ప్రతిస్పందన

నా ప్రియనేస్తమా! పాతిక సంవత్సరాల దేహాన్ని ధరించిన నా స్నేహమయీ! నీతో నా పరిచయం, స్నేహం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. బతుకు అర్ధాన్ని బోధపర్చింది. హృదయానికీ, మేధస్సుకీ మధ్యనుండే సంఘర్షణా రూపాన్ని తెలియచేసింది. ‘స్త్రీల ఆత్మగౌరవ పతాక’గా నిన్ను చెప్పొచ్చు. ఈ తెలుగు నాట చిన్న విత్తనంగా మొలకెత్తి, ఫెమినిస్టు పత్రికగా నిలదొక్కుకోవడమనేది చిన్న విషయం కాదు. అనేక ఆర్థిక కడగండ్లను దాటి, ఇక వచ్చేనెల వస్తుందా రాదా అనే భయాల నడుమ కొండవీటి సత్యవతి గుండె ధైర్యమే పత్రికకు ప్రాణం పోసింది. భూమికా! నిన్ను మొదటిసారి ఎప్పుడు చూశానో తెలుసా? ఒకరోజు ‘సజయ’ తన భుజానికున్న సంచీలోంచి అపురూపంగా నిన్ను బయటకు తీసి, నీ గొప్పతనాన్ని చెప్తూ, చేతికిచ్చింది. అప్పుడంతా సంఘటితంగా పత్రిక బాధ్యతల్ని చూసుకొనేవారు. కోట్లాదిమంది స్త్రీల సంఘటిత రూపంగా అక్షర ముఖాల్ని తొడుక్కుని వచ్చి నాలో నిలిచిపోయిందనిపించింది. అప్పట్నుంచీ ప్రతి నెలా ‘భూమిక’ను చదివి ఎన్నో నేర్చుకున్నాను. ఎంతమంది దగ్గరకు భూమిక వెళ్ళగలిగితే అంత ధైర్యాన్ని ప్రోది చేస్తుందని, నా వంతు బాధ్యతగా ఎంతోమందిని భూమిక చందాదారులుగా చేర్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానింకా. స్త్రీల మనోవికాసం ఎదగడానికి, ఆత్మవిశ్వాసం కలగడానికి, ఆత్మగౌరవం పెరగడానికి ఒక వేదికగా, అండగా ‘భూమిక’ నిలబడిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

నా మానసిక చైతన్యానికి మాత్రమే కాదు ఎందరెందరో స్నేహితులు ఏర్పడడానిక్కూడా దోహదపడింది. భూమిక ఏర్పరచిన మీటింగుల్లోగాని, టూర్లలోగానీ, ఎందరెందరో కలిశారు. మనసుకు దగ్గరగా వచ్చారు. అబ్బూరి ఛాయాదేవి, ఓల్గా, సత్య, సజయ, ప్రతిమ, సుజాతా పట్వారీ, సునీతారాణి, పసుపులేటి గీత, కె.గీత, రెంటాల కల్పన, జూపాక సుభద్ర, జాజుల గౌరి, వరలక్ష్మి, పి.సత్యవతి, కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, పాటిబండ్ల రజని, చల్లపల్లి స్వరూపారాణి, మందరపు హైమవతి, కృష్ణకుమారి, శీలా సుభద్రాదేవి, సి.సుజాత, సుజాతామూర్తి, అమృతలత, అనిశెట్టి రజిత వంటి ఎందరెందరో నాకు ఆత్మీయ మిత్రులయ్యారు. మా అందరి మధ్య ఒక స్నేహ వారధిగా భూమిక నేటికీ నిలిచే ఉంది. గవర్నమెంట్‌ ఉద్యోగాన్ని మానేసి, భూమికకే తానంకితమైన సత్య పట్ల మరింత ప్రేమ పెరిగింది. ఇది అందరికీ అందుబాటులో ఉండే పత్రికగా నిలబడాలనేదే నా చిరకాల వాంఛ.

‘భూమిక’ – ఇటు సాహిత్యరంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేయడంతో పాటు, సామాజిక రంగంవైపు తన అడుగులు వేసింది. ‘భూమిక హెల్ప్‌లైన్‌’ స్థాపించి, బాధిత స్త్రీల తరఫున తాను వకాల్తా పుచ్చుకుంది. నలుగురు ఉద్యోగులతో, కౌన్సిలర్లతో మొదలైన ఇది 40 మంది ఉద్యోగుల వరకు ఎదిగింది. పోలీసులతో పాటు పనిచేస్తూ, జెండర్‌ అవేర్‌నెస్‌ను ప్రజల్లో కల్పిస్తూ తెలంగాణలోనే కాక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటీవలే హెల్ప్‌లైన్‌ సెంటర్లను ప్రారంభించింది. ‘భూమిక’ అనగానే నిజాయితీ గల నిప్పులాంటి స్వచ్ఛమైన సంస్థగా పేరు తెచ్చుకుంది. గుర్తొచ్చినప్పుడల్లా నాకు గర్వంగా ఉంటుంది. ‘మద్దూరు’లో పెట్టిన సెంటర్‌వల్ల ఎన్నో బాల్యవివాహాలు కూడా ఆపగలిగింది. 9వ తరగతి టెక్ట్స్‌ బుక్‌లో భూమిక టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం ముద్రించింది. తమ క్లాసు పిల్లలకు జరుగుతున్న వివాహ వివరాలను తెలియచేస్తూ పిల్లలే ఫిర్యాదు చేశారు. సకాలంలో తెలవడం వల్ల ఆపగలిగింది. చాలా ధైర్యమున్న సంస్థగా, బాధిత పక్షాన పోరాడే శక్తిగా, ఎందరెందరికో ఉపయోగపడే సంస్థగా మంచి పేరు తెచ్చుకుంది. కొన్నాళ్ళపాటు ‘వర్కింగ్‌ ఎడిటర్‌’గా పనిచేయడమనేది నా జీవితంలో నాకెంతో తృప్తినిచ్చిన ఉద్యోగం. ప్రస్తుతం ఎడ్వయిజరీ బోర్డ్‌ మెంబర్‌గా ఉన్నాను. గత పదిహేనేళ్ళకు పైగా భూమికలో కాలమ్స్‌ రాస్తున్నాను. ‘మనోభావం’ పేరిట గతంలో రాశాను. ప్రస్తుతం ‘వర్తమానలేఖ’ పేరుతో నాతోటి రచయిత్రులతో నాకున్న స్నేహబాంధవ్యాలను తెలుపుతూ, వారు సాహిత్య రంగంలో చేసిన కృషిని ప్రధానంగా వెలిబుచ్చాలనే కాంక్షతో గత నాలుగేళ్ళుగా రాస్తున్నాను. ఇప్పటికి 42 మందిని రాయగలిగాను. త్వరలో పుస్తక రూపంలో వస్తోంది. నా మనశ్శరీరాల్లో అంతర్గత భాగం భూమిక. నా పాతికేళ్ళ ముద్దుబిడ్డ. నేనెంత చెప్పినా, రాసినా తక్కువే. నన్నొక రచయిత్రిగా, మనిషిగా, స్నేహితురాలిగా మలచిన శిల్పి భూమిక, నాలో భాగం. ఇటువంటి పత్రికలు తెలుగునాట మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. ‘భూమిక’ను తల్చుకున్నప్పుడల్లా ఒకింత సంతోషం, ఒకింత గర్వం, ఒకింత ధైర్యం, ఒకింత ఆత్మవిశ్వాసం కలగడమనేది సహజమైన విషయం. రైటర్స్‌ టూర్లవల్ల ప్రతి ఒక్కరికీ సంతోషంతో పాటు ఇన్నర్‌ చెక్‌ చేసుకోవడం అలవాటైంది. స్వేచ్ఛ గొప్పతనం తెలిసొచ్చింది. బతుకు విలువ, స్నేహ సౌరభాలు ఎన్నో ఎన్నెన్నింటినో మదినిండా నింపుకున్నాం. భూమిక మనది, అందరిదీ అనే ఊహే అద్భుతమైంది.

– మీ శిలాలోలిత, హైదరాబాద

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.