యాజ్ఞసేని (ద్రౌపది ఆత్మకథ) -ఉమామహేశ్వరి నూతక్కి

 

”ఎవరి కర్మని వారే అనుభవించాల్సి ఉంటే నేను మాత్రం ఎందుకు యుధిష్ఠిరుని ధర్మరక్షణార్ధం అయిదుగురి భర్త పాదాల చెంత నన్ను నేను సమర్పించుకుని లోకంలో అపహాస్యం, వ్యంగ్యం, నిందాపనిందల పాలు కావాల్సి వచ్చింది?”

ఒకే ఒక్క ప్రశ్న!!… యుగాలు మారాయి కానీ అదే ప్రశ్న రూపాలు మార్చుకుని ఇంకా సంచరిస్తూనే ఉంది ఈ లోకంలో… సమాధానం మాత్రం ఇంకా ఎక్కడా దొరకలేదు.

కథగా చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేదు.

ఎందుకంటే మన అందరికీ తెలిసిన మహాభారత గాథే ఇది. అందుకే కథగా చెప్పటం కన్నా ఆనాటి తన అంతరంగాన్ని నేటి లోకపు తీరుతెన్నులతో తరచి చూస్తూ రాస్తున్న అక్షరాలు ఇవి.

ద్రౌపది అంతరంగ కోణంలో నుండి రాయబడ్డ కథ. కృష్ణ (ద్రౌపదికి మరో పేరు) కృష్ణుడికి రాసుకున్న లేఖ. ఇదొక ఆత్మావలోచన. ఆత్మ నివేదన. యుగ యుగాల స్త్రీ లేఖ. తన జీవన ప్రస్థానపు కన్నీటి లేఖ. యజ్ఞగుండంలో తన పుట్టుక నుండి మహాప్రస్థానం వరకూ తన అంతరంగాన్ని విప్పి చెబుతూ తరతరాల స్త్రీలందరిలో ఆలోచన కలిగింపచేసేలా తన ప్రియ సఖుడైన కృష్ణుని ముందు పరిచిన మనోలేఖ ఇది. మనసున్న ప్రతి హృదయాన్నీ చెమరింపచేసేలా చేసే గాథ ఇది.

కృష్ణమయమైన విశ్వాన్ని ప్రేమార కలగన్న కృష్ణగాథ ఇది.

”నాకు ఏవీ కోరికలూ, ఆశలూ లేవు. నా జన్మ జీవితం మరణం ఇంకొకరు నిర్దేశించినట్లు జరుగుతుంది. నేను ఎందుకు వచ్చానో, ఎందుకు జీవిస్తున్నానో, ఎందుకు మృత్యువును చేరుకుంటానో నాకు తెలియదు. అజ్ఞానమే నాకు రక్ష” అర్జునుని అర్ధాంగిగా మారటానికై స్వయంవరానికి సిద్ధపడాల్సి వచ్చినపుడు ద్రౌపది ఆవేదన.

ఈ ఆవేదనని నేటి స్త్రీకి అన్వయించి చూసుకుంటే? అక్షరం అయినా మార్చి రాయగలమా? ఇప్పటికీ స్త్రీ జీవితమంతా ఎవరో ఒకరి నిర్దేశకత్వంలో నడవవలసి వస్తుంది కదా… ఆ పరిధి దాటదామని చూసే ప్రతి స్త్రీని ఎలా త్యజించాలా అనే సమాజం ఆలోచిస్తుంది.

‘నేను అజ్ఞాన శిశువుని, నా సృష్టి కర్త నా చేతిలో ఎప్పుడు ఏ ఆటవస్తువుని పెడితే దాంతో ఆడుకుంటాను. ఆనందిస్తాను, జీవిస్తాను. నా ఆటవస్తువుగా ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు అనే ప్రశ్నలని అడగడానికి నేనెవరిని?’

కాదనగలమా… నిజమే కదా…? ‘సృష్టి స్థితి లయలన్నీ’ ఎవరి చేతుల్లోనో ఉన్నాయన్న ప్రచారం మీదే లోకం నడుస్తున్నప్పుడు… ఎవరి పాప పుణ్యాల గురించి అయినా వారినెలా ప్రశ్నించగలం. ప్రశ్నించాల్సిన వాళ్ళెవరూ మనకి కనబడరు… మరిక మన ప్రవర్తనని పాపపుణ్యాల విభజనగా చేసే అధికారం ఎవరైనా ఎలా తీసుకుంటారు.

‘జన్మ మృత్యువులు విధి లిఖితమైతే ఆ విషయమై ఎవరైనా ఎందుకు లజ్జితులవ్వాలి?’ స్వయంవరంలో కర్ణుని పరిస్థితిని చూసి అనుకున్న మాట.

నిజమే కదా… అన్నీ విధి లిఖితమే అని చెప్పబడుతున్న సమాజంలో పుట్టుకని బట్టి వర్ణాల విభజన ఎందుకు జరుగుతుంది. ఏ విధి లిఖితమైనా సరే, యుగయుగాలుగా తమని తాము శక్తివంతంగా చెప్పుకుంటున్న కొందరి చేతే రాయబడుతుంది. వారి అభీష్టాల మేరకే ఈ లోకం నడపబడాలి. ఇదే విధి లిఖితంగా చెప్పబడే నియమాలలోని అసలైన ఆంతర్యం.

‘అరణ్యంలోని క్రూరమృగాలకంటే మనుషులలోని దుష్టబుద్ధి భయంకరమైనది. జీవించటం కోసం పశువులు జీవ హత్య చేస్తాయి. కేవలం అహంకారాన్ని శమింపచేయడానికి మనిషి మనిషిని హత్య చేయగలడు.’ పచ్చి నిజం కదా ఇది… సృష్టి వైపరీత్యాలన్నిటికీ మూల సూత్రం ఇదే కదా.

అయిదు తొలి రాత్రులు…

ఏ స్త్రీకైనా ఎంతటి ప్రాణ సంకటం? ఎంతటి తీవ్ర మథనం?

ఏ ఒక్కరి మనస్తత్వమూ ఇంకొకరితో పొసగని వ్యక్తిత్వాల మధ్య ఏ ఒక్కరినీ నొప్పించకుండా నెగ్గుకు రావటంలో ఆమె మనసు ఎంత సంక్షోభానికి గురయి ఉండాలి?

ద్రౌపది కర్మ, జ్ఞానం, శక్తి మూర్తీభవించిన స్త్రీ కాబట్టి తనని వెదుక్కుంటూ వచ్చిన ప్రతి సంక్షోభాన్నీ నిబ్బరంగా ఎదుర్కొంది.

ఈ సమాజముందే… తరతరాలుగా స్త్రీ ఉన్నత విలువన్నిటినీ, ఎక్కడా కానరాని శీలమనే ఒక మిథ్యా ఊహతో ముడిపెట్టి చూస్తుంది.

భారత పురాణ… ఇతిహాసాలలో ద్రౌపదిలాంటి బలమైన వ్యక్తిత్వమున్న స్త్రీ మరొకరు కనిపించరనటంలో అతిశయోక్తి లేదు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకూ సమాజం తనకిచ్చిన స్థానం చివరి వరుసలోనే. సప్తవ్యసనాలున్న భర్తల వ్యసనాలకి ఊతమైన వారికిచ్చిన ఉన్నతమైన స్థానం ఈమెకి దక్కలేదు.

ఎందుకంటారా?

శీలవతికి ఈ సమాజమిచ్చిన నిర్వచనాలకి లోబడి లేకపోతే చాలు… ఎంతటి మహోన్నతమైన వ్యక్తిత్వముండనీ ఈ లోకం తనకిచ్చే స్థానం ఎప్పుడూ ప్రశ్నార్థకమే కదా మరి.

కావాలంటే చూడండి…

ఉత్తమ పురుషుడని కొనియాడబడే కర్ణుడు, అభిమానధనుడు అని పేరుబడ్డ దుర్యోధనుడు… ఇంకా ఉత్తమోత్తములని కొనియాడబడ్డ అనేకమంది అయిన వారే, తన ప్రమేయం లేకుండానే అయిదుగురు భర్తలకి భార్యగా మార్చబడిన అసామాన్యమైన విదుషీమణి, భక్తురాలు, శక్తిమంతురాలు అయిన ద్రౌపదిని, బహు పురుష భోగ్యురాలిగా అవమానాలకి గురిచెయ్యటంలోనే ఈ లోకం పోకడ ఎలాంటిదో తెలుస్తుంది.

యాజ్ఞసేని వలే యాతన, అవమానం, మానసిక సంకటం, సంఘర్షణ అనుభవించిన స్త్రీలని ఈనాటి ప్రపంచంలో అడుగడుగునా మనం చూస్తూనే ఉన్నామనటంలో ఎలాంటి సందేహమూ లేదు.

ద్రౌపది గురించి ప్రచారంలోగల అనేకానేక అసంబద్ధ వ్యాఖ్యలు, భిన్న అభిప్రాయాలకు ధీటుగా ఈ ‘యాజ్ఞసేని’ నవల తన అంతరంగాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా విశదపరచి పాఠకులను ఆలోచింపచేస్తుంది.

ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత ప్రతిభా రాయ్‌ ఒడియా భాషలో యాజ్ఞసేని నవలను 1984లో రచించారు. జయశ్రీ మోహనరాజ్‌ తెలుగులోకి యాజ్ఞసేని పేరుతోనే అనువదించారు. ఎమెస్కో బుక్స్‌ సంస్థ ఈ పుస్తకాన్ని 2008లో డిసెంబరులో ప్రచురించారు.

వ్యాస దేవుడి మహాభారతాన్ని ఆసరాగా తీసుకుని ఈ నవలని రాశానని రచయిత్రి ప్రతిభారాయ్‌ తన ముందు మాటల్లో చెప్తారు. అయితే కొన్ని కాల్పనిక ఘటనలు, కాల్పనిక చరిత్ర కూడా మూల కథలో కలిపానని చెప్తారామె. ”యాజ్ఞసేని” నవల కాబట్టి ప్రాథమిక అవసరాల రీత్యా కథా ప్రవాహంలో కొన్ని మార్పులు చేశానని ఆమె అంటారు. అందుకే నవల మొత్తం ఒక సాధారణ కృష్ణ మనోగతం ఎలా ఉంటుందో అలాగే చిత్రింపబడుతుంది. కృష్ణుడు – కృష్ణ అన్న పేర్లను జోడించి వారి మధ్య ఉన్న అలౌకిక దేహాతీత ప్రేమని స్థాపించడానికి ప్రయత్నిస్తారు ప్రతిభారాయ్‌.

‘ఇట్లు నీ ప్రియ సఖి’ అంటూ ఉత్తరంగా మొదలుపెట్టిన ఈ ప్రవాహం ”ఆరంభం” అంటూ ముగుస్తుంది. పుస్తకం చదివాక మనలో మన కొత్త దృక్పథానికి, కొత్త ఆలోచనలకి నిజంగా ఇది ఆరంభమే అనిపిస్తుంది.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.