పితృస్వామ్య వికృత శిశువు -దేవి

వేశ్య, వ్యభిచారిణి, పతిత, కులట, సాని ఇంకా ఇంకా చాలా… మోటుగా ఉండే పదాలు… వెలివాడల నాయికలు… వాళ్ళ ఉనికిని గుర్తించడానికి నిరాకరించే నీతిమంతులు రాత్రి చీకట్లోనో… నాలుగ్గోడల నడుమనో సరససల్లాపాల్లో మునిగితేలే విటులు… పగటి వెలుతుర్లో నలుగుర్లో తెలియనట్లు నటించడం… డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే స్త్రీలు సంసారాలు ధ్వంసం చేసే వగలు గత్తెలుగా వారిని అసహ్యించుకునే కుల సతులు… వాళ్ళే సెక్స్‌ వర్కర్లు… వీరెవరు? అసలు ఎందుకిలా అయ్యారు?

‘వేశ్యలు సమాజానికి మురుగు తూములాంటి అవసరం’ అన్నాడో సహృదయుడు. వేశ్య వృత్తి నియమాలు, వారి నియంత్రణా వివరాలు, వారిని గూఢచారులుగా వినియోగించుకునే మంచి అవకాశం గురించి విస్తృతంగా చర్చించాడో కౌటిల్యుడు. స్త్రీలంతా మానసికంగా చంచల బుద్ధి కలిగినవాళ్ళే. వారి కామలాలస పురుషుడ్ని మహత్తర కార్యాల నుండి పక్కకు లాగుతుందని వాపోయాడొక మనువు. పురుషులంతా ఉత్తములు. గొప్ప కార్యముల కొరకు నిర్దేశించబడి జన్మించిన వాళ్ళు. స్త్రీలు మాత్రం పసితనం నుండి కామలాలసతో పురుషుల్ని వలవేసి లొంగదీసుకుని దేనికీ కాకుండా చేస్తారు. కాబట్టి వాళ్ళని అన్ని రకాలుగా అణిచి ఉంచితేనే సమాజం సక్రమంగా నడుస్తుందని ఓ ప్రవక్త ప్రవచిస్తాడు. అసలు ఆదికాలంలో ఒకామె చేసిన ”పాపం” వల్లే మానవజాతి పతనమైందని దేవుడి కొడుకు ప్రవచనాలు మనకు వెల్లడిస్తాయి.

అసలు ప్రత్యుత్పత్తి అవయవాలు తప్ప ఏ రకమైన తేడాలు లేని స్త్రీ పురుషుల్లో ఈ అంతరాలు ఎందుకు ఏర్పడ్డాయి? మతాలన్నీ స్త్రీలను ”పాపం”గా ఎందుకు ముద్ర వేస్తాయి. ఈ ప్రశ్నలు వేసుకుంటే తప్ప అసలు వ్యభిచారం కథ తేలదు.

క్షీరదాలయిన (పాలిచ్చి పిల్లల్ని పెంచే జీవులు) అన్ని జంతువుల మాదిరిగానే మానవుల్లో ప్రత్యుత్పత్తి ద్వారా జాతిని కొనసాగించడానికి జైవికంగా (బయోలాజికల్లీ) ఆడ, మగ విడివిడిగా ఉంటారు. ఆడజీవి బిడ్డను కనగలిగే శక్తి కలిగి ఉండటమే దాని ఆకర్షణ. ఆడజీవిని తనవైపుకి ఆకర్షించుకునే (తద్వారా పిల్లల్ని కనడానికి) బాధ్యత ఉండటం వలన మగ జంతువులకు ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయి. (నెమలికి పించం, సింహానికి జూలు వంటివి). అంటే ఆ జీవిని వలలో వేసుకొనే బాధ్యత మగ జంతువులదేనన్నమాట. మరి స్త్రీలు మగాళ్ళను వలలో వేసుకోవడం ఏంటి?

పురుషుని స్వార్థం నుంచి…

ఒకానొక కాలంలో స్త్రీ, పురుష సంబంధాల్లో జతకట్టే స్వేచ్ఛ ఇద్దరికీ సమానంగా ఉండేది. ఆ జతకట్టడం తాత్కాలికం కావచ్చు. కానీ ఆ ”జంట పెండ్లి”లో బిడ్డలు స్త్రీకే చెందుతారు. ఆమె సహజ సంరక్షకురాలు. ఆమె పేరే బిడ్డకి ఇంటిపేరవుతుంది. ఆమె నుండే సంతానం గుర్తించబడుతుంది (మాతృస్వామ్యం). కానీ పురుషుడు తన వారసులకే ఆస్తి కట్టబెట్టాలని భావించాక (ప్రైవేటు ఆస్తి ఏర్పడ్డాక) స్త్రీ జతకట్టే స్వేచ్ఛని (లైంగిక స్వేచ్ఛని) కట్టడి చేయడం ద్వారా ఆమె సంతానం తనకే పుట్టిందని నిర్ధారణ చేసుకోవడం అవసరం అయింది. దాంతో స్త్రీలకి పాతివ్రత్యం, కన్యత్వం తప్పనిసరిగా ఉండవలసిన గొప్ప విలువలు అయ్యాయి.

మరి స్త్రీకి ఎవరితోనైనా ఇష్టానుసారం జతకట్టే స్వేచ్ఛను నిషేధించిన పురుషుడు తనకు గల లైంగిక స్వేచ్ఛను కూడా నిషేధించుకున్నాడా అంటే… లేదు. తనకు సంతానాన్ని కనిచ్చేందుకు కులసతి, సంతోషపెట్టేందుకు వేరే స్త్రీ… ఈ వేరే స్త్రీ పేరే వేశ్య… వేశ్యాత్వం… తన లైంగిక స్వేచ్ఛను పెండ్లితో ఆపివేసుకోవడానికి ఇష్టపడని మగతనం వలనే ఏర్పడింది. కనుకనే స్త్రీ బానిసత్వం మానవజాతి బానిసత్వం, వ్యభిచారం ఏకకాలంలో జన్మించాయంటాడు ఏంగెల్స్‌. దాంపత్య వివాహం అంత పవిత్రమైనదైతే స్త్రీకే పాతివ్రత్యం ఎందుకు? పురుషునికి సతీవ్రత్యం నిక్కంగా ఉంటే వేరే స్త్రీలు… వేశ్యలుగా ఎందుకు మారవలసి వచ్చింది?

ఆస్తిగల పురుషునికి ఆస్తి ఇవ్వడానికి వారసుల్ని కని ఇచ్చే పతివ్రతల లైంగికత ఎంతగా ఆంక్షలకు గురయ్యిందంటే వాళ్ళు లైంగిక సుఖం పొందడం తప్పయింది. బిడ్డల్ని కనడానికి తప్ప ఆ ‘పని’ చేయకూడదని నూరిపోసి లైంగిక క్రియనే ‘పాపం’గా ప్రబోధించారు. దాంతో లైంగిక తృప్తి పొందడానికి వేరే స్త్రీలే దిక్కయ్యారు వాళ్ళకి.

రాన్రాను పురుషాధిక్యతను స్థిరీకరించే క్రమంలో మతాలన్నీ ‘స్త్రీ’ని పాపానికి కేంద్రబిందువుగా మార్చివేశాయి. వేశ్యలు సంసారాలు కూల్చి వగలమార్లుగా, విలన్లుగా మిగిలిపోయారు. కానీ వేశ్యల దగ్గరికి వెళ్ళిన మగాళ్ళు మాత్రం రసికులుగా పేరు పొందారు. పీడిత కులాల స్త్రీలను అనుభవించే హక్కుతో తృప్తిపడని భూస్వామ్యం… జోగినీలు, మాతంగిలు, దేవదాసిలు, ఎల్లమ్మల పేరిట ఏకంగా ఒక వ్యభిచార వ్యవస్థనే ”మత క్రతువు”గా మార్చి ఆమోదింప చేసుకున్నారు.

మార్కెట్‌ శక్తుల ప్రభావం

ఆధునిక కాలంలో స్త్రీల లైంగిక దోపిడీ పరమ వికృత క్రీడగా తయారయింది. అసంఖ్యాక వ్యభిచార గృహాలు యమకూపాలుగా స్త్రీలకు నరకాలు చూపిస్తుంటే… రాజ్యం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నది. రాజకీయ నాయకుల ప్రాపకం కూడా ఈ యమ కూపాలకు తోడయింది. మరొకవైపు అనేకానేక కారణాల రీత్యా అసంఖ్యాకంగా మహిళలు ఈ వృత్తిలోకి నెట్టబడుతున్నారు.

ఒకవైపు స్త్రీ దేహాన్ని సరుకుగా చేసి అంగట్లో పెడుతున్న మాధ్యమాలు… సినిమాలు, వ్యాపార ప్రకటనలు, పోర్న్‌ వంటివి మరోవైపున మందు, పొందు మాత్రమే డబ్బున్న మగాడి జీవితానందాలకు పరమార్ధంగా హోరుమంటున్న ప్రతీకలు… ఇదంతా చాలా గొప్ప లైంగిక విప్లవంగా జరుగుతున్న ప్రచారం… అన్నీ కలిసి స్త్రీల శరీరాల (మాంస) వ్యాపారానికి విపరీతమైన డిమాండ్‌ కలిగించి పారేశాయి.

మరి సరఫరా కావాలి కదా. డిమాండు వచ్చిన తరువాత దంధా ఊపందుకోవడం సహజం. స్త్రీలు, పిల్లలు అక్రమ రవాణాకి గురవుతున్నారు. ప్రేమ పేరిట వంచించబడి అమ్మివేయబడతారు. అత్యాచారాలకు గురయ్యాక (శీలం లేదు కాబట్టి) వ్యభిచారంలోకి నెట్టబడతారు.

వీరంతా ఒళ్ళు బలిసి మదమెక్కి కామ వాంఛలు తీర్చుకోవడం కోసం వ్యభిచారులయ్యారని ఏ శీలవంతులైనా భావిస్తే వాళ్ళతో కాశిలోని హరిశ్చంద్ర ఘాట్‌లోని గంగనీళ్ళు తాగించాలి.

అన్ని తీర్థ స్థానాల్లో, పవిత్ర ప్రదేశాల్లో, ప్రసిద్ధ దేవాలయాలు గల చోట్లంతా వీరు విరివిగా కనపడతారు. ప్రతి పట్టణం, నగరం వీరికి ఆలవాలం. అనేకమంది ఉపాధి కోసం వలస వచ్చే పారిశ్రామిక ప్రాంతాలు వీరికి కూడా ఉపాధి కల్పిస్తాయి. హైవేలు మినహాయింపేమీ కాదు. వ్యభిచారాన్ని ఒక కులంగా, కొన్ని గ్రామాలుగా, వాడలుగా నడిపించిన గొప్పతనం ఫ్యూడలిజానిదయితే… అనేకానేక వృత్తుల్ని వలసల్ని, ఆకలిని, నిరుద్యోగాన్ని, సంక్షోభ కాలాన్ని వేశ్యాత్వంలోకి దించగల నైపుణ్యం మార్కెటీకరణ సొత్తు.

తరతమ స్థాయిల్లో పది రూపాయల్నించి లక్ష రూపాయల వరకు వారి వారి తాహతును బట్టి చెల్లించగలిగే వారికి అంతటి ‘శరీరాలు’ ఉంటాయి. కొనుగోలుదార్లు లావా, సన్నమా, ఎరుపా, నలుపా, అందమా, వికృతమా, బానపొట్టా నిమిత్తం లేదు. వాళ్ళు సహజంగా వాంఛగల వాళ్ళా, అసహజరతిగాళ్ళా, శాడిస్టులా, అసలు వాంఛ తీర్చుకోలేని వాళ్ళా… ఏదయినా భరించాలి. వాళ్ళ రోగాల్ని, వాళ్ళ వికృతాల్ని, వారి విపరీత చేష్టల్ని, పీడనల్ని స్వీకరించాలి.

”కడుపు దహించుకుపోయే

రాక్షసి రతిలో అర్థనిమీలిత నేత్రాల

బాధల పాటల పల్లవి”

పిల్లల్ని సాకడానికి…

పుట్టిన పిల్లల కడుపులు (వాళ్ళని మగాడు వదిలేసినట్లు వదిలేయలేక) నింపడానికి వృత్తి కొనసాగింపు… వేరే తార్చుడుగాడి పంచన చేరటం, మళ్ళీ అదే వృత్తి పునరావృతం కావడం… తాము వదిలేస్తే మగపిల్లలు అరాచకులుగా, ఆడపిల్లలు ఇదే వృత్తిలోకి వస్తారేమోననే భయం… తమ వృత్తి గురించి పిల్లలకు తెలియకూడదు. ఇల్లు అద్దెకిచ్చినవారికి, వీథివారికి తెలియకూడదు. కానీ నైతికతకు కావలివాళ్ళయిన పోలీసులు నీరవ్‌ మోడీల్ని, రేపిస్టు ఎమ్మెల్యేల్ని పట్టుకుంటారా! వీరిని మాత్రం వేటాడుతారు. మామూళ్ళు తీసుకొని బ్రోతల్‌ హౌస్‌లను సజావుగా నడిచేలా చూస్తారు. వారూ తమ శృంగారాన్ని వెళ్ళబోస్తారు వీళ్ళ దేహాలపై ఉచితంగా… తరువాత కేసుల లెక్కకు అరెస్టులు కూడా చేస్తారు. ”లం…”కి కూడా పరువుంటుందా, కుటుంబం

ఉంటుందా? దాడుల్లో చిక్కితే ఫైన్‌ (విటులకు ఉండదు లెండి). బిడ్డలు బజార్న పడతారో, అమ్ముడుపోయి అయిపులేకుండా పోతారో… తిరిగి వచ్చాక ఆ గూడు మిగిలి ఉండదనే బెంగ కాల్చేస్తుంది. నరకకూపం అంతం లేకుండా కొనసాగుతూనే ఉంటుంది.

గుర్తింపు కార్డులుండవు. స్థిర నివాసం అసాధ్యం కాబట్టి ఓటరు, రేషన్‌, ఆధార్‌ కార్డులు అసంభవం. వారిని రాజ్యం అసలు మనుషులుగానే గుర్తించదు. ఇంకా ప్రత్యామ్నాయం ఉపాధి ఊసేముంటుంది. వారు ఉన్నారని తెలుసు కానీ ప్రభుత్వం వారి ఉనికిని గుర్తించదు. ఛీ ఛీ అని అసహ్యించుకుంటూనే వీరే లేకుంటే వికృత మనస్తత్వం గల మగాళ్ళ వికారపు కామవాంఛలకు పతివ్రతలు, పరువుగల స్త్రీలు బలవుతారు కాబట్టి ఇది సమాజానికి తప్పనిసరైన దుష్టత్వం అని వాదిస్తారు నిశిత బుద్ధిగల సానుకూల మేధావులు.

విటులకు శిక్ష ఉంటుందా?

వ్యభిచరించే స్త్రీలు తరచుగా పట్టుబడతారు కానీ విటులు, తార్పుడుగాళ్ళు దొరకరు అదేమిటో! అక్రమ రవాణా గురించి గగ్గోలు లేస్తే ఓదార్పుగా కొన్ని దాడులు జరుగుతాయి. ఈ కూపాల్లో చిక్కిన ”ఈగ”లపై సానుభూతి కురుస్తుంది. పునరావాస గృహాలు నోరు తెరిచి వీరిని గుటుక్కున మింగేస్తాయి. ఒక అకృత్యం మరో లాభసాటి దందాగా మారి ”సేవకులకు” కొంగుబంగారమవుతుంది. ”సేవ”కుల జీవితాలు పతితల్ని ఉద్ధరించినందుకు బిరుదులు, భుజకీర్తులతో పేరు ప్రతిష్టలే కాక ‘సేవ’ కొనసాగించేందుకు గుప్తనిధులు ఇబ్బడి ముబ్బడిగా పొందుతాయి. వారిని సన్మానించుకున్న వ్యవస్థ తృప్తిగా నిట్టూర్చి వేశ్యాత్వాన్ని ఈసడించుకుంటుంది.

అంతులేని మగతృష్ణని చల్లార్చడానికి ‘వాత్సాయనం’ సరిపోదని ఆధునిక మార్కెటీకరణ పోర్న్‌ని సృష్టిస్తుంది. ఇదొక లైంగిక విప్లవంగా ప్రకటిస్తుంది. మత్తుమందులిచ్చి మేకప్పులేసిన దేహాలు ఉద్రేకపరిచే పదార్ధాలు స్వీకరించిన మగతనం చేతిలో కెమెరాల సాక్షిగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో లైంగిక బానిసత్వాన్ని ఆధునిక లైంగిక స్వేచ్ఛగా ప్రవహింసచేస్తాయి. ఆ స్త్రీల దేహాలు హింసనే సంబోధించదలిచాయని, అదే ఆనంద మార్గమని ఉద్రేకాలు చెలరేగుతాయి.

ఈ ఉద్రేకాలకు బలైన చిన్నారులు, యువతులు తిరిగి సరుకులైన దేహాలతో ప్రపంచ సంతల్లో నిలబడతారు. అదంతా వారి ఛాయిస్‌. ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నుండే వారి ఆమోదంతోనే జరిగిందని ఆధునికానంతరవాదుల విశ్లేషణ.

లేని మధ్యయుగాల రాచకన్యల శీలం కోసం నగరాలు తగలబడిపోతాయి. దేశమంతా ‘మాత’ల భజనలు హోరెత్తుతున్న వేళ శీలం బిడ్డల ఆకలి చల్లార్చదని తెలిసినా లేదా మానం కోసం నిప్పుల్లో దూకలేని అమానవతులు రోడ్ల పక్కన చీకట్లో నీడల్లా నిలబడతారు. ఎండిన డొక్కల్లో దిష్టిబొమ్మల్లా రంగులద్దుకొని లేని యవ్వనాన్ని ప్రదర్శిస్తూ… ఆకర్షిస్తూ… ఆహ్వానిస్తూ…

మనుషుల్లా వీళ్ళకి అన్నీ ఇచ్చి, ఆ పిల్లలకి అన్ని అవసరాలు తీర్చి… తిరుగుబోతురాయుళ్ళని అన్ని విధాల కట్టడి చేస్తే సరిపోతుంది కదా, సమస్య తీరిపోతుంది కదా అని తేలిక పరిష్కారం చూపిస్తే క్లిష్ట సమస్యలను అట్లా పరిష్కారం చేయరాదంటారు… వారు.

కనుక దాచుకోవటం ఒక్కటే రాచమార్గంగా లైసెన్సుతో నడుస్తున్నపుడు ఈ వ్రణాన్ని ఎవరు నయం చేస్తారు?

(2 జూన్‌ను అంతర్జాతీయ సెక్స్‌ వర్కర్స్‌ హక్కుల దినంగా పాటిస్తున్న సందర్భంగా…)

(నవ తెలంగాణ సౌజన్యంతో…)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.