పాతివ్రత్య పరీక్ష ఫలితమా – దత్తాత్రేయుడి అవతారమా ! – నంబూరి పరిపూర్ణ

టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు అయిపోయాయి. అన్ని సబ్జక్టుల్నీ బాగా హుషారుగా, సంతృప్తికరంగా వ్రాసింది సతీదేవి. రెండ్రోజులయింది పరీక్షలు ముగిసి. ప్రాణం ఎంత తేలిగ్గా హాయిగా ఉందో ఇప్పుడు. పరీక్షలవ్వడంతోనే వేసవి సెలవులు మొదలు. తనకు ప్యాస్‌ రిజల్ట్స్‌ తప్పకుండా వస్తాయన్న నమ్మకం పూర్తిగా ఉంది సతికి. ఏ బెంగా లేదిప్పుడు. ఎలాంటి శ్రమా లేదు. పరీక్షలన్నాళ్ళూ పట్టుదలతో, భయంతో, రాత్రింబవళ్ళు ఒకటే చదువుతుండడం. కాస్త కఠిన పాఠ్య భాగాల్ని పేపర్‌మీద వ్రాసుకుని మననం చెయ్యడం. నడిఝాము వరకూ చదువు సాగించి, మళ్ళీ తెల్లారకముందే లేచి తయారైపోయి హడావుడిగా నిమిషమాలస్యం గాకుండా పరీక్ష హాల్లోకి అడుగుపెట్టడం.

అబ్బ ఇప్పుడెంత తేలిపోతున్నట్టుంది ప్రాణం! అయినప్పటికీ ఈ తీరిక కాలాన్ని వట్టినే ఏమీ చేయకుండా గడిపేయడం ఏం మంచిది. డబ్బు వృధా ఖర్చు చేసినా, ఎక్కడయినా పారేసుకునే వాటిని మళ్ళీ సంపాదించకోగలం. అదే కాలం వృధాగా గడిస్తే, తిరిగొస్తుందా ఎవరికైనా అన్న ఆలోచనలు బుర్రలో తిరుగుతున్నాయి సతీదేవికి. ప్రొద్దుటి పూట ఇంటి పనుల్లో అమ్మకు సాయపడుతుండగా – మిగిలిన పగలంతా ఖాళీనే. మంచి మంచి కథల పుస్తకాలు, వీలుంటే చారిత్రక నవలలు చదువుకుందుకు ఇంతకు మించిన తీరిక సమయం దొరకదు కదా. ఇంక మొదలు బెట్టింది ‘సతి’ – చలం కథలు మొదలు నేటి ఆధునిక అభ్యుదయ రచయిత్రుల రచనల్ని చదవడం, నచ్చిన భావాల్ని, అంశాన్ని మనసుకు పట్టించుకోవడం.

నాయనమ్మకీ తెల్సు బోల్డు పురాణ కథలు. అవి ఎంచక్కగానో కళ్ళకు గట్టినట్టు చెబుతుంది కూడా; రాత్రికి పట్టుకోవాలి తనను కథ చెప్పించుకునేందుకు.

పెందరాళే రాత్రి భోజనాలయినాయి. వేసవిలోని చలచల్లని గాలులకు – మంచాల నాశ్రయిస్తున్నారు ఇంట్లో పిల్లా పెద్దలంతా. ‘సతి’ – నాయనమ్మ మంచం పక్కకు జేరి – ”ఓ మంచి కథను నువ్వు చెబితే వినాలని భలే అనిపిస్తోంది నాయనమ్మా! చెప్పవా”! గారాంగా ఆర్ధించింది సతీదేవి.

”ఈ నాటి కాలపు కథలు నాకేం వచ్చునే చెప్పడానికి, తాతల నాటి పురాణ కథలు తప్ప. అట్లాంటివి మీకు నచ్చుతాయా, మీరీ కాలప్పిల్లలాయె!” అన్నది నాయనమ్మ తాయారమ్మ.

”నాకైతే ఆ కథలే బాగా నచ్చుతాయి, ఎంతో ఇష్టం – చెప్పు ఆలస్యం చెయ్యకుండా. ఊఁ మొదలెట్టు”.

”ఐతే విను చెబుతా. పూర్వ కాలంలో – సతీ అనసూయ అని ఓ సాధ్వీ మణి ఉండేదన్న సంగతి విన్నావు కదా. ఇప్పుడదే చెప్పాలనుకుంటున్నా, ఇష్టమేగా?”

”ఇష్టమే, బాగా ఇష్టం; ప్రారంభించు త్వరగా, ప్రొద్దుబోకముందే ముంగించొచ్చు”.

”ఆ! ఆ! మొదలెడుతున్నా. పూర్వ కాలాన – తపస్సు చేసుకునేందుకు మునీశ్వరులు, ఊళ్ళకి దూరంగా, జనంలేని చోటుల్లో ఆశ్రమాలు కట్టుకుని, భగవధ్యానం చేసుకుంటుండే వాళ్ళు గదూ! అలాంటిదే ఒకటి అత్రి మహాముని ఆశ్రమం. ఎంతో విశాలంగా నిర్మలంగా ఉండేదది. నాలుగు దిక్కులా రంగు రంగుల పూపొదలు లతాగుల్మాలతో, మంద్ర మారుతాలకు అవి తలలూపుతుంటే, చూపరులు కళ్ళు తిప్పుకోలేక పోతుండేవారు.

ఆ ఆశ్రమ వాసి అత్రి మహాముని భార్య అనసూయాదేవి. ఆమె ప్రతి నిత్యం తెల్లారుఝామునే లేచి, ఉదయ సూర్యుని బంగారు కాంతుల్లో మునుగుతూ, దగ్గరి నదీతీరానికి చేరి, స్నానం, సూర్యనమస్కారాలూ ముగించి, పవిత్ర నదీ జలాల పాత్రతో ఆశ్రమానికి తిరిగొచ్చి ముని భర్త భగవత్పూజకు అవసరమైన పూజా ద్రవ్యాలను భక్తితో సమకూర్చుతుండేది. ఈ లోపున భర్తగారు కూడా నదిలో సంధ్యావందన సూర్య నమస్కారాలనాచరించి చల్లని అంగవస్త్రపుటాచ్ఛాదనతో ఆశ్రమం చేరుకుని, భార్య సిద్ధం చేసి ఉంచిన ధూప దీప నైవేద్యాలతో పూజాక్రమం సాగిస్తుండేవాడు. ప్రత్యూష కాలంలో ముని దంపతులు ప్రతి నిత్యం జరుపుతుండే పూజా విధి ఇది”.

”అబ్బో! ఆ దంపతులిద్దరికీ – ఎంత శ్రద్ధా భక్తులవి నాయనమ్మా! సరే… తరవాత కథ ఏమిటో చెప్పిక”.

”ఇక్కడో ముఖ్య సంగతి గమనించాలి. భర్త పూజా విధులు, జపతపాలు అంత క్రమంగా, నిష్టగా సాగడానికి, ఎక్కవగా అనసూయాదేవి సేవా సహకారాలు కారణం. భర్త సేవను, ముందుగా భగవత్సేవగా భావించేది. భర్త పట్ల మనసునిండా గొప్ప నిష్కామ ప్రేమ, ఆరాధన. మహా గొప్ప పతివ్రతామ తల్లి అనసూయ”.

”నాయనమ్మా! నిజంగా ఆ కాలంలో అంత గొప్ప పతివ్రతామ తల్లులుండేవారన్నమాట. ఇలాంటి కథలు ఎలా తెలుసుకున్నావు నువ్వు? ఎవరు చెప్పేవారు?”

”అహా! ఆ సంగతా! మా పుట్టింటి దగ్గర ఒక ఊళ్ళో ఉంటుండే మా గురువుగారొకరు చెప్పి వినిపిస్తుండే ఈ మాదిరి పవిత్ర కథల్నీ గాథల్నీ. నేనేమో, కాస్త సమయం చిక్కినప్పుడల్లా గురువుగార్ని దర్శించి రావడానికి, అమ్మగారింటికి పయనంగడుతుండేదాన్ని గదా. శిష్యులందరికీ ఎన్నెన్ని భగవత్‌ విషయాలు తెలియబరుస్తుండేవారో ఆ అయ్యగారు” వివరించింది నాయనమ్మ.

”అదీ! అలా చెప్పు మరి. ఇంత చక్కగా, చక్కని మాటల్తో చెప్పడం అందుకే అలవడింది నీకు. కథనాన్ని ఆపకులే, చెబుతూ పో”.

”చెబుతా విను. ఒక సమయాన ఎందుకోగాని, మన దేవుళ్ళు ముగ్గురికీ అనసూయమ్మ మంచితనాన్ని, ముఖ్యంగా ఆమె పాతివ్రత్యాన్ని నిశితంగా పరీక్షించి తెలుసుకోవాలన్న సంకల్పం కలిగింది. మన దేవుళ్ళు ముగ్గుర్నీ త్రిమూర్తులంటారు, తెలుసు గదూ! వీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ సమస్త ప్రాణుల్నీ సృష్టించగా, విష్ణువు ఈ ప్రాణులందర్నీ సంరక్షించుతూ, అంటే కాపాడుతుంటాడు. మూడో దేవుడు ఈశ్వరుడు. ఈ సమస్త సృష్టినీ, ప్రాణుల్నీ నిర్జీవుల్ని చేస్తూ, దాన్నే ‘లయం’ చేస్తూ ఉంటాడట”.

”ఆగాగు నాయనమ్మా! నాదొక పెద్ద సందేహం – అందర్నీ సృష్టించి, కాపాడుతూనే, మళ్ళీ అలా సృష్టించినదంతా ‘లయం’ చెయ్యడమెందుకు? ఒకరు కాపాడ్డం, ఒకరు తీసెయ్యడమూనా? ఎందుకలా?”

”లయమంటే – మృత్యువును కలిగించడం. మనుషుల పాప పుణ్యకార్యాల్ని బట్టి, వాళ్ళని స్వర్గానికో నరకానికో చేర్చాల్సి ఉంటుంది కదా? మృత్యువు కల్పించకుండా ఎలా కుదురుతుంది అది? మృత్యు మార్గమనేదందుకే. దాన్ని కల్పించే లయకారుడు ఈశ్వరుడు. ఈ ముగ్గురూ మనం చెప్పుకునే త్రిమూర్తులు.”

”మొత్తానికి మనకు దేవుళ్ళు ముగ్గురన్నమాట. కానీ మా క్లాసులో ఇతర మతాల అమ్మాయిలు – దేవుడు మానవులకందరికీ ఒక్కడు, ఒకే ఒక్కడంటారు ఎందుకనో మరి. సరే గాని, మన ఈ ముగ్గురు దేవుళ్ళకూ ఒకేసారి అనసూయమ్మను పరీక్షించుదామన్న కోరిక ఎందుకు కలిగిందో! అందరూ కలిసి ఒక్కసారిగా భూలోకంలోకి దిగితే, వారి అద్భుత కార్యాలకి ఆటంకం కలగదా? అనుక్షణం మానవుల మంచి చెడ్డల్నీ, పాప పుణ్య చర్యల్నీ నిశితంగా గమనిస్తూ, గ్రహించుతూనే ఉంటారు కదా! అలాంటప్పుడు, ఒక మానవ యువతిని స్వయంగా ముగ్గురూ కలిసి భూలోకంలోని ఒక మున్యాశ్రమానికి దిగడం, అంతవసరమా?” సతీదేవి తీవ్ర సందేహం.

”కథ సాగనివ్వకుండా, అడుగడుగునా ఏం ప్రశ్నలే, రెటమతపు తిక్క ప్రశ్నలు? ఈసారి మాత్రమే ఏంటి, దేవుళ్ళు తమ భక్తుల్ని పరీక్షించడానికి, ఎన్నోసార్లు వచ్చి పోతుంటారు. ప్రత్యక్షమవ్వడం అంటే అదే! అలా పరీక్షించి, మంచి తృప్తీ అభిప్రాయం కలిగాక – భక్తులు, తపస్యుల కోర్కెల్ని వరాలుగా ప్రసాదించి అదృశ్యమవుతుంటారు. ఈ మాదిరి సంఘటనల్ని మనం సినిమాల్లో చూడ్డం లేదూ? ముగ్గురు దేవుళ్ళూ కలిసి ఒకేసారి ప్రత్యక్షమవడానికి కారణం – అనసూయ మామూలు స్త్రీ గాక, ఒక మహత్తర పతివ్రతారత్నమవ్వడం. అంతటి మహిళా శక్తిని పరీక్షించుదామని అనుకున్నారందుకే. ఒకేసారి ముగ్గురూ కలిసి వచ్చేశారు.”

”సరి సరే, ఆ దేవుళ్ళామెకు ఎలాంటి పరీక్ష పెట్టారో?”

”అదే చెబుతా విను. ఆ పరీక్ష బహు చిత్రంగా, అంతకుమించి బహు కఠినంగా ఉందిటలే. ముందుగా తాము పట్టుకొచ్చిన ఇనప గుగ్గిళ్ళు అనసూయమ్మకిచ్చి, మెత్తగా వండిపెట్టమన్నారట. అలా వండుతున్న సమయాన ఒంటిమీద నూలుపోగు లేకుండా దిగంబరంగా ఉండి పచనం చెయ్యమన్నారు. ఇదంతా తమ అసలు రూపాల్లో కాదు, మానవ రూపాల్లో. అతిధి సేవలకు పేరొందిన ఆ మహాతల్లి అప్పుడేం చేసిందంటే, వారిని పసిబిడ్డల రూపంలోకి మార్చి, తాను నగ్న శరీరంతో ఆ ఇనప శనగల్ని మెత్తని గుగ్గిళ్ళుగా వండిపెట్టింది. అంతటి శక్తియుక్తులు గలదన్నమాట!!”

”అయ్యో అయ్యో! అదేం పరీక్ష నాయనమ్మా! అసలే ఆ శనగలు మామూలివి గావు ఇనప శనగలు. వాటిని, ఆ పైన దిశమొలతో మెత్తగా ఉడకబెట్టి పెట్టమనడం! అందుకు ఆవిడ సిద్ధమై వండిపెట్టడం! ఎందుకట ఇలాంటి అశ్లీల పరీక్ష? వారు చూడబోతే త్రిమూర్తులు, లోక సంరక్షకులు! ఈ నాటి సినిమా తారలు సైతం ఇంతటి నగ్నత్వానికి ఒప్పుకోడం లేదే! డబ్బుకు ఆశపడి తమ ఒంటిని ఏదో కొంత జనానికి చూపిస్తున్నారు. దేవుళ్ళయి అంత అసాధ్యపు, అసభ్యపు పరీక్షకు గురి చెయ్యడమేమిటి. అందుకీ అనసూయమ్మ అంగీకరించడమేంటి! నమ్మేట్టు లేదే!”

”ఒసే అమ్మాయ్‌! ఈ నీ తిక్కప్రశ్నలనాపనంటే చెప్పు, నేను చెప్పడం ఆపేస్తా. నీ అడ్డ దిడ్డ ప్రశ్నలకి నేను సంజాయిషీలు చెప్పలేనే”.

”ఒద్దు నాయనమ్మా! ఆపద్దు చెప్పు ఆ తర్వాత ఏమయిందో. ఇంక అడ్డం పడన్లే”.

”దేవుళ్ళు – ఆమెకంతటి కఠిన పరీక్ష ఎందుకు పెట్టారనుకుంటున్నావ్‌. ఆమె సామాన్య స్త్రీ, మహా పతివ్రత, మహా శక్తిమంతురాలు.”

”అందుకే – అంతటి శక్తి గలది గాబట్టే, దేవుళ్ళను కాస్తా చంటి బిడ్డలుగా మార్చింది!”

”అదిగో, మళ్ళీ నీ వ్యాఖ్యానం! అనసూయమ్మ అలా వాక్యం పెట్టడంతోనే ముగ్గురూ పసి బాలురై ప్రాకులాడుతున్నారు. మరుక్షణంలో ముగ్ధులై, ఆశ్చర్య చకితులయి, ఆ పతివ్రతామ తల్లిని అనేక రీతుల ప్రశంసించి, ఆశీర్వాదాలందించదలిచారు. అది తమ మామూలు రూపములలో కాదు సుమా! అందుకని మరో సరికొత్త రూపం అదే దత్తాత్రేయ అవతారం ముగ్గురూ ఏకరూపంగా.”

జయహో! జయహో! శహభాష్‌, శహభాష్‌! నిన్ను మేం పరీక్షించగా అవగతమయ్యింది మాకు నీ శక్తి సామర్ధ్యాలెంతటివో! నీ నోటి వాక్యం ఎంత బలమయ్యిందో! నీ భక్తి జ్ఞాన సంపదలకు మేము ముగ్గురమూ ముగ్ధులమై, అందరం ఒకే రూపాన ఏకమై ఆశీర్వదిస్తున్నాము. అదే మా దత్తాత్రేయ అవతారం. మానవులు నిన్ను కలకాలం ఒక అనన్య శక్తి మూర్తిగా, నిరపమాన దైవభక్తి, పతిభక్తి కల్గిన పతివ్రతా శిరోమణిగా కలకాలం కొలుస్తుందురు గాక! నీ పుణ్యఫలాన, లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లుగాక! అని ఎన్నో దీవెనలు కురిపించి, ఆనంద ప్రపూర్ణులుగా అదృశ్యమయ్యారు. అలా లోకం దర్శించగలిగింది దత్తాత్రేయ అవతార పురుషుణ్ణి.

…. …. ….

‘నాకసలు ఇప్పటివరకూ దత్తాత్రేయుడంటే ఎవరయిందీ తెలిసింది గాదు. ఒకానొక సాధ్వీమణిని అగ్నిపరీక్షకు గురిచేసిన సందర్భాన త్రిమూర్తులు ముగ్గురూ ఒకే రూపాన దత్తాత్రేయుడిగా అవతరించారన్న మాట! ఆ పేరు వెనుక ఇంత కథ ఉంది కావును’

నాయనమ్మ చెప్పిన మన హిందూ మత సంబంధ దేవుళ్ళే గావచ్చు లేక ఇతర దేశాల పరాయి దేవుళ్ళే గావచ్చు. ఆదిలో స్త్రీ పురుషుల్ని ఒకేసారి సృష్టించి ఉంటాడు. ఇరువురికీ తండ్రిగా వాళ్ళను సమాన దృష్టి, ప్రేమలతో సంరక్షిస్తూ వచ్చుండొచ్చు. లైంగిక భిన్నత్వం వల్ల స్త్రీ పురుషుల్ని పతీ పత్నులనే జంటలుగా మార్చి ఉండచ్చు. తండ్రికి తన సంతానమంతా సమానమే. ఒకరు అధికులనీ, మరొకరు అధములన్న ఆలోచనలుండవు, కలగనే కలగవు.

మరి అలాంటప్పుడు భర్త అన్న ఒక మగాడు, భార్య అనబడే ఒక స్త్రీ పైన సర్వాధికారి అనీ, భార్య అతనికి సర్వ రీతుల సేవకురాలు, అతడి బానిస అనీ ఎందుకా తండ్రి నిర్ణయించి ఉంటాడు? భార్య మరొక వ్యక్తిని కన్నెత్తి చూడగూడదనీ, ఇంటి గడప దాటగూడదని ఎందుకు ఆదేశించి ఉంటాడు? ఆ పైన భార్యగా మారిన యువతి పాతివ్రత్యాన్ని పరీక్షించేందుకు తానే ఎందుకు సిద్ధమవుతాడు? పతిగా మారిన మగవాడి ‘సతీ వ్రతాన్ని’ పరీక్షించే పనిని ఎప్పుడు గానీ, ఎన్నడు గానీ ఎందుకు పెట్టుకున్నాడు గాదు? భగవంతుడు, జగద్రక్షకుడు అయిన తనకు బదులుగా, పతియే ప్రత్యక్ష దైవమని భావించి పూజించాలని ఎందుకు నిర్దేశించినట్లు? రాత్రి పగలు ఇంటి చాకిరీ తప్ప బయటకడుగు పెట్టి స్వంత ఆర్జనకుపక్రమించ గూడదనీ, భర్త పోషణ హద్దుల్లోనే మగ్గాలని ఎందుకు శాసించినట్లు?

నాయనమ్మ ఇప్పుడు వల్లించిన పతివ్రత కథల్లాంటివి ఎన్నో మన హైందవం నిండా ఉన్నాయిట. పతివ్రతల మహిమలు, ఆదర్శ క్రియలూ కోకొల్లలు! ఆ పురాణ వనితలను ఆదర్శంగా పెట్టుకొని, నేటి స్త్రీని బ్రతకమంటుంది హైందవ మనుధర్మం. ఈ ధర్మ సూక్తులకు పూర్తి భిన్నంగా ఉంది నేటి ఆధునిక స్త్రీ జీవితం. స్త్రీ బాగా చదువుకుంటోంది. శాస్త్రీయ సాంకేతిక విద్యల్ని అభ్యసిస్తూ, ”తన మేధోస్థాయిని ఎంతగానో పెంచుకుంటోంది. గతంలోలా నేటి యువత అబల గాదు, ఇంజనీరు, డాక్టరు, బ్యాంకు మేనేజరు, పరిశోధకురాలు, బడా పారిశ్రామిక సంస్థల సంచాలకురాలు (డైరెక్టర్‌, మేనేజర్‌).

నేటి మహిళ స్వయంశక్తి గల స్వయం పోషకురాలు. సమాజాన్ని పురోగమింపచేయగల సమర్ధురాలు. ప్రజా సమూహాల ఆయురారోగ్యాలను సంరక్షించగలిగిన ఆధునిక ధన్వంతరి.

మరి ఈనాటి ఈ ఆధునిక మహిళ హైందవ వివక్ష పూరిత, అణగార్చే సంస్కృతికి బద్ధురాలు ఎలా అవుతుంది?

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.