క్షేత్రస్థాయి మహిళల పోరాటాల నుంచి చాలా నేర్చుకోవాలి కామేశ్వరి జంధ్యాల

 

మీ బాల్యం, మీరు పెరిగిన వాతావరణం గురించి చెప్పండి.

నా బాల్యం అంతా చాలా ఉల్లాసంగా గడిచింది. నిజానికి నేను పెరిగిన వాతావరణం చాలా ఆసక్తికరమైన అనుభవం అని నేననుకుంటాను. నాన్నగారు రైల్వేలో పని చేయడం వలన మేము కలకత్తా, చిత్తరంజన్‌, మద్రాస్‌ ఇలా చాలా చోట్ల ఉన్నాం. కానీ నా చదువు ఎక్కువ భాగం మద్రాస్‌లోనే. పెద్ద బంగళా! ఎన్నో గదులు, పెద్ద కుటుంబం, వచ్చే పోయే వాళ్ళతో ఎప్పుడూ సందడిగా ఉండేది. అందుకే ఇప్పటికీ ఎక్కువ మంది ఉన్న గ్రూప్‌లో నేను బాగా కలిసిపోగలను.

నాన్నగారు ఇంగ్లండులో చదువుకున్నారు. గొప్ప పఠకులు. ఇంగ్లీష్‌ లిటరేచర్‌, ఇంకా ఎన్నో పుస్తకాలు ఆయన దగ్గర ఉండేవి. నాకు పుస్తకాలు చదివే అలవాటు మా నాన్నగారి దగ్గర నుండే వచ్చింది. అమ్మ స్కూలుకి వెళ్ళి చదువుకో లేదు. కాబట్టి మేము ఇంట్లో మాట్లాడే భాష తెలుగు. వేసవి సెలవులెప్పుడూ రాజమండ్రి అమ్మమ్మ గారింట్లోనే. కజిన్స్‌, ఆంటీల మధ్య రెండు నెలలు చాలా సరదాగా గడిచిపోయేవి. నేనొక్కదాన్నే ఇంగ్లీషు మాట్లాడగలగడంతో అందరికీ నేనొక స్టార్‌లా ఉండేదాన్ని. లోకల్‌ స్కూలుకి వెళ్ళి ఇంగ్లీషు పాఠాలు చెప్పడం, ట్రాక్టర్‌ మీద ఎక్కి 5 కి.మీ. దూరంలో ఉన్న టెంట్‌లో సినిమాలు చూడడం, ముంజెలు, తేగలు, చెరకు ముక్కలు తినడం… ఇవన్నీ మరపురాని అనుభూతులు. నా మొదటి గ్రామీణ జీవన అనుభవం ఇదే. జీవితం అంటే చాలా సాఫీగా, ఐడియలిస్టిక్‌గా అనిపించేది.

నాకు 15, 16 సంవత్సరాలప్పుడు నాన్న మరణం, అమ్మ అనారోగ్యం, నేను హాస్టల్‌కి వెళ్ళాల్సి రావడం నా జీవితంలో పెద్ద మార్పులే తెచ్చాయి. హాస్టల్లో ముగ్గురు అమ్మాయిలతో గదిని, 50 మంది అమ్మాయిలతో బాత్రూంని పంచుకోవాల్సి రావడం… అప్పుడే మనుష్యులు విభిన్న కుటుంబ నేపథ్యాలతో ఉంటారన్న విషయం అర్థమైంది. నేను అప్పుడే అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు పూర్తి చేయబోతున్నాను… ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు. వీరి బాధ్యత నాపై పడింది. బ్యాంక్‌ అకౌంట్ల నిర్వహణ, ఇంటికి కావలసిన ఏర్పాట్లు, సరకులు తేవడం వంటివెన్నో. అప్పట్లో 17 ఏళ్ళ పిల్ల ఇవన్నీ చేయగలదంటే అందరూ నమ్మేవారు. ఇప్పుడు అలా కాదు. తలచుకుంటే ఆ వయసులో నేను తలకెత్తుకున్న బాధ్యతలు నా కూతురికి కూడా నేను ఇవ్వలేదనిపిస్తుంది. అంతేకాదు, మా కజిన్‌ తన పెళ్ళి కోసం చేతిసంచిలో 30 వేల రూపాయలతో ట్రెయిన్లో వస్తే, ఆమెను పికప్‌ చేసుకుని, పట్టుచీరలు కొనడం, వజ్రాల దుద్దులకి ఆర్డర్‌ ఇవ్వడం ఇవన్నీ నేనే చేసానా అనిపిస్తుంది.

నేను యతిరాజ్‌ కాలేజీలో బిఏ, ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఏ చేశాను. హిస్టరీ ఆప్షనల్‌గా తీసుకున్నాను. అప్పట్లో అమ్మాయిలు మాథ్స్‌, సైన్స్‌ చదవడం అనవసరమన్న భావన ఉండేది.

మీ చిన్నతనంలో సామాజిక పరిస్థితులు, కుటుంబాల నేపధ్యాలు ఎలా ఉండేవి?

సాంప్రదాయిక కుటుంబం నుండి రావడం వలన నేను బి.ఎ. చదువుతున్నప్పటికీ ఎప్పుడూ సెక్సువాలిటీ గురించి కానీ హక్కుల గురించి కానీ మాట్లాడుకోలేదు. అయితే ఇప్పటి రోజుల్లో అందరూ చదువుకున్న, ఉద్యోగం చేసే అమ్మాయి కోడలుగా రావాలని అనుకుంటున్నారు. వాళ్ళేమీ స్త్రీల హక్కులకి సపోర్టు చేస్తున్నారని కాదు, సెకండరీ ఆదాయం ఇంటికి అవసరమనే ఆలోచన కన్పిస్తోంది. అంతేకాక ప్రస్తుతం చాలామంది యువతులు, నాకంటే దాదాపు 20 సంవత్సరాలు చిన్న వయసు స్త్రీలు కూడా సాంప్రదాయాలు, ఆచారాల మధ్యలో చిక్కుకుని ఉంటున్నారు. మా అమ్మ ఏమీ చదువుకోలేదు, కానీ మా ఇంట్లో పెద్దగా పూజలేమీ ఉండేవి కాదు. ఒక్క వరలక్ష్మి పూజ తప్ప. అది కూడా కొబ్బరికాయకి స్త్రీ ముఖం బాగా అలంకరించడం పైన ఎక్కువ ఇష్టం ఉండేది. నాపై, మా అక్కచెల్లెళ్ళపై ఎప్పుడూ బలవంతంగా గుడికి వెళ్ళు, ఇది చెయ్యి, చెయ్యొద్దు అనే ఒత్తిడి ఉండేది కాదు. నాకు 20 సంవత్సరాల వయస్సు వరకూ నేను ఎప్పుడూ బొట్టు పెట్టుకునేదాన్ని కాదు. అంతేకాక ఇంట్లో పని చేయాలని ఎవ్వరూ ఎప్పుడూ బలవంతం చేసేవారు కాదు. ఒకటే చెప్పేవారు… మనం, మన జీవితాలు ఎలా ఉంటాయో తెలీదు. ఎలాగూ నువ్వు పెద్దయ్యాక అన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి అవసరం వచ్చినప్పుడు నేర్చుకుందువు అనేవారు. అలాగే పూజలు, మత సాంప్రదాయాలు ఉండేవేమో కానీ ప్రతిరోజూ, కనపడేంతగా మాత్రం లేవు. మా అమ్మమ్మగారు మాత్రం ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆవిడ శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఆవిడకి 8 సంవత్సరాల వయస్సులో తనకంటే 20 సంవత్సరాలు పెద్ద, మొదటి భార్య చనిపోయి ఒక బిడ్డ ఉన్న వ్యక్తితో పెళ్ళయింది, కన్యాశుల్కంతో. ఆయనది జమీందారీ కుటుంబం కాబట్టి మా అమ్మమ్మగారికి ఇంగ్లీషు, తెలుగు, సంస్క తం నేర్పడానికి ఇంటి దగ్గరికే వచ్చి చెప్పే ట్యూటర్‌ ఉండేవారు. అలాగే సంగీతం టీచర్‌ కూడా ఉండేవారు. నేను పుట్టేటప్పటికి మా తాతగారు చనిపోయారు. అమ్మమ్మగారు సాంప్రదాయబద్ధమైన వితంతువు వస్త్రధారణలో ఉండేవారు. ఆవిడ పూజలు చేయడం నేనెప్పుడూ చూడలేదు. కానీ దేవుడు, పూజ సామాను ప్రతిరోజూ శుభ్రంగా

ఉంచేవారు, అంతే! చాలా విషయాల్లో ఆవిడ ఖచ్చితంగా ఉండలేదు ఎప్పుడూ. నెలసరి సమయంలో మా పిన్నిలు దూరంగా కూర్చోవడం ఉండేది. కానీ అమ్మమ్మగారి సమయంలోనే ఎప్పుడో అది మానేసారు. ఆవిడకున్న ఒకే ఒక శ్రద్ధ రాజమండ్రి సమాచారం చదవడం. ఆవిడకి 13 మంది సంతానం. నాకు, మా కజిన్స్‌ అందరికీ ఆవిడ సలహా ఏమిటంటే ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనండి అని. ఆవిడకి మడి ఉండేది. శుభ్రమైన పంచె కట్టుకుని, వంటగదిలో ప్రత్యేకంగా కూర్చుని భోజనం చేయడం. కానీ తన పెంపుడు కుక్క మాత్రం ఎప్పుడూ తన పక్కనే ఉండేది. మమ్మల్నెవరినీ మడిగా ఉండమని చెప్పలేదు. అది ఆవిడ వ్యక్తిగతం మాత్రమే. మా ఇంట్లో దళిత వర్గానికి చెందిన వ్యక్తి వంటమనిషి అయినా, ఆవిడ ఎటువంటి అభ్యంతరం చెప్పేవారు కాదు. ఆవిడ చాలా విభిన్నంగా

ఉండేవారు, నా మడి నా దగ్గర అనేలా. అది పూర్తిగా ఆమె పర్సనల్‌. ఇప్పుడు ఈ విశాల దక్పథం ఎంత మందికి

ఉంది? వెనక్కి పోతున్నాం అనిపిస్తోంది.

మరో సంతోషకరమైన విషయం – దంపతుల మధ్య పరస్పరం సమయం కేటాయించుకోగలగడం గురించి అని చెప్పాలి. ప్రతిరోజూ అమ్మ, నాన్నగారు వారికంటూ ప్రత్యేక సమయం కేటాయించుకోగలగడం చాలా ఆసక్తి కలిగించే విషయం. నాన్నగారు సాయంత్రం ఆఫీసునుండి రాగానే, వరండాలోటేబుల్‌ దగ్గర అమ్మ, నాన్నగారు కూర్చునేవారు. ఇంగ్లీషువారి సాంప్రదాయంలో కెటిల్‌, టీ కప్పులు ఉండేవి. కేన్‌ కుర్చీలలో కూర్చుని అందులో టీ తీసుకునేవారు. లండన్‌ నుంచి వచ్చిన ఇంగ్లీషు పత్రికలను దాదాపు 45 నిమిషాలపాటు నాన్నగారు అమ్మకి చదివి వినిపించేవారు. పిల్లలు ఎవ్వరూ అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదు. అది వారిద్దరి సమయం. ఆలోచిస్తే, దంపతులు తమకంటూ ఒక వ్యక్తిగత సమయాన్ని, చోటును కల్పించుకోవడం చాలా చక్కటి అవకాశం అనిపిస్తుంది. అది వారిద్దరికే కాదు, మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా ఆ అవసరాన్ని అర్థం చేయిస్తుంది. నిజానికి నేను పరిశీలన ద్వారా మా అమ్మగారి దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. ఆవిడకి చాలా చక్కటి వ్యవహార శైలి ఉంది. తెలివైన వ్యక్తి, గొప్ప మేనేజర్‌. నీకు మనుష్యుల పట్ల చక్కటి అవగాహన ఉంది. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావని చాలామంది నన్ను అడుగుతారు. నా సమాధానం ఒక్కటే – నేను పెరిగినట్లు మీరు పెరిగితే, మీరు కూడా ఇలాగే నేర్చుకుంటారు అని.

మా నాన్నగారు ఉన్నప్పుడు మాకు ఇచ్చిన బాధ్యత ఒక్కటే, నేను, మా అక్క ప్రతి శనివారం కారులో మండీకి వెళ్ళి ఇచ్చిన లిస్టు ప్రకారం కూరగాయలు కొని తేవాలి. ఆ ఒక్కరోజే కారు ఇచ్చేవారు. మిగిలిన రోజులు అంతా నడక, బస్సు అంతే. నాన్నగారు మా కాలేజీవైపు వెళ్ళినా, మేము బస్సెక్కి వెళ్ళాల్సిందే. వర్షం, ఎండ, జ్వరం ఏమైనా సరే కారు మాత్రం ఉపయోగించకూడదు.

కాలేజి అనుభవాలు…

యతిరాజ్‌ కాలేజి ఆడపిల్లల కోసం 1940లలో స్థాపించబడింది. చాలా ప్రాముఖ్యమున్నది. నాయకత్వం, టీం బిల్డింగ్‌, యూనియన్‌ వంటి ఎన్నో అవకాశాలు ఉండేవి. సామాజిక వర్గాలపై అంత ప్రాముఖ్యత లేదు కానీ విద్యార్ధుల్లో ముస్లింలు, ముస్లిమేతరులు అన్న విభజన ఉండేది. అయితే, దక్షిణ తూర్పు ఆసియా దేశాల నుండి వచ్చిన భారతీయ కుటుంబాల పిల్లలు ఉండేవారు. హాస్టల్లో అందరితో కలిసి ఉండడం పెద్ద అనుభవం.

ప్రెసిడెన్సీ కాలేజిలో ఎంఏ చదువుతున్నప్పటి రోజులు: మా క్లాసులో ముగ్గురే అమ్మాయిలు. అందరమూ ఉన్నత కులాల నుండి వచ్చిన వాళ్ళమే. నేను మాత్రమే క్లాసులో తెలుగు మాట్లాడే అమ్మాయిని. అప్పుడే తమిళనాట రాజకీయ పరిణామాలలో మార్పు. డిఎంకే అధికారంలోకి వచ్చింది. క్లాసులో అబ్బాయిలందరూ జిల్లాల నుండి, వివిధ సామాజిక, రాజకీయ నేపథ్యాలతో వచ్చినవారు. చురుకైన డిఎంకె కార్యకర్తలు. ఫ్యాకల్టీ కూడా డిఎంకే వైపుకే. పైగా అందరూ తమిళ భాష మాట్లాడేవారు. నన్ను మొత్తంగా వెలివేసినట్లుండేది. మొదటి బెంచిలో తలుపు దగ్గరే కూర్చుని క్లాస్‌ అవ్వగానే వెళ్ళిపోయేవాళ్ళం. మేము సర్వైవ్‌ కావడానికి ముఖ్య కారణం మేం బాగా చదవడమే. ఎప్పుడూ 1, 2, 3 స్థానాల్లో ఉండేవాళ్ళం. ప్రొఫెసర్లకి కూడా మాతో డీల్‌ చేయడం తప్ప వేరే ఛాన్స్‌ ఉండేది కాదు. మొదటి సంవత్సరం చాలామంది అబ్బాయిలు ఫెయిల్‌ కావడంతో కొద్దిగా రెండో సంవత్సరంలో ఐస్‌ బ్రేక్‌ అయ్యింది. వాళ్ళు మాతో స్నేహితులయ్యారు. నేను కూడా అకడమిక్‌గా వాళ్ళలో చాలా మందికి సహాయం చేసేదాన్ని.

కాలేజి లైఫ్‌లో రెండు అనుభవాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. మాకు మోడర్న్‌ సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కోర్సు ప్రారంభించారు. అది ఆప్షనల్‌ కానీ అందరూ తీసుకోవాలన్నారు. సరే అని కోర్సు విషయాంశం, కర్రిక్యులమ్‌ చూశాము. అది కేవలం తమిళనాడు చరిత్ర మాత్రమే. సౌత్‌ ఇండియా అంటే తమిళనాడు మాత్రమే కాదు కదా. నేను మా ప్రొఫెసర్‌ దగ్గరికి వెళ్ళి విషయం అడిగినప్పుుడు ఆయన సౌత్‌ ఇండియా అంటే తమిళనాడు కదా అన్నారు. అది నేను ఎంత మాత్రం ఒప్పుకోలేదు. మీరు ఆధునిక తమిళనాడు చరిత్రగా టైటిల్‌ మార్చండి, నేను తీసుకుంటాను అని చెప్పాను. నువ్వు తీసుకోకపోతే, నీ మొదటి ర్యాంక్‌ పోతుందని హెచ్చరించారు. అయినా నేను మాత్రం టైటిల్‌ మార్చనందుకు కోర్సుతీసుకోనని నిరాకరించాను. మొదట్లో నాకు పదిమంది సపోర్టు చేసినా చివరికి ఇద్దరే నాతో

ఉన్నారు.

మరో అనుభవం చదువుకి ఏ మాత్రం సంబంధం లేనిది. నిజానికి మొదటి సంవత్సరంలో మేం నలుగురం అమ్మాయిలం

ఉండేవాళ్ళం. మాలో ఒక ముస్లిమ్‌ అమ్మాయి హాస్టల్లో ఉండేది. చాలా నెమ్మది. ఎవరితో మాట్లాడేది కాదు. చాలా తెలివైనది. ఫైనల్‌ పరీక్షల ముందర ఆ అమ్మాయి సడన్‌గా కాలేజికి రావడం మానేసింది. ఆమె కాలేజిలో చేరక ముందే పెళ్ళి నిశ్చయమైందని మాత్రం తెలుసు. ఒకరోజు కాలేజికి వెళ్ళేసరికి కారిడార్లో పెద్దగా అరుపులు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయి హాస్టల్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది అని మమ్మల్ని అడిగారు. మాకేం తెలీదన్నాం. మీరు క్లాస్‌మేట్సే కదా, ఎందుకు తెలీదని ప్రశ్నించారు. నిజానికి జరిగిందేమిటంటే, ఈ అమ్మాయికి ఎవరితోనైతే పెళ్ళి నిశ్చయం చేశారో, అతనంటే ఇష్టం లేదు. తన కజిన్ని ఇష్టపడింది. క్లాస్‌లో ఉన్న అబ్బాయిలంతా మా ఎవ్వరితో మాట్లాడకపోయినా అందరూ కలిసి డబ్బులు పోగేసి, ఆమె పెళ్ళి రిజిస్టర్‌ మ్యారేజ్‌లా జరిపించారు. ఈ విషయాన్ని నేను చాలా రోజులు మర్చిపోలేక పోయాను. ఇంత నెమ్మదిగా ఉండే అమ్మాయి ఎంత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది. దానికోసం ఎవరి నుండి సపోర్టు కావాలో అది తీసుకోగలిగింది. అయితే దురదష్టవశాత్తు చదువు కొనసాగించలేకపోయింది. తన జీవిత భాగస్వామి గురించి అంత ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలిగిన అమ్మాయి, తన చదువు విషయంలో మాత్రం ఏమి చేయలేకపోయింది.

అమెరికాలో చదువుకున్నారు కదా, ఆ అనుభవం…

నేను పై చదువులకి అమెరికా వెళ్ళాను. నేను అమెరికా వెళ్ళిన సమయం కూడా చాలా ఆసక్తికరమైనది. నా మొదటి అమెరికా అనుభవం ఏమిటని ఎవరైనా అడిగితే టివి చూడడం అని చెప్తాను. అంతకు ముందెన్నడూ చూడలేదు. ముఖ్యంగా అప్పటి పొలిటకల్‌ డ్రామా, వాటర్‌ గేట్‌ హియరింగ్స్‌, నిక్సస్‌ ఇంపీచ్‌మెంట్‌ గురించిన సమాచారం టివికి అతుక్కుపోయి వినేదాన్ని. అదే సమయంలో యూనివర్శిటీలో కూడా చాలా వేరేగా ఉండేది. వియత్నాం యుద్ధం వెటరన్స్‌, డ్రగ్స్‌కి అడిక్ట్‌ అయినవారు, యుద్ధ బాధితులు నాతోపాటు క్లాసులోఉండేవారు. దీనికి తోడు ఆయిల్‌ క్రైసిస్‌, పెట్రోలు కోసం పెద్ద క్యూలు, కారు బయటకు తీయాలా వద్దా అన్న సంశయం. అప్పుడే నడక అలవాటయింది. ఎక్కువగా ఫిట్‌గా ఉండేదాన్ని. ఇప్పటి పెద్ద రోడ్లు, భవంతులు, విశాలమైన కార్లు ఉండే అమెరికాకి, నా అమెరికా అనుభవానికి చాలా వేరుగా ఉండేదన్నమాట.

మీరేం సబ్జక్ట్‌ తీసుకున్నారు?

నేను హిస్టరీ తీసుకున్నాను, సివిల్‌ సర్వీసెస్‌ వ్రాయాలని. అందుకోసం అందరిలానే హిస్టరీ, ఎకనామిక్స్‌ తీసుకున్నాను. కానీ మా కుటుంబంలో వచ్చిన ఒడిదుడుకులవల్ల సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష వ్రాయలేదు. నేను మద్రాస్‌లో ఎంఏ చదువుతున్నప్పుడు తూర్పు ఆసియా చరిత్రపై ఒక పేపరు ఉండేది. నాకు జపాన్‌, చైనా చరిత్ర పట్ల ఫాసినేషన్‌ కారణంగా పెన్సిల్వేనియా యూనివర్శిటీలో పిహెచ్‌.డి కోసం ఆసియన్‌ స్టడీస్‌ విషయాంశంగా ఎంపిక చేసుకున్నాను. భాష కూడా రాదు, నేర్చుకోవడానికి కొంత సమయం పెట్టాను. కానీ అక్కడ చైనా చరిత్రతో పిహెచ్‌.డి చేసి ఏం చేస్తానో నాకే అర్థం కాలేదు. దానికి తోడు అప్పటి రాజకీయ పరిస్థితులు. వియత్నాం యుద్ధం అప్పుడే పూర్తయింది. విద్యార్థి, స్త్రీల ఉద్యమాలు కొంత ఊపందుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా యూనివర్శిటీలలో కూడా ఆసియా అధ్యయనాలపై కొంత విమర్శలు, ఇంకా వివిధ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితులలో పిహెచ్‌డి వదిలేసి ఇండియా తిరిగి వచ్చేశాను.

హైదరాబాద్‌ యూనివర్శిటితో మీ అనుబంధం?

హైదరాబాద్‌ వచ్చేశాక పెళ్ళయింది. ఢిల్లీ వెళ్ళాను. ఏం చేయాలో తెలియని సమయం. అదే సమయంలో హైదరాబాద్‌ యూనివర్శిటీలో ఉద్యోగం అవకాశం వచ్చింది. అప్పుడే కొత్త డిపార్ట్‌మెంట్‌ మొదలైంది. అక్కడ నేను సెలక్ట్‌ అవ్వడమే నాకు పెద్ద ఆశ్చర్యం. హైదరాబాద్‌ యూనివర్శిటీలో చాలా సరదాగా ఉండేది. సోషల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్లన్నీ ఒకే దగ్గర గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో ఉండేవి. అందరం ఒకే హాలులో కూర్చునేవాళ్ళం. కోర్సులు డిజైన్‌ చేయడం, కర్రిక్యులం తయారు చేయడం, అందరం వేర్వేరు సబ్జెక్టులయినా కలిసి పనిచేయడం, మాట్లాడుకోవడం… చాలా లవ్లీ టైమ్‌. నిజంగా ఆ రోజులు చాలా బాగుండేవి. కానీ ఎక్కడో అసంతప్తి. కారణం తెలియదు. ఇది కాక ఇంకేదైనా ఆసక్తికరంగా ఉంటుందా అని ఆలోచన. అప్పుడే కన్నభిరాన్‌గారు, వసంత గారు కలిశారు. నిజానికి కె.లలిత, రమా మెల్కోటె, గోపాల్‌, కన్నభిరాన్‌, వసంత… వీళ్ళంతా, ఇంకా విమలా రామచంద్రన్‌ అందరూఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్‌ లీడర్లు. హరికి మిత్రులు కూడా. ఉస్మానియా విద్యార్థులు ప్రారంభించిన పోగ్రెసివ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఉమెన్‌ ూూఔ లో వీరంతా భాగం. దేశం మొత్తంలో కూడా ఇదే సమయంలో స్త్రీ వాదుల గ్రూపులు, వారి కార్యక్రమాలు మొదలవుతూ వచ్చాయి. నిజానికి నాకు కానీ, నా కుటుంబానికి కానీ ఎప్పుడూ రాజకీయ నేపధ్యం లేదు. సామాజిక అంశాలతో ఇది నా మొదటి పరిచయం. జెండర్‌ గురించి ముందే అవగాహన ఉంది. కానీ జెండర్‌ అంశాలు నిజ జీవితంలో ఎలా భాగం అవుతాయన్నది స్త్రీ శక్తి సంఘటనలో చేరి వరకట్న చావులు, ఆల్కహాలిజమ్‌, ఆడపిల్లల చదువులాంటి అంశాలపై పనిచేస్తున్నపుడు అర్ధమైంది. ఇందులో సభ్యులంతా రాజకీయ నేపథ్యం ఉన్నవారు, రాడికల్‌ భావాలున్న వాళ్ళు. నేనే ఆ పరిధిలోకి రాను అనిపించేది. నిశ్శబ్దంగా ఉండడం, రాజకీయ నేపథ్యం లేకపోవడం, అప్పుడే అమెరికా నుండి రావడం… ఇవన్నీ నేను శీబ్‌ శీట జూశ్రీaషవ అన్నభావనలు కలిగించేవి. అక్కడి నుంచే చాలా నేర్చుకున్నాను, చాలా పొందాను.

’80ల మొదట్లో నన్ను రెండు సంఘటనలు చాలా ప్రభావితం చేశాయి. ఒకటి స్త్రీ శక్తి సంఘటన ద్వారా మేము వరకట్న చావులు, ఆల్కహాలిజమ్‌ అంశాలపై చేసిన స్ట్రీట్‌ థియేటర్‌ కార్యక్రమాలు. ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు థియేటర్‌పై కొంత పని చేశాను. కానీ నేను బాగా ప్రదర్శన చేయగలనని ఇప్పుడే అర్థమైంది. నాటకాన్ని నిర్వహించడంలో, స్టేజిపై చేయడంలో నా పాత్ర ప్రముఖంగా

ఉండేది.

ఇక రెండవది, యూనివర్శిటీలో ఉమెన్‌ స్టడీస్‌ సెల్‌ ఏర్పాటు, దాని ద్వారా కోర్సులను నడపడం. ఈ అనుభవం విశ్వవిద్యాలయాల్లో ఉమెన్‌ స్టడీస్‌ సెల్స్‌ ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ ధోరణులను, జెండర్‌ పాలిటిక్స్‌, పితస్వామ్య ధోరణులు యూనివర్శిటీ లాంటి పెద్ద విద్యా సంస్థలలో, విద్యా వ్యవస్థలో పాతుకుపోయి ఉండటాన్ని అర్థం చేయించింది. జెండర్‌ని అర్థం చేయించడానికి, దానిపై ఉన్న దురభిప్రాయాలు పోగొట్టడానికి చాలా కష్టమైంది. స్త్రీ వాదులు అంటే భర్తలను వదిలేసిన, కుటుంబాలని వదిలేసినవారు అన్న ఇమేజి పడుతుంది. అయినప్పటికీ మేము యూనివర్శిటీలో సెల్‌ ఏర్పాటు చేసి కోర్సులు మొదలుపెట్టాం. అలాగే అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజిలో కూడా జెండర్‌ కోర్సు ప్రారంభించాం.

మేము ఉమెన్‌ స్టడీస్‌ సెల్‌ ద్వారా కొన్ని స్టడీస్‌ చేశాం. వీటిలో జూఔదీ ద్వారా స్త్రీలకు నిర్వహించిన అవగాహనా కార్యక్రమాల మూల్యాంకనం (నిప్‌సిడ్‌ సంస్థ నుండి) ఒకటి. ఇవి 1950లో దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ కాలం నుండి రాజ్యాంగం, ఆరోగ్యం వంటి అంశాలపై స్త్రీలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నాయి. ప్రత్యేకించి స్వఛ్చంద సంస్థలు, వారి పని గురించిన అవగాహన పెరగడానికి ఇది నాకు దోహదం చేసింది. అప్పటికే హైదరాబాద్‌లోని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వంటి ఎన్జీఓలతో కొంత పరిచయం ఉండి, వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున డెవలప్‌మెంట్‌ సెక్టార్లో ఎన్జీఓల పని పట్ల కొంత అవగాహన మెరుగైంది. కానీ నా ప్రముఖ పాత్ర యూనివర్శిటీలో విద్యా బోధన అనే భావనే నాలో ఉండేది. ఎకడమిక్స్‌లో మరింత నిశితంగా పనిచేయడం ద్వారా విద్యార్థులు కొంత మందైనా క్లిష్టమైన సామాజిక అంశాలపై అవగాహన తెచ్చుకుని మార్పుకోసం పనిచేయగలరన్న అస్పష్ట అభిప్రాయాలు ఉండేవి. అలా జెండర్‌ టీచింగ్‌ గ్రూప్‌లో భాగంగా పనిచేసేదాన్ని.

ఇంకా ఉమెన్‌ స్టడీస్‌ సెల్‌ నుండి చేసిన ప్రాజెక్టులలో గర్ల్‌ ఛైల్డ్‌ అండ్‌ ఫ్యామిలీ ప్రాజెక్టు ICSSR ద్వారా దేశం మొత్తం మీద 21 విశ్వవిద్యాలయాలలో భాగంగా చేపట్టినది మరొకటి. ICSSR నుండే ఈ స్టడీకి ప్రశ్నపత్రం తయారై వచ్చింది. ఇది చాలా పెద్ద ఎక్సర్‌సైజ్‌. ప్రతి ఒక్కళ్ళం మా రిపోర్టులను ప్రజెంట్‌ చేశాం. అయితే ఎండ్‌ ప్రోడక్ట్‌లో చాలా వేరుగా వచ్చింది. వ్యక్తిగతంగా నాకు ఇది మరో ఇంట్రస్టింగ్‌ అనుభవం. దీనిలో భాగంగా ఫీల్డ్‌లో చాలా ఎక్కువసేపు గడపడం, వివిధ అంశాలపై ఆలోచించడం… మానసికంగా నాలో ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తించింది, నేను ఇలాంటి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నానా అని. అప్పుడే డెవలప్‌మెంట్‌ ఫీల్డ్‌ ఆలోచన లేనప్పటికీ, ప్రజలతో నేరుగా కలిసి పని చేయడం, ఫీల్డ్‌ బేస్‌గా పనిచేయడం లాంటివి. అంతేకాక మాతోపాటు పనిచేయగల వ్యక్తులు, మా విద్యార్థులు కూడా పరిచయమయ్యారు. మొదట్లో వీళ్ళకి ఫీల్డ్‌ అనుభవం లేదు కదా, సోషల్‌ వర్క్‌ విద్యార్థులయితే బాగుంటుందని సోషల్‌ వర్క్‌ కాలేజీకి వెళ్ళాం. కానీ వాళ్ళు మేము MSW చేసి ఫీల్డ్‌కి వెళ్ళడమేంటి? మేము విధాన రూపకర్తలం కావాలంటూ మాట్లాడారు. దాంతో తిరిగి మా యూనివర్శిటీలోనే డీన్‌ని ఒప్పించి సోషల్‌ సైన్సెస్‌ నుండి ఎంపిక చేసుకున్నాం. అక్కడినుండి మొత్తం అధ్యయనం అంతా ఎంతో ఉత్సాహంగా సాగింది. ఫీల్ట్‌లో నేరుగా పాల్గొనడం, ప్రశ్నాపత్రం నింపడంలో మా ఆలోచనలా లేక నిజంగా వాళ్ళు చెప్పింది పెడ్తున్నామా అని చర్చించడం, సంబంధిత జానపద సంస్కతికి చెందిన సామెతలు, కథలు, పాటలు సేకరించడం, ఇవన్నీ రిపోర్టులో పెట్టడం – అంతా నిజంగా చాలా ఆసక్తికరంగా సాగింది. మొదటిసారిగా తెలుగు నుండి ఇంగ్లీషుకి ట్రాన్స్‌లేట్‌ చేయడం, తెలుగు భాషలో ఎప్పుడూ శిక్షణ లేని నేను అలా చేయడం నాకే కొత్తగా అనిపించింది.

మొత్తంగా ఈ ప్రాజెక్టు, జెండర్‌ అంశంపై నేను టీచ్‌ చేస్తున్న కోర్సు రెండూ నా ఆలోచనలకి రూపం ఇవ్వడానికి తోడ్పడ్డాయి.

2006-12 మధ్య కాలంలో ఉమెన్‌ స్టడీస్‌ సెంటర్లపై అధ్యయనంలో భాగమయ్యాను. దీని ద్వారా దేశమంతా ఏం జరుగుతోందన్న అవగాహన వచ్చింది. చాలా సెంటర్లు స్త్రీలను ఎస్‌హెచ్‌జిలుగా సంఘటితం చేసి కార్యక్రమాలు చేపడ్తున్నారు లేదా యూనివర్శిటీ పరిధికి బయట కార్యక్రమాలు, ప్రాజెక్టులు, అధ్యయనాలు జరుగుతున్నాయి. నిజానికి పరిశోధన, బోధన, కార్యాచరణ… ఈ మూడూ జరిగితేనే వాటి ఉనికికి వ్యూహాత్మక విజయం ఉంటుంది. యూనివర్శిటీ లోపల కోర్సుల రూపకల్పన, విషయాంశాలలో జెండర్‌ని చొప్పించడం వంటి పాత్ర అమలు కావడం లేదు. తగినంత నిధులు లేకపోవడం, సరైన సమయంలో విడుదల కాకపోవడంతో అవి కొన్ని రకాల కార్యక్రమాలకే పరిమితమవుతున్నాయి.

నేను యూనివర్సిటీలో చేరినప్పటికీ స్త్రీ శక్తి సంఘటనతో నా అనుబంధాన్ని మాత్రం తగ్గించుకో లేదు. అయితే, అప్పుడే ఆ సంస్థలో రెండు విభాగాలు – అస్మిత, అన్వేషి మొదలయ్యాయి. ఒకటి యాక్టివిస్ట్‌ వైపు మొగ్గితే, అన్వేషి కొంత పరిశోధనలవైపు ఓరియంట్‌ అయ్యింది. రెండు గ్రూపులలోను నాకు స్నేహితులు ఉండేవారు. అనుబంధం కూడా ఉండేది. కానీ ఎందుకో కొంచెం దూరం ఏర్పడింది. నేను వ్యక్తిగతంగా యాక్టివిస్ట్‌గా ఉండడానికే ప్రాధాన్యత ఇచ్చేదాన్ని. దీనికి తోడు యూనివర్శిటీ గచ్చిబౌలి క్యాంపస్‌కి మారడంతో సమయం సరిపోయేది కాదు.

మీ సామాజిక జీవనం..

నాకంటూ సోషల్‌ లైఫ్‌ పెద్దగా లేదు. యూనివర్శిటీ, స్త్రీ శక్తి సంఘటన… అంతే. నేను ఏం చేస్తున్నానన్న సమాధానం ఎవరికీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. అలాంటి అంచనాలు కూడా ఎవరికీ లేవు. అయితే అసలు సందర్భం నా సన్నిహితురాలు చనిపోయినప్పుడు వచ్చింది. హింస అనే అంశంపైన వ్యక్తిగతంగా నాకు చాలా అయోమయ పరిస్థితిఎదురైంది. ఈ సంఘటన పట్లయూనివర్శిటీ స్పందించిన తీరు, మేము ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అన్న ప్రశ్నలు తలెత్తాయి. బయటకు చూస్తే అందరూ చాలా శక్తివంతులు, సమర్ధవంతులు కానీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలకి స్పందించలేనితనం, నిర్ణయాలు తీసుకోలేనితనం. ఇది నాకు చాలా కష్టంగా అనిపించిన సమయం. ఒక పూర్తి విత్‌డ్రాయల్‌ దశలోనికి వెళ్ళిపోయాను. అయితే యూనివర్శిటీలో అందరం ఎవరి బాధ్యతల్లో వాళ్ళం ఉంటాం. మాకు మా విద్యార్థులు ఉంటారు. నాలాగే ఆలోచించే చిన్న గ్రూప్‌ కూడా నాతో ఉంది. వారితో చర్చలు జరిగేవి. ఈ అనుభవాలన్నీ తర్వాత దశలో నాకు చాలా సహాయం చేశాయి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలతో పనిచేసేటప్పుడు. సమాజంలో పితస్వామ్య విలువలు ఎంత లోతుగా విస్తరించాయో అని అర్థం చేసుకోవడానికి ఇది బాగా తోడ్పడింది. మనం ఉద్యమాలు, విప్లవాల గురించి మాట్లాడవచ్చు, బోధించవచ్చు, కానీ వ్యక్తిగత ధోరణులు, దక్పథాలలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. నేను మహిళా సమతలో

ఉన్నప్పుడు ఈ ఆలోచనలను ఇతరులతో పంచుకోగలిగాను.

మహిళా సమాఖ్యతో అనుబంధం?

నిప్‌సిడ్‌ స్టడీని ప్రజెంట్‌ చేయడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆసమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ జాయింట్‌ సెక్రటరీ మహిళా సమాఖ్య (ఎమ్మెస్‌) కార్యక్రమం గురించి ప్రస్తావించారు. చాలా ఆశావహకంగా వివరించారు. అయితే అప్పట్లో నా ఆలోచన – ఇలాంటి కార్యక్రమం ఆచరణ సాధ్యం కాదని. ఒకరోజు నేను యూనివర్సిటీ నుండి వచ్చేసరికి టేబుల్‌ పైన విమల రామచంద్రన్‌ గారు మాట్లాడాలనుకుంటున్నారన్న స్లిప్‌ పెట్టి ఉంది. ఆ సమావేశంలో తనతోపాటు RV అయ్యర్‌, విద్యా శాఖా సెక్రటరీ, ఇంకా ఇతరులు ఉన్నారు. శ్రీలత బాట్లివాల, లక్ష్మీకష్ణ మూర్తి, విమల రామచంద్రన్‌ ముగ్గురూ మహిళా సమాఖ్య గురించి పరిచయం చేస్తూ, ఆ కార్యక్రమం ఉద్దేశ్యాలు, నాలుగు సంవత్సరాలుగా యుపి, కర్ణాటక, గుజరాత్‌లలో పనిచేస్తున్న అనుభవాలు వివరంగా ప్రజంట్‌ చేసారు. అది విన్నాక కార్యక్రమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. కొంత నమ్మకం కూడా ఏర్పడింది.తర్వాత ఏ.పి.లో ఈ కార్యక్రమం ప్రారంభానికి జిల్లాల ఎంపిక, ప్రాతిపదికలు, సహకార వ్యవస్థలు, బడ్జెట్‌ తదితర వివరాలతో కూడిన ప్రపోజల్‌ని తయారు చేయడానికి ఒక చిన్న గ్రూపును ఏర్పాటు చేశారు. దానికి నన్ను కన్వీనర్‌గా

ఉండమన్నారు. ఆ తర్వాత కార్యక్రమం ప్రారంభమప్పుడు నన్ను ఎస్‌పిడిగా ఉంటావా, ఆసక్తి ఉందా అని అడిగారు. ఏమీ ఆలోచించకుండా ఎస్‌ చెప్పేశాను. ఇంటర్వ్యూ లేదా సెలక్షన్‌ పక్రియలు లేవు. ఎస్పీడీగా ఎవరు ఉండడానికి సమర్ధులని అందరినీ ఒక చీటీమీద రాయమన్నారు. అలా నా పేరు ప్రపోజ్‌ అయ్యింది.

మా వైస్‌ ఛాన్సలర్‌ నన్ను అడిగారు – నువ్వు నిజంగా ఇలాంటి కార్యక్రమంలో పని చేయాలనుకుంటున్నావా, నువ్వు ఒక ఐఏఎస్‌ అధికారి భార్యవి, నువ్వు దీనికి తయారుగా ఉన్నావా అని. నువ్వు ఒకవేళ ఏదైనా తప్పు స్టేట్‌మెంట్‌ ఇస్తే అది అతని కెరీర్‌కి ఇబ్బంది అవుతుందని అన్నారు. నేను షాక్‌ అయ్యాను. ఇప్పటిదాకా నన్నెవరూ అలా చూడనేలేదు. నేను అనేదానిపై అతని కెరీర్‌ ఆధారపడితే దానికి అసలు అర్థమే లేదని అనిపించింది. ఎలాగైతేనేమి, మహిళా సమాఖ్యలో జాయినయ్యాను. ఆంధ్ర ప్రదేశ్‌లో అప్పటికే మహిళా సమాఖ్య పేరుతో కమ్యూనిస్ట్‌ పార్టీవారి మహిళా విభాగం ఉంది. అందుకని కార్యక్రమానికి మహిళా సమత పేరుతో సొసైటీ రిజిస్టర్‌ చేసాం.

ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిందేమిటంటే, ఇన్ని సంవత్సరాల నా బోధనా అనుభవం ముఖ్యంగా ఆధునిక భారత చరిత్ర, రైతు – ప్రజా ఉద్యమాలు – స్త్రీ వాదం, జెండర్‌ సామాజిక నిర్మాణం వంటి మూడు రకాల కోర్సులు చెప్పిన అనుభవం నా ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో పెట్టిందనిపిస్తుంది. అధికారం – కలోనియల్‌, సామ్రాజ్యవాదం, అధికార సంబంధాలలో వైరుధ్యత, జెండర్‌పై విభిన్న ప్రశ్నలు, ఆలోచనలు ఇవన్నీ నాకు కొత్త కాదు. అంతేకాక ఆధునిక భారత చరిత్రలో భాగంగా క్లాస్‌రూంలో ఉద్యమాల గురించి చెప్పేటప్పుడు మా మధ్య జరిగిన చర్చల్లో నాయకత్వం ఏర్పాటు/నిర్మాణం ప్రజల నుండి/ సమూహాల నుండి క్రింది స్థాయి (SUB ALTERN) నాయకత్వం, యంత్రాంగాలు ఏర్పాటవడం వంటివి చాలా బయటకు వచ్చేవి. కాబట్టి నేను ఎమ్మెస్‌లో పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాను. సమాజపుటంచుల్లో ఉన్న గ్రూపుల నుండి నాయకత్వ వ్యవస్థ ఏర్పాటయ్యే దిశగా కార్యక్రమ విధానం, సామర్ధ్యాల నిర్మాణం ఉండాలని. కాబట్టి ప్రారంభం నుండి ఎలాంటి కార్యక్రమం లేదా శిక్షణలు జరిగినా, ఈ ఫ్రేమ్‌ వర్క్‌ ప్రకారమే ఉండేది.

ఇందులో పనిచేసే కార్యకర్తలు కూడా అదే వర్గానికి చెందిన వారుగా ఉండడం, అణచివేయబడిన, అవకాశాలు అందని నేపథ్యం కలవారుగా ఉండడం కూడా దీనికి మరో కారణం. అయితే నా దష్టి ఎప్పుడూ ఎమ్మెస్‌లో పనిచేసే వారి నాయకత్వంపై మాత్రం కాదు. వారు కూడా ఈ మొత్తం క్రమంలో స్వశక్తి వంతులవుతారన్నది నా ఆలోచన. నా ధ్యేయమంతా సమాజపుటంచుల్లో ఉన్న గ్రూపుల నుండి నాయకత్వ వ్యవస్థలు ఏర్పాటు కావాలన్న దానిపైనే ఉండేది. ఇది మిగిలిన రాష్ట్రాలలోని ఎమ్మెస్‌ కార్యక్రమ విధానాలకంటే కొంత భిన్నంగా ఉండేది.

ఇదంతా ఒకెత్తు అయితే, నాలో ఒక భయం ఎప్పుడూ ఉండేది. నేను ఎంతో సంతోషంగా ఈ ఉద్యోగాన్ని తీసుకున్నాను, కానీ సిటీలో పెరిగాను, యూనివర్శిటీ నుంచి వచ్చాను. నా అభిప్రాయాలు, ఆలోచనలు పుస్తకాల భాషలో మాట్లాడతాను. నాకు ఏ విధమైన రాజకీయ నేపథ్యం, అనుభవం లేవు. మద్రాసు యూనివర్శిటీలాగా కాదు. అక్కడ వేరే విధమైన ఇంటలెక్చువల్‌ వాతావరణం ఉండేది. ఇటువంటి నేపథ్యాల నుంచి వచ్చిన నేను ఈ కార్యక్రమానికి లీడర్‌గా ఉండి నడిపించగలనా అనే భయం ఉండేది. నిజానికి కార్యక్రమం అమలు జరుగుతుండగా, ఆ అనుభవాల నుండి కార్యక్రమ రూపం ఏర్పడుతూ వచ్చింది. ముందుగా కార్యక్రమం ఎటువైపు వెళ్తుంది అనే ఐడియా నాకు లేదు.

మహిళా సమాఖ్యలో చేరాక, ఇలాంటి కార్యక్రమం ఏ మేరకు పని చేయగలుగుతుంది అని నేను చాలా లోతుగా ఆలోచన చేశాను. మొదట్లో యూపి, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలలోని కార్యక్రమం గురించి విన్నప్పుడు నాకు అంత సౌకర్యవంతంగా అనిపించలేదు. అక్కడ దష్టంతా వ్యక్తిగత మార్పు ఒక ఉత్ప్రేరకంగా పని చేయడానికి ఉపయోగపడుతుంది అన్న భావనపై కేంద్రీకతమయింది. అది నాకెందుకో అంత అర్థవంతంగా అనిపించలేదు. కార్యక్రమంలో భాగంగా సమాజపు అంచుల్లో ఉన్న కుటుంబాలనుండి వచ్చిన స్త్రీలతో పని చేస్తున్నాం కాబట్టి, వారిని నాయకత్వ పాత్రల్లోకి తీసుకువచ్చే క్రమంలో సంఘటిత పరచడం చాలా కీలకమైనది. నాయకత్వం సంఘటితంగా లేకపోతే ఎక్కువ కాలం సుస్థిరంగా ఉండదన్న అభిప్రాయం ఏర్పడింది.

అంతే కాకుండా స్త్రీల సాధికారత గురించి మాట్లాడే ఇలాంటి కార్యక్రమాలలో నాయకత్వం అంటే ఎలా ఉండాలి అనే దానిపై కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. నిజానికి ఈ అంశం కొత్తేమీ కాదు. స్త్రీవాద ఉద్యమాల్లో చర్చకు వచ్చినదే. సంస్థ ఎంత పారదర్శకంగా, సమాంతరంగా ఉందని చెప్పుకున్నా, అందులో ఉండే అధికార సంఘర్షణల గురించి ఎవరికీ తెలియనిది కాదు. దానిపై చాలా ప్రశ్నలు వచ్చేవి. స్త్రీ శక్తి సంఘటనలో కూడా వీథి నాటకాలు చేసినప్పుడు ఈ ప్రశ్నలు వచ్చాయి. ఆ బందాన్ని రాడికల్‌ అనలేము కానీ పొలిటికల్‌ అనవచ్చు. ఎప్పుడూ ఒకే రకమైన బందం ఉండాలంటే అదెప్పుడూ చిన్న గ్రూప్‌ అవుతుంది. అయితే గ్రూప్‌ విస్తరిస్తున్న కొద్దీ ఆసక్తితో పాటు కొన్ని ఒత్తిడులు కూడా తప్పవు. అలా ఈ గ్రూప్‌ లో కూడా చర్చలు జరిగేవి, ప్రశ్నలు తలెత్తేవి.

ముందుగా రాష్ట్రస్థాయి సెమినార్‌ ద్వారా కార్యక్రమం ప్రారంభమైంది. ఆ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ ఎన్జీవోలను, సంస్థలను (రాష్ట్ర వ్యాప్తంగా) కలుసుకునే ప్రయత్నం చేశాం. వేదికలు, నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ పని చేయాలన్నది నా ఆలోచన. వివిధ సంస్థలతో భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఆశించాను. అయితే ఇదేదీ అనుకున్నంత స్థాయిలో జరగలేదు. శిక్షణలు, సెమినార్లకు పరిమితమైంది. పనిచేస్తున్న ప్రాంతం, వ్యక్తుల ఆలోచనా ధోరణులు, పరిమితులు దీనికి కారణం కావచ్చు.

గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటైన వివిధ దశల నాయకత్వం, పట్టణ ప్రాంతాలలో నెట్‌వర్క్‌లు, ఎన్జీఓల ద్వారా ఏర్పాటైన నాయకత్వం… ఈ రెండింటిలో ఎలాంటి ప్రత్యేక వ్యత్యాసాలు చూస్తున్నారు?

నేను ఈ రెండింటిలో ఉన్నాను. నాకర్థమైన విషయాలలో మొదటిది సంఘటిత యంత్రాంగం అనే నాయకత్వాన్ని ఫెసిలిటేట్‌ చేయాలనుకుంటున్నప్పుడే ఎక్కడో ఒక దగ్గర వ్యక్తిగత నాయకత్వం తలెత్తుతుంది. దాన్ని సంత ప్తి పరచినప్పుడే సంఘటితంగా నాయకత్వాన్ని పంచుకోవడానికి ఉద్యుక్తులౌతారు. మనలో చాలామందికి ఈ క్రమం చాలావరకు అర్థమవ్వడం కష్టం. మరో ముఖ్యమైన పాఠం ఇంకోటుంది. అధికారాన్ని పంచుకోవడం, అందులో వ్యక్తిగత పాత్రలు నిర్వచించడం మనం అనుకున్నంత సులభం ఏ మాత్రం కాదు. పట్టణ ప్రాంతానికి చెందిన సంస్థలలో కూడా మొదటగా స్థాపించిన సభ్యులు అధికార స్థాయిలో మొదట్లోనే ఉంటారు. అది కొన్ని తరాలుగా సాగుతూనే వస్తోంది. సంఘాల ఏర్పాటులో దీని గురించే నేను మొదటినుండీ చాలా జాగ్రత్తతో వ్యవహరించాను. కార్యక్రమంమొదటి రోజునుండీ, ఒక సమూహం ఉండాలి, బాధ్యతలు రొటేషన్‌ పద్థతిలో పంచుకోవాలని చెప్తూ వచ్చాను. దానిని అదే స్పూర్తితో పనిలో పెట్టడానికి ప్రయత్నించాం. స్త్రీ శక్తి సంఘటనలో కూడా నిర్మాణం విభిన్నంగా ఉండేది. ఒక్క కన్వీనర్‌ మాత్రమే నాయకత్వ పాత్రలో ఉండేవారు. అది రిజిస్టర్‌ కాలేదు. ఒక వేదిక మాత్రమే. అయినప్పటికీ, అక్కడ కూడా స్త్రీల ఉద్యమాల్లో ఉన్నవారు, రాజకీయ నేపథ్యం ఉన్నవారు, నాలాగా రాజకీయ నేపథ్యం లేనివారు… ఇలా ఎంతోమంది ఉన్నారు. ఇంకా కొంత మంది వీథి నాటకాల సమయంలో చేరిన వారు, అందరూ వేర్వేరు నేపథ్యాలు ఉన్నవారు. వారి మధ్యలో అంతరాలు చెప్పకనే ఉన్నాయి. అధికార వలయాలు కూడా ఉన్నాయి. వాటిని విడగొట్టడం కష్టమే అయ్యేది. చర్చలు, ప్రశ్నలు చాలా వచ్చేవి. సమాధానాలు వెతకడం అంత సులభం కాలేదు. కాని ఒకటి మాత్రం స్పష్టంగా ఉండేది. ఏది ఎలా ఉన్నా స్త్రీల సమానత్వం అన్న పెద్ద లక్ష్యం మమ్మల్నందర్నీ ఒక దగ్గరకి చేర్చింది.

నా యూనివర్శిటీ నేపథ్యంలో మహిళాసమతలో సెలెక్షన్లు చేసేటప్పుడు చాలా స్పష్టంగా అందరూ ఒకే వర్గం నుండి ఉండకూడదని నిర్ణయించుకున్నాం. రోస్టర్‌ లేదా రిజర్వేషన్‌ పద్ధతి ఉపయోగించకపోయినా, వైరుధ్యం ఉండాలనేది నమ్మి పాటించాం. మహిళా సమాఖ్య రాష్ట్రాలన్నింటిలోనూ మేమే మొదటిగా ఈ సూత్రాన్ని పాటించాము. తర్వాత అది మిగిలిన రాష్ట్రాల కార్యక్రమాల్లో కూడా భాగమైంది. అయితే దళిత, గిరిజన వర్గాల నుండి కార్యకర్తకి అవసరమైన విద్యార్హతలున్న సిబ్బంది దొరకడం చాలా కష్టమైంది. కాని మేము ఆ వర్గాల నుండే స్త్రీలను కార్యకర్తలుగా తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నాం. అందుకోసంమేము విద్యార్హతలను ఎంపిక పరిగణలోకి తీసుకోలేక పోయినప్పటికీ ప్రాథమిక విద్యార్హతలు, పనిచేయాలన్న ఆసక్తి ముఖ్యమైన అర్హతలుగా నిర్ణయించుకుని సిబ్బందిని ఎంపిక చేశాం.

ఇన్ని సంవత్సరాల తర్వాత సామాజిక స్థితిలో మార్పుపై మీ అంచనా ఏమిటి?

క్షేత్రస్థాయిలో భౌతిక పరిస్థితులు చాలా మారాయి, అప్పటిలాగా కాదు. కారణం కేవలం ఉద్యమాలు మాత్రమే కాదు, జాతీయ, అంతర్జాతీయ ఒప్పందాలు, ఆర్థిక పరిస్థితులలో మార్పులు… ఇలాంటివన్నీ కావచ్చు. కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాళ్ళు మునుపటంత పేదగా లేరు. కానీ ధనిక, పేద వర్గాల మధ్య అంతరం కూడా పెరిగింది. ఒక ముఖ్యమైన మార్పు బహుశా అంతకుముందు పెద్దగా పట్టించుకోలేనిది కావచ్చు – పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారిలో (స్త్రీ, పురుషులలో) కులం చాలా ప్రధానంగా కన్పిస్తోంది. ఇదివరకు కూడా ఉండేదేమో కానీ బయటకు వ్యక్తమవ్వడం ఈ మధ్య చూస్తున్నాం. తద్వారా ఒక దురదష్టకరమైన సామాజిక వాతావరణం కన్పిస్తోంది. మహిళా సమాఖ్య లాంటి కార్యక్రమాల ద్వారా ఈ పరిస్థితిలో మార్పుకి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ వీటి పరిధి చాలా స్వల్పం. ఇంకా పెద్ద స్థాయిలో వస్తేకానీ మార్పు సాధ్యం కాదు.

మీ జీవితంలో చాలా త ప్తిగా అనిపించినవి…

చాలా ఉన్నాయి. చాలా సంతోషంగా అన్పించినవాటిలో మొదటిగా మేఘ పెరుగుతున్న క్రమం. తను ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో మా దగ్గరికి వచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పుడు తను ఎదుగుతున్న విధానం, తన భావనలు, విలువలు ఇవన్నీ చాలా సంతోషాన్నిస్తాయి. రెండవది మహిళా సమాఖ్యలో మా మొట్టమొదటి టీం సభ్యులను కలవడం. వాళ్ళు ఏ పొజిషన్‌ అయినా, కార్యకర్తలు, ఇంకా ఎవరైనా… వారు ఎలా ఎదుగుతూ వచ్చారో చూడటం. నాకు సంతప్తినిచ్చే విషయం. వారి ఎదుగుదలలో నాకూ చిన్న పాత్ర

ఉందన్న భావన.

ఇప్పటి రోజులలో స్త్రీల సాధికారతపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు. స్త్రీలకే అన్ని హక్కులు, అవకాశాలు ఇస్తున్నారు. దానివల్ల వారు చాలా స్వశక్తివంతులు అయ్యారనే వాదన ఉంది. ఇది విన్నప్పుడు మీరెలా ఫీలవుతారు? అమ్మాయిలు లేదా స్త్రీలు ఎలాంటి మెసేజెస్‌ అందుకుంటున్నారు.

ఇది చాలా ముఖ్యమైన ఆందోళన, కానీ మనం రెండోవైపు ఉన్న చాలా పెద్ద పితస్వామ్య ప్రపంచం, మగవారి అణచివేతని ఎప్పుడూ మర్చిపోకూడదు. అణచివేత స్కేలు చూస్తే, స్త్రీలే బాధితులుగా కన్పిస్తారు. అయితే, ఎక్కడో అందరం మిస్‌ చేసిన అంశం – ఈ మొత్తం స్త్రీల స్వశక్తి కోసం చేసిన ప్రయాణంలో అబ్బాయిలు, పురుషులతో మాట్లాడడం, వారిని ఈ అంశాల పట్ల ఆలోచింపచేయడం అనేది అంత ఎక్కువగా జరగలేదు. గ్రామీణ, పట్టణ, వ్యవస్థల పరంగా ఎక్కడా కూడా ఆ దిశగా ఎక్కువ ప్రయత్నాలు జరగలేదు. ఎందుకు చేయాలి అన్న ప్రశ్న రావచ్చు. కానీ నా అభిప్రాయంలో మనం మార్పుని కోరుకుంటూ దానికోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఎక్కడైతే మన నెట్‌వర్క్‌ను విస్తరించగలమో అలాంటి ప్రాంతాలు, అవకాశాలను… ముఖ్యంగా మగవారితో కలిసి పనిచేయడం వంటివి మిస్‌ చేశాం. ఒకవేళ ఇప్పుడు నాకు మహిళా సమత లాంటి కార్యక్రమం డిజైన్‌ చేసే బాధ్యత ఉంటే నేను అబ్బాయిలు, పురుషులతో పనిచేయడానికి వేదికల ఏర్పాటుపై ఆలోచన చేస్తాను. బాల సంఘాల ఆలోచన అప్పటికే వచ్చింది. అయితే ఇంకా పెద్దస్థాయిలో పని జరగాల్సింది. నిజానికి ఏ మహిళా కార్యక్రమమైనా ముందుగా ఆడవారికే ప్రత్యేకంగా పనిచేయాలి. ఆ క్రమంలో మార్పు ఏజెంట్లుగా మగవారికి చోటు కల్పించాలి. ఉదాహరణకి మధ్యప్రదేశ్‌లోని ఒక పంచాయతీ పరిధిఠలో ప్రజలంతా తమ పిల్లలకి 21 సం||లలోపు పెళ్ళిళ్ళు చేయమన్న నిర్ణయం తీసుకున్నారు. దాని వెనుక ఆ పంచాయతీ సర్పంచ్‌ పాత్ర, అతని పట్టుదల చాలా ఉంది. అలాంటి స్నేహ పూరిత అవకాశాలు వెతికి, వారితో కలిసి పనిచేయడం ద్వారా వారిని మార్పు ఏజెంట్లుగా చేయగలం.

ప్రస్తుతం మీరు చేస్తున్న పని?

గత పదిహేనేళ్ళుగా కొంతమంది స్నేహితులతో కలిసి ERU (ఎడ్యుకేషనల్‌ రిసోర్స్‌ యూనిట్‌)ని ఏర్పాటు చేశాం. దాని ద్వారా విద్యలో జెండర్‌, సమానత్వం అంశాలపై గుణాత్మక పరిశోధనలు చేపడ్తున్నాం. మేము ఇప్పటిదాకా జరిపిన పరిశోధనల్లో, చదువు అంశంలో అన్ని స్థాయిల్లో ఇంకా పితస్వామ్య, అసమానత్వపు ధోరణులు లోతుగా ఇమిడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. దాన్ని బట్టి చూస్తే, మనం సమానత్వ సాధన కోసం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి అనేది స్పష్టమౌతోంది.

చివరగా ఇంకో మాట! ఈ మధ్యనే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని మహిళా సమత ద్వార ఫెసిలిటేట్‌ చేసిన ఫెడరేషన్లలోని సభ్యులను కలిసాను. తమకై ఒక చోటు కోసం, గుర్తింపు కోసం, హక్కుల అందుబాటు కోసం ఇంకా పోరాటాన్ని కొనసాగిస్తుండటంలోని వారి ధైర్యం, తెగువ చూసి నేనెంతో వినమ్రంగానూ, విస్మయంగానూ ఫీల్‌ అయ్యాను. వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనిపించింది.

ఇంటర్వ్యూ చేసిన వారు : పద్మ ఆకెళ్ళ, పి. ప్రశాంతి

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.