ఆడపిల్లలు ఆత్మవిశ్వాసం, ఆర్థికపుష్టీ సాధించాలి -విజయ భారతి

 

మీ బాల్యం ఎక్కడ, ఎలా గడిచింది?

నేను రాజోలు (తూర్పుగోదావరి జిల్లా) హైస్కూల్లో చదువుకున్నాను. రాజోలు మా తాతయ్య (అమ్మ తండ్రి) గారి ఊరు. మా తాతయ్య గొల్ల చంద్రయ్యగారు (1888 – 1971) ఆ ఊళ్లో మాల మాదిగ కుటుంబాలన్నింటికీ పెద్దగా వ్యవహరించేవారు. మాల మాదిగలలో మొదటగా చదువుకున్నది ఆయనే. ఆయన తండ్రిగారు అక్కడి జమీందారుల/రాజుల ఇళ్లల్లో పనిచేస్తుండేటప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకోవడం చూసి తన కొడుకునూ చదివించాలని అనుకున్నారట. అప్పటికి వారిది కలిగిన కుటుంబం కిందే లెక్క. అందువల్ల కొడుకుని చదివించారు. చదువు అంటే నాలుగు అయిదు క్లాసులే. ఆ రోజుల్లో అయిదో క్లాసు చదివి ప్రైమరీ స్కూలు / ప్రాథమిక పాఠశాల టీచరు ట్రైనింగుకు వెళ్లేవారు. చంద్రయ్యగారు మూడో తరగతి చదివే రోజుల్లోనే తన బంధువుల పిల్లల్ని పిలుచుకువచ్చి వారికి అక్షరాలు నేర్పించే వారట. పొలాల్లో పని చేసుకునే వాళ్ళ పిల్లల్ని చేరదీసి వారికి చదువు చెప్పేవారట. అప్పటికి బ్రిటీష్‌ పాలన ఉంది.

రాజోలు తాలూకా కేంద్రం. అక్కడి అధికారులు చంద్రయ్యగారి విద్యాభిలాష చూసి ఆయన్ను టీచరు ట్రయినింగుకు రాజమండ్రి పంపి తర్వాత టీచరుగా నియమించారు. ఆ తర్వాత ఆయన పేద హరిజన విద్యార్థులకు, మగపిల్లలకూ, ఆడపిల్లలకూ వేర్వేరుగా హాస్టళ్ళు నిర్వహించారు. తన పిల్లలందర్నీ చదివించారు. మా అమ్మవైపు కుటుంబం వాతావరణం అలాంటిది. నేను ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు తాతయ్య ఇంట్లోనే ఉండి చదువుకున్నాను.

మా నాన్న బోయి భీమన్నగారు (1911-2005). కాకినాడ పిఠాపురం మహారాజా వారి కాలేజీలో చదివారు. కాంగ్రెస్‌ వారి సహాయ నిరాకరణోద్యమం వంటి కార్యక్రమాలలో (రాజకీయ, స్వాతంత్య్ర ఉద్యమాలలో) పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావం కూడా అక్కడి వారిపై చాలా

ఉండేది. నాన్న కవి. నాటక రచయిత. జర్నలిస్టుగా చాలా పత్రికలకు పనిచేస్తూ మద్రాసు వెళ్ళారు. అక్కడ పెద్ద పత్రికలలో పనిచేసారు. నార్ల వెంకటేశ్వరరావు గారి ‘ఆంధ్రప్రభ’లో సబ్‌ ఎడిటర్‌గా పనిచేసారు. సమీక్ష కోసం వచ్చే పుస్తకాలు రాజోలు పంపేవారు. అలా నేను హైస్కూలులో ఉన్నప్పుడే నాకు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు, అనువాదాలు అప్పుడే చదివాను.

అప్పట్లో కులవివక్ష ఉండేది. పురుషాధిక్యతా ఉండేది. మా తాతయ్య గారింట్లో నేనే పెద్ద మనవరాలిని. అందుకని గారాబంగానే చూశారు. అమాయకంగా ఉండేదాన్ని. ఎప్పుడూ ఏదో పుస్తకం చదువుతూ ఉండేదాన్ని. ఈ వివక్షల గురించి అంతగా పట్టించుకోలేదు. ఆలోచించనూ లేదు.

మా తాతయ్య ఆడ పిల్లలు చదువుకుని ఆడంబరాలకి పోతారేమో, కుటుంబం పరువుకు ఇబ్బందవుతుందని మమ్మల్ని చాలా స్ట్రిక్ట్‌గా పెంచారు. టైం ప్రకారం స్కూలుకి వెళ్ళడం, ఇంటికి రావడం అంతే. మా తాతగారు నడిపే హాస్టల్‌ పిల్లలకు కూడా అంతే. ఆయన రంగూన్‌ వెళ్ళి వచ్చారు. హాస్టళ్ళను సేవాభావంతో నడిపేవారు.

అన్నింటికీ లెక్క ఉండేది. చాలా పొదుపుగా ఉండేవారు. అప్పట్లో కిరసనాయిల్‌ దీపాలుండేవి. ఒక్కొక్క లాంతరుకి ఎంత నూనె పోయాలనేది చూసి కొలిచి లెక్కగా పోసేవారు. అది మా పిన్ని బాధ్యత. హాస్టలులో 5, 6 గదులుండేవి. ఒక్కొక్క గది నుంచి లాంతర్లు తీసుకుని విద్యార్థులు సాయంత్రం ఇంటికి వచ్చేవారు. నూనె ఎంత పోయాలో కొలిచి పోసేది. ”పరీక్షలున్నాయి, ఇంకొంచెం నూనె పోయమని” అడిగేవారు, కానీ నెల అయ్యేసరికి తాతయ్యకి లెక్క చెప్పాలి కదా. వంట నూనెలు కూడా అంతే. ఎంత తెచ్చారో అది మళ్ళీ సంత రోజు వరకూ రావలసిందే.

నా బాల్యమంతా చాలా స్ట్రిక్ట్‌గా గడిచింది. గట్టిగా నోరు విప్పి మాట్లాడకూడదు. వీధిగుమ్మంలోకి రాకూడదు. ఎవరైనా వస్తే లోపలికి వెళ్ళి ఉండాలి. ఆడ పిల్లలు వీధిలోకి చాలా బెరుకుగా వచ్చేవాళ్ళం. సినిమాలకు కూడా వెళ్ళనివ్వలేదు. మా తాతయ్య హాస్టల్‌ పనిమీద మద్రాస్‌ వంటి చోట్లకు వెళ్ళినప్పుడు మేము సినిమాలకు వెళ్ళే వాళ్ళం. ఆడపిల్లలు బయటకు రాలేని ఆ రోజుల్లో హరిజన హాస్టల్‌కి పక్క ఊళ్ళ నుంచి పిల్లల్ని పంపేవారంటే అప్పట్లో మాల మాదిగ పిల్లలపై అంబేద్కర్‌ ప్రభావమూ, బ్రహ్మ సమాజం ప్రభావమూ ఉన్నాయి.

అప్పట్లో బ్రిటిష్‌ వాళ్ళు వచ్చిన తర్వాత మతం మార్పిడి వంటివి ఏమైనా జరిగాయా?

రాజోలు ప్రాంతంలో మత మార్పిడులు చాలా జరిగేవి. చాలామంది ఎస్‌సిలు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. క్రిస్టియానిటీ ప్రచార కర్తలు అందరినీ వారం రోజులకి ఒకసారి రాత్రిపూట ఒకచోట చేర్చి కూటమి పేరుతో సమావేశాలు పెట్టేవారు. క్రీస్తు మీద పాటలు పాడి భజనలు చేసేవారు. ”ఏసుక్రీస్తు రక్షకుడు, రేపటి రొట్టె ఆయనే ఇస్తాడని” చెప్పేవారు. అంటే రేపటికి భరోసా అనేది ఆ మతం కల్పించింది. మన పాపాలన్నీ ఆయన తనమీద వేసుకుంటాడు, మనకోసం రక్తం చిందించాడని క్రిస్టియన్లు బాగా ప్రచారం చేసారు. హిందూ దేవాలయాల్లోకి ఎస్‌సిలను రానివ్వకపోవడం, ఇళ్ళలోకి రానివ్వకుండా బయటే నిల్చోబెట్టడం కూడా దీనికి తోడైంది. దాంతో చాలామంది ఆ మతం పట్ల ఆకర్షితులయ్యారు.

1920లలో సఖినేటిపల్లి ప్రాంతాల్లో క్రిస్టియానిటి, అలాగే కమ్యూనిస్టుభావాలు పెరగడానికి కులవివక్ష కారణం అయింది.

అవి ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం రోజులు. నాన్నగారు కవిగా 1940లలోనే పాలేరు నాటకం వ్రాసారు. దాన్ని తాతగారి హాస్టల్‌ పిల్లలు రిహార్సల్సు చేసేవారు. రెండు, మూడు ప్రదర్శనల తర్వాత అది చాలా పాప్యులర్‌ అయ్యింది. చాలా గొప్ప నాటకం. కథ పాలేరు, భూస్వామిల సంబంధాలు, చదువు చుట్టూ తిరుగుతుంది. పాలేరు కొడుకు చదువుకుని డిప్యూటీ కలెక్టర్‌ అవుతాడు. మంచి బట్టలతో, పక్కన బంట్రోతుతో తన ఊరికే ఉద్యోగ రీత్యా వస్తాడు. చదువుకుంటే పాలేరు కొడుకు కూడా కలెక్టర్‌ అవుతాడన్న సందేశంతో ఉండే ఈ నాటకం అందరికీ చాలా బాగా నచ్చింది. ప్రతి మాలపల్లెలోనూ పిల్లలు వేషాలు వేసుకుని ”బానిసతనమును బాపుమురా, భారతమాతకు భాగ్యము తేరా” అంటూ పాటలు పాడుతుంటే చూసిన ప్రతి తల్లీ తన కొడుకును చదివించాలని పట్టుదలగా పిల్లలను చదివించింది. ఈ నాటకం ఆడకుండా భూస్వాములు రౌడీలను పంపి కొట్టించేవారట. ఈ భావజాలాన్ని ఆపేయాలని పోలీసుల చేత కేసులు పెట్టించేవారు. ఇది కమ్యూనిస్టు భావజాలమని ప్రచారాలు జరిగాయి. రంగూన్‌లో కూడా ఈ ప్రదర్శన జరిగింది. దాదాపు 50, 60 సంవత్సరాలపాటు ఈ నాటకం రాష్ట్రమంతటా ప్రదర్శింపబడింది. చాలామంది ఈ నాటకం ద్వారా ప్రభావితులై చదువుకుని బాగా అభివృద్ధిలోకి వచ్చారు. ఆ రకమైన నేపథ్యం గల కుటుంబం కాబట్టి నాకు కూడా చదవాలని ఆసక్తి ఉండేది. కుల వివక్షను నేను ఎక్కువగా ఎదుర్కోలేదనే చెప్పాలి. నా శరీరపు రంగు చూసి ఎవరూ సందేహించేవారు కాదు.

ఒకసారి నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు క్లాసులో నా పక్కన కూర్చున్న అమ్మాయి నన్ను ”మీరు ఏముట్లు?” అని అడిగింది. నాకు అర్థం కాలేదు. మళ్ళీ మీరు ఎవరు, కిరస్తానీలా అని అడిగింది. నాకు తెలియలేదు. కానీ కిరస్తానీలం మాత్రం కాదని తెలుసు. ఎందుకంటే, మా తాతగారు మమ్మల్ని క్రైస్తవ కూటములకు వెళ్ళనిచ్చేవారు కాదు. అందుకని కాదని చెప్పి ”మీరు కిరస్తానీలా” అని అడిగాను. దానికి ఆ అమ్మాయికి బాగా కోపమొచ్చింది. ఆమె ఫక్తు బ్రాహ్మణుల అమ్మాయి. నన్ను కిరస్తానీ అంటావా అని గొడవ చేస్తే నా పక్కవాళ్ళు సర్ది చెప్పారు. తర్వాత నాతో ”నీకు మాట్లాడడం తెలీదు. మాట్లాడకుండా ఉండు” అని చెప్పారు. అలా మాట్లాడడం తగ్గించాను. ఇంట్లో కూడా ఆడపిల్లలకు ఆంక్షలు ఉండేవి. అలా నేను చాలా సైలెంట్‌ అయ్యాను. తర్వాతనైనా గట్టిగా నోరు విప్పి మాట్లాడలేకపోయేదాన్ని.

ఆ సందర్భం మీలో మాట్లాడకుండా ఉండిపోవడం అనే మార్పుని తెచ్చిందా?

కావచ్చును. ఒకసారి సినిమా పాటలు పాడుతుంటే మా తాతయ్య ”ఏమిటా పాటలు” అని కేకలేశారు. దాంతో నోట్లో నోట్లోనే పాడుకోవడం తప్ప గొంతెత్తి పాడింది లేదు. తాతగారు కానీ, మా నాన్నగారు కానీ మిగిలిన ఎస్‌సిలతో కూడా కలవనిచ్చేవారు కాదు. చాలా సెక్యూర్డ్‌గా పెంచారు. ఆ రకంగానూ కలుపుగోలుతనం తగ్గింది.

ఒకసారి హాస్టల్‌ పిల్లలతో కలిసి సినిమాకు వెళ్ళాను. అప్పుడే నాన్నగారు మద్రాసు నుండి వచ్చారట. మమ్మల్ని సినిమా మధ్యలో హాలునుంచి పిలుచుకువచ్చి కొట్టారు. అదే క్రమశిక్షణ అనుకునేవారు. మా తమ్ముళ్ళకు ఈ ఆంక్షలుండేవి కావు. అప్పట్లో అది పురుషాధిక్యత అని తెలీదు. చాలా మామూలుగా మాదే తప్పు అన్నట్టు లొంగి లొంగి ఉండేవాళ్ళం.

ఇంటర్‌ కాకినాడలో ఆడపిల్లల హాస్టల్‌లో ఉండి చదివాను. అక్కడ నా అదృష్టంకొద్దీ అందరూ కలిసి మెలిసి ఉండేవారు. అలాగే డిగ్రీ కూడా హైదరాబాద్‌లోని కోఠీ ఉమెన్స్‌ కాలేజీలో చదివాను. అది ఒక సముద్రం. అక్కడ కూడా నాకు కులవివక్ష అంతగా ఇబ్బందికరంగా లేదు. కాకినాడలో నా రూం మేట్‌ బ్రాహ్మణ అమ్మాయి శ్యామల. ఆమె బియస్‌సి సెంకడ్‌ ఇయర్‌. నేను ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌. నన్ను చాలా బాగా చూసుకునేది. నా అవసరాలన్నీ గమనించి ఏర్పాట్లు చేసేది. ”మీ అమ్మాయికి మాటలు నేనే నేర్పాను” అనేది మా అమ్మతో – అక్కడ నాకు కులం గురించిన ఆలోచన రాలేదు.

కోఠి ఉమెన్స్‌ కాలేజీలో చాలా రోజులపాటు చాలా సన్నిహితంగా మెలిగిన ఒక అమ్మాయి ఒకసారి నా కులం తెలియగానే నాతో స్నేహం కట్‌ చేసింది. హైస్కూలులో ఫలానావారి మనుమరాలు, కాలేజీలో ఫలానా వారి అమ్మాయి అన్న గుర్తింపు ఉండేది. బి.ఎ.లో నాయని కృష్ణకుమారి గారు, యశోదారెడ్డి గారు మా లెక్చరర్స్‌. నాన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కొన్నాళ్ళు సెక్రటేరియట్‌లో కార్మిక శాఖ మంత్రిగారికి పి.ఎ.గా పనిచేసారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడి ఓడిపోయారు. ఈ క్రమంలో ఉమ్మడి మద్రాసులో ”సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ అండ్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ బుక్స్‌” పోస్టు పడింది. (నాన్నగారి వయస్సు అప్పటికి ఎక్కువయినా అప్లై చేయించి,

ఉద్యోగం వచ్చేలా చేయడంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సహకరించారు. రాష్ట్రం విడిపోయినాకే హైదరాబాద్‌ వచ్చార. అప్పటికే నాన్న మంచి కావ్యాలు, నాటకాలు రాశారు. కాబట్టి బాగా పేరు వచ్చింది. అయినా కూడా కొన్ని కొన్ని చోట్ల ఆయనకి వివక్ష తప్పలేదు. పైకి కనబడకపోయినా అంతర్లీనంగా ఉండేది.)

బిఎ తర్వాత నా కాళ్ళమీద నేను నిలబడదామని, ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజిలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాను. సమాచార పౌర సంబంధాల శాఖలో మూడు నెలల లీవ్‌ వేకెన్సీ ఉంటే అందులో చేశాను. బి.ఎడ్‌. చేస్తే టీచర్‌ అవ్వచ్చుకదా అనుకున్నాను. కానీ మా నాన్న ఎం.ఏ చేయాలని పట్టుపట్టారు. తనకి చదవాలని ఉన్నా చదవలేకపోయానని, కనీసం నేనైనా ఎంఏ చదవాలన్నారు. నేనే ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్ళి దివాకర్ల వేంకటావధాని గారిని కలిసి పరిచయం చేసుకున్నాను. నాన్న ఎవరికైనా పరిచయలేఖ ఇచ్చేవారు. నేనే వెళ్ళి పనులు చేసుకునేలాగ నన్ను తీర్చిదిద్దారు.

ఎం.ఏ అయ్యాక ఉద్యోగం చేద్దామని మళ్ళీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులో చేరాను. అయితే ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు నన్ను, మరొక అమ్మాయిని తెలుగులో పిహెడ్‌ చేయవలసిందిగా ప్రోత్సహించారు. అప్పట్లో తెలుగులో అమ్మాయిలెవరూ పిహెచ్‌డి చేయలేదు. అలా అప్లికేషన్‌ ఇచ్చాను కానీ ఉద్యోగంలో చేరిపోయాను.

అప్పుడు లక్ష్మీరంజనం గారు నాన్నగారికి ఉత్తరం వ్రాసారు. ”మీ అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం మీకు

ఉండదని నేననుకుంటాను. పోనీ పెళ్ళి చేస్తానంటే, పెళ్ళయ్యేవరకూ చదువుకోవచ్చు కదా. మీ అమ్మాయికి కాస్తో కూస్తో చదువుమీద ఆసక్తి ఉంది. రిసర్చిలో పైకి వస్తుంది” అని చాలా బాగా రాశారు. ఆ ఉత్తరం మా నాన్నగారు నాకు చూపించలేదు. ఏదో చీవాట్లు పెట్టి మళ్ళీ నన్ను యూనివర్శిటీకి పంపించారు. ఆయన దాన్ని చింపలేదు కూడా, ఆయన చనిపోయాక, ఆయన కాగితాల నుండి తీసి తమ్ముడు నాకు ఇచ్చాడు. అంత చేసారు లక్ష్మీరంజనం గారు. ఆయనే అప్లికేషన్లు పెట్టించి టాపిక్‌ కూడా నిర్ణయించారు. సదరన్‌ స్కూల్‌ ఆఫ్‌ తెలుగు లిటరేచర్‌ – తంజావూరు, మధుర సాహిత్యాలలోని సామాజిక చరిత్రపై పిహెచ్‌డి చేసాను. పిహెచ్‌డిలో నాకు పల్లా దుర్గయ్య గారిని గైడ్‌గా పెట్టారు. అలాగే, ఈ అమ్మాయికి డబ్బులు అవసరమేమోనని భావించి రెండేళ్ళు ఆర్ట్స్‌ కాలేజి నుంచి స్కాలర్‌షిప్‌ ఇప్పించారు. అప్పటికి నాకు అలాంటి స్కాలర్‌షిప్‌ ఉంటుందని తెలియదు. అలా నా పిహెచ్‌డి ఆయన ప్రోత్సాహంతో జరిగింది.

ఆ మధ్యలో నేను రోజరీ కాన్వెంటులో టీచరుగా చేసాను. అదే సమయంలో నిజామాబాద్‌ ఉమెన్స్‌ కాలేజీలో తెలుగు లెక్చరర్‌ పోస్టు పడింది. దానికి సెలక్షన్‌ కూడా చాలా చిత్రంగా జరిగింది. అప్పటికి మా నాన్నగారిది సీనియర్‌ పోస్టు కావడం వల్ల ప్రభుత్వ సాంస్కృతిక ఉత్సవాలు అన్నీ ఆయన చేతులమీదుగా నడిచేవి. చాలా కమిటీలలో ఆయన ప్రముఖ సభ్యుడుగా ఉండేవారు. 1966 ప్రాంతాల్లో నిజామాబాద్‌ వెళ్ళడం అంటే సాహసమే. నా ఉత్సాహం చూసి నాన్నగారు కొందరిని కలవమన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌లోని ఒక ప్రముఖుడిని కలిస్తే ”నీకు జిల్లాలో ఎందుకమ్మా, ఇక్కడే ఏదైనా చూద్దాం, అక్కడ స్థానిక అభ్యర్థి ఎవరో ఉండే ఉంటారు” అన్నారు. యూనివర్శిటిలో ఒక ప్రొఫెసరు కూడా అలాగే అన్నారు. నిడదవోలు వేంకటరావుగారి అబ్బాయి సుందరేశ్వరరావు మాత్రం నన్ను ఇంటర్వ్యూకు వెళ్ళమని ప్రోత్సహించాడు, అనుభవం వస్తుంది కదా అని.

అక్కడ ఇంటర్వ్యూ కోసం ఒక పేరున్న రచయిత్రి వచ్చింది. ఆవిడ అప్పటికే ”తంజావూరు పతనం” అనే నవల రాయడమే కాక ఎక్కడో ఉద్యోగం కూడా చేస్తోంది. సహజంగా ఆమె ఇంటర్వ్యూ నాకంటే బాగా చేసింది. సెలెక్టయింది కూడా. కానీ ఇంటర్వ్యూ బోర్డులో

ఉన్న అధికారులు కొంతమంది ”ఆ అమ్మాయి అప్పటికే ఉద్యోగం చేస్తోంది, మళ్ళీ ఏదైనా మంచిది వస్తే మానేస్తుంది”, ఈ అమ్మాయికి

ఉద్యోగం లేదు అనుకుని నా పేరు సెలక్ట్‌ చేశారు (బహుశా కులం కూడా ఒక అంశం అయి ఉండవచ్చు). తర్వాత ”ఏ రికమండేషన్‌ లెటర్‌ లేకుండా నువ్వు ఒక్కదానివే వచ్చావమ్మా” అన్నారు. నన్ను నిరుత్సాహపరిచిన పెద్ద మనుష్యుల అభ్యర్థికి ఉద్యోగం రాలేదు. అమ్మతో సహా అందరూ నన్ను డిస్కరేజ్‌ చేసినవాళ్ళే. నిజామాబాద్‌ కాలేజీ యాజమాన్యం నాలాంటి వారికి భరోసా ఇచ్చింది. జిల్లాలో అది మొదటి మహిళా కళాశాల, చాలా సమర్థంగా దానిని నడుపుతున్నారు. అక్కడి విద్యార్థినుల, సహోద్యోగినుల జ్ఞాపకాలు నాకు మంచి అనుభూతినిచ్చాయి. కుల వివక్ష ఉండేది కానీ నేనే దాన్ని గమనించలేదు. పాజిటివ్‌గానే ఉండేదాన్ని.

రెండేళ్ళ తర్వాత ’68లో పెళ్ళయింది. మా వారు బొజ్జా తారకంగారు అడ్వకేట్‌. అంబేద్కరైట్‌. చుట్టుపక్కల గ్రామాలలో అంబేద్కర్‌ భావజాలాన్ని ప్రచారం చేస్తుండేవారు. నిజామాబాద్‌లో 11 ఏళ్ళున్నాం. తారకం గారు 1975లో ఎమర్జెన్సీ మిసా కింద అరెస్టయ్యారు. విడుదలయ్యాక నిజామాబాదు నుండి సిపిఐ ఎంఎల్‌ పార్టీ మద్దతుతో పార్లమెంటు సీటుకు పోటీచేసి ఓడిపోయారు. రాజకీయాలు నాకు కొంచెం కొంచెం అర్థమవుతూ వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే శివశంకర్‌ గారు (మాజీ కేంద్ర మంత్రి అప్పటికి హైదరాబాద్‌లో లాయర్‌గా ఉన్నారు), ”నీవు హైదరాబాద్‌ వచ్చేయమ్మా, నిజామాబాద్‌లోనే ఉంటే మీ ఆయన నక్సలైట్లలో కలిసిపోతాడు, ఇక్కడయితే నాతోపాటు హైకోర్టులో ఉంటా”డనే వారు. అప్పటికి పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు, ఒకబ్బాయి, ఒకమ్మాయి. అప్పుడే హైదరాబాద్‌లో తెలుగు అకాడమీలో రిసర్చి ఆఫీసరు (టర్మినాలజీ) పోస్టు కోసం ప్రకటన వచ్చింది. అది రిజర్వుడు పోస్టు. నాకు అంతగా ఆసక్తి లేక. నేను అప్లికేషన్‌ పెట్టలేదు.

అకాడమీ డైరెక్టర్‌ వెంకటస్వామిగారు నిజామాబాద్‌ వచ్చినప్పుడు ఈ పోస్టు గురించి చెప్పి నన్ను అప్లై చేయమని అడిగారు. ఎవరూ అప్లై చేయకపోతే అది జనరల్‌లో కలిసిపోతుంది కదా, అవకాశం కోల్పోతాము, ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ఆయనే తారకంగారికి చెప్పారు. మా నాన్నగారికి కూడా ఈ పోస్టు బాగా ఉందనిపించింది. దాదాపు ఏడ్చుకుంటూనే హైదరాబాద్‌లో 1978లో జాయినయ్యాను.

వచ్చిన కొత్తలో నాపై వేరే అభిప్రాయాలు ఉండేవి. రిజర్వుడు క్యాండిడేట్‌, ఏమీ రాదు, ఏదో బట్టీపట్టి ప్యాసై తెలుగు లెక్చరర్‌గా జిల్లాలో పనిచేసింది అనే భావం కనపడేది. శబ్దసాగరం అనే ప్రాజెక్టు ఉండేది. దాన్ని సూర్యరాయాంధ్ర నిఘంటువు కంటే గొప్పగా చేయాలన్నది ఉద్దేశ్యం. దేశంలోని తెలుగు మాటలన్నీ ఒక దగ్గర చేర్చి వాటికి ఎటిమలాజికల్‌ అర్థాలన్నీ వివరించడం. ఆ ప్రాజెక్టు చాలా చేతులు మారి అలాగే సాగుతూ ఉండేది, నన్ను ఆ ప్రాజెక్టులో వేశారు. అకారాది క్రమంలో పదాలు వేర్వేరు గ్రంథాల్లోంచి తీసుకుని విడివిడిగా కార్డుల మీద రాయడం – రాసినవి ట్రేలలో వేసి మళ్ళీ అక్షర క్రమం చేయటం ఇలా చాలా మాన్యువల్‌ పని ఉండేది. అలా కొంతకాలం రాస్తూ కూర్చున్నాను. తర్వాత నీకు ఓ మంచి ప్రాజెక్టు ఇస్తానంటూ డైరెక్టర్‌ గారు నాకు సాహిత్య కోశం ప్రాజెక్టు ఇచ్చారు. అది నాకు ఇచ్చారని తెలియగానే అందరికీ ఆశ్చర్యం. ఏమిటి ఈమెకు ఇంత పెద్ద ప్రాజెక్టా అని… ఎంతో గొప్ప పండితులు చేయాల్సినది అది. నన్ను రిక్రూట్‌ చేసుకున్నది టెర్మినాలజీ రిసెర్చ్‌ ఆఫీసర్‌ పోస్టుకి. అయితే టెర్మినాలజీ ఈమెకు ఏం తెలుస్తుందన్న భావంతో కేవలం పదాలు ఎత్తి రాసే నిఘంటువు పని అప్పచెప్పారు. ఆ తర్వాత డైరెక్టర్‌ జోక్యంతో ‘సాహిత్య కోశం’ ప్రాజెక్ట్‌ ఇచ్చారు. అది కూడా ఒక డిక్షనరీ లాంటిది. తర్వాత నాకు పూర్తి ఛార్జ్‌ ఇచ్చారు. అది చాలా వివాదాస్పదమైంది. దానికి సంబంధించిన బ్లూ ప్రింట్‌ దాచేశారు, అలాగే కావలసిన మెటీరియల్‌ లైబ్రరీలో ముందే ఎవరో ఒకరు తీసేసుకుని మాకు అందనిచ్చేవారు కాదు. ఇలా చాలా ఇబ్బందులు పడి చాలా వరకు పూర్తి చేశాం. మాల మాదిగల తెలుగు అంటూ, హేళన చేస్తూ మాలమాదిగలకు తెలుగు రాదు అనే అభిప్రాయంతో ఉన్న అకాడమీ పండితులు దానిని ‘సాహిత్య శోకం’గా ప్రస్తావించుకునేవారట. ఆ ప్రాజెక్టుకు నేను పరిష్కర్తగా ఉన్నాను. నల్లపాటి శివ నారయ్యకు ఆ ప్రాజెక్టు పూర్తి బాధ్యతలు ఇచ్చారు. అతడు మాదిగ. మంచి భాషా పరిజ్ఞానం ఉంది. అయినా కులం కారణంగా చాలా అవమానాలు భరించిన వ్యక్తి. ధైర్యశాలి. నేను నెమ్మదిగా ఉంటాను కాబట్టి ఆయన పూర్తి బాధ్యత తీసుకున్నాడు. ఇదంతా వెంకటస్వామిగారు డైరెక్టరుగా ఉన్నప్పుడు జరిగింది. ఈ లోపల ఆయనకు ట్రాన్స్‌ఫరయింది. దాంతో శివనారయ్య ”దీన్ని రెండుగా చేసి ముందు ఒకదానికి ప్రింట్‌ ఆర్డర్‌ తెచ్చుకుందాం, ఆయన వెళ్ళిపోతే ఇక ఇది ఆగిపోతుంది” అని తొందరపెట్టాడు. ప్రింట్‌ ఆర్డర్‌ లేకపోతే ప్రచురణ ఆగిపోయి ఆ పుస్తకాన్ని పక్కకు పడేస్తారు. అలా గొప్ప గొప్ప వాళ్ళ ప్రాజెక్టులే కట్టకట్టి పక్కన పడేశారు అన్నాడు. త్వరత్వరగా ప్రాచీన సాహిత్య భాగం వేరు చేసి ప్రింటుకు ఇచ్చాం. అలా హడావిడిగా చేసినందువల్ల దానిలో కొన్ని తప్పులు దొర్లాయి. అక్షర దోషాలు, లభ్యమవుతున్న పుస్తకాలు అలభ్యం అని రాయడం… ఇలా… అది ప్రింటయి రాగానే… పత్రికల్లో, దీనిపై వ్యాసాలు వచ్చాయి. చిత్రమేమిటంటే అది బాగుందని చెప్పిన వారే బాగాలేదని రాశారు. అలా ఎందుకని అడిగితే ”మీ వాళ్ళే అలా రాయమన్నారు, ఇప్పుడు నువ్వు అడిగితే దాన్ని ఖండిస్తూ మళ్ళీ నీవు చెప్పినట్లు రాస్తాను” అన్నారు ఒకాయన.

వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఉండదా?

ఉండదు. డబ్బులు, కులంపై అభిమానం. భారతి పత్రికలో ఈ వ్యాసం రాగానే హిందూ ఓరియంటెడ్‌ పత్రికలలో ఈ సాహిత్యకోశంలో తప్పులు అని వ్యాసాలొచ్చాయి. అకాడమీ ప్రచురించిన మూడు పుస్తకాలకు ఆ యేడాది ప్రత్యేకంగా ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు. ఆ మూడింటి మీదా విమర్శలు వచ్చాయి. వాటిలో సాహిత్య కోశం ఒకటి, వీటి మీద అసెంబ్లీలో ప్రశ్నలూ వేయించారు. మిగతా రెండింటినీ ఆయా కులాల మంత్రులు సమర్థించుకున్నారు. మా దానిపై కమిటీ వేశారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. అందులో తప్పులు రావడమనేది నన్ను బాగా కలచివేసింది. చాలా వర్రీ అయ్యాను.

ఈ వర్రీతో మీరు ఇంట్లో లేదా కుటుంబంలో ఏ రకంగా తీసుకోగలిగారు? ఈ విషయాలలో తారకం గారు ఏ విధంగా సపోర్టు చేశారు?

అదే సమయంలో నేను అంబేద్కర్‌పై పుస్తకం రాశాను. ఆంధ్రా ప్రొవిన్షియల్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ అసోసియేషన్‌ వారు అంబేడ్కర్‌పై పుస్తకం రాయమని తారకంగారిని అడిగితే ఆయన ఆ పని నాకు అప్పగించారు. నేను రాసిన ఆ పుస్తకం బాగా ప్రచారంలోకి వచ్చింది. అక్కడ కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నాను. నేను ఆఫీసుకు వస్తుంటే, ‘అదుగో అంబేడ్కర్‌ వస్తుంది’ అని నవ్వుకునేవారట. సాహిత్య కోశం అంటే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీకి కంపానియన్‌, అది నువ్వు చేయడమేంటి అన్న భావన. అందులోనూ ఒక ఆడదానిగా దాని బాధ్యత తీసుకోవడమేంటి అని. కులమూ, దాని తోడైంది.

మీరు బోయి భీమన్న గారి కూతురు, బొజ్జా తారకం గారి భార్య. అయినప్పటికీ మీరు ఇలాంటివి ఫేస్‌ చేశారు. అదే కనుక అదే పొజిషన్‌లో ఒక పురుషుడు ఉంటే ఇలా ఉండేదా?

ఇలా ఉండేది కాదు.

అదే పొజిషన్‌లో ఒక బ్రాహ్మణుడు ఉంటే అస్సలు ఆ తప్పులు అంత స్థాయిలో బయట పెట్టేవారు కాదు. పైగా చాలా బాగా రాశావని హైలైట్‌ చేసేవారు, సన్మానాలు చేసేవారు. ఇప్పుడు అలాంటి ప్రాజెక్టు ఏ యూనివర్శిటీలోనూ లేదు. నిజానికి ఆ

రెండేళ్ళు నన్ను ఎంతో ఇబ్బందికి గురి చేశారు. ఈ విషయంలో. నేను అకాడమీలో నిలదొక్కుకోవడం నిజానికి సాహసమే.

వెళ్ళిపోవాలనిపించిందా ఎప్పుడైనా?

నిజామాబాద్‌లో రిజైన్‌ చేసి ఇక్కడ సెటిల్‌ అవుదామని వచ్చాను. కాక పోయినా ఎప్పుడూ వెళ్ళిపోవాలని అనిపించలేదు, ఎదుర్కొందాం అనిపించేది. ఎందుకంటే మా నాన్నగారు నా భాషని ఎప్పుడూ మెచ్చుకునేవారు. బిఏ, ఎంఏ లలో మా కొలీగ్స్‌ కూడా చాలా మెచ్చుకునేవారు. ఇక్కడ పుస్తకాలు దొరక్కపోయినా చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర ఉన్నవి చదివిన జ్ఞాపకాలు ఉన్నాయి కదా, అలాగే మా డైరెక్టర్‌ సపోర్టు కూడా ఉండింది. అందుకని ఎప్పుడూ వెళ్ళిపోదాం అని అనిపించలేదు. పక్షపాతం లేని కొందరు ఉద్యోగులు నాకు సపోర్టు ఇచ్చారు.

మరొక చిత్రం ఏమిటంటే, మా నాన్నగారు అప్పుడు మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆ సమయంలో అసెంబ్లీలో ఈ పుస్తకంపై ప్రశ్నలు వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారు అకాడమీలో ఈ గొడవను మీరు చూసుకోకూడదా” అని భీమన్నగారిని అడిగారట.

భీమన్నగారు, ఇంకొక ప్రొఫెసర్‌, మరికొందరితో కమిటీ వేసి ఎంక్వైరీ పెట్టారు. అందులో భాగంగా మాకు ముందునుండీ ఇవ్వని బ్లూ ప్రింట్‌ని బయటకు తీశారు. దానిలో సాహిత్య కోశం వ్రాసేటపుడు ఒరిజినల్‌ పుస్తకాలు దొరకకపోతే సమీక్షల ఆధారంగా రాయొచ్చని ఉంది. వందేళ్ళు, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం దొరకకపోవచ్చు కదా, అందుకని సమీక్షల ఆధారంగా చేసుకోమన్నారు. చాగంటి శేషయ్యగారి ఆంధ్ర కవిత తరంగిణి, కందుకూరి వీరేశలింగం గారి ఆంధ్ర కవుల చరిత్ర. అలాంటి స్టాండర్డ్‌ పుస్తకాలు, సమీక్షలు తీసుకుని మేము వ్రాశాం, రిఫరెన్స్‌లో కూడా ఇచ్చాం. అందుకని మేము సేవ్‌ అయ్యాం. బ్లూ ప్రింట్‌ లేకపోయినా అందులో చెప్పినట్లు చేశాం. తప్పులు కూడా మేం చేసినవి కాదు, ప్రాచీన / పండితులవే. అనుభవం లేక ఇలా జరిగిందని తేల్చేశారు. రెండో భాగం కూడా వీళ్ళే చేయొచ్చని సూచన కూడా ఇచ్చారు. అలా మా మీద ఉన్న దురభిప్రాయం పోయింది. మమ్మల్ని కుదుటపడేలా చేసింది.

ఈ లోపు కొత్త డైరెక్టర్‌ వచ్చారు. చెప్పుడు మాటల వల్ల ఆయనకి మా ఇద్దరి సామర్ధ్యాలపై అనుమానం, క్రింద కులాలన్న దృష్టి ఉండేది. ఒకరోజు ఆయన మా ఇద్దర్నీ, నన్నూ శివనారయ్యనూ పిలిచి ఆఫీస్‌ రూంలో కూర్చోబెట్టి అల్లసాని పెద్దనపై రెండు పేరాలు వ్రాయమని చెప్పి వెళ్ళారు. ఆఫీసర్లని కూర్చోబెట్టి పరీక్ష పెట్టడం అన్నమాట. ప్రొటెస్ట్‌ చేయలేం. వెనకాల బలం కూడా లేదు. తిరగబడి చేసేదేమీ లేదు. ఆయన తెలుగు పండితుడు కూడా కాదు. సరే అని చాలా విధేయంగా రాశాం. అది చూసి ఆయన రెండేళ్ళనుండి పనిచేస్తున్నారు కదా ఆ అనుభవంతో రాశారు అని వెళ్ళిపోయారు. ఒక నెలవరకూ ఆయనకు అదే అనుమాన దృష్టి. ”రెండవ భాగం తప్పులు లేకుండా జాగ్రత్తగా చేయండి” అని చెప్పేవారు. నిజానికి మొదటి భాగంలో దొర్లిన తప్పులు అప్పటివరకూ ఉన్న సమీక్షలలోవే. కానీ మా వల్ల ఏమీ జరగలేదని ఆయనకి నెమ్మదిగా అర్థమయింది. తెలిశాక ఈ నలుగురితోనూ ఇంత పుస్తకం ఎలా చేయగలిగావమ్మా అని ఆశ్చర్యపోయారు. ప్రాజెక్టులో ఉన్న ఒకరిని ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళి గ్రంథాలయాల్లో ఫలానా పుస్తకాలు చూడండి అని చెప్పాం. అయితే ఆయన అక్కడికి వెళ్ళి ఆ ఉక్కకి తట్టుకోలేకపోయాడు. ఒక రెండు రోజులు ఉండి వచ్చేశాడు. వారం తర్వాత ఆఫీసుకు వచ్చాడు. ఏం పుస్తకాలు చూశావంటే, సమాచారం తెచ్చాను కానీ నా భార్య ఆ కాగితాలు చింపేసింది అని చెప్పాడు. అది విన్నాక మా డైరెక్టరుకి పరిస్థితి అర్థమైంది. సాహిత్య కోశం (ఆధునిక యుగం 1851-1950) కూడా నా సారథ్యంలోనే పూర్తయింది.

ఆయన తర్వాత వచ్చిన మరో డైరెక్టర్‌ వెంకారెడ్డి గారు. ”నీకు సాహిత్య కోశం ఎందుకు అది ఎవరైనా చేస్తారు. నువ్వు నీ అసలు పోస్టు పని తీసుకో – నీలా పనిచేసే వాళ్ళు అవసరం” అంటూ నాకు టర్మినాలజీ మొత్తం అప్పగించారు. అది అప్పటి డిప్యూటీ డైరెక్టర్‌ బూదరాజు రాధాకృష్ణగారి అధీనంలో ఉంది. నేను అప్పటికి రిసర్చి ఆఫీసరునే. ”నేను లింగ్విస్టుని. జర్నలిస్టుని కూడా. ఇవన్నీ చూసి అది నాకు ఇచ్చారు. ఇది నా డిపార్టుమెంట్‌” అని ఆయన వాదించారు. అప్పుడు డైరెక్టర్‌ మొత్తం ఫైల్‌ను తిరగేసి ఇది వ్యక్తిగత ప్రాజెక్టు కాదు, అకాడమీది అని మొత్తం రికార్డు అంతా నా రూంకి మార్చారు. ఆ రోజు అకాడమీలో అందరూ చాలా ఆశ్చర్యపోయారు. రాధాకృష్ణగారి రూమ్‌లో నుండి ఫైళ్ళు బయటికి రావడం, అందులోనూ నా దగ్గరికి.

అలా అకాడమీలో నా ఉద్యోగం అంతా ఒడిదుడుకులమయమే. అయినా అకాడమీ అంటే నాకు ప్రాణం. సాహిత్య కోశం రెండోభాగం చేసేటప్పుడు రాధాకృష్ణ నాతో ”దీనికి కావలసిన పుస్తకాలు నీకు దొరకవు, ముఖ్యమైన పుస్తకం నా దగ్గర ఉంది, అది నేను ఇవ్వను” అని చెప్పారు. చిత్రమేమిటంటే, కురుగంటి సీతారామయ్యగారు వ్రాసిన ”నవ్యాంధ్ర సాహిత్య వీధులు” అన్న ఆ పుస్తకం మరెక్కడా దొరకదు. కానీ, నాన్నగారి ద్వారా నా దగ్గర రెండు కాపీలున్నాయి. అది ఆధునిక సాహిత్య చరిత్రకు మూల గ్రంధం.

ఈ ప్రాజెక్టులన్నీ మోరల్‌ సపోర్టుతో చేయగలిగాం. అంత అప్రీసియేషన్‌ లేకపోయినా మా శక్తివంచన లేకుండా చేశాం. తర్వాత నాకు డిప్యూటీ డైరెక్టర్‌ (పబ్లికేషన్స్‌)గా ప్రమోషన్‌ వచ్చింది. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందించాం. ఇంటర్‌ ఇంగ్లీష్‌ మీడియం పుస్తకాలు కూడా తెలుగు అకాడమీ ప్రచురించడం ఆరంభించింది. నేను డైరెక్టర్‌గా (ఇన్‌చార్జ్‌) ఉండగానే ఆ బాధ్యత తీసుకున్నాను. ఆ క్రమంలో ఇతర పబ్లిషర్ల నుండి ఒత్తిడి వచ్చింది. మా పుస్తకాలు ఆలస్యమయ్యేలాగా పేపరు కొనుగోలు ఫైళ్లు తొక్కిపెట్టారు. సంకల్పబలంతోనే అన్నీ ఎదుర్కొన్నాము. ఆకాడమీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యంగా నా సహోద్యోగి శ్రీమతి యం. ప్రమీల రెడ్డి ఇచ్చిన తోడ్పాటుతో మేము నిలదొక్కు కోగలిగాం. అదొక పెద్ద కథ. నా నిర్ణయాలతో అకాడమీ ఆర్థికంగా బలపడింది.

ఈ మొత్తం క్రమంలో ప్రమోషన్లు ఆలస్యం చేశారు. అకాడమీ ఆశయాలపై బాగా పట్టు ఉన్నవారంతా ప్రమోషన్లు రాకుండానే రిటైరైపోవడం సంస్థ పురోగతిపై ప్రభావం చూపింది.

ఈ మొత్తంలో మీ కుటుంబ జీవనంపై పడిన ప్రభావం ఎలాంటిది? ఉద్యోగం, సాహిత్యం, పిల్లలు, బాధ్యతలు ఇవన్నీ ఎలా నిర్వహించుకోగలిగారు?

అదేనండీ. మా ఆయన సీనియర్‌ అడ్వకేట్‌. సామాజిక కార్యకర్త. రాజకీయాలలోనూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా గొడవలు జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవారు. ప్రజల సమస్యలు – ముఖ్యంగా దళితుల సమస్యలు ఆయనకి ప్రధానం. అంచేత ఆయనని ఎవరూ తప్పు పట్టలేరు. ఆయన సేవలు సమాజానికి అవసరమే, మనమే సర్దుకోవాల్సి వస్తుంది. కారంచేడు గొడవలప్పుడు నెలకోసారి అర్థరాత్రి వచ్చి రెండు రోజులుండి వెళ్ళిపోయేవారు. నేనే అన్నీ చేసుకోవలసి వచ్చింది. దీనికి తోడు మానసిక ఒత్తిడి. దాంతో నా ఆరోగ్యం పాడైంది. అప్పుడు అమ్మ వాళ్ళింట్లో అద్దెకు ఉండేవాళ్ళం. పిల్లలని అమ్మ చూసుకునేవారు. కానీ ఇప్పటికీ పిల్లలకి చాలా అసంతృప్తి. ”నువ్వు మమ్మల్ని ఎప్పుడైనా ప్రేమగా దగ్గరకు తీసుకున్నావా, ఎప్పుడూ ఆఫీసు గొడవలే కదా!” అంటారు. సమాజానికీ, కుటుంబానికీ స్త్రీలే జవాబుదారీగా ఉండవలసి వస్తోంది. ఒకసారి చిన్న సందర్భం. మా ఆయన ఎవరితోనో ఎవరి గురించో మాట్లాడుతూ ”ఆయన లేరంటే వాళ్ళ ఆవిడను అడుగుదాం” అంటున్నారు. నేను ”వాళ్ళ ఆవిడకి కూడా నాలాగే భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కదా” అన్నాను. దానికి ఆయనకు ఎంత కోపం వచ్చిందో. ఎంత కాదనుకున్నా పురుషాధిక్యత కనబడుతుంది.

ఒకసారి ఏదో డిక్టేట్‌ చేస్తుంటే నేను రాస్తున్నాను. ”ఇంగ్లీషు బాగా రాస్తున్నావే” అన్నారు. బిఏ లోనైనా ఇంగ్లీషు చదివినదాన్ని ఆ మాత్రం రాయలేనా? ఆ మాటకు నాకు చాలా బాధ కలిగింది. ఎంతగా హర్ట్‌ అయ్యానో చెప్పలేను.

ఎందుకని దెబ్బలాడలేకపోయారు?

మనసుకి చాలా కష్టమయిన సందర్భంలో, దెబ్బలాడగలిగితే బాగుండేది, నాకు రిలీఫ్‌గా ఉండేది. కానీ, నేను దెబ్బలాడలేదు. అందుకే ఇలా అయిపోయానేమో. మానసికంగా బాగా దెబ్బతిన్నాను. చిన్నప్పటినుండి గట్టిగా మాట్లాడలేకపోవడం, అలాగని వదిలేయలేకపోవడం. ఇదే ఇబ్బందితో ఇప్పటికీ అలాగే ఉన్నాను. ”చెప్పిన పని చేయడం అంతే. ఎదురు చెప్పకు” అనేవారు మా చిన్నప్పుడు. ఇప్పుడు సమాజంలో కొంచెం మార్పు వచ్చిందేమో. చిన్నప్పుడు ఒకసారి చెవిలో నొప్పి వచ్చింది. నాన్నగారేమో మద్రాసులో ఉన్నారు. అమ్మ ఎవరేం చెబితే ఆ వైద్యం చేయించేది. ఒకసారి పసరు మందులు చెవిలో వేశారు. అతను ఆకులు నూరి చెవిలోకి దూర్చి బయటికి లాగేవాడు. దాంతో చెవులలో కర్ణభేరి దెబ్బతిని వినికిడి తగ్గింది. ఆడవారి ఆరోగ్యం, వాళ్ళే చూసుకోవాలి. ఎవరూ పట్టించుకోరు అనేది నా అనుభవం. మగవారికి సేవలు మాత్రం కావాలి, మనం మన ఫీలింగ్స్‌ని బయటికి చెప్పలేము. నేను మా నాన్నగారి మీద చెప్పలేను, నా భర్తమీద చెప్పలేను. వాళ్ళిద్దరూ గొప్ప వ్యక్తులు.

ఇప్పుడు ఆడపిల్లలకు మీరిచ్చే సలహా ఏమిటి?

ఆత్మ విశ్వాసమూ, ఆర్థిక పుష్టీ సాధించాలి. సమాజంపై, అసమానతలపై ఒక్కోసారి తిరగబడడమూ మంచిదే, తిరగబడకపోవడమూ మంచిదే. అది మనమున్న పరిస్థితులు, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర చదివాను. ఆవిడ భర్త డామినేషన్‌ని తట్టుకోలేక బయటికి వచ్చి ఉంటే ఇంకా కష్టాల పాలయ్యేవారేమో. ఒక కుటుంబ స్త్రీగా ఉండాలని అనుకున్నారు, అందుకని అలాగే ఉండిపోయారు. ఆవిడకి భర్త డామినేషన్‌ ఉన్నా, రక్షణ ఉన్నది. ఆవిడ ప్రతిభ చిరస్థాయిగా నిలిచింది. ఇంట్లో హింస గురించి కంప్లైంట్‌ చేసి మళ్ళీ అదే ఇంటికి రాలేం కదా. ముందు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఫిర్యాదు చేసినా పోలీసులు కేస్‌ ఫైల్‌ చేయకపోవచ్చు. జడ్జిల తీర్పులు అంతంత మాత్రం. వేదన మరీ తీవ్రమైతే, బయటకు రావలసిందే. అలా రావడానికి ఇప్పుడు అవకాశాలున్నాయి. అయినా ఒంటరి స్త్రీలకూ, తల్లులకూ మానసిక వేదన తప్పటంలేదు.

ఈ రోజుల్లో టీచర్‌ తిట్టారని తలిదండ్రులు కోప్పడ్డారనీ పిల్లలు ఉరేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు మా చిన్నతనంలో లేవు. కాలేజీలో, అకాడమీలో చిన్న, పెద్ద అవమానాలు చాలా పడ్డాను. నేను తెలుగు లెక్చరర్ని అయినా, నాకంటే తెలుగు తమకే బాగా వచ్చన్న అహంకారం చూపిన సమాజంతో సౌమ్యంగా నెగ్గుకొచ్చాను. నా పనేదో నేను చేసుకుంటూ పోతాను. పనే పరమార్థం.

తారకంగారికీ అంతే. ఎవరి పని వారు చేసుకు పోతూ సహజీవనం సాగించాం. ఇప్పటికీ, నేను నేర్చుకోవలసింది ఇంకా ఉంది” అని భావిస్తాను.

కుటుంబాలలో స్త్రీలే అన్నీ సర్దుకోవాలనటం ఎంతో అనుభవంతో చెప్పిన మాట. ఒకేసారి రకరకాల బాధ్యతలు నిర్వర్తించటం స్త్రీల నేర్పరితనం.

అవసరమే స్త్రీలకు అన్నీ నేర్పుతుంది. అందుకే ఇంటిపనీ, ఆఫీసు పనీ చూసుకుంటూ సాహిత్య వ్యాసంగం కూడా పెట్టుకోవటం నాకు అలవాటయింది. అది గొప్ప సాంత్వననిస్తుంది. మహాత్మా జ్యోతిరావ్‌ఫూలే జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించాను. ఫూలేను తెలుగు వారికి పరిచయం చేసింది నేనే అని చాలామంది నన్ను అభిమానిస్తుంటారు. అంబేడ్కర్‌, ఫూలేల భావజాలం నాలో బాగా నాటుకుంది. ఆ కోణంలోనే నా ఆలోచనలు సాగుతున్నాయి.

రిటైరయ్యాక పురాణాలలో కులవ్యవస్థ గురించీ, స్త్రీల ప్రతిపత్తి గురించీ రాస్తూ వస్తున్నాను. హెచ్‌బిటి వారు నా రచనలు ప్రచురిస్తూ నాకు ధైర్యాన్నిచ్చారు.

హిందూ సమాజాన్ని పురాణాలు నియంత్రిస్తున్నాయని హేతువాదులూ, ప్రగతి కాముకులూ చెప్పే మాటలు నన్ను ఆలోచింపచేసాయి. బి.ఎ తెలుగు పాఠ్య గ్రంథంలో ”శ్రీకృష్ణుని మధురానగర ప్రవేశము” అనే పాఠాన్ని పరీశీలనగా చూసినపుడు నాకు కృష్ణుని పనులు రౌడీ చేష్టలలాగా అనిపించాయి. వాటిని భక్తులు ఆరాధనతో స్తుతించుకోవడం చూసాక పురాణాలు మనలను తప్పుదారి పట్టిస్తున్నాయనిపించింది. కొన్ని సంప్రదాయాలను పద్దతులను కొందరి ప్రయోజనానికే కల్పించి చెప్పినట్టు తోచింది. ముఖ్యంగా స్త్రీ పాత్రల చిత్రణ-రాముడు తాటకిని నిర్ద్యాక్షిణ్యంగా అధర్మంగా చంపటం దానిని ఎవరు పట్టించుకోకపోగా పొగడటం మానవ సంబంధాలలో వివక్ష ఉండటం గమనించి వాటిలోని నిజానిజాలను ప్రజలకు మామూలు జనానికి వివరించాలనిపించింది. అందుకే రిటైరయ్యాక దీక్షగా పురాణాలు చదువుతున్నాను. తోచినదేదో రాస్తున్నాను.

భూమిక ప్రారంభించినప్పుడు ఆ సభలో నేనూ పాల్గొన్నాను – మాట్లాడాను కూడా. ఆ పత్రిక ఇంత గొప్పగా కొనసాగుతుండటం నాకు చాలా ఆనందాన్నిచ్చే విషయం. భూమికకు నా శుభాకాంక్షలు.

ఇంటర్వ్యూ చేసినవారు: పద్మ ఆకెళ్ళ, ఉష

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.