దినదినాం దీపాంతల్లె
అయిపోతాంది పాణం
నోరున్నది గని
కూత కరువైంది.
కడుపుకి మాత్రం
పోత బరువైంది.
మంచినీరే బువ్వైతాంది
మంచితనమే కూరైతాంది
పొద్దుగుంకి ఆరైనా
ఎండారుతనే లేదు
కండ్లల్ల తడారుతనే లేదు
శుభలేఖల రాకడెక్కువయ్యె
పెండ్లీల పోకడేమో తక్కువయ్యె
అందరు దగ్గరోళ్ళైపాయె…
మనసుకి దూరమోళ్ళైపాయె
పోకపోతే మాటబోతది..
పోతేనేమో జీవిబోతదమోననిపించబట్టె…
శెట్లన్ని పీనుగలై
గుడ్లప్పగించి నిలబడి సూడబట్టె.
రారా అని పిలవబట్టె…
ఒక్క శెట్టు కొమ్మ నన్న
ఊగుడు లేదు.
తాగుబోతులంతా తాగి
తాగి ఊగుతున్నరు గాని
ఊగి ఊగి వాగుతున్నరు గాని
గొంతేమో ఎండబట్టె
ఒక్క సుక్క నీళ్ళు లేక
చక్కరొచ్చినట్టే అయి
ఊగుతంది ఒళ్ళంతా
ఒక్కాకు సుత ఆడుత లేదాయె…
ఎండేమో పిండారబోసుకోబట్టె…
ఒళ్ళేమో ముద్దయి పిండబట్టె…
ఈ కాలమైపోయే సరికి
నాకు కాలమైపోయేట్టున్నదాయె
ఏం జెయ్యను…ఎట్లగాను
మూడు కాళ్ళ ముసలిదాన్నైపోతి
ఊరు పొమ్మనే కాడు రమ్మనే…
కొడుకు నన్నొదిలిపో అంటే
వాడ్ని నేనొదిలితి కానీ
బతకలేను ఊపిరి
నానుండి పో అంటే
పోలేక ఉండలేక ఊగబట్టే…!
ఏం చేయను…
చూసుకోని ముర్వ
చెప్పుకోని ఏడవా…!