కాలా ‘రజనీ సినిమా’ కాదు! (తెలుగు అనువాదం ల.లి.త.) సుమీత్‌ సామోస్‌

స్పష్టమైన కులతత్వ వ్యతిరేక రాజకీయాలు కేంద్రంగా ఉంటూ, ప్రతిదీ వాటి చుట్టూనే తిరుగుతూ ఉండగా, ‘కాలా’ దళిత బహుజన జీవితాన్ని, వాళ్ళ ప్రపంచాన్నీ చూపిస్తుంది. పవిత్రత, అధికారం, స్థానం లాంటి బ్రాహ్మణీయ భావజాలానికి ఎదురుగా నిలబడి, వాటినన్నిటినీ పక్కకు తోసేస్తుంది.

(పా.రంజిత్‌ సినిమాలోని కులతత్వ వ్యతిరేక రాజకీయాల గురించి ఓ దళిత బహుజన పరిశీలన)

‘ప్రధాన స్రవంతి అంటే మేమే’ అని దర్శకుడు పా.రంజిత్‌ చెప్తున్నట్లుగా ఉంది కాలా సినిమా. ‘మేమే’ అంటే ఇక్కడ భూమి, చదువు వనరులూ ఏమీ లేకపోయినా వాటికోసం సంఘటితం అవుతూ పోరాడుతున్న ఈ దేశపు అధిక సంఖ్యాకులైన బహుజనులు. ఈ కథను చెప్పటానికి ముంబైలోని ధారావి (ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ)ని నేపథ్యంగా తీసుకున్నాడు దర్శకుడు.

సామాన్యంగా ధారావిలో ఎలాంటి సామాజిక వర్గానికి చెందిన మనుషులు ఉంటారు, అందులోనూ ప్రత్యేకంగా ఈ సినిమా లొకేషన్‌ ఎటువంటిది అని ఊహించటానికి పెద్దగా ఏమీ లేదు. ఆ బస్తీ పేరు భీమ్‌ వాడ, గౌతమ్‌ బుద్ధ నగర్‌. గోడమీద బుద్ధుడు, మహాత్మా ఫూలే, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ల పటాలు. ‘నికల్‌ నికల్‌’ పాటలో కోలివాడా, కుంభార్‌ వాడా అనే పేర్లు రావటం, సినిమా ప్రారంభంలోనే తమను అక్కడినుండి తరిమేయటానికి ప్రయత్నిస్తున్న ఆ ప్రాంతపు రాజకీయ

నాయకులూ, అధికారులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేసే చాకలివాళ్ళు. అంతేకాదు, ఆ ప్రాంతానికి దగ్గరలోనే పెరియార్‌ చౌక్‌.. ఇయోతీ థాస్‌, మార్క్స్‌, లెనిన్‌ల ఫోటోలు, ఇంకా కాలా ఇంటి దగ్గరలోనే బలి చక్రవర్తి చిన్న సైజు విగ్రహం, అణచివేయబడిన రిపబ్లికన్‌ పార్టీ చిన్న జెండాలు (మధ్యలో అశోక చక్రంతో), ఆ దగ్గరే గొడ్డు మాంసం అమ్మే దుకాణం, అక్కడే ఆకుపచ్చ జెండాలు. సూటిగా చెప్పాలంటే తమిళనాడులో జరుగుతున్న కులతత్వ వ్యతిరేక పోరాటాల కారణంగా ఎగసిపడుతున్న సామాజిక రాజకీయ అలలకు సృజనాత్మక చిత్రణ ఈ సినిమా. దీని వెనుక ధారావిలో బ్రతుకుతున్న దళిత బహుజన వలస జీవులున్నారు. మహారాష్ట్రలోని కులతత్వ వ్యతిరేక పోరాటాలూ ఉన్నాయి.

అగ్రవర్ణాల వారు గుత్తకు తీసుకున్న డాక్యుమెంటరీలు, సినిమాలు, న్యూస్‌రూమ్‌లూ…ఇవన్నీ పట్టణాలలోని మురికి వాడలను వంచనకు గురయినవాటిగా చిత్రీకరిస్తాయి. దీనికి వ్యతిరేకంగానూ, ఇంకా అశుభ్రత, నేరం లాంటి అభిప్రాయాలకు వ్యతిరేకంగానూ ‘కాలా’లో అణచివేతకు గురైన పాత్రలు మామూలు మనుషుల్లాగా సహజంగా చిత్రించబడ్డాయి. వాళ్ళెలా ఉంటారో అలాగే చూపించారు. సర్వసాధారణత్వం, సంబరాలు, దుఃఖం, వాదులాటలు, ప్రేమ, సంబంధాలు, మరీ ముఖ్యంగా వాళ్ళ చరిత్రలో భాగమైన రాజకీయ చట్రాలు… వీటన్నింటితో కూడిన దళిత బహుజన నిత్య జీవిత సత్యాలను మన దృష్టి నుంచి దాటిపోకుండా ‘కాలా’ సజీవంగా మన ముందు ఉంచుతుంది.

భారతీయ సినిమా చరిత్రను చూస్తే ‘రాజా హరిశ్చంద్ర’ నుంచీ నేటి ‘వీరే దీ వెడ్డింగ్‌’ వరకూ అగ్ర వర్ణాల జీవితాలనూ, వాళ్ళ ప్రపంచాన్నీ ఎన్నో రకాల కథల్లో ఇమిడ్చారు. ‘సంజూ’ పేరుతో సినిమా తీస్తూ సంజయ్‌ దత్‌ వంటి వాళ్ళను హీరోలు చేస్తున్నారు. వాళ్ళ దుఃఖాలూ, వాళ్ళ నవ్వులూ, ప్రేమలూ, వాళ్ళ చారిత్రక కథలూ, విజయాలూ, దయ్యం కథలూ… ఇవన్నీ వెండి తెరను అలంకరిస్తున్నాయి. సినిమా సత్యాన్నే నమ్మాలంటే, అగ్రవర్ణాల వారే బీదలు. వాళ్ళే ధీరులైన ప్రేమికులూ, వీరులైన ఉద్దారకులూ. దళిత బహుజన శ్రామికుల శ్రమను దోపిడీ చేసే పీఠం మీదే కల్పిత చరిత్ర మొత్తం నిర్మించబడింది. మనుషులుగా ఈ శ్రామికుల అస్తిత్వమే అగ్రవర్ణాల వారికి పట్టదు.

అగ్రవర్ణాల అధికారంలో ఉన్న సినిమా రంగం చేసే చరిత్ర కల్పనా, వక్రీకరణా లాంటి వాటికి భిన్నంగా ఈ దేశపు దళిత బహుజనుల చారిత్రక అస్తిత్వాలను పై పై పూతలు లేకుండా చూపించిన ఏకైక సినిమాగా ‘కాలా’ నిలబడుతుంది.

సవర్ణ ప్రపంచం దృష్టికి అసలేమీ కనిపించని విషయాలే ఈ సినిమాకు ప్రధానమైనవీ, దీన్ని నిలబెట్టేవీ. అవి బహుజనుల జీవితాలు కథలూనూ. వాళ్ళ ఉనికి, చర్మం రంగు, బట్టలు, ఆఖరుకు వాళ్ళ పేర్లు కూడా సవర్ణుల నిత్యజీవితంలో అసహ్యానికీ, నిరాదరణకూ గురైనవే. హిందూ కులతత్వ విలువలను నీచంగా ప్రదర్శించే హరిదాదా అనే క్రిమినల్‌ రాజకీయ నాయకుడు కాలాను కలవటానికి వచ్చి, సెల్వి ఇచ్చే మంచినీరు తాగటానికి ఇష్టపడని సీన్‌లో కులతత్వం అనే సామాజిక సత్యం స్పష్టంగా చిత్రించబడింది. ఇంకొక సీన్‌లో హరిదాదా ఇంటికి కాలా వెళ్ళినపుడు అతను కాలాగా హీనంగా చూస్తూ తన కాళ్ళమీద పడమని అడగడం బ్రాహ్మణీయ గ్రంథాలలో వర్ణ వ్యవస్థకు చెందిన సామాజిక ఆధిపత్య శ్రేణి బ్రహ్మ శరీరంగా ఊహించబడటాన్ని గుర్తు చేస్తుంది.

అసలు ఉనికే లేనివాళ్ళుగా చూడబడేవాళ్ళూ లేదా అసహ్యకరంగా చూడబడేవాళ్ళూ ‘కాలా’లో మాట్లాడతారు. వాళ్ళే పారాయ్‌, హిప్‌ హాప్‌ లను ప్రదర్శిస్తారు. వాళ్ళే జాగరూకులుగా సంఘటితులై

ఉద్యమిస్తారు. అవినీతితో, పిరికితనంతో మోసపూరితంగా తమ భూమిని ఆక్రమించి లాక్కునే చిన్న చిన్న సమూహాలకు చెందిన అగ్రవర్ణాల వారికి వ్యతిరేకంగా పోరాడతారు.

‘క్యారే సెట్టింగా?’ అని కాలా చెప్పిన డైలాగ్‌ దళిత బహుజనులను అణచివేయడానికి ఉపయోగించే పైన చెప్పిన మార్గాలను సూచించేదే. హరిదాదా స్టేజిమీద మాట్లాడుతున్నపుడు రెండు ముఖ్యమైన పదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అవి ‘మను రియల్టీ’, ‘దండకారణ్య నగర్‌’. ఈ మాటలకు సవర్ణుల లోకంలో, మతంలో, గ్రంథాలలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఉపమానంగా చెప్పాలంటే శూద్రులకూ, అతిశూద్రులకూ, స్త్రీలకూ కనీసమైన మానవ హక్కులను, భూమి, ఆయుధాలు, వనరులు, ఆఖరుకు విద్యను కూడా ఇవ్వడానికి తిరస్కరించే, అణచివేసే కులవ్యవస్థను అమల్లోకి తెచ్చిన ప్రాచీన స్మృతి మనువుది. ఎవరైనా వీటిలో దేన్ని అతిక్రమించినా వారిని హింసించటానికి వికృతమైన దండనలను రూెెపొందించారు. బ్రాహ్మణ/సవర్ణ పురాణాల్లో దండ కారణ్యం రాక్షసులది. దండకారణ్యం అంటే నేటి ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాలలో, రామాయణంలోని కొన్ని ఘట్టాలు జరిగినట్టుగా చెప్పబడింది.

సినిమాలో ‘నవభారత రాష్ట్రవాది పార్టీ’ అనే జెండాతో దండకారణ్యనగర్‌ను అభివృద్ధి నమూనాగా తయారుచేసే పనిలో ఉన్న ‘మను రియల్టీ’ భీమ్‌ వాడాను ఆక్రమించి, అక్కడి భూమిని బహుజనుల నుండి లాక్కుని, వారిని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. దీనిని ప్రతీకగా చూస్తే, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిశాలలో కొంత భాగమైన దండకారణ్య ప్రాంతం గుర్తుకు వస్తుంది. అక్కడ మనుస్మృతి భావజాలాన్ని ఆచరణలో పెడుతున్న పెద్ద పెద్ద కార్పొరేట్‌లు, మైనింగ్‌ మాఫియాలు, కాంట్రాక్టర్స్‌ కలిసి ఆదివాసీల నుంచి భూమిని లాక్కోవడంతో వారి జీవితాల్లో మహా వినాశనకరమైన పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో హరిదాదా చేసే ప్రయత్నం కూడా అటువంటిదే. సినిమా మొదల్లోనూ, తరువాతా అభివృద్ధి పేరుతో చేసే హంగామా ఒక పక్క… కాలా, హరిదాదాల మధ్య జరిగే తీవ్రమైన వాగ్యుద్ధంలో బహుజనులు భూమికి ఇచ్చే ప్రాముఖ్యత మరోపక్క. ”నీకు భూమి అధికారాన్నిచ్చేదయితే, మాకు అది జీవితం. మీ దేవుళ్ళు మన మధ్య అడ్డం వచ్చినా సరే వాళ్ళనూ వదలం” అని కాలా హరిదాదాతో చెప్పే మాటలు మామూలు మాటలు కావు. అది కుల వ్యవస్థపై శక్తివంతమైన ఖండనే కాదు, దళిత బహుజనుల అభ్యుదయానికీ, సంతోషానికీ అడ్డుపడుతున్న బ్రాహ్మణీయ భావజాలాన్ని తోసిపుచ్చమనే పిలుపు కూడా.

ఈ సినిమాలోని స్త్రీ పాత్రల విషయానికి వస్తే, తూఫానీ, జరీనా, సెల్వీ… ఇంకా బస్తీలోని చాలామంది స్త్రీలు… వీళ్ళంతా సమాజంలో మార్పును తీసుకొచ్చేవాళ్ళు. పోరాటాన్నీ, ఆందోళనలనూ ముందుండి నడిపిస్తూ స్థిరంగా తమ గొంతును వినిపిస్తూ ధారావిలో ముఖ్యమైన నిర్ణయాలు కూడా తామే తీసుకోగలిగే సత్తా ఉన్నవాళ్ళు. జరీనా హరిదాదాను కలిసినప్పుడు తననుంచి ఏదో సాయాన్ని ఆశించి వచ్చినట్లుగా ఆమెను చులకనగా చూస్తాడు. అతనేదో పితృస్వామ్య ఆధిపత్య భావాన్ని ప్రదర్శిద్దామనుకుంటే, ఆమె దాన్ని సాగనివ్వదు. పోలీసులనూ, రాజకీయ నాయకులనూ ఎదుర్కోవడంలోనూ ధారావి భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవటంలోనూ తూఫానీ ముందు వరసలో ఉంటుంది. ఉమాదేవి రచించగా ప్రదీప్‌ కుమార్‌, ధీలు పాడిన కణ్ణమ్మా పాట శాంతంగా ఉంటే, రాప్‌ పాటలు సామాజిక రాజకీయ విమర్శ చేస్తాయి. ధారావి పాటల్లో సహజమైన కమ్మదనం, ప్రాంతీయ నుడికారం ఉంటాయి. వెనకబడ్డ జాతుల యువకులకు చోటు కల్పిస్తూ హిప్‌ హాప్‌ను ప్రదర్శించే ధారావి యునైటెడ్‌, కాస్ట్‌లెస్‌ కలెక్టివ్‌ లాంటి ప్రముఖ గ్రూపులవి.

సినిమాలోని ప్రధాన స్రవంతి రాజకీయాల దగ్గరకు మళ్ళీ వస్తే, ఒక సీను నాకు తోచింది. ఈ శ్రామికులు, అంటే అణచివేయబడిన కులాల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ ఒకరోజు పనిచేయడం మానేసినప్పుడు, సోషల్‌ మీడియా ద్వారా ఆ వార్త అందరికీ చేరుతుంది. ఇది నాకు ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసనగా ఏప్రిల్‌ రెండవ తేదీన జరిగిన భారత్‌ బంద్‌, భీమా కోరేగావ్‌కు వచ్చిన దళిత బహుజనుల మీద జరిగిన హింసకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో జనవరిలో అంబేద్కర్‌ వాదులు చేపట్టిన నిరసనలను గుర్తుకు తెచ్చింది. ఈ రెండు నిరసన ప్రదర్శనలూ కూడా శక్తివంతమైన సోషల్‌ మీడియా ద్వారా జనాన్ని కూడగట్టి నిరసనల క్రమాన్ని అందరికీ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ జరిపారు.

సినిమాలో న్యూస్‌ ఛానెల్స్‌, ధారావిలో దళిత బహుజనులు ప్రారంభించిన నిరసన ప్రదర్శనను ఏదో అపరాధంలాగా చిత్రీకరిస్తాయి. నిరసన కారణంగా ట్రెయిన్‌లో ప్రయాణం చేయాల్సి వచ్చిన ఉన్నత వర్గపు మహిళా నిరసనకారుల మీద తన కోపాన్నంతటినీ వెళ్ళగక్కుతుంది. వాళ్ళ సౌకర్యం తప్ప ఇంకీమీ పట్టని మధ్య తరగతి, అధికార కులాల ఉదాసీనతను ఇది పట్టి చూపిస్తుంది. మరోవైపు ఈ సీన్‌, బహజన ప్రధాన స్రవంతే సవర్ణుల చిన్న ప్రపంచపు అస్తిత్వానికీ కొనసాగింపుకూ వీలు కల్పిస్తోందన్న నిజాన్ని నొక్కి చెప్తోంది.

కొన్ని ప్రతీకలూ, పురాణగాధలూ ఎలాంటివంటే అవి సవర్ణ ద్విజులూ బహుజనుల సామాజిక సాంస్కృతిక సంభాషణలలో చాలా భిన్నమైన అర్థాలను కలిగి ఉంటాయి. వాటిని పక్కపక్కనే వాడటం నన్ను ఆకర్షించింది. అలాంటిది ఒకటి ఏమిటంటే, హరిదాదా ఇంటి గోడమీద పరశురాముడి ఫోటో

ఉంటే, కాలా టేబుల్‌మీద ‘అసుర’ పుస్తకం ఉంటుంది. మరొకటి, గణేశ నిమజ్జనం జరుగుతూ ఉంటే హరిదాదా అనుచరుడూ, నేరస్తుడూ అయిన రాజకీయ నాయకుడు విష్ణును కాలా జీప్‌ నడుపుతూ చంపేస్తాడు. జీప్‌ లైసెన్స్‌ ప్లేట్‌ మీద దీ=1956 అని ఉంటుంది. సంస్కరించ వీలుగాని సనాతన ధర్మమని పిలవబడేదానిని వదిలి అంబేద్కర్‌ లక్షల మంది అనుయూయులతో బుద్దిజంలోకి మారిపోయిన సంవత్సరం అది. ఇంకోసారి హరిదాదా ఇంట్లో యజ్ఞం జరుగుతూ ఉంటే బ్రాహ్మణ పూజారి ‘జై సియారాం’ అంటాడు. అదే సమయంలో ధారావిలో జనం చంపబడతారు.

స్పష్టమైన కులతత్వ వ్యతిరేక రాజకీయాలు కేంద్రంగా ఉంటూ, ప్రతిదీ వాటి చుట్టూనే తిరుగుతూ ఉండగా, ‘కాలా’ దళిత బహుజన జీవితాన్ని, వాళ్ళ ప్రపంచాన్నీ చూపిస్తుంది. పవిత్రత, అధికారం, స్థానం లాంటి బ్రాహ్మణీయ భావజాలానికి ఎదురుగా నిలబడి, వాటినన్నింటినీ పక్కకు తోసేస్తుంది.

ఈ సినిమాను చూస్తున్న, రివ్యూలు రాస్తున్న, అభిప్రాయాలు తెలుపుతున్న చాలామంది సవర్ణులు ఇదింత స్పష్టంగా దళిత బహుజన హక్కుల కోసం పట్టుబడుతూ ప్రతిపాదనలు చేయటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎక్కువమంది ఈ కథలో తమకోసం ఎక్కడో ఓ చోటు వెదుక్కోవడానికి కష్టపడి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళూ, వాళ్ళ కుల ప్రపంచమూ ఇలా ఎదిరించబడటం చూసి, వాళ్ళ సవర్ణ ప్రపంచజ్ఞానం చిరాకు పడుతోంది. తాము ఈ కథలో అసలే లేకుండా అయినా అయిపోయారు లేదా సమస్యలు సృష్టించే చిన్న గ్రూప్‌గా ఎక్కడో ఒకచోట ఉన్నారని అర్థం చేసుకున్నారు. అందువలన వాళ్ళవైపు నుంచి కేకలు మొదలయి క్రమంగా పెరిగిపోతున్నాయి. మరికొంతమంది ‘కాలా’ సినిమాను రాజకీయాలు, ముఖ్యంగా కులతత్వ వ్యతిరేక రాజకీయాలు లేని సినిమాగా ముద్ర వేయటానికి ప్రయత్నిస్తూ దీనిని రజనీకాంత్‌ సినిమా అనేస్తున్నారు. దర్శకుడు పా.రంజిత్‌ (ఈయన అంబేద్కర్‌ వాది) చేసిన మేథో శ్రమనూ శారీరక శ్రమనూ, సినిమాను సాధ్యం చేయటంలో చేయివేసిన ఎంతోమంది దళితబహుజనుల శ్రమనీ, సహకారాన్నీ కనబడనీయకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. మరికొంతమంది ఈ సినిమాను రైట్‌ వింగ్‌ ఫాసిజాన్ని ఎదిరించినందుకు గాను ప్రగతిశీలమైనదని మెచ్చుకుంటూనే, కులతత్వ వ్యతిరేక, విప్లవ అనుకూల శక్తిని కలిగి ఉందని అంగీకరించటానికి ఇష్టపడటం లేదు. ఇంకా ఎన్నాళ్ళు వీళ్ళు ఈ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటారో!

వీళ్ళందరికీ కాలా లాగే నేనొక మాట చెప్తాను. ”కాలా బహుత్‌ భారీ హై, చల్‌ తెరే నికల్‌ నికల్‌”

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.