వారి నవ్వులో సాధికారత ఉంది
వారి నడకలో భవిష్యత్తు దర్శనం ఉంది
వారు రాబోయే తరాలకు వేగు చుక్కలు
అంతరంగం వీక్షణంలో వారు మనో విజ్ఞానులు
జీవన శిల్పంలో వారి నైపుణ్యత అపూర్వం
కడలి తరంగాలపై వారు నడుస్తున్నప్పుడు
అలలు వారి చరణాలకు మెట్లయ్యాయి
పచ్చిపొదల్లో మంటల్లా వారు వెలుగులు చిమ్ముతున్నారు
నిస్తేజాన్ని నిరసించటం వారి నైజం
సాహసానికి వారు ప్రతీకలు
నిజమే! వారి నవ్వుల్లో సంగీతముంది
తంబురలో దాగున్న స్వరాలన్నీ
రాగ మాలికలవుతున్నాయి
జీవితం ఓ మహాకావ్యం సుమా
కొన్ని దశల్లో విద్యుత్తు
కొన్ని దశల్లో వికాసం
కొన్ని దశల్లో విషాదం ఉంటాయి
కొందరెందుకు లేనిదాని కోసం ఆరాటపడుతున్నారు
ఉన్న దాన్నెందుకు గుర్తించకలేకపోతున్నారు
కొందరు పూచిన చెట్లలా గుభాళిస్తున్నారు
ఆత్మ విశ్వాసమే వారికి ఆయువు!
కొందరు అన్నీ అనుభవిస్తూనే ఉంటారు
ఏమీ పొందనట్లు నిరాశను కనపరుస్తారు
అభివ్యక్తిలో శూన్యత చూపిస్తారు
నిజాయితీగా జీవిస్తారు
వారి కళ్ళలో వెలుగుల సందడి
ప్రతి అడుగులోను నూత్న శోభ
అక్షరాలను సృజించే శిల్పం
వారు చిత్రాలు చిత్రాలుగా కదులుతూ
గుండె తడి నుండి పంటలు పండిస్తారు
వారు బలవంతుడు విల్లంబు నుంచి వదిలిన
బాణాల్లా దూసుకెళుతున్నారు
నిజమే! ఇది వ్యక్తిత్వ నిర్మాణయుగం
ఒక నిర్దిష్ట గమ్యం వైపు ప్రయాణించటమే
నేటి కర్తవ్యం
బొటన వేలితో అనంత జ్ఞానాన్ని సృష్టించినవారే
ఒక ఉలి చేత బూని
నిలువెత్తు విగ్రహాన్ని చెక్కిన శిల్పి
యుగాలుగా మనకు దర్శనమిస్తున్నాడు
ఆ కుంచె ధరించిన యువతి
తన్ను తానే ముందు గీసుకుంది
తన మనస్సులోని తరంగాలను
నదిగా సృష్టించింది
తన నడకలో భూమి పొరలను నిక్షిప్తం చేసింది
రెండు కళ్ళతో అనేక చిత్రాలు గీసింది
రెండు వేళ్ళతో అంతరంగాన్ని చూసింది
రెండు మాటలతో లోకాన్ని జయించింది
ఆమె అతులిత కళా సృష్టికర్త
ఆమె నవ్వితే తోట పూసింది
అవును! ఈ తరం యువతులు
రోజూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు
ప్రేమించటం వారి నైజం
జీవించటం వారి దినచర్య
వారి దిన చర్యలు చూసి సూర్యుడు
అలసి అస్తమిస్తున్నాడు
అవును! సౌందర్యం ఎక్కడుంది?
ఆత్మవిశ్వాసంలో ఉంది
ఎవరో పొగడాలని ఎదురు చూసేవారు
ఎప్పుడూ అభాగ్యులే…
అందుకే, ఇది తమకు తాము గుర్తిస్తున్న కాలం
ఎల్లలు చెరిగిపోతున్నాయి
కుల, మత భేదాలు గోడలు బిగుసుకున్నాయి
అగడ్తలు దాటి ఈ తరం అడుగులేస్తుంది
వెనుదిరిగి చూడడం వారికి రాదు
వెనకబడేవారు వెనకబడే ఉన్నారు
ముందడుగే ఈనాటి సూత్రం
ఆత్మ విశ్వాసమే ఈ యుగ సంకేతం