తెలుపు…
ఆమెకెంతిష్టమో
చిన్ననాటి వైట్ యూనిఫాం
దూదిపింజల్లాంటి మబ్బులు
తాత నుదుటిన విభూతిరేఖలు
ఆమె మధుర స్మృతులు
కాలం గడిచింది
ఆమె ఇల్లాలయింది
నిజంగానే ఆమె జీవితం
పచ్చని వాకిలిలో
తెల్లని ముగ్గులా
సిగలో తురిమిన
తెల్లని మల్లెలా
ఉయ్యాల్లో పాప
తెల్లని పాలపండ్లలా
ఆమె తీపి జ్ఞాపకాలు
కాలం గడిచింది
అదే తెలుపు
ఇప్పుడదంటే
ఆమెకెంత కోపమో
అవును
సిగలో తెల్లని మల్లెలు
శాశ్వతంగా మాయమై
తెల్లని విభూతి రేఖలు
నుదుట్లో వెలసి ఆమె
దురదృష్టాన్ని వెక్కిరిస్తున్నాయి
తెల్లని మేఘాల్ని చూసినప్పుడల్లా
తాను కట్టిన తెల్లని చీరని
చూసినట్టయి
తెల్లని ఆమె కళ్ళలో
ఎర్రని కన్నీళ్ళు
నల్లపూసలు లేక తెల్లబోయిన
మెడ తెల్లని అద్దంలో
నల్లగా ప్రత్యక్షం
ఘల్లు ఘల్లుమని మోగిన
ఆమె తెల్లని పట్టీల సవ్వడి
మూగబోయినట్టు
ఆమె వెక్కిళ్ళ సవ్వడి సాక్ష్యం
ఇప్పటికీ ఆమెకర్ధం కానిదొకటే
పుట్టుకతో వచ్చిన బొట్టు, కాటుక, పూలు
మధ్యలో వచ్చిన పుస్తెలతో
ఎందుకు
మాయమైనాయో
అని…