ప్రియమైన ‘రేవతీ’ ఎలా ఉన్నావ్?
మబ్బుల తోటలో తెల్లని హృదయంతో అలా అలా గాలికి ఎగిరొస్తూ అప్పుడప్పుడు ఊహల పల్లకీ దిగొచ్చి పలకరిస్తుంటావు కదూ! ఆ క్షణాలు నాకెంతో అపురూపమైనవి. నీ ప్రతి అక్షరం, మాట నా మనసు గోడలనెప్పుడో అతుక్కు పోయాయి. నీ చిరునవ్వు, అందమైన నీ
కళ్ళు నాకిష్టం. నిజంగా ‘రేవతీదేవీ’. అవి అనంతానంత లోకాల రహస్యాల్ని విప్పుతూ ఉంటాయి. ఎన్నెన్ని ఊసుల్నో, అనుభూతుల్నో పంచుకోవడానికి ఆహ్వాన గీతికల్లా అన్పిస్తాయి.
నీ కవిత్వం నా ఇంకో ప్రాణం. అందరికీ ప్రాణమొకటే ఉంటే, నాకేమో నీ కవితాక్షరాలన్నీ ప్రాణ వాయువులే. అందుకే నీ మీద నాకున్న అపారమైన ప్రేమను ప్రకటించడానికే, నేను ‘నేను’ మరిచి నన్ను నీ కవిత్వ పుస్తకమైన ‘శిలాలోలిత’లో కలగలిసిపోయాను. నిజానికి నాకిప్పుడు ఎవరన్నా గుర్తుచేస్తే తప్ప నా పేరు లక్ష్మి అని గుర్తుండదు. నేను శిలాలోలితనే కదా అనుకుంటాను. అందుకేనేమో ‘రాజాహస్సన్’ గారొకసారి ‘రేవతీదేవి శిలాలోలితను ఆవహించింది అనడం సరైనదేమో’ అనడం గుర్తొస్తుంది.
నీతో నా తొలి పరిచయం ఎప్పుడో గుర్తుచేసుకుంటే అప్పటి రోజులన్నీ ఒకటొకటిగా రాలిపడ్తున్నాయి. 88’లో నేను రాజమండ్రి తెలుగు యూనివర్శిటీలో ఎం.ఫిల్ చేస్తున్నాను. ‘కవయిత్రుల కవిత్వంలో స్త్రీల మనోభావాలు’ టాపిక్. జయధీర్ తిరుమలరావుగారు గైడ్. మెటీరియల్ చాలా వరకు సేకరించు కున్నానప్పటికే. నీ పుస్తకం దొరకలేదు ఎంత వెతికినా! నీలానే! ఎవరో అన్నారప్పుడు రేవతీదేవిని చదవకుండానే కవయిత్రుల కవిత్వం ఎలా పూర్తవుతుంది? అది అసంపూర్తి పరిశోధనగానే మిగులుతుంది అని. నాకొక్కసారిగా దిగులు పట్టుకుంది. ఎలా ఎలా అని? నువ్వు నా అభిమాన రచయిత ‘వడ్డెర చండీదాస్’ గారి దగ్గర ‘జీన్‌పాల్ సార్త్రె’ మీద రిసెర్చ్ చేస్తుండే దానివనీ, ఆయన దగ్గర ఒక కాపీ దొరకచ్చని అన్నారు. వెంటనే చండీదాస్ గారికి ఉత్తరం రాస్తే, వెంటనే పంపారాయన. నీ నీలిరంగు అక్షరాల్లో శిలాలోలిత నన్ను చేరిందొక సాయంత్రం. ఆ రాత్రంతా చదివాను.
‘దానవాయిపేట’లో నువ్వు తిరుగాడిన ప్రదేశంలో ఇన్నేళ్ళ తర్వాత నేను కూడా ఉండటం, నాకిప్పటికీ ఆశ్చర్యమే. ఎంతో అద్భుతమైన కవివి నువ్వు!! ప్రతి అక్షరం అపురూపం. కొత్త కొత్త ప్రతీకలు, ఊహలు, నిజాలు, నిరాలంకార శోభతో, గొప్ప తాదామ్యంతో నన్నావరించాయి. నీ కవిత్వం ఆవిరిలా నన్ను కమ్ముకుంది. నీ కోసం కన్నీటి నదినే అయ్యానా రోజు. ఎంత పెయిన్, ఎంత బాధ, ఎన్ని ప్రశ్నలు, ఎంత విశ్లేషణ, ఎంత నిజాయితీ, ఎంత నిర్భీతి, ఎంత కవిత్వం. ఒకటేమిటి? పుస్తకం నిండా నువ్వే కన్పించావు. నువ్వే గనక జీవించి ఉంటే, శ్రీ శ్రీ లాంటి ఎందరెందరో కవుల సరసన నిలిచే సామర్ధ్యం నీది.
తొలి స్త్రీ వాద కవయిత్రి అని నా రిసెర్చిలో ప్రతి పాదించాను. నువ్వున్నావని, ఊళ్ళోంచి ఇంట్లోంచి వెళ్ళిపోయాను… కానీ, నీ మనసులోంచి మాత్రం వెళ్ళలేకపోయాను అంటా వొకచోట. నీలం నిప్పు రవ్వలు, క్షితిజరేఖ, ఒక స్త్రీ ఊపిరాడని ఈ సమాజపు సంకెళ్ళ నడుమ ఎలా నలిగిపోతుందో చాలా చోట్ల చెబ్తూ పోయావు. ఈ దేశంలో ఆడదానికి పావలా ఇచ్చినా చాలు, పసుపుతాడు కట్టినా చాలని తేల్చేశావు. నన్ను కదిలించి, కరిగించి, కన్నీళ్ళొలికించిన కవిత్వం. నా కలానికి పేరెందుకు కాకూడ దనుకున్నాను ఆ క్షణంలో. నాలో, నా ఆలోచనలో, నా రక్తంలో భాగమైపోయావు. ఇప్పటికీ పేరెంత బాగుందో అని అంటే మురిసిపోతుంటాను నిన్ను తలచుకుంటూ. నా కోసమే నువ్వా పేరు పెట్టుంటావు.
భౌతికంగా మనం కలవలేక పోయినా, ఎప్పుడూ నీ నెచ్చెలినే నేను. నీ కవిత్వాన్ని ఎన్నెన్ని జిరాక్స్‌లు చేసి పంచానో తెల్సా! నిన్ను వాళ్ళందరికీ పరిచయం చేయాలని.
అప్పుడప్పుడు ఇలా ఉత్తరాలతో నిన్ను పలకరిస్తూనే ఉంటా. నేను కొన్నాళ్ళకు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను కలవడానికి వస్తాను కదా! ఏమో, కలుస్తామో లేదో తెలీదు. తెలిమబ్బు నడిగినా చెప్పడం లేదు. ఏ శాస్త్రవేత్తా ఇప్పటివరకు చివరి అడుగు చిరునామా కనుక్కోలేకపోయినా, మన హృదయభాష మనకుంది కదా!
ప్రస్తుతానికి ఉండనా మరి…
– నీ ప్రేమికురాలు