భూమిక
ఒక పత్రిక కాదు, ఒక ఎన్నిక
అవనిలో సగం కలిసి అందుకున్న పూనిక
ప్రతి రచనా
ఎక్కుపెట్టిన బాణమై, ప్రజ్వరిల్లే అస్త్రమై
ప్రతి అక్షరం
మరుగుపడిన మానవతా దృక్కోణమై
ప్రతి సంచికా
అణచివేతను ప్రశ్నించే కంఠస్వరమై
అసహాయతకి తోడొచ్చే గుండెబలమై
ఆకాశంలో సగానికి
నేలమీది ఆధారమై నిలబడి
ధిక్కరించే ధైర్యమై కలబడి
నీడనిచ్చే వృక్షమై విస్తరించి
అశ్రువుల్లో వానవిల్లై విరిసి
ఆపదల్లో ఆసరాగా నిలిచి
అతివల హృదయాలాపనని
అవని అంతటా వినపడే వేకువపాటగా
కూర్చి, కూనిరాగాలు తీస్తూనే
శంఖారావాలు మోగించిన శూరనాయిక
వనితావని తనకు తానే
ఆలంబనగా రూపొందాలని
మహిళావాణి అవసరమైతే
యుద్ధదుందుభిగా మ్రోగాలని
కుటుంబం కోసం బతికే స్త్రీ
తనకోసం తాను పోరాడక తప్పదని చెపుతూ
పరస్పర గౌరవ ప్రాతిపదికని
ప్రపంచానికి ప్రతిపాదించిన పదునైన తూలిక
భూమిక ఒక పత్రిక కాదు,
మానవీయత చేసుకున్న ప్రగాఢమైన ఎన్నిక
పరిమళించే స్త్రీ స్వేచ్ఛ ప్రస్ఫుటించే ప్రతీక
అశ్రుకణంలో శ్వేతకిరణం ఎగరేసిన సప్తవర్ణ పతాక
మాతృత్వం, మార్దవం
అహంకారపు అణచివేతకు గురైనపుడు
మమకారపు మాధుర్యం
దౌర్జన్యం పాలబడినపుడు
లేరా ఎవరూ లేరా అన్న ప్రశ్నకు
నేనున్నానని బదులిచ్చి
ఆర్తులెవరూ అనాధలు కారని
కలిసి నడిస్తే సమత సాధ్యమని
తెరలు తీసి తేల్చి చెప్పిన కరదీపిక
ఇది భూమిక పోషించిన భూమిక!
బహు దూరం… ఈ ప్రయాణం!
మైలురాళ్ళెన్నో దాటిన
ఈ ప్రస్థానపు గమ్యం సుస్పష్టం! విజయం తథ్యం!
– వారణాసి నాగలక్ష్మి, హైదరాబాద్