేరింది. ప్రపంచం మొత్తంలో ఇలాగే జరిగింది. అంతెందుకు, మనం తెచ్చిన సెల్ఫ్‌ హెల్ప్‌ పదాన్ని ప్రపంచ బ్యాంక్‌ వాడుకుంటూ సెల్ఫ్‌ హెల్ప్‌ బృందాలుగా ఏర్పాటు చేసి, ఋణాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలకి పరిమితం చేసింది. అంటే ఆ పదాలకి పూర్తి అర్థం మారిపోయింది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో స్త్రీవాద ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రపంచ బ్యాంక్‌తో పాటు డోనర్లు కూడా అందులోకి నెట్టబడ్డారు. ఇప్పుడు SHG అంటే పర్యాయపదం మైక్రోఫైనాన్స్‌.

మొత్తంగా స్త్రీవాదులను హైజాక్‌ చేసినట్లు కదా!

హైజాక్‌ చేశారు. కానీ ఒక దశలో మనం కూడా హైజాక్‌ అవ్వడానికి తయారుగానే ఉన్నామేమో! అధికారం, హోదా, డబ్బు అన్నీ కావలసి వచ్చాయి. ఇదంతా ప్రొఫెషనల్‌ అయ్యింది. మొదట్లో కన్సల్టెన్సీ చేశాము. జెండర్‌పె ౖపేపర్లు వ్రాసి ఇచ్చాం, వర్క్‌షాప్‌లు నిర్వహించాం. అసలు పాలిటిక్స్‌ అనే పదం లేకుండా పోయింది.

స్త్రీల హింస గురించి ఎన్నో కార్యక్రమాలు, చట్టాలు వచ్చాయి. పథకాలు వచ్చాయి. దీనివల్ల వారి పట్ల హింస ఏమైనా తగ్గిందా?

అప్పటి నుండి ఇప్పటికి హింస విపరీతంగా పెరిగింది. జరిగిన ఒక కేసును లేదా కొన్నింటిని హైలైట్‌ చేస్తున్నారు. మిగిలిన వాటి గురించి, కోకొల్లలుగా జరుగుతున్న వాటిని ఆపే ప్రయత్నం జరగడం లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు తామంతట తామే బయటికి వస్తున్నారు. అంశాల ఆధారంగా కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. గ్రూపులు/బృందాలపై వారికి విశ్వాసం, నమ్మకం పోయిందేమో మరి. ఏ బ్యానర్‌ కిందా కాకుండా అంశాలపైనే ఒక్కటవుతున్నారు. సంస్థలపై విశ్వాసం లేదు, కోల్పోయారు.

స్త్రీల ఉద్యమం ఒకప్పుడు చాలా వైబ్రెంట్‌గా, క్రియాశీలకంగా ఉండేది. అయితే ఇప్పుడు అది సంస్థల పరమైందనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం.

చాలా త్వరగా అయిపోయింది. ‘అస్మిత’లో కూడా ప్రతినెలా స్పెషల్‌ బ్రాంచికి రిపోర్టు ఇచ్చేవాళ్ళం. రైట్స్‌ అనే పదం వాడకుండా డెవలప్‌మెంట్‌ అనే పదం వాడేవాళ్ళం.

మీ రచనలు…

గొర్లె సత్యవతి గారి బయోగ్రఫీ ఇది ఇంగ్లీష్‌లో, తెలుగులో వచ్చింది. తడి ఆరని గాయాలు. మరొకటి (ఇంగ్లీష్‌, తెలుగు, కన్నడ, మరాఠీ బాషల్లో వచ్చింది). అన్నింటికంటే ఇష్టమైనవి, ముఖ్యమైనవి నేను రాసి, ప్రొడ్యూస్‌ చేసి, డైరెక్ట్‌ చేసిన 5 బ్యాలెలు – మేనక, అహల్య, గాంధారీ, పీస్‌ ఆన్‌ ఎర్త్‌, రాజసింహ. ఇవన్నీ పురాణాల్లో నుండి తీసుకున్న ఇతివృత్తాలను ప్రశ్నించుకుంటూ, అర్థాలను విమర్శనాత్మకంగా పరిశీలించి బ్యాలేలుగా రూపొందించాను. కాళోజి మా ఇంటికి వచ్చినప్పుడల్లా పాడి వినిపించే నర్సింహ పాటని స్ఫూర్తిగా తీసుకుంటూ రాజసింహ చేసిన. ఇంకా అనువాదం ప్రాజెక్ట్‌ ఒకటి ఈ మధ్యే పూర్తయింది. ఇంకా ఏదో కవితలు అవి వ్రాస్తాను, అంతే. తెలుగు సాహిత్యం పైన అనువాదం. దాని ద్వారా తెలుగు సాహిత్యంపై కొంత పరిచయం పెరిగింది. నేను ఇంగ్లీషుపై పెట్టిన దృష్టి తెలుగు భాషపై పెట్టలేదు. నిజానికి నాకు మంచి తెలుగు చెప్పే టీచర్లు ఉండేవారు. నేను కీస్‌ హై స్కూల్‌లో చదివేటప్పుడు మా టీచర్‌ ఎల్లాప్రగడ సీతాకుమారి, కాలేజీలో సి. నారాయణ రెడ్డిగారు.. అంత మంచి టీచర్లు ఉండడం నా అదృష్టం.

చివరగా మీ సందేశం…

ప్రతి మనిషి తనలోని భయాలను అధిగమించి – నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, తన అవసరం ఉన్నవాళ్ళకు అండగా నిలబడటం, చివరగా ప్రతి చిన్న పనిలోనూ సంతృప్తిని పొందటం అలవాటు చేసుకోవాలి. నేను నా జీవితంలో ఎంతో సంతృప్తిగా ఉన్నాను. నా జీవితం నాకు ఎంతో విలువైనది. ఎందుకంటే, నేను కలిసిన, సృజించిన అసంఖ్యాకమైన స్త్రీలు ఇందుకు కారణం. ఇక్కడ, దేశమంతా, ప్రపంచం మొత్తంలో నేను విభిన్నమైన వ్యక్తులను కలిశాను. వారితో పరిచయాల వల్ల ఎక్కడో నాకు నా జీవితం వ్యర్థం కాలేదకు అనిపిస్తుంది. ఎంతో మంది స్త్రీలు, పురుషులను కలిసినందువల్ల నేను చాలా అదృష్టవంతురాలిని అని నేననుకుంటాను.

ఇంటర్వూ చేసినవారు: పద్మ ఆకెళ్ళ, కొండవీటి సత్యవతి

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.