తెలుగు లలిత సంగీతంలో ”రజనీ” గంధం!… పరుచూరి శ్రీనివాస్‌

”రజనీ” గారిని పరిచయం చేయడం అంటే కొంచెం భయంగానే ఉంది. లలిత సంగీతంతోను, యక్షగానాలతోను, ఆకాశవాణి విజయవాడ కేంద్రంతోను పరిచయం ఉన్నవారికి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకపోతే గత పది సంవత్సరాలలో వెల్లువలా వచ్చిపడిన టి.వి.ఛానెళ్ళ హోరులో పైన పేర్కొన్న కళారంగాలు, సంస్థలు మెరుగు పడ్డాయన్నది నిజం. అందువల్ల ఈ తరం వారికి సుప్రసిద్ధుడైన బాలాంత్రపు రజనీకాంతరావు గారిని పరిచయం చేయాలన్న చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం. 1920 జనవరి 29వ తేదీన నిడదవోలులో జన్మించిన రజని తాత, తండ్రులు కవి, పండితులుగా పేరు గడించినవారు. రజని తండ్రిగారైన ”కవిరాజహంస” బాలాంత్రపు వేంకటరావు ”వేంకటపార్వతీశ కవుల”లో ఒకరిగాను, ”ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల” సంస్థాపక, నిర్వాహకులుగాను జగద్విదితులు. తల్లి వెంకటరమణమ్మ కూడా గొప్ప సాహితీ సంస్కారం గల వ్యక్తి. ఇంటిలోని సాహితీ వాతావరణానికి తోడుగా తండ్రి నడిపే గ్రంథమాలకు వస్తూ, పోతూ ఉండే టేకుమళ్ళ రాజగోపాలరావు, తెలికచర్ల వెంకటరత్నం, చిలుకూరి నారాయణరావు, గంటి జోగిసోమయాజి వంటి పండితులతో ఎప్పుడూ సందడే. అన్నింటినీ మించి ఆనాటి పిఠాపురంలో ఏ వీథిలో చూసినా పండితులు, కవులు, సంగీత విద్వాంసులు, నాట్యవేత్తలతో (పానుగంటి, వేదుల రామకృష్ణ కవి, ఓలోటి వెంకట రామశాస్త్రి, దేవులపల్లి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి, మొక్కపాటి నరసింహ శాస్త్రి, తుమరాడ ”వీణ” సంగమేశ్వరశాస్త్రి, పెండ్యాల సత్యభామ…) విలసిల్లుతుండేది. అలా పిఠాపురం కళాపీఠికమీద అక్షరాలు నేర్చుకొనే వయసులోనే సాహిత్యంలోని సౌందర్యాలను చూడగలిగారు. బంధువైన పులిగుత్తుల లక్ష్మీ నరసమాంబ (20వ శతాబ్దం తొలి సంవత్సరాల్లోనే ప్రత్యేకంగా మహిళల కొరకు ”సావిత్రి” అన్న పత్రిక నడిపిన వ్యక్తి) నేర్పిన భక్తి సంగీతపు ”పాఠాల” ద్వారా ఆకాశవాణిలో ముందు ముందు సమర్పించిన ”భక్తిరంజని” కార్యక్రమాలకు బీజాలు ఆనాడే పడ్డాయి. చిన్నప్పటినుండీ హాజరయిన సంగమేశ్వరశాస్త్రిగారి వీణ కచేరీలు, మేనమామ దుగ్గిరాల పల్లంరాజు వద్ద మొదట నేర్చిన పద్యాలు, రాగాలు సంగీతం పట్ల ఆసక్తిని పెంచాయి. కాకినాడలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో నేర్చిన శాస్త్రీయ సంగీత పాఠాలు భవిష్యత్తులో సంగీత రచనకి పునాది అయ్యాయి.

తండ్రి వంగసాహిత్య పక్షపాతి కావడం, గ్రంథమాల వారు ఎక్కువగా బెంగాలీ సాహిత్యాన్నే ప్రచురించడం కారణంగా తొలి రోజుల్లో రజనీపై బెంగాలీ ప్రభావం బలంగా ఉండేది. (శాంతినికేతన్‌ నుండి ప్రవేశ పత్రం ఒక రోజు ముందుగా వచ్చి ఉంటే అక్కడికే వెళ్ళి ఉండేవారేమో!) 1937లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరిన తరువాత సైగల్‌, మల్లిక్‌, బోరల్‌లు కూడా (వాళ్ళ పాటల ద్వారా) పరిచయమయ్యారు. ఈ బెంగాలీ ప్రభావాన్ని ఆయన తొలి సంగీత రచనల్లో (ఉదా: చండీదాస్‌) చూడగలం. ”విమర్శకులకు భయపడి ఆ తర్వాతి కాలంలో పద్ధతి మార్చేశాన”ని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నా, బెంగాలీ (రవీంద్ర) సంగీతాలలో ఉన్న ఆసక్తి ఎలాంటిదో ఆకాశవాణిలో ఆయన చేసిన ”రవీంద్ర సంగీతం”పైన ”సోదాహరణ ప్రసంగాలు”, ”రవీంద్రుని భావస్ఫూర్తితో” సమర్పించిన ”సూక్తి సుధ”లు, ఇప్పటికీ అద్భుతంగా గానం చేసే బెంగాలీ గేయాలు విన్నవారికి తెలుసు.

వాల్తేరుకు రాకముందే గేయ రచనలు, ”కదంబం” (సం త. శివశంకరశాస్త్రి) లాంటి సాహిత్య పత్రికల్లో కవితా ప్రచురణలు జరిగినా రజని కలం 1937-40 మధ్య కాలంలో కొన్ని వినూత్న ప్రయోగాలు చేసింది. శ్రీశ్రీ, పఠాభి కవితలతో ప్రేరితుడై ”పూషా” అన్న కలం పేరుతో లయ ప్రధానంగా, మాత్రా ఛందస్సులలో పొందుపర్చి ”తెలుగు స్వతంత్ర”, ”ఆనందవాణి” వంటి పత్రికల్లో ప్రచురించిన గేయ కవితలను (అబ్బూరి ఛాయాదేవి గారి పుణ్యమా అని ”పూషా” కవితలన్నీ ఈ మధ్యనే ఒక సంకలనంగా వెలువడ్డాయి), ”పసిడిమెరుంగుల తళతళలు” వంటి పాటలను (1938లో మొదటిసారి సి.ఆర్‌.రెడ్డితో కలిసి పాడిన ఈ పాట పదేళ్ళ తర్వాత రజనీ, భానుమతి గళ ద్వయంలో విజయవాడ ఆకాశవాణి కేంద్ర ప్రారంభ గీతికగా వాడబడింది), ”చండీదాస్‌” వంటి గేయ నాటికలను, కమ్యూనిస్ట్‌ ఉద్యమగీతంగా పేరొందిన జుబస్త్రవఅవ ూశ్‌్‌ీఱవతీఃర కూa Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీవ కు స్వరకల్పన రజనీ విద్యార్థి కాలంలోని ముఖ్య రచనలుగా చెప్పుకోవాలి. అప్పట్లో తెలుగు విశ్వవిద్యాలయాలలో ప్రవేశానికి ‘అనర్హులు’గా ‘బహిష్కరించబడిన’ గిడుగు రామ్మూర్తి, తల్లావఝ్జల శివశంకరశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణలను విద్యార్థి సంఘం తరఫున పిలవడం గొప్పగా చెప్పుకోవలసిన విశేషం.

చదువు పూర్తయిన పిమ్మట కొద్దికాలం గ్రంథమాలలో సహ సంపాదకుడిగా పనిచేసి 1942 జులైలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో చేరడంతో రజనీ జీవితం కొత్త మలుపు తిరిగింది. అంతకుముందు చదువుకునే రోజుల్లోనే (1938 జులై) ఆచంట జానకీరామ్‌ సమర్పించిన ”అనార్కలి” నాటకంలోని కొన్ని పాటలకు వరుసలు కట్టడం, దేవులపల్లి కృష్ణశాస్త్రికి రేడియో వ్యాసాల రచనలో సహాయకుడిగా వ్యవహరించడం, స్వీయ రచనలు ”చండీదాస్‌”, ”గ్రీష్మఋతువు” 1941లో ప్రసారం (మొదటి నాటికలో రజని, ”మాలపల్లి” సుందరమ్మలు ప్రధాన పాత్రధారులు, సాలూరి రాజేశ్వరరావు వాద్యగోష్టి నిర్వహణ) కావడం జరిగినా రేడియో కేంద్రంలో చేరతానని మాత్రం రజనీ అనుకోలేదు. 1942 నుండి రజనీ సంగీత, సాహిత్య రంగాల్లో కేవలం ఆకాశవాణి కోసం చేసిన అపారమైన సృష్టిని వివరంగా పేర్కొనడం కష్టం.

రజనీ పేరు వినగానే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చేది ”శతపత్రసుందరి” అన్న (1953 వరకు వచ్చిన) ఆయన గేయ సంకలనం. (ఇటీవలే మరల పునర్ముద్రితం) వీటిలో అధికభాగం రజనీయే మొదటిసారి స్వరపరచి పాడుకున్నవి, పాడించినవి… సాలూరి స్వయంగా కంపోజ్‌ చేసుకుని పాడిన ‘ఓహో విభావరి’, ‘చల్లగాలిలో’, ‘హాయిగ పాడుదున’ వంటి కొన్నింటిని మినహాయిస్తే! తెలుగునాట మొన్న మొన్నటివరకు మార్మోగిన ఈ సంపుటిలోని గేయాల నుండి మచ్చుకు కొన్ని ఉదాహరణలు ”శతపత్రసుందరి”, ”మ్రోయింపు జయభేరి (సూర్యకుమారి), ”మన ప్రేమ” (బాలమురళి, గోపాలరత్నం), ”గుడారమెత్తివేశారు”, ”ఎందు చూచినగాని” (ఘంటసాల), ”ఎన్ని తీయని కలలు కన్నానో” (మల్లిక్‌), ”నటనమాడవే మయూరి” (బాలసరస్వతి), ”పోయిరావే కోయిల”, ”కోపమేల రాధ” (సాలూరి, బాలసరస్వతి), ”జాబిల్లి వస్తున్నాడు” (వింజమూరి సోదరీమణులు), ”ఓహో ప్రతిశ్రుతి” (రజనీ), ”ఓ భ్రమరా” (టి.జి.కమలాదేవి), ”రొదసేయకే తుమ్మెదా” (వి.లక్ష్మి?)…

దాదాపు ఒకటిన్నర దశాబ్దపు కాలం మద్రాసులో పనిచేసిన తరువాత గురువైన పింగళి లక్ష్మీకాంతంగారి పిలుపుతో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి తరలి వచ్చారు. విజయవాడలో చేసిన పనిని గురించి ముచ్చటించుకోబోయే ముందు రజనీ ప్రయాణంలో మరో ముఖ్య ఘట్టాన్ని తెలుసుకోవాలి. అదేమంటే చలనచిత్ర రంగంతో ఆయనకు గల సంబంధం. రేడియోలో నిలయ కళాకారుడిగా చేరేముందు కొద్ది కాలం హెచ్‌.ఎం.రెడ్డి గారి ”రోహిణి” సంస్థలో సంగీత దర్శకత్వ విభాగంలో అప్రెంటిస్‌గా పనిచేశారు. అక్కడ హిందీ సినీ పాటల వరుసలకు పాటలు రాయమనడం, నచ్చక త్వరగా బయటకు వచ్చేసినా, రేడియోలో చేరిన తొలిరోజుల్లోనే మిత్రులైన నిడుమోలు జగన్నాథ్‌ నిర్మించిన రెండు లఘు హాస్య చిత్రాలకి (”తారుమారు”, ”భలేపెళ్ళి” – 1942) సంగీత దర్శకత్వం వహించారు (వీటిలో రజనీ, ఆయన శ్రీమతి సుభద్రగారు కొన్ని పాటలు కూడా పాడారు). ”గీతావళి” కార్యక్రమంలో ప్రసారితమైన ”స్వామీ నీ ఆలయమున” అన్న రజనీ గేయాన్ని, అందులోని మధ్య ప్రాచ్య సంగీతపు పోకడల్ని విని ఆశ్చర్యపోయిన ప్రఖ్యాత దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి సరాసరి మద్రాస్‌ రేడియో కేంద్రానికి వచ్చి తాను అప్పట్లో నిర్మిస్తున్న ”స్వర్గసీమ” (1945) చిత్రంలో ఒక సన్నివేశానికి తగినట్లుగా ట్యూన్‌ కావాలన్నారు. అలా తయారయినదే ”ఓహో పావురమా” అన్న పాట. ఆ పాట పొందిన జనాదరణ గురించి చెప్పనవసరం లేదు. అదే చిత్రానికి ”ఋష్యశృంగ” సంగీత రూపకం, ”హాయి సఖీ”, ”గృహమే కదా స్వర్గసీమ” (నాగయ్య), ”ఎవని రాకకై” (రజనీ) అన్న మరో నాలుగు పాటలు కూడా రాసి స్వరపరిచారు.

ఇంకా రజనీ సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది ”గృహప్రవేశం” (1945). ఇది రజనీ మిత్రుడు, అభిమాని అయిన త్రిపురనేని గోపీచంద్‌ కోరికపై పనిచేసిన సినిమా. ”మేలుకో ఓ భారత నారీ” అని స్త్రీ వాద ధోరణిలో ఆయన నాడు రాసిన పాట ఈనాటికీ సామాజికపరంగా సరిపోతుంది. సి.ఎస్‌.ఆర్‌.పాడిన ”మై డియర్‌ తులశమ్మక్కా”, ”జానకి నాదేనోయి”, ఎమ్‌.ఎస్‌.రామారావు పాడిన ”హాలాహలమెగయునో” పాటలు రజనీ రచనలు, వరుసలే. పూర్తి సంగీత బాధ్యతలు చేపట్టిన చివరి సినిమా గోపీచందే దర్శకత్వం వహించిన ”పేరంటాలు” (1951). ”లక్ష్మమ్మ”లో (1950) అన్ని పాటలు, వరసలు రజనీవే. అయినా కారణాంతరాలవల్ల వాటిని స్వరపరచిన వారిగా ఘంటసాల టైటిల్స్‌కెక్కారు. సినీ సంగీతంలో ”విదేవీ వాద్యగోష్టి ప్రభావం, పాటలోని రసభావ నిరూపణ చేసే చరణాంతర సంగీతం” చాలామంది సంగీత దర్శకులకు కొత్త దృష్టినిచ్చాయి. ”వకుళాభరణం”, ”మలయమారుతం” వంటి రాగాలను లలిత, సినీ గీతాల ద్వారా ప్రచారంలోకి తెచ్చింది కూడా ఆయనే. వేరే చిత్రాలకు ఆయన రచించి, (”సౌదామిని” – 1951, మాధవపెద్ది, రచన – ఆరుద్ర) ”మానవతి” (1952)లోని ”తన పంతమే” (బాలసరస్వతి), ”ఓ మలయపవనమా” (ఎమ్‌.ఎస్‌.రామారావు, బాలసరస్వతి), ”ఓ శారదా” (ఎస్‌.వరలక్ష్మి), ”తాధిమి తకధిమి” (మాధవపెద్ది – ‘బంగారుపాప’ 1954), చివరగా ”ఊరేది పేరేది” అన్న ఒక అద్వితీయమైన రాగమాలిక (ఘంటసాల, లీల – ”రాజమకుటం” 1960). ఇన్ని చిత్రాలకు పనిచేసినా వేటిపైనా రజనీ పేరుండదు అని గమనించాలి. ఉద్యోగులు ప్రభుత్వ అనుమతి లేకుండా వేరే వ్యాసంగాలు చేయకూడదు. కానీ ఆ సర్కారు వారి సమ్మతి వచ్చేవరకు చిత్ర నిర్మాత ఆగలేడు కనుక రజనీ పాటలన్నీ సోదరుడైన నళినీకాంతరావు, బావగారైన బుద్ధరాజు నాగరాజు, అలాగే తారానాథ్‌ అన్న పేర్లపై రికార్డులపైకెక్కాయి. ”తెలుగు సినిమా పాట” చరిత్రను రాసే ”పరిశోధకులు” ముందు ముందు తమ ”గేయ రచయితల పట్టిక”లను తయారు చేసుకునే ముందు ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

విజయవాడకు వచ్చినప్పటి నుంచి స్వయంగా యక్షగానాలు రాయడమే కాకుండా పింగళి, బందా, వోలేటిలతో ఎన్నో ప్రాచీన యక్షగానాలను పునరుద్ధరించారు. ”గొల్ల కలాపం దరువులు”, ”భామా కలాపం”, ”ప్రహ్లాద చరిత్ర”, ”ఉషా పరిణయం”, ”రుక్మిణీ కళ్యాణం”, మన్నారుదాస విలాసం (రంగాజమ్మ), గంగాగౌరీ విలాసం (పెదకెంపెగౌడ), ”కళ్యాణ శ్రీనివాసం” వాటిలో కొన్ని. నిజానికి రజనీ ప్రేరణతోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి యక్షగాన రచన చేశారని చెప్పాలి. అలా చేసిన వాటిలో కొన్నింటికి రజనీ సహ రచయిత అనటం సబబేమో! గురువు లక్ష్మీకాంతంగారితో కలిసి ఎన్నో సంస్కృత నాటకాలను (దూతవాక్యం, పాంచరాత్రం, ద్యూత ఘటోత్కచం, ప్రతిమ భాస విరచితాలు, వేణీసంహారం, భట్టనారాయణుడు, అనర్ఘరాఘవం మురారి), బాణాలను (తామరపువ్వు కానునక, ధూర్తవిట సంవాదం) తెనిగించారు.

రజనీ సంపూర్ణ గేయ నాటకాలు (మొత్తం పద్ధెనిమిది) ఒక సంకలనం ”విశ్వవీణ”గా 1964లో వెలువడ్డాయి. ముప్పయి వరకు గద్య పద్య గేయాత్మక నాటకాలను రచించారు. సంగీత నాటకంలో సంగీత నిర్వాహకుని బాధ్యతే అతి ముఖ్యమైనదని మనందరికీ తెలిసిందే. వాద్య (కథా) చిత్రాలకు ఒక ఒరవడి, రూపం దిద్దినవారాయన. ఈ సందర్భంలో ”ఆదికావ్యావతరణం”, ”మేఘసందేశం”, ”కామదహనం” రూపకాలను పేర్కొనకుండా ఎలా ఉండగలం. ఇవి రజనీకే కాకుండా ఆకాశవాణి కేంద్రాలకే పేరు తెచ్చాయి. ఇవన్నీ కూడా ఆనాడు అతి తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన ప్రయోగాలు, సాధించిన విజయాలన్న విషయాన్ని మనం మరువకూడదు.

ఈ రోజు అన్నమయ్య గురించి, ఆయన రచనలకున్న ప్రాచుర్యాన్ని గురించి పరిచయాలు అక్కర్లేదు. కానీ అన్నమయ్య పదాలను ప్రజాబాహుళ్యానికి పంచిపెట్టినదెవ్వరు అన్న ప్రశ్న వస్తే, సాహితీ లోకానికి పరిచయం చేసిన వ్యక్తిగా వేటూరి ప్రభాకరశాస్త్రి, వాటిలోని సంగీతాన్ని వెలికి చిలికించిన వారిగా రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, నేదునూరి కృష్ణమూర్తి గార్ల పేర్లే మనం వింటుంటాం. వాస్తవానికి ఆ పదాలు శాస్త్రీయ కచేరీ శ్రోతలకే పరిమితం కాకుండా నలుగురి నోళ్ళలో పడి నలిగింది రేడియో ద్వారానే. ఆకాశవాణిలో మొదటగా ఆ పాటలకు వరసలు కట్టి పాడింది రజనీగారే. ”విన్నపాలు వినవలె” (భౌళి) వాటిలో మొదటిది. దీనినే భానుమతి ఆంధ్ర రాష్ట్రావతరణ సందర్భంలోను, తరువాత ”అనురాగం” (1963) అనే సినిమాలోను పాడారు. రజనీ వరసలతోనే ”రమ్మనవే మాని రచనలు” (కాపీ, బాలసరస్వతి), ”వద్దే గొల్లతా” (కర్ణాటక దేవగాంధారి, బాలమురళీకృష్ణ, వోలేటి) కూడా 1952, 1953 ప్రాంతాల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలోనే రజనీ విరచిన ”హరి అవతారం” అన్న సంగీత రూపకంలో (వోలేటి, సంధ్యావచనం, మల్లిక్‌, వి.లక్ష్మిలతో) కూడా కొన్ని ”హరి అవతారమితడు” (సౌరాష్ట్రం), ”సురులకు నరులకు” (మోహన) అన్నమయ్య పాటలున్నాయి. (ఇదే కాలంలో మల్లిక్‌గారు ”తందనాన” (భౌళి), ”అదివో అల్లదివో” (మధ్యమావతి) పాటలకు బాణీలు కట్టుకుని పాడారు. అన్నమయ్య పదాలకు కొన్నింటికి బాణీలు కట్టడమే కా, పద కవితా పితామహుని రచనలపై, సంగీతంపై శాస్త్రీయంగా పరిశోధనలు చేసి ఆ ఫలితాన్ని మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడెమీ వంటి చోట్ల పండితుల ముందుంచారు. (కేవలం అన్నమయ్య పైనే కాక ”గీతగోవిందం” లోని రాగాలు, ”గాంధార గ్రామం” ”ఆంధ్రి” అన్న ప్రాచీన రాగం మొదలైన అంశాలపై కూడా వ్యాసాలను సమర్పించారు.) ”ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం” అన్న పరిశోధక గ్రంథంలో తెలుగుదేశంలో సంగీత రీతుల పరిణామాన్ని, సంగీత, గేయ రచయితల జీవితాల్ని కూలంకషంగా చర్చించారు.

రజనీ కేవలం పెద్దలూ, విద్యావంతులూ మాత్రమే ఆనందించగల సంగీత, సాహిత్య రచనలు చేయలేదు. ఆయన ”జేజి మావయ్య” పేరుతో రాసిన పిల్లల పాటలు విననివారుండరంటే అతిశయోక్తి కాదు. (ఉదా: ”పాపాయి ఎక్కేది కర్రగుర్రం సిపాయి ఎక్కేది ఎర్రగుర్రం). అలాగే ప్రత్యేకంగా పిల్లలకోసం చేసిన గేయనాటికలు ”దిబ్బరొట్టె అబ్బాయి”, ”మామిడి చెట్టు” మొదలైనవి.

ఉదయాన్నే సూర్యుని లేత కిరణాలతో పాటుగా రేడియో మోసుకు వచ్చే భక్తి సంగీత తరంగాలు మనందరికీ

శుభోదయాన్ని పలికేవని వేరే చెప్పాలా! ”భక్తిరంజని”లో రజని వినిపించిన వచనాలు, (శ్యామలా) దండకాలు, గద్యాలు, (సూర్య) స్తుతులు తెలుగువారి దైనందిన జీవితంలో భాగాలయిపోవాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్ర నిర్దేశకుడిగా ఉన్న కాలంలో సంగీత రంగం మూడు పువ్వులు ఆరు కాయలై ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 1971-76 మధ్య కాలాన్ని స్వర్ణయుగంగా ఈనాటికీ చెప్పుకుంటారు. అప్పుడే తొలిసారిగా విజయవాడ కేంద్రం అంతర్జాతీయ పీఠంపైకి వచ్చింది. రజనీ (శ్రీనాథ, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజుల రచనలకు) సంగీతం సమకూర్చి ప్రసారం చేసిన ”కొండ నుంచి కడలిదాకా” అన్న గోదావరి నదిపైన సంగీత రూపకం 1972లో చీనఖ టోక్యో నుంచి బహుమతి పొందింది. స్టేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే తిరువన్నామలైకి తరలి వెళ్ళిన తర్వాత మౌనవ్రతం దాల్చిన చలాన్ని ఇంటర్వ్యూ చేయగలిగారు. ”చలం కలం వెలుగులు” అన్న పేరుతో ప్రసారితమైన ఈ కార్యక్రమం ఒక ”క్లాసిక్‌”. కళాకారునిగా ఎంత ప్రతిభ చూపారో, ఒక అధికారిగా కూడా అంతే పేరు సంపాదించుకున్నారు. ”తంత్రులనూ, స్వరాలనూ సరియైన శృతిలో పలికించుకోగలిగినట్లే, సహోద్యోగుల నుండి కూడా వారి సామర్ధ్యాలను రాబట్టుకోవచ్చు” అన్నది ఆయన విజయ రహస్యం. ఆకాశవాణి నుండి రిటైరైన తర్వాత కూడా వేర్వేరు పదవుల్లో అదే ఉత్సాహం, అంకితభావంతో పనిచేయడం ఆయనకే చేతనైంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటను ఏదో కొద్ది రంగాల్లో ప్రవేశమున్న వ్యక్తుల ఎడల వాడటం చాలా తరచుగా చూస్తుంటాం. వాస్తవానికి అలాంటి ప్రశంసలు ఎన్నో రంగాలలో అభిరుచి, అభినివేశం ఉన్న రజనీలాంటి వారికే వర్తిస్తాయి. ”ఒక వ్యక్తి తనేదో నిర్వహించిన వాడిలాగా, నిర్వాకాలు చేసిన వాడిలాగా పేరు పొందవచ్చు గాని నా దృష్టిలో ఈ కీర్తి సమిష్టి కృషివల్ల సాధింపబడినది. నేను కేవలం నిమిత్తమాత్రుడిని. ఆకాశవాణి కేంద్రం కర్త, అవసరాలు కర్మ, ఇవి క్రియని సాధించాయి” అని చెప్పుకున్న వినయ సంపన్నుడాయన.

కొసమెరుపు ఈ తరం వారెవ్వరు యెరగని రజనీకాంతరావు గారి ప్రతిభను, ఆయన తెలుగు సంగీత, సాహిత్య, సాంస్కృతిక చరిత్ర, నాట్య రంగాలకు చేసిన ఎనలేని సేవలను గుర్తించి ఈ సంవత్సరపు ప్రతిభామూర్తి పురస్కారంతో ఆయనను సత్కరిస్తున్న అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్‌ వారు ఎంతయినా అభినందనీయులు.

(గత ఆరున్నర దశాబ్దాల కాలంలో రజనీకాంతరావు గారు అనేకానేక రంగాల్లో అందించిన సంపదలన్నింటినీ ఈ చిన్న వ్యాసంలో సమీక్షించడం సాధ్యం కాని పని. ఏ విషయమైనా ప్రస్తావించబడకపోతే అది రజనీ యెడల పాక్షికత్వం కాదని మనవి.)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.